———————-
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన పదేళ్ల తరువాత , 1957లో విద్వాన్ విశ్వమ్ పెన్నేటి పాట రాశాడు . చిన్నపద్యకావ్యం . బహు భాషాపండితుడు , జర్నలిస్టు అయిన విశ్వమ్ ఇంకా చాలా రాశాడుకానీ , పెన్నేటిపాటకు వచ్చిన ఖ్యాతి అసాధారణం . ఒక పెద్ద భూస్వామి కొడుకు , ఒక సంపన్న రైతు కరువువల్ల చివరికి అనామక రైతుకూలీగా ఎంత దుర్భరంగా బతకాల్సివస్తుందో చెప్పిన కావ్యం పెన్నేటిపాట . దీనికి రాళ్లపల్లివారి ముందుమాటే ఒక పరిశోధనకావ్యంతో సమానం .
అంటే యాభై ఏళ్ల కిందటే సీమ కరువు అంతదయనీయంగా ఉండేదన్నమాట . ఈ యాభై ఏళ్లలో ఎలాగూ ఏ మార్పూ లేదు . వరుసకరువులు , పిలవని పేరంటం – కరువు , కరువు కరాళ నృత్యం , ధాతు కరువు , వలసలకరువు . . ఇలా కరువుకు ముడిపడి ఎన్నెన్ని కొత్త పదబంధాలు , పారిభాషికపదాలు పుట్టాయో ?
క్షామములెన్నివచ్చిన రసజ్ఞత ఇంచుక చావలేదన్నాడు ఒక పెద్దాయన .
మధురాంతకం రాజారాం తెలుగువారు గర్వించదగ్గ గొప్ప కథారచయిత . ఎడారికోయిల పేరిట రాయలసీమ కరువుమీద ఒక
కథ రాశారు . ఇది పేరుకే కథ . నిజానికి ఒక నిలువుటద్దం . ఉద్యోగం దొరక్క ఒక చదువుకున్న అబ్బాయి అమెరికా వెళ్తాడు . అక్కడే బాగా స్థిరపడతాడు . పిల్లాపాపలతో హాయిగా ఉంటాడు . 18 నిండిన వాళ్ళబ్బాయి ఒకసారి ఇండియా వెళ్లివస్తాను అని తండ్రిని అడుగుతాడు . తండ్రి సరేనంటాడు . అమెరికా నుండి బేగంపేట ఎయిర్ పోర్టు , హైదరాబాద్ నుండి రైళ్లో చిత్తూరుకు , అక్కడినుండి బస్సులో ఆ అబ్బాయి తండ్రి పుట్టిన పల్లెకు వెళ్తాడు . కొన్నిరోజులతరువాత తిరిగి అలాగే బస్సులో , రైల్లో , విమానంలో అమెరికా వెళ్తాడు . ఇంత ప్రేమాభిమానాలు , అనుబంధాలు , ఆప్యాయతలు అమెరికాలో ఎక్కడ దొరుకుతాయి ? ఈ ఊళ్లల్లో నీళ్ళొక్కటి ఉండి ఉంటే మా నాన్న ఇక్కడే ఉండిఉండేవాడు . . . అనుకుంటూ బాధపడతాడు . అక్కడికి కథ ముగుస్తుంది .
ఇలా సీమ సాహిత్యం నిండా కరువు కన్నీటికథలే .
——————
అయితే వందేళ్లలో ఎప్పుడూ లేనంతగా ఈసారి సీమలో వర్షాలు పడ్డాయి . వాగులు , వంకలు నీళ్లతో కళకళలాడుతున్నాయి . కొండకోనల్లో జలపాతాలు దూకుతున్నాయి . పచ్చదనం పుడమికి పట్టుచీరలా పరచుకుంటోంది . కరువుతీరిన ఆనందం ఆర్ణవమయ్యింది . రాయలసీమ సమస్యలపై పోరాడుతున్న తాడిపత్రి అబ్బాయి , సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అశోక్ నాకు కొన్ని సీమ జలపాతాల వీడియోలు పంపి –
అన్నా ! మనోళ్లు పొంగిపోతావున్నారన్నా , ఎక్కడ చూసినా నీళ్ళే నీళ్లు . దీనిమీద ఏదన్నా రాయన్నా ! అని అడిగాడు .
నిజమే .
తడారిన గొంతుకు చినుకుల తడికంటే ఆనందం ఏముంది ?
నెర్రెలు చీలిన నేలకు చిరుచినుకుల పలకరింపుకంటే పులకింత ఏముంటుంది ?
సీమతోపాటు దేశమంతా అవసరమయినంత వర్షాలు ఇలాగే ప్రతియేడూ పడాలని కోరుకుంటూ –
–పమిడికాల్వ మధుసూదన్