——————-
గుండమ్మ కథ ఇప్పటిదాకా వచ్చిన తెలుగు సినిమాల్లో మణిమకుటాయమానమయినది. తెలుగు సినిమా వెలుగు తారలు ఎస్వీ ఆర్ , ఎన్ టీ ఆర్ , ఏ ఎన్ ఆర్ , సావిత్రి , జమున, సూర్యకాంతం , రమణారెడ్డి హేమా హేమీలందరున్నారు అందులో. అద్భుతమయిన కుటుంబ కథ. వీనుల విందయిన పాటలు, మాటలు.
ఈ సినిమా మొదట్లోనే ఒక హోటల్ కు పాలు పొసే రమణారెడ్డి వీధి కొళాయిదగ్గర క్యాన్ పాలలో నీళ్లు కలుపుతూ ఒక పత్రిక వార్త చదువుతాడు. పాలలో నీళ్లు కలిపి పలుచటి పాలతో మోసం చేస్తున్నారన్నది ఆ వార్త సారాంశం. పాలల్లో నీళ్లు కాక – నీళ్ళల్లో పాలు కలుపుతారా? అని తన సహజసిద్ధమయిన మాండలికంలో , భుజాలు ఎగరేస్తూ ప్రేక్షకులకు జ్ఞాన బోధ చేస్తాడు.
మా చిన్నప్పుడు లేపాక్షిలో రోజూ మా ముందే ఒక ముసలాయన కరియప్ప పాలు పితికి మేము తీసుకెళ్లిన క్యాన్ లలో పోసేవాడు. పెద్ద గిన్నెలో తరగనురగలతో ఆ పాల వాసనకే సగం కడుపు నిండిపోయేది. పాలు పోయించుకోవడానికి నిరీక్షించే పిల్లల్లో ఒకరికి ముందు ఒకరికి వెనుక సమస్య రాకుండా చుట్టూ అన్ని క్యాన్ లు పేర్చుకుని ఒకేసారి పోసేవాడు. ఆ క్రమశిక్షణకు గుర్తుగా మేజర్ జనరల్ పాల కరియప్ప అని లేపాక్షి ఆయనకు బిరుదు ప్రదానం చేసింది. ఆ బిరుదుకు తగినట్లు తరచుగా జున్నుపాలు ఉచితంగా ఇచ్చేవాడు. జున్ను భోంచేయడం నాకు అప్పటినుండే అలవాటు అయ్యింది. ఉదయాన్నే కొత్త లేపాక్షినుండి పొలాల్లో కాలిబాటనపడి పాతలేపాక్షిలో కిలోమీటరు దూరం వెళ్లి అప్పుడే పితికిన పాలు పోయించుకోవడంలో ఎంత ఆరోగ్యం, అంతకుమించి ఎంత ఆనందం ఉందో ఇప్పుడు తెలుస్తోంది. కరియప్ప మూడ్ బాగున్నపుడు ఇట్ల రా స్వామీ అని ఆవు పొదుగు కింద నా తల పెట్టించి నోరు తెరవమని నోట్లోకి నేరుగా పాలు పితికేవాడు. అదో గొప్ప అదృష్టం. అందరికీ దొరకదు. ఇంతకంటే అదృష్టం ఓ చిన్న గిన్నె మా చేతికి ఇచ్చి కూర్చుని రెండు మోకాళ్ళమధ్య ఆ గిన్నెను పట్టుకుని పిడికిలి బిగించి బిగించకుండా ఎలా పాలు పితకాలో ఎప్పుడయినా శిక్షణ ఇచ్చేవాడు. ఆ పశువులపాకలో ఆవులు, దూడలతో కరియప్ప మామూలు మనుషులతో మాట్లాడినట్లు మాట్లాడేవాడు. అదో బృందావనం, ఆయనో కృష్ణుడేమో!
వరుసగా ఈ మధ్య న్యూస్ పేపర్లతో పాటు ఒక కరపత్రం వేస్తున్నారు. ఒమేగా త్రీ ఉన్న ఏ2 పాలు కొనండి, తాగండి , కొలెస్టరాల్ తో రక్త నాళాల్లో సమస్యల్లేకుండా ఆరోగ్యవంతులు కండి – అన్నది ఆ కరపత్రం సారాంశం. అరలీటరు 80 రూపాయలు , లీటరు 150 రూపాయలేనట. వాళ్ళ ఫామ్ లో సొంతంగా పెంచిన ఆర్గానిక్ గడ్డినే ఆ ఆవులు తింటాయట. పాల ఉత్పత్తి పెరగడానికి ఎలాంటి ఇంజెక్షన్ లు , మందులు , స్టెరాయిడ్స్ ఇవ్వము – అని ఏ 2 పాలు ఎలా గొప్పవో వివరణ ఇచ్చుకున్నారు. సరే- కొనగలిగినవారు కొంటారు, లేని వారు లేదు. ఎవరిష్టం వారిది. బలవంతమేమీ లేదు.
ఈ కరపత్రం చదివినప్పటినుండీ నాకు ఒకటే భయంగా ఉంది. ఎన్నెన్నో ప్రశ్నలు, అనుమానాలు పాలు- నీళ్లలా కలసిపోతున్నాయి. ఇప్పుడు పాలను నీళ్లను వేరుచేసే హంసలు ఎక్కడన్నా దొరుకుతాయేమో అని అన్వేషణలో పడ్డాను.
హైదరాబాద్ లో ఇరవై ఏళ్లుగా ప్లాస్టిక్ కవర్లో పాలే వాడుతున్నాను. పాలు నీళ్లు కలవడాన్ని భాష అంగీకరించింది కానీ పాలు ప్లాస్టిక్ కలవొచ్చా ? కలవకూడదా?
నేను తాగుతున్న పాలు కొలెస్టరాల్ పెంచేవా ? తగ్గించేవా ? అందులో మళ్ళి చెడు మంచి కొలెస్టరాల్ ఉన్నాయి . ఏది ఏదో ?
నేను తాగుతున్న పాలు ఏ ఆవులు ఇచ్చినవి? అవి తిన్న గడ్డి ఆర్గనిక్కా ? అనార్గానిక్కా?
వాటికి ఏవయినా మందులు, స్టెరాయిడ్స్ ఇచ్చారా?
మీగడ తీసిన టోన్డ్ పాలు మంచివా ?
మీగడ తీయని హోల్ మిల్క్ మంచిదా?
అసలు మనుషులు తప్ప ఇంకే ప్రాణులు పెరిగి పెద్దయ్యాక పాలు తాగవు. పాలే మంచిది కాదు – అనే సిద్ధాంతం మంచిదా ?
పాల ఉత్పత్తుల్లో పెరుగు మంచిదా ?
మజ్జిగ మంచిదా ?
టన్నులకు టన్నుల వెన్న టిన్నులు ఓపెన్ చేసి తిన్న చిన్ని కృష్ణుడికి అప్పుడు అజీర్తి ఎందుకు చేయలేదు?
అసలు నెయ్యి ఆరోగ్యమా ? అనారోగ్యమా ?
పాల పాపాలు చేసేవారికి శిక్షలున్నాయా? ఉంటే ఎవరికియినా పాల శిక్షలు పడ్డాయా?
ఇలా ఒక్క కరపత్రం చదివితే అనంతంగా ప్రశ్నలు పుడుతున్నాయి.
పాలు- నీళ్లలా కలకాలం కలిసి ఉండమని ఆశీర్వచనం. కాబట్టి రమణా రెడ్డి సిద్ధాంతీకరించినట్లు పాలల్లో నీళ్లు కలపడం వరకు యుగధర్మంగా అర్థం చేసుకోవచ్చు. మిగతా ఏమి కలిపినా లేదా కలిసినా అవి పాలు కాదు. అంటే మనమంతా తాగుతున్నది పాలు కాదా? ఏమో?
తెల్లనివన్నీ పాలు కాదు.
–పమిడికాల్వ మధుసూదన్