Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘‘భలేవారే మాస్టారూ… తాగినోడి మాటలకు అర్థాలేమిటి? మర్మాలేమిటి…’’

May 30, 2026 by M S R

.

అప్పట్లో… చెన్నై వీథులు… ఆత్రేయ ఓ రిక్షా ఎక్కాడు… స్మార్ట్ ఫోన్లు గట్రా లేవు కదా… సదరు రిక్షావాడు అప్పటికే కాస్త ‘కరెంటు’ మీదున్నట్టున్నాడు… కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అని హమ్ చేస్తున్నాడు, తెలుగు వాడు అయి ఉంటాడు… ఆత్రేయ కవి కదా, పట్టుకున్నాడు… ‘ఒరేయ్, ఆ పాట అంత నచ్చిందా’ అన్నాడు…

‘భలేవారే, బాగా నచ్చేసింది, రాసిందెవరనుకున్నారు, చాలా పెద్ద కవి, నటించింది ఎవరనుకున్నారు, చాలా పెద్ద నటుడు, నాగేస్పర్రావు…’ అని చెబుతున్నాడు… ఎహె, ఆగు, కుడి కుడే, ఎడమ ఎడమే, అటూఇటయితే పొరపాటే కదరా, మరి ఆ కవి పొరపాటు కాదంటాడేంటి అన్నాడు ఆత్రేయ… సగటు మనిషి ఆ పాటను ఎలా రిసీవ్ చేసుకున్నాడు, ఏం అర్థం చేసుకున్నాడో తెలుసుకోవడానికి…

Ads

‘ఊరుకొండి మాస్టారూ, అంతటి పెద్ద కవి రాశాడంటేనే ఏదో పెద్ద అర్థం ఉండే ఉంటుంది’ అన్నాడు రిక్షా అతను… ‘ఏమోనోయ్, నాకైతే అది తప్పు భావన’ అన్నాడు రెట్టించి ఆత్రేయ… ‘చాల్లెండి, అందులో ఏఎన్నార్ ఏం వేషం వేశాడు, తాగుబోతు… తాగినోడి మాటలకు అర్థాలేముంటాయి లెండి, ఊరుకొండి’ అని దులిపేశాడు రిక్షావాడు…

అక్కడ ఆత్రేయకు ఇక మాట్లాడటానికి ఏమీ దొరకలేదు… నిజానికి జీవితంలో కుడి, ఎడమ అటూ ఇటయితే పెద్ద నష్టమేముంది? నిండా మునిగాక మునకే సుఖమనుకోక ఈ మీమాంసలేమిటి..? ఈ తేడాలేమిటి అనే తత్వం భలే రాశారు ఆ పాటలో అంటూ అప్పటికే పత్రికల్లో ప్రశంసలు కూడా వస్తున్నాయి… అంత లోతుల్లోకి ఓ సగటు మనిషి ఎందుకెళ్తాడు, ఏదో సినిమా కవులు ఏవో పైత్యాన్ని రాస్తుంటారు గానీ, సగటు మనిషి ఎలా తీసుకుంటాడనే లెక్కలు వాళ్లకెందుకు..?

అసలు కథేమిటంటే..? ఆ పాట రాసింది సీనియర్ సముద్రాల… ఆయన కూడా ఏదో తత్వాన్ని చెప్పడానికి రాయలేదు ఆ పాటను… తను రాసింది ‘కూడి ఎడమైతే పొరపాటు లేదోయ్’ అని… అంటే కూడి, కలిసిపోయి, ఎడమైపోతే, అంటే దూరమైపోతే, పెద్ద పొరపాటు లేదు అని చెప్పడం ఆయన భావన, ఏదో కథకు తగ్గట్టు రాశాడు…

తను చెబుతుంటే రాసుకున్న అసిస్టెంట్ డైరెక్టర్ దాన్ని కూడి బదులు కుడి అని రాసుకున్నాడు.., ఇప్పటిలాగా కంప్యూటర్ సహకారాలు, ట్రాకులు, మన్నమశానాలు లేవు కదా, అంతా లైవ్ రికార్డింగ్, ఆ టైమ్‌కు రచయితలు కూడా రికార్డింగ్ స్టూడియోకు వచ్చేవాళ్లు… ఈ సముద్రాల అక్కడికి చేరుకునేసరికి ఘంటశాల ఆ పాట కుడి ఎడమ అని పాడేస్తున్నాడు…

పర్లేదు, ఈ వ్యక్తీకరణ కూడా బాగానే ఉంది కదా, తాగినోడు ఏవో పాడుకుంటాడు కదా అనుకుని సముద్రాల సైలెంట్… అభ్యంతరపెట్టలేదు, రికార్డింగ్ ఆపలేదు… పైగా ఒకసారి పాట ఆగితే మళ్లీ బోలెడంత ప్రయాస, ఖర్చు… అవును, అందుకే ఇప్పటికీ అదే కఠిన జీవితసత్యం… ‘కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్’… ఆత్రేయకు కూడా రిక్షావాడు తత్వబోధ చేశాడు..!! ఆ పాట ఎంత సూపర్ హిట్టో తెలుసు కదా..!!



నిజానికి ఇది ఆత్రేయకు సంబంధించిన ముచ్చట కాదట… ఆరుద్ర, ప్రతిభాశాస్త్రి విజయవాడలో రిక్షాలో వెళ్తున్నప్పుడు ఈ ప్రస్తావన వచ్చి, ఏవేవో తర్కవితర్కాలకు దిగారట… అన్నీ వింటున్న ఆ రిక్షావాడు వాళ్లు దిగేచోట… ఇన్ని చర్చలెందుకు మాస్టారూ, వాడో తాగుబోతు, తాగినోడి మాటలకు అర్థాలేముంటయ్ అని వెళ్లిపోయాడట…. దీన్ని శ్రీరమణ హాస్యజ్యోతి పత్రికలో ప్రస్తావించాడట…



 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • TMC బండి నొగలు విరుగుతున్నయ్… ‘కర్మ’ ఎదురుతంతోంది…
  • అసలు హిట్లర్ ఎవరు..? BRS రచ్చకు శ్రీధర్‌బాబు భలే కౌంటర్…!
  • బొద్దింకలు అడిగాయని… ధర్మేంద్ర ప్రధాన్‌‌ను తప్పించడం పెద్ద పరీక్షే..!!
  • బండి ‘ఫ్లెక్సీలు’ సరే… తనను పదే పదే గోకి, గిల్లి, గిచ్చి, రక్కి రెచ్చగొట్టింది ఎవరు..?
  • మానెక్ షా … మనసున్న ఓ చిత్రమైన కేరక్టర్ … చదవాల్సిన ఓ కథ …
  • ప్రధాని మోదీ వెనుక కనిపిస్తున్నది ఏమిటి..? గేమ్ ఛేంజర్..!
  • … కుండ బద్ధలు కొట్టేయడంలో రేవంత్ రెడ్డి తరువాతే ఎవరైనా..!!
  • అబ్ ఆయేగా మజా ..! జార్ఖండ్ బరిలో సాయిరెడ్డి, పరిమళ్ అంబానీ..!!
  • సుకన్య..! పరువుకై 30 ఏళ్ల సఫల పోరాటం… మీడియాకు ఓ పాఠం..!!
  • …. అందుకే రేవంత్ రెడ్డి ప్రత్యర్థుల అంచనాలకు అందడు..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions