భూమికి ఆలమంద వెన్నుదన్ను
———————-
“భూగోళం పుట్టుక కోసం
రాలిన సుర గోళాలెన్నో?
ఈ మానవ రూపం కోసం
జరిగిన పరిణామాలెన్నో?”
అన్న దాశరథి ప్రశ్నకు సమాధానం అంత సులభంగా దొరకదు. భూమి ఏర్పడి ఎన్ని కోట్ల సంవత్సరాలయ్యిందో? భూమి మీద మనిషి ఇప్పుడున్న మనిషి రూపంలోకి రావడానికి ఎన్ని లక్షల లేదా కోట్ల ఏళ్లు పట్టిందో? భూమి తప్ప మిగతా గ్రహాలు ప్రాణులు బతికి బట్టకట్టడానికి అనువైనవి కావు. భూమి మీద మనం బతకాలంటే భూమి మీద పండే పంటలే ఆధారం. గింజలు, ధాన్యాలు, ఆకు కూరలు, కాయలు, పళ్లు, చివరికి నీళ్లు…అన్నీ భూమి ఇవ్వాల్సిందే.
Ads
ఆ భూమిని విష రసాయనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందులతో నిర్వీర్యం చేశాం. పురుగులు పడకూడదని మందులు చల్లి, చివరికి పాడు పురుగులు కూడా తినని పంటను మనమే తింటున్నాం. దిగుబడి బాగా పెరగాలని విష రసాయన ఎరువులు చల్లి ఆ విష రసాయన సార ఫలమయిన ధాన్యాన్ని మనమే వండుకుని తింటున్నాం. మర్రి, మామిడి, కొబ్బరి లాంటి చెట్ల వేళ్లు భూమి లోపల ఇరవై, ముప్పయ్ అడుగుల లోతుకు వెళతాయి. వరి, గోధుమలాంటి వేళ్లు పైపైనే ఉంటాయి. భూమి అడుగునుండి లవణాలు, ఖనిజాలు, ఇతర పోషక విలువలను పైకి తెచ్చి పంటకు ఇవ్వడం భూమి బాధ్యత. నీటి తడికి వేళ్ల ద్వారా ఆ పోషకాలను పైన వరి, గోధుమ వెన్నులోకి పంపడం సృష్టిలో జరిగే అద్భుతం. మనం ఎరువులు, మందులు చల్లితే పండే పంటలో అవే సూక్ష్మ రూపంలో వస్తాయి. ఎరువులు, పురుగుల మందులు తింటూ- బియ్యం, గోధుమ తింటున్నామని మనం సంబరపడిపోతుంటాం. నెమ్మదిగా భూమి పొరలు కూడా విషతుల్యమవుతూ ఉంటాయి.
ప్రకృతిలో సహజమయిన సమతౌల్యం ఉంటుంది. కోట్ల ఏళ్లుగా భూమి పండుతున్నా దాని సారం తగ్గకుండా అంతర్గతంగా ఒక శాస్త్రీయమయిన నిర్మాణం దాగి ఉంది. ఆవులు, ఎద్దులు, గేదెలు తొక్కితే చాలు. భూమి పులకించిపోతుంది. పొంగిపోతుంది. పవిత్రమవుతుంది. సారవంతమవుతుంది. ఆవులు, ఎద్దుల పేడ, మూత్రంతో భూమికి బలం పెరుగుతుంది. మలినాలు పోతాయి. అందుకే ఇది వరకు ఊరు ఊరంతా పేడ దిబ్బలు ఉండేవి. దుక్కి దున్నడానికి ముందు బండ్లల్లో పేడను తీసుకెళ్లి పొలమంతా చల్లేవారు. అదే అసాధారణమయిన ఎరువు. అదే అద్భుతమయిన పురుగుల మందు.
యజ్ఞానికి ముందు భూమిని ఆవు తొక్కాలి. ఎద్దులు తొక్కాలి. భూమికి నమస్కరించి నాగలి పెట్టి నేలను చదును చేయాలి. మిథిలానగర అవుటర్ రింగ్ రోడ్డు పక్కన జనకుడు అలా యజ్ఞానికి ముందు నాగలి పట్టి నేలను దున్నబోతే భూమిలో దొరికింది భూజాత సీత. నాగేటి చాలును సంస్కృతంలో సీత అంటారు. యజ్ఞానికి చదును చేసిన నేల మీద ఆవు పేడ కళ్ళాపి చల్లి ముగ్గులు పెట్టి తరువాత యజ్ఞవాటికలు కట్టాలి. నూతన గృహ ప్రవేశంలో మొదట ఆవు లోపలికి వెళ్లాకే మనం వెళ్లాలి. ఆవు పంచకం ఇల్లంతా చల్లాలి. భాగవతంలో బాలకృష్ణుడిని రాక్షసులు హింసించబోతే యశోద ఆవు తోక తాకించి గోవిందుడికే గో రక్ష రక్ష! అని మొక్కుకుందని పోతన పోతపోసిన తెలుగులో అక్షరీకరించాడు.
————————
భూమి గుండ్రంగా ఉంటుంది. ఇన్నాళ్లకు మళ్లీ భూములు ఆవుల పాద స్పర్శ కోరుకుంటున్నాయని రైతులు గ్రహించారు. ఆవుల, ఎద్దుల మందలను ఒక వారం, పది రోజులు పాటు పొలంలో ఉంచితే- ఆ పొలంలో బంగారు పంటలు పండుతాయని రైతులకు అర్థమయ్యింది. వందల సంఖ్యలో ఎలమందలు ఉన్న సంచార జాతులకు ఇదొక చక్కని ఆదాయ వనరు అయ్యిందని సాక్షి మంచి వార్తను ప్రచురించింది. ఆవు, ఎద్దుల పేడ, మూత్రం వల్ల ఆ పొలం బలం ద్విగుణీకృతమవుతోంది. ఆ పొలంలో పండే గింజలు తిన్నవారికి నాలుగు కాలాలు ఈలోకంలో నూకలు మిగిలి ఉంటాయి.
భూమికి చేవ.
రైతుకు దిగుబడి.
మనకు ఆరోగ్యం.
మొత్తంగా సమాజానికి సంతోషం………. By… -పమిడికాల్వ మధుసూదన్
Share this Article