Muchata

టీ-కాంగ్రెస్… ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కథ!!

April 5, 2016

Delhi modelFOR HYED_EPS (1)
…. ఇప్పుడు సమావేశమైన కారణమేందంటే… కేసీయార్ అసెంబ్లీలో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు కౌంటర్ గా మనమూ ఓ ప్రజెంటేషన్ ఇచ్చే విషయంలో చర్చిద్దామని….
తెలంగాణ కాంగ్రెస్ అతిరథమహారథులు (?) అందరూ గాంధీభవన్ లో కూర్చుని సమాలోచనలు జరుపుతున్న సందర్భం అది… టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎలాగూ నేనే అధ్యక్ష పదవికి రాజీనామా చేద్దామనుకుంటున్నాను. గనుక చివరగా ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నేను సమర్పించి నిష్క్రమిస్తా అన్నాడు….
అదేంటి ఉత్తమా? పాలేరు ఉప ఎన్నిక కూడా అయ్యాక అన్ని ఓటములకూ నైతిక బాధ్యత వహిద్దువు గానీ, ఇప్పుడే తొందరేమొచ్చింది అంటూ అడ్డుతగిలాడు జైపాల్ రెడ్డి…
అంతే అంతే అన్నట్టు అందరూ చప్పట్లు చరిచారు, బల్లలు చరిచారు…. ఒకాయనైతే మైకు విరగ్గొట్టాలనుకుని, ఇది అసెంబ్లీ కాదని గుర్తొచ్చి చివరి క్షణంలో తమాయించుకున్నాడు…
సరే, ఏ ఇంజనీర్ నో బతిమిలాడి అవే గూగుల్ మ్యాప్స్ కూడా కలిపి ఆ ప్రజెంటేషన్ ప్రిపేర్ చేయిద్దాం… ఇరిగేషన్ మినిస్టర్ గా చేసిన పొన్నాల ఇటీవల అక్కడా ఇక్కడా వ్యాసాలు కూడా రాస్తున్నాడు కాబట్టి, ఆ పనిని తనకు అప్పగిద్దాం….
ఓకే, ఓకే… వాళ్లూ వీళ్లూ ఎందుకు, నేనే తయారు చేసేస్తాను ఓ ప్రజెంటేషన్… కానీ అది నేనే ప్రజెంట్ చేస్తాను… అలాగైతేనే నేను ముందుకొస్తా…. అన్నాడు పొన్నాల
ఠాట్, అదెలా కుదుర్తుంది….? నేను సీఎల్పీ లీడర్ని… నేనే ప్రజెంట్ చేస్తాను…. అని మెల్లగా బాంబు వేశాడు జానారెడ్డి…. సమావేశమంతా అసాధారణ నిశ్శబ్దం… జానారెడ్డి మామూలుగా మాట్లాడితేనే జనం గగ్గోలు, ఇక పవర్ పాయింట్ ప్రజెంటేషనా? అన్నట్టు చూశారు అందరూ…
వాళ్ల చూపులకు విషయం అర్థమై…. ‘‘సరే, సరే, మీ ఇష్టం’’ అని మొహం మాడ్చుకున్నాడు… ‘‘అది కాదు జానా భాయ్, మొన్న అయిదు రూపాయల భోజనం బాగుందని చెప్పి నువ్వు గ్రేటర్ ఎన్నికల్లో పార్టీకి చేసిన సేవ అందరికీ అర్థమైంది కదా… అందుకని ఈసారి వేరేవాళ్లకు ఛాన్స్ ఇద్దాం’’ అని సముదాయించాడు వి.హన్మంతరావు… ‘‘గా ప్రజెంటేషన్ నాతోనైతే కాదుర భయ్, మనదంతా ఢిల్లీ లెవల్… గివన్నీ మనతోని గావు’’ అని తేల్చిచెప్పాడు. అందరూ తేలికగా ఊపిరి పీల్చుకున్నారు.
‘‘అసలు రంగారెడ్డికి అన్యాయం జరుగుతుందని నేను పోరాడుతున్నా కాబట్టి నేనే ఆ ప్రజెంటేషన్ బాధ్యత తీసుకుంటా…’’ అని సబితా ఇంద్రారెడ్డి, ‘‘అసలు మొదటి నుంచీ రీడిజైన్ మీద మాట్లాడుతున్నదే నేను, నేనే ఆ చాన్స్ తీసుకుంటా’’ అని జీవన్ రెడ్డి ముందుకొచ్చారు…. ‘‘ఎహె, మాట్లాడితే పంచ్ ఉండాలి. నాకు అప్పగించండి. దుమ్ము రేగిపోతుంది’’ అని ముందుకొచ్చింది డీకే అరుణ….
‘‘అసలు ఓ పద్ధతి ప్రకారం మాట్లాడుతున్నది నేను… అంతా మీరేనా? మాకేం అవకాశాలివ్వరా’’ అంటూ కస్సుమన్నాడు భట్టి… పొన్నం ప్రభాకర్, జి.వివేక్, గుత్తా సుఖేందర్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ గుసగుసలాడుకుని ‘‘అసలు తెలంగాణ తెచ్చింది మేము, సోనియాను ఒప్పించింది మేము. కనీసం ఇలాంటి విషయాల్లోనైనా మాకు చాన్స్ ఇవ్వాలని మా గ్రూపు డిమాండ్’’ అంటూ గట్టిగా దబాయించి మరీ సవాల్ విసిరారు….
‘‘అంతా బాగానే ఉంది… ఏదో ఒకటి చేద్దాం గానీ, అసెంబ్లీలో కాబట్టి, ప్రజెంట్ చేసింది కేసీయార్ కాబట్టి, ప్రత్యక్ష ప్రసారం చేయకపోతే తరువాత కష్టాలుంటాయి కాబట్టి మీడియా అంతా భలే హై పబ్లిసిటీ ఇచ్చింది… మనం గాంధీభవన్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే ఎవరు చూపించాలి? ఎవడు రాయాలి? మన వివేక్ సొంతం కాబట్టి ఒక్క వీ6 ఒక్కటి సగంసగం చూపిస్తుందేమో… మరి మిగతా చానెళ్లు, మిగతా పత్రికల మాటేమిటి? ఇంత కవరేజీ వచ్చినా, నేషనల్ మీడియా పట్టించుకోలేదని కేటీఆర్ గుర్రుమంటున్నాడు… అదీ పరిస్థితి…. అందుకే మనం ఓ పని చేద్దాం…. మనలో ఎవరైతే మొత్తం మీడియాను కాస్త మేనేజ్ చేయగలరో, వారికే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చాన్స్ కూడా ఇద్దాం…. ఏమంటారు?’’ అంటూ జైపాల్ రెడ్డి ఓ పరిష్కారం చూపేందుకు ప్రయత్నించారు…
కొద్దిసేపు నిశ్శబ్ధం… ఒక్కొక్కరే అకస్మాత్తుగా ఫోన్లు వచ్చినట్టు నటిస్తూ లేచి వెళ్లిపోవడం మొదలెట్టారు…. కాసేపటికి ఒకరో ఇద్దరో మిగిలారు…. సమావేశం నిరవధికంగా వాయిదా పడింది…
 

Filed Under: off beat Tagged: bhatti, counter to kcr, DKAruna, irrigation, janareddy, palvai, ponnala, ponnam, power point presentation, sabita, shabbir, tpcc, uttamkumar, vhanumantarao

Recent Posts

  • పౌరసత్వ సవరణ మంటల్లో ఐక్యరాజ్యసమితి ఆజ్యం..!
  • ఈ రాహుల్ రేప్ కథేమిటి..? ఈ సుకన్యాదేవి ఎవరు..? అసలేం జరిగింది..?
  • ఈ విశృంఖల కేరక్టర్ మళ్లీ శబరిమల తెరపై ప్రత్యక్షం..!!
  • అనూహ్యం..! ఈనాడు నుంచి తప్పుకున్న రామోజీరావు..!
  • పౌరసత్వ సవరణ చట్టం… మరికొన్ని చిక్కు ప్రశ్నలు ఇవీ…
  • మర్దానీ-2…. బిగి సడలని కథనం… రాణిముఖర్జీ పర్‌ఫామెన్స్..!
  • టైమ్ పాస్ పల్లీ..! ఆ కాసేపూ నవ్వించి, కడుపు నింపే వెంకీ మామ..!
  • 8400 కోట్ల బంపర్ ఆఫరా..? ఏమిటా కథ..? దొరకని జవాబు..!!
  • చంద్రబాబును మించి చంద్రజ్యోతి శోకాలు..! విడ్డూరంగా ఉంది బాసూ..?!
  • పాక్ ఉగ్రవాదులపై ఇండియా అంతరిక్ష గూఢచారి… రిశాట్..!
  • మ్యారేజెస్ ఆర్ మేడిన్ కౌన్సిలింగ్ సెంటర్స్
  • దిశ ఎన్‌కౌంటర్ కేసు కథ కంచికేనా..? సుప్రీం దర్యాప్తు మంచికేనా..?
  • ఒక్కసారిగా అతన్ని హగ్ చేసుకున్నా… సారీ, జొమాటో బాయ్..!
  • మామాంగం..! తెలుగు ప్రేక్షకుడు కనెక్ట్ కాలేని ఓ కేరళ వేడుక..!!
  • అనవసర వివాదాలతో బోలెడంత హైప్, ప్రచారం… కానీ ఏముందని ఇందులో..!

Follow

Subscribe to notifications

Handcrafted with by All Tech Media. All Rights Reserved Muchata.