అకస్మాత్తుగా జగన్ ఏపీ గవర్నర్‌తో భేటీ ఎందుకు వేశాడు..? గవర్నర్ దంపతులతో సీఎం దంపతుల విందు సమావేశం అని ఫోటోలు, వార్తలు… అవి నిజమే… కానీ… అదుగో పులి, ఇదుగో తోక అన్నట్టుగా… నిజాలేమిటో, చర్చించిన విషయాలేమిటో జగనూ చెప్పడు… గవర్నరూ చెప్పడు… ఈలోపు ఎవరికిష్టమున్నది వాళ్లు ప్రచారంలోకి తీసుకురావడం… అలా వ్యాప్తిలోకి వచ్చిన అంశాలేమిటంటే..? ‘‘జగన్ బెయిల్ కేన్సిల్ చేయబోతున్నారు… జైలుకు పంపిస్తారు… తన భార్య భారతిని సీఎంగా చేయబోతున్నాడు… అందుకే అన్ని పాలన వ్యవహారాల్లో ఆమెను ఇన్వాల్వ్ చేస్తున్నాడు… శిక్షణ ఇప్పిస్తున్నాడు… గవర్నర్‌కు పరిచయడం చేయడం కూడా అందుకే…’’ ఇదీ ప్రచారం…
నో, నో, అది కాదు… మొన్న ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసిన కొత్తపలుకు రాష్ట్రంలో మతవిద్వేషాల్ని రెచ్చగొడుతూ, ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలాగా ఉంది కాబట్టి, జగన్ సీరియస్ చర్యలకు సిద్ధపడుతున్నాడు, ఓమాట గవర్నర్ దృష్టికి తీసుకెళ్లడానికే వెళ్లాడు అని మరో ప్రచారం…
ఎహె, కాదు, తరచూ సీఎం గవర్నర్‌ను కలిసి రాష్ట్రంలో పరిస్థితులను వివరించడం ఆనవాయితీయే… అందులో భాగంగా వెళ్లిన ఓ రొటీన్ సమావేశం తప్ప ఇంకేమీ కాదు అంటూ మరో సమర్థన…
- ఇప్పటికిప్పుడు జగన్ బెయిల్ రద్దు చేయించేలా సీబీఐను ఉసిగొల్పాల్సినంత రాజకీయ అవసరం బీజేపీకి లేదు… దానివల్ల బీజేపీకి వచ్చే ప్రయోజనమూ లేదు… అయితే గియితే అది చంద్రబాబుకు ఉపయోగమే కానీ బీజేపీకి అంతగా ఉండదు… మరి చంద్రబాబు కోసం జగన్‌ను మళ్లీ జైలుపాలు చేయాల్సిన అవసరం మోడీకి ఏముంది..? ఇది ఓ బేసిక్ ప్రశ్న… రీసెంటుగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కుదరదు అని సీబీఐ కోర్టు చెప్పిందే తప్ప… బెయిల్ రద్దు చేయాలని సీబీఐ ఏమీ కోరలేదు… (సీఎం హోదాలో జగన్ కీలక సాక్ష్యాలు తారుమారు చేసే ప్రమాదం ఉందనే సాకుతో సీబీఐ బెయిల్ రద్దు కోరేందుకు అవకాశం ఉంది, కానీ అదేదో జైలులో ఉన్నా చేయగలడు కదా… సో, లాజిక్కుకు అందని ప్రచారం…)
- ఆమధ్య కేసీయార్ ఎవరితోనో ఆంతరంగిక సంభాషణల్లో ‘ఎలాగూ 3, 4 నెలల్లో జగన్ జైలుకు వెళ్తాడని వ్యాఖ్యానించినట్టుగా రాధాకృష్ణ రాసిన ఓ వ్యాసమే తప్ప… జగన్‌పై బీజేపీ పూర్తి శతృభావనతో కదులుతుందని చెప్పటానికి ఆధారాల్లేవు… నిజానికి రాష్ట్రంలో తెలుగుదేశం బలహీనపడితే బీజేపీకి ఏమైనా ఎదిగే చాన్సుంటుందేమో తప్ప ఇప్పటికిప్పుడు అధికారంలో ఉన్న జగన్ పునాదుల్ని పెకిలించడం కష్టం, జగన్ దెబ్బతింటే అది టీడీపీకి ప్రయోజనమే తప్ప తనకు ఒనగూరే ఫాయిదా ఏమీ ఉండదు… సో, జగన్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలకు మోడీ పూనుకుంటాడనేది నమ్మబుల్ వాదనగా కనిపించడం లేదు…
- మహారాష్ట్రలో బీజేపీ దెబ్బతిన్నది, హర్యానాలో దెబ్బతిన్నది… మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో ఏదో చేయాలని భావించినా ఈరోజుకు ఏమీ చేయలేకపోతున్నది… పంజాబ్, చత్తీస్‌గఢ్‌లలో ఏమీ చేయటానికి కూడా చాన్స్ లేదు… జార్ఖండ్‌లో మిత్రులు దూరమయ్యారు… ఈ స్థితిలో ఇతర రాష్ట్రాల్లో తన గోచీ సర్దుకోవడానికే బీజేపీకి టైం సరిపోవడం లేదు… ఇంకా నిష్ప్రయోజనకరమైన ఏపీ రాజకీయాల జోలికి వచ్చి గోక్కునే పరిస్థితి ఉందా..?
- జగన్ జైలుకు వెళ్లాలంటే… సీబీఐ కోర్టు ఏదో ఓ కేసులో తనకు జైలుశిక్ష వేయాలి… అది విచారణలు, సాక్ష్యాలు, వాదప్రతివాదాల మెరిట్‌ను బట్టి ఉంటుంది… లేదంటే బెయిల్ రద్దు చేయాలి… సీబీఐ ఇలా అడగ్గానే సీబీఐ కోర్టు బెయిల్ రద్దుకు అంగీకరించాలని కూడా ఏమీ లేదు…
- నిజానికి తెలుగుదేశం బీజేపీ నుంచి దూరం కావటానికి కారణాల్లో ఇదీ ఒకటి… ‘జగన్‌ను ఏదో ఓ కేసులో శిక్ష పడేలా చేసి, ఎన్నికల్లో పోటీకి అనర్హత వేటు వేయించాలి’ అని కేంద్ర ప్రభుత్వాన్ని పదే పదే కోరినా సరే బీజేపీ పెద్దగా పట్టించుకోలేదు… ‘‘కావాలని జగన్‌ను సతాయించేది లేదు, అలాగని సమర్థించి సాయం చేసేదీ లేదు’’ ఇదే అప్పట్లో మోడీ స్టాండ్… మరి అప్పట్లోనే ఆ బాబు డిమాండ్లను తోసిపుచ్చిన బీజేపీ ఇప్పుడు దానిపై దృష్టి ఎందుకు సారిస్తుంది..? ఒకవేళ చేసినా తనకొచ్చే ఫాయిదా ఏమిటి..? తనను మొన్నమొన్నటిదాకా తిట్టిపోసి, తనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రతిపక్షాలను ఏకం చేసి, ఆర్థికసాయం కూడా చేసిన చంద్రబాబును ఇప్పటికిప్పుడు అర్జెంటుగా నెత్తిమీద పెట్టుకోవాల్సిన అగత్యం బీజేపీకి ఏముంది..? ఇదుగో ఇన్నిరకాల చర్చలు, విశ్లేషణల నడుమ… జగన్ మళ్లీ జైలుకు పోతాడా లేదా అనేది పాఠకుడు విశ్లేషించుకోవాల్సిందే ఇక..!