గొప్ప భారతీయ సినీదర్శకుడిగా గౌరవింపబడే సత్యజిత్ రాయ్ గురించి చెప్పిన ప్రతిసారీ అప్పు త్రయం (Appu Trilogy) ప్రస్తావన చాలా అలవోకగా జరిగే విషయం. అలాగే శ్యామ్ బెనెగల్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా అంకుర్ (1973), నిషాంత్ (1975) మరియూ మంథన్ (1976) చిత్రాలను గ్రామీణ త్రయం (Rural Trilogy) గా విశ్లేషకులు గుర్తిస్తారు. అలాగే మమ్మో (1995), సర్దారీ బేగం (1996) మరియూ జుబేదా (2001) చిత్రాలు ముస్లిం చిత్రత్రయం (Muslim trilogy) గా భావించవచ్చు. భారతీయ సమాంతర సినిమాలో ఎగసిన మరో కెరటం గోవింద్ నిహలాని గారి ఆక్రోష్ (1980), అర్ధ సత్య (1983), ద్రోహ్ కాల్ (1994) చిత్రాలను ఆ దర్శకుడి చిత్రత్రయంగా చెప్పుకుంటారు. అదే పద్ధతిలో రాంగోపాల్ వర్మ సినిమాలలోని విషయాలని తీసుకొని, మూడింటిని ఎంపికచేస్తే అవి శివ (1989), గాయం (1993), మరియూ సత్య (హిందీ 1998) అవుతాయి. ఎందుకంటే, ‘శివ’ తొలి సినిమా కాగా, ‘గాయం’ సినిమాతో వర్మ తనదైన ఒక కథన శైలి, విషయం మీద పట్టూ ఈ సినిమాతో అలవర్చుకున్నా డనిపిస్తుంది. ఇక ‘సత్య’ వర్మ శైలిని శిఖరాగ్రానికి చేర్చిన చిత్రం. ఆ తరువాత వర్మ ఎన్ని సినిమాలు తీసినా, ఇంకా తీస్తున్నా ‘సత్య’ సినిమాకు సరితూగేవి కనిపించవు. అందుకే ఈ వర్మ చిత్రత్రయాన్ని ఎంచుకుని, తన కథానాయకుల ద్వారా వర్మ సూచించిన సమాజ విలువల్ని గురించి చర్చిద్దాం!

Sponsored Links

కాలేజీ దౌర్జన్యాన్ని ఎదుర్కోవడంతో మొదలై, దానికి కొనసాగింపుగా, పెచ్చరిల్లుతున్న ‘భవాని’ అనే సిటీ గూండా యొక్క మాఫియా ఆధిపత్యాన్ని సమూలంగా నాశనం చెయ్యడానికి తయారయ్యే ఒక మధ్యతరగతి యువకుడి కథ శివ. ఒక మాఫియా రాజకీయ కుటుంబం నేపధ్యం ఉన్నా, కేవలం సాధారణ జీవితాన్ని అనుభవించాలనుకునే ‘దుర్గ’ తప్పని సరి పరిస్థితుల్లో, మాఫియా నాయకుడిగా మారవలసి వచ్చే కథ గాయం. ఎక్కడి నుంచీ ముంబైకి వచ్చాడో తెలీని ‘సత్య’ అనే సాధారణ యువకుడు మాఫియా సభ్యుడిగా మారే కథ సత్య. ఈ విధంగా చూస్తే సమాజంలోని ఒక చీకటికోణాన్ని వర్మ ఈ మూడు చిత్రాల్లోనూ తెరపైకి తీసుకు వచ్చాడు. ఈ ప్రస్థానంలో వర్మ తన సినిమాలలోని కథానాయకుడి ద్వారా ఈ చీకటి ప్రపంచాన్ని (underworld) అర్థం చేసుకొన్నతీరు, తద్వారా సమాజంలో మారుతున్న విలువలని ఎత్తిచూపిన విధానం గమనిస్తే, అది సమాజంపై దర్శకుడి వాంగ్మూలం అనిపిస్తుంది. ఈ పరిణామం అర్థం చేసుకోవడానికి ఒక విశ్లేషణ అవసరం.

Sponsored Links

శివ లోని కథానాయకుడు ‘శివ కుమార్’ (నాగార్జున) మొదట్లో “నన్ను కొట్టడానికి వచ్చినప్పుడు చెంప చూపించడానికి నేను గాంధీ అంత గొప్పవాడ్ని కాను” అని, తను చేసింది ఒక వ్యక్తిగా తన ఆత్మరక్షణకు మాత్రమే అన్నట్టుంటాడు. తరువాత “అయినా ఊర్లో గొడవలు మనకెందుకు?”అని కథానాయిక ‘ఆశ’ (అమల) అంటే, “ప్రతి ఒక్కళ్ళూ, మనకెందుకూ! అనుకోబట్టే పరిస్థితి ఇలా ఉంది. ఎవరో ఒకరు first step తీసుకోవాలిగా?” అని, సమాజం తరఫున రౌడీయిజానికి వ్యతిరేకంగా ఆ మొదటి అడుగు వేసేస్థాయి వరకూ ఎదుగుతాడు. ‘మల్లి’ (శుభలేఖ సుధాకర్) చని పోయినప్పుడు “దీనికి solution గా భవానీని చంపడంకాదు. అలాంటి గూండాలను పుట్టిస్తున్న ఈ వ్యవస్థని నాశనం చెయ్యడం” అంటాడు. తన అన్నయ్య (మురళీ మోహన్) “నలుగురికీ పనికొచ్చే ఉద్యోగం చెయ్యొచ్చుకదా?” అనే మాటకు, “నలుగురికి ఉపయోగపడే పనికన్నా, భవానీ లాంటివాణ్ణి ఒక్కణ్ణి నాశనం చేస్తే వందమందికి ఉపయోగపడినట్టు” అని తన ఉద్దేశాన్ని స్పష్టంగా తెలియజెబుతాడు. ఇందులో వ్యక్తిగతమైన ఆత్మరక్షణ నుండీ సమాజాన్ని కూడా తనవంతు ప్రయత్నంగా రక్షించాలనే ఒక యువకుడి ఆదర్శం కనబడుతుంది. ఈ ప్రయత్నంలో తను ఎంచుకునే మార్గం మళ్ళీ రౌడీయిజమే అయినా, అందులోకూడా ప్రతీకారవాంఛ కాక, ఒక ఆలోచన కనబడుతుంది.

కాలేజి రాజకీయాలూ, సిటీలోని గూండాయిజం మరియూ అక్కడి స్థానిక రాజకీయాలూ ఒక్కటిగా మారి ఒక వ్యవస్థీకృత మాఫియాగా ఎలా మారిపోయాయో ఇనస్పెక్టర్ గా ఉన్న ‘ఆశ’ అన్నయ్య (సాయి చందర్) ద్వారా వివరంగా తెలుసుకున్న శివ, స్టూడెంట్స్ యూనియన్ మొదలు, వర్కర్స్ యూనియన్, వ్యాపారస్థుల సంఘాలు ఇంకా బార్ ఓనర్స్ సంఘాలు, అందరూ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ మాఫియాకి మద్దతునిస్తున్న కారణాలని తెలుసుకుని ఈ వ్యవస్థ మూలాల్ని కదిలిస్తాడు. ఆ వ్యవస్థల్ని చాలా పకడ్బందీగా నాశనం చేసి అందరి పునాదుల్నీ కదిలించి ఒక భూకంపాన్నే సృష్టిస్తాడు.
ఇదంతా ఒక ఎత్తైతే, (క్లైమాక్స్) చివరిలో తన కథానాయకుడితో రాంగోపాల్ వర్మ ఇప్పించిన ముగింపు, పాత్ర అభివృద్ధి పరంగా చూస్తే అభినందనీయం కాకపోయినా, ప్రేక్షకుల్ని ఆలోచింపచేసేదిగా నిలిపిన ఘనత కూడా వర్మదే. శివపై ప్రతీకారానికి భవాని చేయించే దాడిలో, శివ అన్నయ్య కూతురు హత్య చెయ్యబడుతుంది. ఈ ఆవేశంలో శివ, భవానీని ఎదుర్కొని చివరికి చంపేస్తాడు. కాకపొతే ఒక్కసారి సినిమా మళ్ళీ చూస్తే శివ నిజంగా భవానీని క్రింద పడేలా తన్నాడా? అన్నది నిర్ధారణగా చెప్పలేం. శివ క్లోజప్ నించి కట్ చేసి చూపే భవాని పడిపోయే షాట్ లో భవాని అ..దు..పు..తప్పి పడిపోయాడా! అన్న భావన కూడా ఎడిటింగ్ ద్వారా ప్రేక్షకులకి కల్పించాడు. పైగా చివరి దృశ్యంలో, ఆశ మెట్లు దిగివచ్చిన శివకి ప్రేమగా దగ్గరైతే, ముఖంలో దాదాపు ఏభావమూ లేని ఇనస్పెక్టర్ ఎదురుగా నిలబడి ఉంటాడు. అంటే, శివ అరెస్టు చెయ్యబడతాడా? తన భవిష్యత్తు ఏమిటీ? అనేవి తెలియకుండా సినిమా ముగుస్తుంది.

తను ఎంచుకున్న దారి తప్పైనా ఒక ఆదర్శం కోసం ఎంచుకున్నట్టుగా హీరో యొక్క సామాజిక విలువల్ని చూపి హీరోయిజాన్ని నిలబెట్టాడన్నమాట. అంతేకాక ముగింపుని అలా ప్రేక్షకుల ఆలోచనకే వదిలేసి, హీరో స్థాయిని నిలబెట్టాడు. శివ సినిమా అప్పటివరకూ వచ్చిన తెలుగు సినిమాలన్నింటకీ విభిన్నమైనది గనక, వర్మఅప్పటికే ఉన్న ఒక ట్రెండ్ ను ఫాలో అయ్యాడు, అని అనుకోలేం. కాబట్టి, వర్మ తను అర్థం చేసుకున్న సామాజిక విలువల్ని తన కథానాయకుడి ద్వారా సినిమాలో తెలియజెప్పాడు అని అనుకోవడానికి చాలా అవకాశం ఉంది.

ఇక ‘గాయం’ సినిమాలో హీరో ‘దుర్గా ప్రసాద్’ (జగపతి బాబు) వర్మ హీరోలందరిలో ఎక్కువ సంక్లిష్టమైన పాత్ర అనిపిస్తుంది. బహుశా ఆ కాలంలోని సామాజిక పరిస్థితుల్ని అర్థంచేసుకోవడంలో వర్మ అనుభవించిన సంక్లిష్టతను ఈ హీరో ద్వారా చెప్పాడు అనుకోవచ్చు. అంతేకాక శివ సినిమాలా ఏకపక్షంగా కాక, ఈ సినిమాలో హీరోతో పాటూ మరికొన్ని పాత్రలు ప్రాముఖ్యతని సంతరించుకుంటాయి. హీరో దారినీ, ఆలోచననీ, ఆచరణనీ వ్యక్తి స్థాయిలో విమర్శించే పాత్ర ఒకటైతే (దుర్గ ప్రియురాలు అనిత (రేవతి)), మరోటి ఈ సమస్య యొక్క సామాజిక పార్శ్వాన్ని జనాంతికంగా ఎత్తిచూపేది (ప్రత్యేక పాత్రలో సిరివెన్నెల సీతారామశాస్త్రి). వర్మ సూత్రధారి గొంతు (third person narrative voice- over) ను ఉపయోగించి సినిమా ముగింపు చెప్పించిన మొట్టమొదటి సినిమా ఇదే. ఈ సినెమాటిక్ ప్రక్రియ ఉపయోగం తెలిసిన అందరికీ వర్మ దీన్ని ఉపయోగించడం ద్వారా సూచిస్తున్న భావం అర్థమయ్యే ఉంటుంది. (సినిమా థియరీలో, The third-person narrative is a narrative that is not from a player in the story, hence, assumed to be providing the illusion of subjectivity to the story అంటారు.) దీన్ని బట్టి, వర్మ ఈ విధానాన్ని ఉపయోగించి ముఖ్యపాత్రల వ్యక్తిగత స్థాయికి అతీతమైన సార్వజనీనతని కథనంలో కల్పించాడు. ఆ నెరేటివ్ లో చెప్పింది ఒక దర్శకుడిగా తన ఆభిప్రాయమే అన్న బాధ్యత నుంచీ తప్పించుకున్నాడని కూడా అనుకోవచ్చు. మనకి ఈ విశ్లేషణలో నాయకుని పాత్ర దృక్పథం ముఖ్యం గనుక ఇక్కడ ఆ గొంతుకతో చెప్పించిన ముగింపు కాక మిగతా భాగంలో హీరో పాత్ర ద్వారా వర్మ సూచిస్తున్న సమాజపు స్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
హీరో వ్యక్తిత్వాన్ని తీసుకుంటే, ఆరంభంలోనే “మనదొక్కటే పద్దతి, మనకు సంబంధించిన విషయాలు పట్టించుకోం. మన జోలికొస్తే మాత్రం వదలం” అని తన ఉద్దేశ్యాన్ని చాలా సూటిగా తన ప్రియురాలు అనితతో పంచుకుంటాడు. ఒక రౌడీ రాజకీయవేత్త అయిన తన అన్నయ్య గురించి ఆమె ప్రశ్నిస్తే, “మా అన్నయ్య ఏమైనా ఆకురౌడీ అనుకుంటున్నావా? ఎన్నో రకాల రాజకీయాలలో అదోటి” అని ఒక నిర్ధిష్టమైన సామాజిక విలువలని ఆపాదించక, నిస్పక్షంగా స్పందిస్తాడు. దీన్ని బట్టి కథానాయకుడు సమాజ విలువలకి కాక వ్యక్తిగా తన భావాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవాడుగా సాక్షాత్కరిస్తాడు. మూర్తీభవించిన సమాజ వ్యాఖ్యాతగా, దుర్గ పక్కన అనితను ఉంచి ఇక్కడ దర్శకుడు హీరోపాత్రను విడమర్చి చెప్పడమేకాక, రాబోయే విబేధాలని కూడా సూచిస్తాడు. ఏదో ఒక ఉద్యోగం సంపాదించి, ప్రేమించిన అనితను పెళ్ళి చేసుకుని, దూరంగా వెళ్ళి హాయిగా జీవించాలనుకునే ఈ యువకుడు, తన అన్న, మామయ్యల మరణంతో ప్రతీకారంకోసం ఆవేశంతో కాక ఒక ఆలోచనతో రౌడీయిజాన్ని అందిపుచ్చుకుంటాడు. అన్నయ్య మరణం తర్వాత, విరోధి గ్యాంగ్ ను మట్టు బెట్టడానికి జరిగే చర్చల్లో భావరహితమైన ముఖంతో, “ఇప్పుడు మనం ఆలోచించాల్సింది చంపడం గురించి కాదు. ఎలా చంపాలి అన్నది” అన్న ఒక్క మాటతో హీరో తన గ్యాంగ్ పై ఆధిపత్యాన్ని తీసుకుని, నిర్దేశించేస్థాయికి ఎదిగిపోతాడు. “మన జోలికొస్తే మాత్రం వదలం” అన్న ప్రారంభ వాక్యాల్ని అక్షరాలా ఆచరించి చూపిస్తాడు.

ఇంత జరిగినా తను చేసింది ‘తప్పు’ అని నమ్మడు. సమాజానికి ప్రతీకగా ఉన్న అనిత, దుర్గ చేసిన పని ఔచిత్యాన్ని ప్రశ్నిస్తే, “నేను చేసింది తప్పని ముమ్మాటికీ నేననుకోవడం లేదు … ఏది ఏమైనా, ఎంత మందిని చంపైనా మా అన్నయ్య చేసింది నిలబెడతాను” అని అనితతో తన బంధాన్ని తెగిపోయేలా చేస్తాడు. రౌడీరాజకీయ వ్యవస్థలో మంచికోసం చెడుచేస్తూ, చెడు రౌడీరాజకీయాల్ని ఎదుర్కొనే ఒక నాయకుడిగా మిగిలిపోతాడు. ఇక్కడే ఈ పాత్ర సంక్లిష్టత బయటపడుతుంది. తను చేసేది చట్టపరంగా తప్పే అయినా, సమాజపరంగా మంచిగా అనిపించడం అప్పటి సామాజిక స్థితికి అద్దం పడుతుంది. హిందీ సినిమాలో వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడటానికి ప్రతీకగా పుట్టిన ‘యాంగ్రీ యంగ్ మ్యాన్’ పాత్ర అప్పటిదాకా తెలుగులో స్పష్టంగా ఎక్కడా లేకపోయినా, ఈ నాయకుడి పాత్ర ఆ ఆలోచనా శైలిని కల్గి ఉంటుందని చెప్పొచ్చు.
సర్కార్ (రామిరెడ్డి) దుర్గపై థియేటర్లో చేసిన హత్యాప్రయత్నం తరువాత, జర్నలిస్టుగా మారిన అనిత, థియేటర్ యజమాని నిజం చెప్పకపోతే అసహనం వ్యక్తపరుస్తుంది. ఆ థియేటర్ యజమానికి సమాజం పట్ల ఉన్న బాధ్యతను ప్రశ్నిస్తుంది. దానికి సిరివెన్నెల సీతారామశాస్త్రి చెప్పే సమాధానం, “ఆ నిజాన్ని తెలుసుకుని నువ్వు గానీ, నీ జనంగానీ ఏంచేస్తారు? నువ్వు పేపర్లో రాస్తావు, అది పొద్దున ఆరు గంటలకి ఇంటింటికీ వెళుతుంది. దాన్ని వాళ్ళు చదువుకుని పక్కన పడేసి, ఎవరి పనుల్లో వాళ్ళూ మునిగిపోతారు. అంతేగా!” అంటూ, “నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని. నిప్పుతోటి కడుగు ఈ సమాజ జీవఛ్ఛవాన్ని … మారదు లోకం .. మారదు కాలం” అని స్పందించని సమాజాన్ని ప్రశ్నిస్తాడు. ఈ సన్నివేశం తరువాత ఇలాంటి ప్రశ్నే దుర్గను అడుగుతుంది అనిత, దానికి దుర్గ ఇచ్చే సమాధానం “తెలుసుకుని నువ్వేం చేస్తావ్?” అని ఇంచుమించు సిరివెన్నెల లేవనెత్తిన ప్రశ్నలాంటిదే. ఇక్కడ దుర్గ పాత్ర మరింత ముందుకు వెళ్ళి, “ఇలా ఒకరినొకరు చంపుకుంటూ పోతే, దీనికి అంతం ఎక్కడుంటుంది?” అన్న అనిత ఆవేదనకు సమాధానంగా, “అదినేను చెప్పలేను. ప్రస్తుతం జరుగుతున్నవాటికి పరిష్కారమేమిటో నువ్వు చెప్పగలవా?” అని, ప్రస్తుతం ఉన్న సమాజంలో కొన్ని జవాబుల్లేని ప్రశ్నలలో తను ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ వ్యవస్థ కూడా ఒకటని ఎత్తిచూపుతాడు.

ఇలాంటి విలువల ఘర్షణల మధ్య చివర్లో గురునారాయణ్ (కోట శ్రీనివాసరావు) రూపొందించే మతకల్లోలాల ఎత్తగడను అరికట్టడానికి పోలీసులు కూడా దుర్గ సహాయం కోరడం, అప్పటి వరకూ దుర్గ విలువలని తప్పన్న అనిత తన భర్త పోలీస్ ఇనస్పెక్టర్ భరద్వాజ(శివకృష్ణ) ను రక్షించుకోవడానికి దుర్గ సహాయం కోరడంతో సినిమా పతాకస్థాయికి చేరుకుంటుంది. చట్టానికి వ్యతిరేకంగా హీరో ఒక వ్యవస్థని నడుపుతున్నా, చివరకు ఆ చట్టమే అతని సహాయం అర్థించడం, హీరో ఎంచుకున్న విలువల్ని సమాజానికి ప్రమాదంగా భావించిన అనిత, పరిస్థితుల ప్రభావం వల్ల ఆ హీరోనే సహాయం కోరడంతో హీరో పాత్ర నిజంగా ‘హీరో’ అవుతుంది. ఇలాంటి హీరోయిజం అంత అభిలషణీయం కాదు, అనే ఒక సామాజిక స్పృహ కలిగించి (మభ్యపెట్టాడానికా అన్నట్టు) వర్మ ఆఖర్న voice-over ని ఆశ్రయిస్తాడు. అందుకే సిరివెన్నెల సీతారామశాస్త్రి గొంతులో “ఇలాంటి పరిస్థితులు సమాజానికి మరణం కాదు, యుగాంతమూ కాదు. సమాజానికి తగిలిన నిర్లక్ష్యం చెయ్యకూడని గాయాన్ని ఎత్తిచూపడానికే ఈ ప్రయత్నం” అనిపిస్తాడు. ఏదిఏమైనా వర్మ, దుర్గాప్రసాద్ పాత్రను అప్పటి సమకాలీన పరిస్థితులకి అద్దంపట్టే ఒక ఒక సంక్లిష్ట పాత్రగా మలచి తను అర్థం చేసుకున్న సమాజానికి అద్దం పట్టాడు.

ఇక ఈ త్రయంలో చివరి చిత్రం ‘సత్య’. ఇది హిందీ భాషలో, ముంబై మాఫియా నేపధ్యంగా ఉన్న చిత్రమే అయినా, రాంగోపాల్ వర్మ ‘శివ’ ద్వారా మొదలుపెట్టిన sఅమాజపు చీకటికోణాలపై తన పరిశీలనను తారాస్థాయికి తీసుకెళ్ళిన చిత్రంగా, ఈ వరుసలో చేరింది. అంతేకాక వర్మ తన socio- philosophical premise ని ఒక నిరపేక్షిక (objective, detached) స్థాయికి ఈ చిత్రం ద్వారా తీసుకెళ్ళాడనేది నా నమ్మకం. ‘శివ హీరోకి ఉన్నటువంటి absolute values ఈ సినిమాలోని నాయకుడిలో కనపడవు. ‘దుర్గ’కి ఉన్నటువంటి టి వ్యక్తిగత కారణాలూ, సమాజంలోని మంచి చెడుల చర్చలు ఈ కధానాయకుడికి లేవు. ఎక్కడినుండీ వచ్చాడో, తల్లిదండ్రులెవరో, భాష ఏమిటో, అతడి విలువలేమిటో, ఎవ్వరికీ తెలియవు. నిజానికి ‘సత్య’ (జె.డి.చక్రవర్తి) కు భూత, భవిష్యత్ కాలాలు లేవు, ఒక్క వర్తమానం తప్ప. ఇలాంటి ఒక సాధారణ వ్యక్తి. .. చాలా సా…ధా…ర…ణం…గా ముంబై మాఫియాలొ చేరి, అంతే సులువుగా జీవితం గడిపి, పెద్దగా వ్యక్తిగతంగా మార్పు కూడా లేకుండా (కాల్పుల్లో) మరణించడం ఈ చిత్ర కథ. ఇంత సాధారణ యువకుడి కథ అంతే value judgement లేకుండా చెప్పి వర్మ తన matured understanding of present day society ని తెరబద్ధం చేసాడనిపిస్తుంది.

సినిమా బోంబాయి నగరంలో పెరిగిపొయిన ఆర్థిక అసమానతలూ, అస్తవ్యస్తంగా ఉన్న ప్రభుత్వ వ్యవస్థ, దాని కారణంగా ఏర్పడిన మాఫియా గురించి నేపథ్యంలో ఒక voice-over చెప్తుండగా, ఈ చిత్ర హీరో పరిచయమవుతాడు. ఇంతకు ముందే చెప్పినట్లు అతని నేపథ్యం తెలియదు, తను జైల్లో ‘భీఖూ మహత్రే’ (మనోజ్ బాజ్ పాయ్)తో చెప్పిన మాటల్లో , తల్లిదండ్రులెవరో తెలీదు, బ్రతికున్నారో లేదో కూడా తెలీదు. కాకపోతే తనను చందా (హఫ్తా) అడిగిన ఒక లోకల్ గూండా ముఖాన కత్తివేటు వెయ్యడంతో తనలోని కోపాన్ని పరిచయం చేస్తాడు. ఈ గొడవ పర్యవసానంగా లోకల్ మాఫియాతో కుమ్ముక్కైన ఒక పోలిస్ ఇన్ స్పెక్టర్ ద్వారా నేరం మోపబడి జైలుకి చేరతాడు. అక్కడ తన జీవితంలో పెద్ద మలుపు తిరుగుతుంది. భీఖూ మహత్రే అనే ఒక మాఫియా సైనికునితో పరిచయం కలుగుతుంది. మొదట వీరి పరిచయం గొడవతో మొదలైనా, “నాకు చావంటే భయం లేదు” అన్న తన ఒక్క మాటతో, సత్య విలువ గ్రహించిన మహత్రే, తనతో పనిచెయ్యమంటాడు. తన గ్యాంగ్లో స్థానం కల్పిస్తాడు. అప్పటిదాకా తాడూబొంగరం లేని సత్యకు ఆ మాఫియా గ్యాంగులో తనదంటూ ఒక కుటుంబం దొరుకుతుంది.

తనని జైలుకు పంపించిన లోకల్ గూండాను కాల్చిచంపడంతో తన మాఫియా జీవితం ఆరంభస్తాడు. ఆ గూండాని చంపుతున్నప్పుడుగానీ, ఆ తరువాతగానీ ఎక్కడా తను చేసింది ‘తప్పు’ అనే చర్చగానీ, ముఖంలో భావంగానీ కనపడని సత్య. తనుచేసింది ఒక ఆటవిక న్యాయం అంతే, అక్కడ అదే సరి. దాంట్లో చర్చలూ, ఫీలింగ్స్ కి స్థానం లేదు. ఈ నిజాలకి నిలువెత్తురూపంగా ‘సత్య’ మారతాడు. అక్కడి నుండీ భీఖూ కుడిభుజంగా, తన తరఫున ఆలోచనగా, ఒక నమ్మకంగా గ్యాంగ్ లో సుస్థిరస్థానాన్ని కల్పించుకుంటాడు. శివ, దుర్గల్లాగా సత్య గ్యాంగుకి నాయకుడు కాదు, ఒక భాగం మాత్రమే. కానీ అతడు ఈ బొంబాయి అస్థవ్యస్థమైన వ్యవస్థలో ‘ఒక సామాన్యుడు’, మాఫియాలో స్థానాన్ని కల్పించుకుని సిటీని తనదైన విధంగా శాసించిన ‘అసామాన్యుడు’. ఇతడి ఫోటో పోలీసుల దగ్గర ఉండదు, కానీ he is one of the most wanted persons. ఈ contradiction సత్యను ఒక విభిన్నమైన కథానాయకుణ్ణి చేస్తుంది.

‘సత్య’ పాత్రకున్న మరోపార్శ్వం, ‘విద్య’ (ఊర్మిళ మటోండ్కర్)తో తన పరిచయం, ప్రేమ. విద్యను మనలాంటి సామాన్యులకు ప్రతీకగా పోల్చుకోవచ్చు. పక్కనే మాఫియా ప్రపంచం అనేది ఒకటుందని తెలీదు. మన జీవితాలు ఏదోఒక విధంగా దానితో ముడిపడి ఉన్నాయనీ తెలీదు. అలాగే సాధారణంగా బతికేస్తాం. అజ్ఞాతంగా ఉండి సంగీత దర్శకుణ్ణి గన్ పాయింట్ మీద బెదిరించి పాటపాడే అవకాశం సత్య ఇప్పించాడని తనకి తెలీదు. ఆఖర్న పోలీసులు తనని సత్య గురించి చెప్పమని ఇంటరాగేట్ చేస్తే, తన నమ్మశక్యంకాని ముఖంలో, మాఫియా ఉనికి గురించే తెలియని ఒక సాధారణ పౌరుడి తెలియనితనం కనబడుతుంది. అప్పటి వరకూ భయం ఎరుగని సత్య కూడా, సినిమా ధియేటర్ ఉదంతం తరువాత భీఖూ తో “విద్య గురించి అలోచించినప్పుడలా భయం కలుగుతోంది” అంటాడు. విద్యతో దుబాయ్ వెళ్ళి తన మాఫియా జీవితాన్ని ముగిద్దామన్న సత్య కథ, అతని షూటౌట్ తో ముగుస్తుంది.

‘సత్య’ పాత్ర గురించి ప్రత్యేకంగా అర్థం చేసుకోవడానికి ఏమీ ఉండదు. ఈ పాత్ర ద్వారా వర్మ చెప్పదలుచుకున్న social commentary అదే. సత్య ఎవరైనా కావచ్చు. మీరు, నేను, మన పక్కింటి అమాయకపు కుర్రాడు ఎవరైనా … ఏక్కడైనా ఈ సత్య ఉండొచ్చు. మన ఆధునిక సమాజంలో ఈ చీకటి ప్రపంచం (under world) ఎంతగా మమేకమైపోయిందనడానికి ప్రతీక సత్య. వర్మ ఈ హీరోని ఎటువంటి social, moral, emotional conflict లేకుండా ఒక non-committal statement లాగా సృష్టించాడు. ఈ కథానాయకుడి ద్వారా వర్మ ఈ సమాజానికి తను తెలుసుకున్న, తనదైన అర్థాన్ని పరిచయం చేసాడు.
ఇలా రాంగోపాల్ వర్మ మూడు సినిమాల కథానాయకుల గమనం: వ్యవస్థ లోపాలవల్ల పుట్టిన మాఫియాని ఆదర్శం కోసం ఎదిరించడంతో మొదలై (శివ), పరిస్థితుల ప్రభావం వలన ఆ మాఫియాకే నాయకుడుగా కొనసాగి (గాయం), చివరికి దాన్నుండీ బయటపడలేక చంపబడతాడు (సత్య). ఈ పరిణామక్రమంలో సమాజం, చట్టం, వ్యవస్థ, మొదలైన వాటిపై కొన్ని ప్రశ చిహ్నాలు వదిలి వెళ్తారు ఈ హీరోలు . ఈ విధంగా వర్మ సమాజాన్ని అర్థం చేసుకున్న విధానానికి ఈ కథానాయకులు అద్దం పడతారు.

రాంగోపాల్ వర్మ తన సినీ ప్రస్థానంలో సమాజాన్ని సమూలంగా మార్చే సినిమాలు తీసుండకపోవచ్చు. కానీ తన సమకాలీన దర్శకులను మించిన సామాజిక అవగాహన కలిగిన సినిమాలు తీసాడన్నది నిజం. అందరూ పక్కకితప్పుకునే, లేదూ చెప్పాలంటే దాన్ని గ్లామరైజ్ చేసి చూపించే మాఫియా సబ్జెక్టుని ఒక నిబద్ధతతో అర్థం చేసుకుని తెరపైకి అనువదించిన దర్శకుడితడు. తను చూపిన సమాజం లోని ఈ పార్శ్వాన్ని, రాబోయేకాలంలో ఎవరైనా చరిత్రగారాస్తే ఒక reference గా ఉపయోగించదగ్గ సినిమాలను మనకిచ్చాడు అని నా ప్రగాఢ విశ్వాసం. అందుకే ఈ వర్మ త్రిచిత్రాలు సామాజిక విశ్లేషణకు ఉపయోగకరమైన ప్రాముఖ్యత కలిగిన సినిమాలుగా నిలబడతాయి.