మీరేమనుకున్నా సరే, మా బోయపాటికి సాటి ఎవరూ లేరు..!

శంకరాభరణం సినిమా చివరలో శంకరశాస్త్రి “అంతరించిపోతున్న, కొడిగట్టిపోతున్న సంస్కృతీ సంప్రదాయాలను అడ్డంపడి ఆపుతున్న ఆ మహా మనీషి ఎవరో..?” అంటూ హాచ్చెర్యపోతాడు.

ఆ మహామనీషి పాటివాడే మా బోయపాటి..!
****

హీరోయిన్ తప్ప తను తీసిన ప్రతీసినిమాలో మహిళలు ఎంతో పద్ధతిగా వంటింట్లో కూడా పట్టుచీరలు కట్టుకుంటారు. ప్రతీకొంపలో కనీసం ఓ పాతిక మంది బిరబిరలాడుతూ తిరుగుతుంటారు.

“సింహా” లో డాక్టరుగారు మర్డర్లు చేసొచ్చినా, ఇంట్లో భార్య ఏడువారాల నగల్ని దిగేసుకుని పప్పుచారు పెడుతుంది. పూజారీ, అతని కూతురూ హీరోకి సంప్రదాయబద్ధంగా పాదాభివందనాలు చేస్తుంటారు.

“దమ్ము” సినిమాలో మగపురుషపుంగవులు సంవత్సరానికి ఓసారి “తాంబూలాలిచ్చేసుకుని తన్నుకుచావడం చూయించి” తెలుగువారి ఆచార వ్యవహారాలనూ, కన్యాశుల్కం లో అగ్నిహోత్రావధాన్లనూ ఒకే దెబ్బతో గుర్తుకు చేసారు.

“లెజెండ్” సినిమాలో బావ గారి వీపు సాపు చేసి, చితక్కొట్టి, స్త్రీ శక్తి గురించి అద్భుతంగా వివరించారు. రైలెళ్లి మనిషిని గుద్దినా, మనిషి వెళ్లి రైలును గుద్దినా మనిషికి చావు మూడుతుందని చెప్పి మనబోటి సామాన్యులకు నాలుగో గమన సూత్రం నేర్పించారు.

“సరైనోడు” సినిమాలో ఇంటిముందు సెక్యూరిటీ గార్డు లేని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిని, కన్నతండ్రి కన్నా, ప్రాక్టీసు లేని బాబాయిని ప్రేమించే బేవార్స్ కొడుకునూ, వాడికోసం ముందే ట్యూబెక్టమీ చేయించుకున్న పిన్నినీ చూయించి కుటుంబ చిత్రానికి సరైన నిర్వచనం ఇచ్చాడు.

ఇహపోతే “జయజానకీ ప్రాణనాయకా”. అసలా టైటిల్లో ఎంత తెలుగుదనం ఉట్టిపడుతుందో గమనించండి. డబ్బు అహంకారం తేకూడదనే సందేశం ఇవ్వడానికి కోటీశ్వరులు ప్రతిరోజూ రోడ్డుమీద మిర్చీబజ్జీలు తింటూ సిక్స్ ప్యాక్ బాడీ మైంటైన్ చేస్తారు. కన్యాశుల్కంలో పూటకూళ్లమ్మ లా సందేహాస్పద విధవ ఐన హీరోయిన్ను కందుకూరి వీరేశలింగం పంతులు మానసపుత్రుడైన హీరో పెళ్లి చేసుకుంటాడు. పరువు కోసం ప్రాణమిచ్చే పెద్దలుంటారు.

లేటెస్ట్ గా వచ్చిన “వినయవిధేయరామ” ద్వారా బోయపాటి తనను తాను పునరావిష్కరించుకున్నాడు. ఐదుగురు అనాధలకు ఇంటిపేరు “కొణిదెల” అని పెట్టారు. కాశ్మీర్, ఛత్తీస్గఢ్, విశాఖపట్నం, బీహార్ అన్నిటికి ఒక ఎలక్షన్ కమీషనర్ ని ఇచ్చాడు. రెండు నిమిషాలలో ద్వారక నుండి నేపాల్ బోర్డర్ కి హీరోని పంపి పురాణాలలో ఉన్న పుష్పకవిమానం కాన్సెప్ట్ గుర్తుకుతెచ్చాడు. దహనం అయిన శవం తాలూకు బూడిదని సంవత్సరం పాటు తాజాగా ఉంచి హీరోగారి వదినగారి పాతివ్రత్యం మహిమను చూపారు. భర్త మరణం తెలిసిన మరుసటి సన్నివేశం లోనే ఆమెకు నల్ల టికిలీ నుదుటన పెట్టి మనబోటి ఛాందసులకు బోయపాటి స్వాంతన కలిగించాడు.

అయ్యేయెస్లూ; ఐపీయెస్లూ అందరూ ప్రజాసేవకులనీ; మనం ప్రజలం వాళ్లను బెదిరించొచ్చనీ; గాజులేయొచ్చనీ; గజ్జెలు కట్ఠి డాన్సాడించొచ్చనీ; ముఖ్యమంత్రితో సహా ప్రజాప్రతినిధులు అందరూ గూండాలకు దండాలు పెడతారని తెలియ జెప్పి మనకు జ్ఞానోదయం కల్పించారు.

****
బోయపాటి గారూ…,

రుక్మిణి శ్రీకృష్ణుడికి చేసిన తులాభారం కన్నా మీరు తెలుగు హీరోలకు చేస్తున్నది కోటిరెట్లు గొప్పది. మీరలా ముందుకు సాగిపోవడం మా బోటి ఫాన్సుకు దైనందిన సమస్యల మధ్య పేద్ధ ఆటవిడుపు..!

వీటిని మించిన సినిమాలు మీరు తీసి మమ్మల్ని పావనం చేయండి…!🙏