బ్రహ్మానందం… అర్ణవమైతే…!!

Sponsored Links

Ace comedian with a touch of class!!
——————————————————–

యామినీ శిరోజ దీప్త జ్వాలా కుసుమాలు
తేజోతల్పంపై రాలి అదృశ్యమైనాయి…
రవి కిరణాంగుళీ నఖక్షతాలతో
శ్యామలాకాశం కందింది….

Sponsored Links

విశాఖ, సీతమ్మధారలోని నా యింట్లో
చెలం ‘సుధ’ మరోసారి చదువుకుని, లేచి,
రెడీ అయి, బస్సెక్కి ఆంధ్రాయూనివర్శిటీ
అవుట్ గేట్ ముందు దిగాను.

1979 మే నెల 14 గానీ 15 గానీ కావచ్చు. ఆ ఏడాది మే 4న చలం మనల్ని విడిచి వెళ్లిపోయారు. పొద్దున్నే కొద్దిపాటి వర్షం కురిసి, వెలిసింది. పచ్చని చెట్లు, తడిసిన ఆకులు, విచ్చుకుంటున్న పూలు… నల్లగా మెరుస్తున్న తార్రోడ్డు… యూనివర్శిటీ ఒక పురాతన కోటలోని ఉద్యానవనంలా మెరిసిపోతోంది. ఈ దృశ్యానికి నేపథ్య సంగీతంలా దూరం నుంచి సముద్ర కెరటాల గలగలలు. నడుస్తూనే వున్నా… యూనివర్శిటీ వెనక, ఒక మనిషి వెళ్లడానికి వీలుగా పగలగొట్టిన ప్రహరీ గోడ ఉంది. దాన్ని దాటి వెళ్లి, యూభై అడుగులేస్తే చందు సుబ్బారావు యిల్లు. తలుపులు తీసే వున్నాయి. ముందు గదిలో కూర్చున్నా. చందు వచ్చి పలకరించారు. ఆయన భార్య నిర్మల వచ్చి, కాఫీ యిచ్చారు. కొద్దిసేపటి తర్వాత ఆ యింట్లోంచి ఒక యువకుడు వచ్చాడు. ఇతను ప్రకాషు, ఈనాడులో జర్నలిస్టు అని అతనికి పరిచయం చేశారు. ‘‘ఇతని పేరు బ్రహ్మానందం’’ అని నాతో చెప్పారు. రానున్న కొన్ని దశాబ్దాలపాటు అతను తెలుగు వెండి తెరని శాసిస్తాడనీ, అతన్ని చూసి ప్రేక్షకులు కింద పడి దొర్లి దొర్లి నవ్వుతారనీ, బ్రహ్మానందమే గనక లేకపోతే, పెద్ద హీరో హీరోయిన్ల సినిమాలకూ అతీగతీ వుండదని… అప్పుడు అక్కడున్న మా నలుగురికీ తెలీదు.

బైటకి వెళ్లడానికి చందు, బెమ్మీ రెడీ అవుతున్నారు. టిఫిన్ చేస్తున్నా… టీ తాగుతున్నా, చొక్కా వేసుకుంటున్నా బెమ్మీ ఏదో ఒకటి వొంకరగా, వెటకారంగా అంటూనే వున్నాడు. వాళ్లు నవ్వుతున్నారు. వాళ్లిద్దరూ, నేనూ యూనివర్శిటీ ఫేకల్టీ క్లబ్ దగ్గరికి వచ్చాం. చందు లెక్చరర్లనీ, ప్రొఫెసర్లనీ పలకరిస్తున్నాడు. నా చెయ్యి లాగీ, భుజమ్మీద చేతులేసీ… బెమ్మీజోకుల్లాంటి కబుర్లూ, విరుపులూ, మెరుపులూ… నాకో Pleasant surprise అది. ‘ఇతనికి కొత్తేమీ వుండదా’’ అనిపించింది. మిమిక్రీ ఆర్టిస్టని తెలుస్తూనే వుంది. చందూ వచ్చి ‘‘రండి, సభకి వెళ్దాం’’ అన్నాడు. సభ ఏంటి? అంటే, ‘‘చలం గారి సంతాప సభ, బ్రహ్మానందం మాట్లాడతాడు’’ అన్నాడు చందూ.

ఈ జోకర్ గాడేంటి? చలం సంతాప సభలో మాట్లాడటమేంటి? ఏమన్నా సెన్స్ వుందా? అసలు! అక్కడే, ఒక క్లాస్ రూంలో సభ. 30, 40 మంది యూనివర్శిటీ ప్రముఖులు. బ్రహ్మానందం ఉపన్యాసం మొదలయింది. చలం, ఆయన పాత్రలూ, ఉదాత్తమైన రచనల గురించి మాట్లాడుతున్నాడు. పెదవుల మీదికి చిరునవ్వు మాత్రమే వచ్చేలా సరస సంభాషణ చేస్తున్నాడు. ఇంతలోనే చలం సాహిత్యం ఔన్నత్వం గురించి గంభీరంగా వ్యాఖ్యానిస్తూ, విశ్లేషణ చేస్తున్నాడు. చివరిగా నమస్కారం పెట్టి, ఆ మహనీయునికి నివాళులర్పించి ప్రసంగం ముగించాడు. అతని లోతైన అవగాహన, సమయస్ఫూర్తి, ఇంగితం నన్ను చకితుణ్ణి చేశాయి. చందు మరో యిద్దరు మాట్లాడారు. సభ ముగిసింది. చాలా సేపటి వరకూ బ్రహ్మానందం షాక్ లోంచి తేరుకోలేకపోయాను. ఒక వెకిలి, చిల్లర, మిమిక్రీ జోకర్ అనుకున్నవాడు చలం రచనల గురించి సాధికారికంగా మాట్లాడటమా…! అదీ యూనివర్శిటీ లెక్చరర్ల ముందు! వచ్చిన వాళ్లలో చాలా మంది రచయితలు, కవులు వున్నారు.

ఆ రోజుల్లో ‘ఈనాడు’ పక్కనే వున్న మెస్ లో భోజనం రెండు రూపాయలు. కాసిన్ని మెతుకులు, చారు అనబడే కారపు నీళ్లూ, రుచీ పచీలేని కూర, మజ్జిగ… కేవలం మంచి భోజనం కోసమే చందు ఇంటికి 15 రోజులకి వొకసారైనా వెళ్లేవాణ్ణి. ఎంటర్ టైనర్ బ్రహ్మానందం ఎలాగూ వున్నాడు కదాని, రెండో రోజు చందు యింటికి వెళ్లాను. నిర్మల గారు బాత్ రూంలో స్నానం చేస్తున్నారు. ఎదురుగా రెండు సిమెంటు మెట్లు వున్నాయి. వాటి మీద కూచున్న బెమ్మీ, ‘‘రా అప్పా, ఎంతసేపు స్నానం చెయ్యడం, చికెన్ వండప్పా’’ అంటున్నాడు. పైగా ఆ మాటనే రిపీట్ చేస్తున్నాడు. టీజ్ చేసే టెక్నిక్ అది. ‘‘అరేయ్…వుండరా, వస్తున్నా’’ అని ఆవిడ. నేనక్కడే నవ్వుతూ నించుండిపోయా. చందూకీ, బెమ్మీకీ- ఒక కమ్యూనికేషన్ లాంగ్వేజ్ వుంటుంది. కిరణాషాపు అంటాడు చందూ… వెంటనే ఆ ఫన్నీ ఐటం చెబుతాడు బెమ్మీ. చాదస్తపు బ్రామ్మడు… అనగానే మరో ఐటం. ఇలా కళ్లలో నీళ్లొచ్చి, పక్కటెముకలు నొప్పెట్టి పడీ పడీ నవ్వుతూ గడిచిందా రోజు… ఆఫ్ కోర్స్, మంచి భోజనంతో! బెమ్మీ ఎమ్మే తెలుగు చేశాడనీ, అత్తిలిలో లెక్చరర్ అనీ ఆ రోజే తెలిసింది. ఆంధ్రా యూనివర్శిటీ జియో ఫిజిక్స్ లెక్చరర్ చందూ. నిర్మల తెనాలిలో జువాలజీ లెక్చరర్. వాళ్ల ఎనిమిదేళ్ల అమ్మాయి పేరు కవిత. బెమ్మీని మావయ్యా అంటూ వుండేది. అప్పటికి బెమ్మీ వయసు 24 సంవత్సరాలు. నాకు 22 ఏళ్లు నిండాయి.

*** *** ***

చార్లీ చాప్లిన్ ది దుర్భరమైన బాల్యం. తండ్రి తాగుబోతు. అరాచకుడు. తల్లి చిన్న కమెడియన్. ఇంగ్లండులో చిన్నపాటి వేదికల మీద జోకులు చెప్పే, కామెడీ పండించి చిల్లర డబ్బులు సంపాదించేది. 14, 15 సంవత్సరాల వయసులో కూడా ఫుట్ పాత్ ల మీదో, పార్కుల్లోనో పడుకునేవాడు చాప్లిన్, అర్థాకలితో… రెండు పూటలా నాలుగు బ్రెడ్డు ముక్కలు వేడి టీ కోసం వాళ్లు చేసిన పోరాటం గుండెల్ని పిండేస్తుంది. ఆనక… హాలీవుడ్ ను శాసించి, ప్రపంచాన్ని చాప్లిన్ గెలుచుకున్న సమయానికి, కొడుకు విజయాల్ని చూడటానికీ, సకల భోగాల్లో తులతూగడానికీ ఆ పేద తల్లి లేకుండాపోయింది. ఆ విషాదం చాప్లిన్ ని జీవితాంతమూ వెంటాడింది. విజయాల్లోనూ, విషాదంలోనూ చాప్లిన్ కీ బ్రహ్మానందానికీ పోలికలున్నాయి.

*** *** ***

బ్రహ్మానందం వాళ్లది గుంటూరు జిల్లా, సత్తెనపల్లి. పేద కుటుంబం. తండ్రి చిన్నా చితకా నాటకాలు వేసేవాడు. ఆ పేద తండ్రి జీన్సే తర్వాతి కాలంలో బెమ్మీ.. అనే జీనియస్ ని మనకిచ్చాయి. బెమ్మీకి పదేళ్ల వయసున్నప్పుడే తండ్రి చనిపోయారు. తల్లీ నలుగురు బిడ్డలూ పేదరికాన్ని కావలించుకుని నిద్రపోయేవారు. పక్కింటావిడ, బెమ్మీని చేరదీసి, ముచ్చటపడి పెంచింది, చదువు చెప్పించింది. ఆవిడకి మగ పిల్లలు లేరు. కొన్ని పువ్వులు పుట్టగానే పరిమళిస్తాయి. బెమ్మీ ఆ టైపు కాదు. ఈ పువ్వు పుట్టగానే పిల్లి మొగ్గలేసింది. చురుకైన కుర్రాడు. చూసి రమ్మంటే కాల్చివచ్చే రకం.

సత్తెనపల్లిలో పెంచినావిడ అన్నయ్య- భీమవరం డి.ఎన్.ఆర్. కాలేజీ ప్రిన్సిపల్ సున్నం ఆంజనేయులు. అంచేత బెమ్మీ భీమవరం కాలేజీలో డిగ్రీ చేశాడు. ఒక సబ్జెక్టు మిగిలిపోయింది. పెంచినావిడ చెల్లి అనసూయ తెనాలిలో కాలేజీ లెక్చరర్, మరో లెక్చరర్ అయిన నిర్మలకి రూమ్మేటు. బెమ్మీ వీళ్ల దగ్గర కొచ్చి ఆ సబ్జెక్టు చదువుకున్నాడు. అక్క పెంచిందని.. అనసూయ ఎంతో ఆప్యాయంగా చూసేది బెమ్మీని. ఓ రోజు మధ్యాహ్నం అనసూయ ఇంటి ముందు నించుని బెమ్మీ ‘‘అమ్మా.. ఒక ముద్దెయ్యండి తల్లీ’’ అని గొంతు మార్చి అడుక్కుంటున్నాడు. వీడే అలా అరుస్తు్న్నాడని నిర్మలా, అనసూయా లోపల నవ్వుకుంటున్నారు. ఈ లోగా పక్క పోర్షన్ లో వున్న ఇంటి యజమానురాలు ఓ పళ్లెంలో అన్నం, కూరా పట్టుకొచ్చి చూసింది. సిగ్గుపడిపోయింది. రోజూ పక్కింటికి వచ్చి చదువుకునే బెమ్మీ ఆవిడకి బాగానే తెలుసు! అలా రోజువారీ మెకానికల్ రొటీన్ని కూడా హాస్యంతో నింపి బతుకు పండించేవాడు.

భార్య నిర్మల కోసం చందూ తెనాలి వెళ్లేవాడు. అక్కడ బెమ్మీ కలిసేవాడు. ఓ రోజు యిద్దరూ పాన్ షాపు అనే కిళ్లీ కొట్టుకి వెళ్లారు. రెండు అరటిపళ్లు అడిగాడు బెమ్మీ. షాపులో వున్న యువకుడు యిచ్చాడు. తర్వాతో కూల్ డ్రింకు తాగాడు. మరో అరటిపండు కావాలని మళ్లీ అడిగాడు బెమ్మీ. ‘‘యేంటండీ అదేదో ముందే చెప్పొచ్చుగా. యిందాకే అరటి పళ్లు యిచ్చాగా, ఏంటో ఇది’’ అని విసుక్కుంటూ అరటిపండు యిచ్చాడు. కాస్త మర్యాదగా మాట్లాడు అని చందూ అన్నాడు. మూడున్నర రూపాయలైంది. అయిదు రూపాయల నోటు యిచ్చాడు బెమ్మీ. అతను రూపాయిన్నర తిరిగి యిచ్చాడు. షాపు దగ్గరే కుర్చీలో కూర్చున్నాడు కిళ్లీకొట్టు యజమాని. అది కనిపెట్టిన బెమ్మీ.. జేబులోంచి ఒక అర్థ రూపాయి తీసి, ఆ రూపాయిన్నరలో వేసి, ‘‘ఏందయ్యా.. మూడున్నర రూపాయలు అయింది కదా, అయిదు రూపాయలిచ్చాను. రెండు రూపాయలు యిచ్చావేంటి? నాకు రావాల్సింది రూపాయిన్నరేగా’’ అంటూ అర్థ రూపాయి తిరిగి యిచ్చేశాడు. పక్కనున్న వోనరు ఠక్కున అందుకున్నాడు. ‘‘ఏరా డబ్బులు యిష్టం వచ్చినట్టు యిచ్చేయడమేనా, పెద్ద మనిషి గనక అర్థ రూపాయి వెనక్కిచ్చేశాడు… అదే…’’ అంటూ తిట్టడం మొదలెట్టాడు. వీళ్లక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్లిపోయారు. ‘‘అర్థ రూపాయి పోతే పోయిందిగానీ చెందూ, వాడికివ్వాళ నరకమే’’ అన్నాడు బెమ్మీ.

*** *** ***

ఆ రోజుల్లోనే కవి, అదృష్ట దీపక్ సినిమాలకి పాటలు రాస్తుండేవాడు. ఓ సారి మద్రాసు రైలెక్కాడు. అత్తిలిలో బెమ్మీ అదే రైలు ఎక్కాడు. సినిమా ఛాన్స్ కోసం ప్రయత్నిస్తున్నాడు. దీపక్ ని పలకరించి, ఆ కంపార్ట్ మెంటులోనే కూర్చున్నాడు. ఇద్దరూ మిమిక్రీ చేయగలరు. పాడగలరు. బాగా చదువున్న వాళ్లు. ఇక పాటలు, పద్యాలు, మిమిక్రీ మొదలు పెట్టారు. చుట్టూ వున్న జనం ఎంత అదృష్టం చేసుకున్నాం అన్నట్టు ఎంజాయ్ చేస్తున్నారు. వినోదం మంచి రసపట్టులో వుంది. అసలు సూరిబాబు ఎలా పాడతాడంటే అని దీపక్ కీచుగొంతుతో వికారంగా పాడి వినిపించాడు. అందరూ నవ్వుతున్నారు. అప్పటి దాకా బెర్త్ మీద పడుకుని.. వింటున్న భీమవరం రాజు ఒకాయన లేచి, బాబూ సూరిబాబు ఎలా పాడతాడంటే… అంటూ దుమ్ము దుమ్ముగా పాడి వినిపించాడు. మన అల్లరి ఆర్టిస్టులిద్దరూ అవాక్కయిపోయారు. ‘‘బీవారంలో 30 ఏళ్లు నాటకాల కంపెనీలు నడిపినోణ్ణండీ’’ అని చెప్పారట రాజుగోరు.

*** *** ***

టీవీల్లో, ముఖ్య అతిథిగా వెళ్లిన కొన్ని సభల్లో- బెమ్మీ మిమిక్రీ చూసి ముచ్చటపడినవాడు జంథ్యాల. చిన్న చిన్న వేషాలు యిచ్చిందీ ఆయనే. విశాఖలో షూటింగ్ లు జరుగుతున్నపుడు చందూ యింట్లోనే మేకప్ వేసుకుని వెళ్లేవాడు బెమ్మీ. ‘సినిమా కేరేజీ’ కూడా చందు యింటికే వచ్చేది. చేపల పులుసు, రొయ్యల వేపుడు, కోడి కూర వుండే ఆ కేరేజీని పక్కన పెట్టి ‘‘అప్పా, ఆవకాయ, పప్పూ, పెరుగూ వేసి నాకు అన్నంపెట్టు’’ అనే వాడు నిర్మల గారితో. భోంచేశాక గదిలో చాప పరుచుకుని పడుకునేవాడు. మంచం వుందిగా అంటే చాప మీద కాళ్లు జాపి పడుకోడంలో… సుఖమే వేరప్పా’’ అనేవాడు.

A simple and down to earth soul… with a thunderous sense of humor.

ఒక రోజు విశాఖలో షూటింగ్ అయిపోయాక, ఖరీదైన హోటల్లో పార్టీ. గుమ్మడి, రావు గోపాలరావు, గొల్లపూడి మారుతీరావు, చందు సుబ్బారావు… Exclusive with brahmanandam. చందూ అదీ యిదీ అందిస్తున్నాడు, బెమ్మీ మిమిక్రీ అయిటమ్స్ తో చెలరేగిపోతున్నాడు. పెద్దలు తెగ నవ్వుతున్నారు. రెండు గంటలు గడిచిపోయాయి. చిన్న గ్యాప్… గొల్లపూడి, ఒక కవిత చదవనా? అన్నారు. ‘‘మన కవిత్వం మన దగ్గరే వుంటుంది లెండీ, కుర్రాణ్ణి చెయ్యనిద్దాం’’ అన్నారు రావు గోపాలరావు. బెమ్మీ మరో గంట దుమ్ము దులిపేశాడు. ‘‘సార్, బోరుకొడుతున్నానా?’’ అని వినమ్రంగా అన్నాడు. ‘‘నువ్వు బోరు కొడుతుంటే భరించడానికి మేమన్నా, పిచ్చినా కొడుకులం అనుకుంటున్నావా? బావుంది. కానియ్’’ అన్నారు గోపాలరావు. అర్థరాత్రి దాటే దాకా అక్కడ హాస్యం నవ్వులై పండి, వరదలై పారింది.

బెమ్మీకి తాగే అలవాటు లేదు. సిగిరెట్టు కాల్చడు. కోడి కూర, గోంగూర మాంసం వుంటే యిష్టంగా తింటాడు. సాఫ్ట్ డ్రింక్ తాగుతాడు…. and he can happily call it a day.

*** *** ***

డిగ్రీ పూర్తయ్యాక, ఎమ్మే తెలుగు చెయ్యాలనుకున్నాడు. సీటు రాలేదు. ప్రొఫెసర్ యస్వీ జోగారావుని ఒక సభలో అనుకరించి నవ్వించాడు బెమ్మీ. ఆ సభలోనే వున్న జోగారావు గారు ఆనందించారు. ఆ యిష్టంతో ఆయనే నాగార్జున యూనిర్శిటీలో బెమ్మీకి సీటు యిప్పించారు. అనసూయ అన్నయ్య- సున్నం ఆంజనేయులు చదువుకి అన్ని రకాలుగా సహాయం చేశాడు. అనసూయ ఆడబిడ్డ లక్ష్మి ఆమె దగ్గరే వుండేది. దేనికీ నోరెత్తని సంప్రదాయకమైన తెలుగు పిల్ల అయిన లక్ష్మీ బెమ్మీకి నచ్చింది. అదే ఆంజనేయులు గారితో చెప్పాడు. ఆయన ఆశ్చర్యపోయాడు. మన వాడు తెలుగు లెక్చరర్. లక్ష్మీ తొమ్మిదో క్లాసు మాత్రమే చదివింది. సింపుల్ గా పెళ్లి జరిపించారు. అలా ఎగిరే ఆకులాంటి బెమ్మీకి సున్నం అంటుకుని అంతా వక్కటయ్యారు. తనని ఆదుకుని, అన్నం పెట్టి, ఉద్యోగం యిప్పించిన వారి పట్ల బెమ్మీ చూపిన కృతజ్ఞత అది. కావాలంటే బెమ్మీ ఏ లెక్చరర్ నో చేసుకోగలడు. అందంగా, ఆకర్షణీయంగా ఎవరినైనా 15 నిమిషాల్లో చిత్తు చేసే హాస్యంతో, చతురతతో వున్న నాటి బెమ్మీ కావాలన్నది సాధించుకోగలడు. అలాంటి పని చేయలేదు. నింగికన్నా ఉన్నతమైన సంస్కారంతో లక్ష్మిని తన జీవితంలోకి రానిచ్చాడు. త్వరలోనే లక్ష్మీ కటాక్షం పొందాడు కూడా.

* చిరంజీవిని బెమ్మీ కలిసిన రోజు…

ఆ చరిత్రాత్మకమైన రోజు, అతి సాధారణంగా బెమ్మీ ముందుకి నడుచుకుంటూ వచ్చింది. విశాఖ షూటింగ్ స్పాట్ లో హీరో చిరంజీవికి బెమ్మీని పరిచయం చేశారు దర్శకుడు జంథ్యాల. బెమ్మీ షాకింగ్ స్పాంటేనిటీతో అరగంటలోనే చిరంజీవిని మెప్పించాడు. ‘‘హోటల్ రూంకి పోదాం రా’’ అన్నాడు చిరంజీవి. విశాఖ డాల్ఫిన్ హోటల్లోని చల్లని గదిలో వాళ్లిద్దరే. ఐటం మీద ఐటం. బెమ్మీ చేస్తూనే వున్నాడు. చిరంజీవి నవ్వుతూనే వున్నాడు. రాత్రి రూంకి వచ్చిన అల్లు అరవింద్… మద్రాసు ట్రెయిన్ కి ఫస్ట్ క్లాస్ టిక్కెట్లు బుక్ అయ్యాయని చెప్పాడు. ‘‘మీరు వెళ్లండి. మేం తర్వాత వస్తాం’’ అన్నాడు చిరంజీవి. మర్నాడు చిరు, బెమ్మీ విమానంలో మద్రాసు వెళ్లారు. అదే మొదటిసారి బెమ్మీ విమానం ఎక్కడం. అక్కడ చిరంజీవి యింట్లోనే మకాం. రోజూ గంటల తరబడి బెమ్మీ మిమిక్రీ విన్యాసాలు, కబుర్లు, జోకులు! పెద్ద స్టార్ గా emerge అవుతున్న చిరు త్రిల్లయిపోతున్నాడు. అలా నెల గడిచిపోయింది.

‘‘సార్ ఒక్కసారి అత్తిలి వెళ్లొస్తా’’ అన్నాడు బెమ్మీ. ఎందుకు అన్నాడు చిరు. ‘‘లెక్చరర్ ఉద్యోగం సార్! నెలకి ఆరు వేలు జీతం’’ అన్నాడు బెమ్మీ. అంటే సంవత్సరానికెంత? చిరు. 72 వేలు సార్ బెమ్మీ జవాబు. ఇంకా ఆరేళ్లు సర్వీసు వుంది సార్. 72 వేలు ఇంటూ ఆరు ఎంత అన్నాడు చిరు.. అయిదు లక్షల వరకూ అవుతుంది సార్ అన్నాడు మన బడుగు లెక్చరర్. మేనేజర్ని పిలిచి, ఈ బ్రెమ్మానందం పేరు మీద ఆరు లక్షలకి చెక్కు యివ్వు అన్నాడు చిరు. గడ గడలాడిపోయాడు బెమ్మీ. వద్దు సార్. అత్తిలి వెళ్లి సెలవు పెట్టి వచ్చేస్తా అని చెప్పాడు. అత్తిలి వెళ్లిన బెమ్మీకి కాలేజీ వాళ్లు అర్నెల్ల సెలవు యివ్వలేదు. రిలీవ్ చెయ్యలేదు. అత్తిలి సర్పంచ్ ని కలిశాడు. ‘‘మద్రాసు ఎందుకు.. యిక్కడే వుండవయ్యా’’ అన్నారాయన. చిరంజీవికి ఆ విషయమే చెప్పాడు బెమ్మీ. సర్పంచికి చిరు ఫోన్ చేశాడు. రిలీవ్ చేసి వెంటనే మద్రాసు పంపమన్నాడు. వాళ్లు కిక్కురుమనకుండా బెమ్మీని మద్రాసు రైలెక్కించారు.

బెమ్మీకి వున్నది టాలెంటో, ప్రతిభో కాదనీ, ఆ జీనియస్ కి ఇంకేదో పేరు పెట్టాలనీ చిరు తొలి నాళ్లలోనే గ్రహించారు. కాశ్మీరులో వున్నా, నల్లమలలో వున్నా కాలక్షేపం కోసం చిరు- బెమ్మీని ఆఘమేఘాల మీద పిలిపించుకునేవాడు. ఎంత dullగా, flatగా ఉండే విషయాన్నైనా అతి చేసి, జోకుగా మార్చి బెనర్జీ లాంటి వాణ్ణి కూడా నవ్వించే ఎనర్జీ బెమ్మీకుంది. తాగి కక్కుకున్నట్టుగా కొందరు నిర్మాతల్ని బెదరగొట్టి, తర్వాత తీరిగ్గా, ‘‘నేను నటుణ్ణి సార్. తాగే అలవాటు లేదు’’ అని చెబితే వాళ్లు త్రిల్ అయి సినిమా అవకాశాలు యిచ్చిన సందర్భాలూ వున్నాయి.

*** *** ***

మా అన్నయ్య ఆర్టిస్టు మోహనూ, విజయవాడ మేయర్ గా చేసిన నా చెల్లాయి శకుంతల బెమ్మీకి బాగా సన్నిహితులు. ఎంతో గౌరవంగా వాళ్లతో మాట్లాడేవాడు. బ్రహ్మానందం సూపర్ స్టార్ డమ్ సాధించిన తర్వాత, హైద్రాబాద్ లో ఒక రోజు మోహన్, నేనూ బెమ్మీ యింటికి వెళ్లాం. జూబ్లీ హిల్స్ లో. ఒక డెడ్ ఎండ్ లో ఆయన ఇల్లు. చాలా పెద్దది. ఆ రోజు ఆదివారం. తెల్ల లుంగీ, తెల్ల చొక్కా వేసుకున్న బెమ్మీ.. తెల్ల ప్టాస్టిక్ కుర్చీ మీద నడిరోడ్డులో కూర్చుని వున్నాడు లిటరల్ గా! relaxed గా ఉన్నాడు. మమ్మల్ని నవ్వుతూ పలకరించి, షేక్ హ్యాండిచ్చి, ఒక చిన్న కథ చెప్పాడు. ‘‘మోహనూ, నిన్న మధ్యాహ్నం బాగా ఎండలో ఒక ముసిలావిడ, యీ రోడ్డులో సపోటాలు అమ్ముతోంది. ఎండ ఘోరంగా వుంది. అన్నీ కొనేస్తే ఆవిడ త్వరగా యింటికి వెళ్లిపోతుంది కదాని ఎంతమ్మా’’ అన్నాను. డజను పది రూపాయలు అంది. మొత్తం అన్నీ ఎంత? అన్నాను. ‘‘అన్నీ తీసేసుకుంటావా బాబూ… 200 రూపాయలు యిస్తావా?’’ అని అడిగింది. ‘‘నేను 300 యిచ్చి తీసుకున్నాను. ఇరుగు పొరుగు వాళ్లకి సపోటాలు పంచేశాను. యివ్వాళ చూస్తే, మా యింటి ముందు, బత్తాయిలు, అరిటిపళ్లు, జాంకాయలు అమ్మేవాళ్లు, అరుస్తూ తెగ తిరుగుతున్నారు. ఆ ముసిల్ది చెప్పినట్టుంది’’ అంటూ పకా పకా నవ్వారు బ్రహ్మానందం.

తర్వాత యింట్లోకి వెళ్లాం. చాలాసేపు కబుర్లు. పరాచికాలు నడిచాయి. లక్ష్మి- మోహన్ కీ, నాకూ కాఫీ యిచ్చింది. బెమ్మీ 1979 నాటి వాడిలాగే వున్నాడు. చందు సుబ్బారావు ఇంట్లో వున్నట్టే, నిర్మల గార్ని అప్పా చికెన్ పెట్టప్పా అని అడిగినట్టే, అనసూయ గారింట్లో అన్నం తింటున్నట్టే… ఎంత కష్టం- అలా వుండగలగడం! సంవత్సరం కితం బెమ్మీకి మేజర్ బైపాస్ ఆపరేషన్ జరిగింది. జోకుల్తో చావుని చావగొట్టి సజీవుడై తిరిగి వచ్చాడు. మనం యిష్టపడే వాళ్ల గురించి, వాళ్లు వున్నపుడే నాలుగు మంచి మాటలు రాయడం ఒక బాధ్యత కదా అనిపించింది. చనిపోయాక, అతని కళ్లు కాంచనమాల, వొళ్లు వైజయింతిమాల అని ఎంత ఎగిరెగిరి పడినా… వినిపించదు కదా!

*** *** ***

చాప్లిన్ అఖండ విజయాల్నీ, ప్రపంచ ఖ్యాతినీ చూడ్డానికీ ప్రాణాధికంగా ప్రేమించిన తల్లి లేనట్టే, బ్రహ్మరథాల్లో వూరేగుతున్న బ్రహ్మానందం గ్లోరీని చూడ్డానికి వాళ్ల నాన్న లేడు.

ఇన్ని కోట్ల రూపాయల సంపద వుండీ, కొడుకు గౌతమ్ ని హీరోని చేయలేకపోయాడు.

ప్రతి నల్లని మబ్బు అంచులో ఒక సిల్వర్ లైనింగ్ వుంటుందని అంటాం కదా!

నిజానికి, కళ్లు మిరుమిట్లు గొలిపే ప్రతి తటిల్లత వెనకా, కాటుక లాంటి చీకటి కమ్ముకుని వుంటుంది.

అది ‘‘మేరా నామ్ జోకర్’’ లో రాజ్ కపూర్ లాగా…
‘‘దిన్ భీ అంథేరీ రాత్ హై’’ అని గొంతెత్తి పాడుతూనే వుంటుంది!

.

.

……..  Taadi Prakash…………………. 7045 41559