………………. ‘‘నాయకుడనగానే చిల్లర హామీలతో, వెకిలి దండాలతో, మాయమాటలతో జనాన్ని నిండా మోసం చేసే డర్టీ ఫెలో అనుకున్నావురా..? రజినీ… రజినీకాంత్…’’ అని కబాలీ టైపులో డైలాగు చెబుతూ రజినీకాంత్ రాజకీయాల్లోకి వచ్చేస్తే ఎలా ఉంటుంది..? బీజేపీలో చేరడం వల్ల గానీ, బీజేపీ అనుకూల పార్టీ ఏర్పాటు చేసి గానీ తను ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుంది..? ఏమో… ఇప్పుడప్పుడే విశ్లేషించలేం కానీ బీజేపీ మాత్రం రజినీకాంత్‌పై బాగా ఆశలు పెట్టుకుంటున్నది… సౌత్ ఇండియాలో బలం పెంచుకోవాలనుకుంటున్న బీజేపీకి ఏమాత్రం పరిస్థితులు అనుకూలించడం లేదు… ఈ స్థితిలో తమిళనాడులో మారుతున్న రాజకీయ పరిస్థితులు బీజేపీలో ఆశలు పెంచుతున్నాయి… అందుకే తమిళనాట విపరీతమైన జనాదరణ ఉన్న రజినీకాంత్‌పై ఒత్తిడి తీసుకువస్తున్నది… తమిళ రాజకీయాలపై సినిమాల ప్రభావం చాలా ఎక్కువ… తిరుగులేని ఫాలోయింగ్ ఉన్న రజినీకాంత్ గనుక తమతో చేతులు కలిపితే సౌత్ ఇండియాలో ఓ బలమైన రాష్ట్రంలో పాగా వేయవచ్చు అనేది బీజేపీ ఆకాంక్ష…
ఏపీలో వెంకయ్యనాయుడు, చంద్రబాబునాయుడు అనే సయామీ కవలల పుణ్యమాని సమీప భవిష్యత్తులో బీజేపీ ఏమాత్రం పుంజుకునే ఛాన్స్ లేదని ఆ రాష్ట్ర పార్టీ ప్రముఖులు కూడా అంగీకరిస్తారు… తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఏమాత్రం బాగాలేక, తెలుగుదేశం క్రమేపీ కనుమరుగవుతూ, మెల్లిమెల్లిగా అధికార పార్టీపై ప్లస్ ప్రభుత్వంపై జనంలో వ్యతిరేకత పెరుగుతున్న దశలో నిజానికి బీజేపీ బలపడేందుకు ఎంతోకొంత ఛాన్స్ ఉండేది… కేంద్రంలో అధికారంలో ఉండటమూ కొంత కలిసివచ్చేది… కానీ ఇక్కడా వెంకయ్య ప్రభావం ప్లస్ పార్టీ కేడర్‌ను వీడని స్తబ్దత, అకస్మాత్తుగా బీజేపీతో కేసీయార్ దోస్తీ తెలంగాణ బీజేపీకి పగ్గాలు వేస్తున్నాయి… పైగా దూకుడుగా పార్టీని నడిపించే నాయకుడు లేకపోవడం అతి పెద్ద మైనస్… కేరళలో ఎంత ప్రయత్నించినా బీజేపీకి కలిసిరావడం లేదు… నిజానికి దేశంలో ఎక్కడా లేనంత పట్టు ఆర్ఎస్ఎస్‌కు ఈ రాష్ట్రంపై ఉంది… ప్రాణాలకు తెగించి పనిచేసే కేడర్ ఉంది… కానీ బీజేపీ ఏమీ పర్‌ఫామ్ చేయలేకపోతున్నది… కాస్తోకూస్తో ఆశలున్నది కర్నాటకపైనే… ఈ స్థితిలో తమిళనాట జయలలిత మరణించి, అన్నాడీఎంకే అంతులేని సంక్షోభం వైపు పయనిస్తున్నది… శశికళ తాత్కాలికంగా పార్టీని తన గుప్పిట్లో పెట్టుకోగలిగినా రాను రాను ఆ పార్టీ మరింత బలహీనపడి, వర్గాలు, ముఠాలు, విభేదాలతో సతమతం కావడం తథ్యంగా కనిపిస్తున్నది… దీన్ని వాడుకోవాలంటే ఓ బలమైన ఫేస్ కావాలి… అది రజినీకాంత్ మాత్రమే అని బీజేపీ నమ్మకం…
గతంలో ఓసారి జయలలితకు వ్యతిరేకంగా రజినీకాంత్ పిలుపునివ్వడం మినహా తను పెద్దగా రాజకీయాలపై ఇంట్రస్టు చూపించిందే లేదు… ఏదో ఓ సినిమా చేయడం, ఆ పనిలేనప్పుడు హాయిగా హిమాలయాలకు వెళ్లి విశ్రాంతి తీసుకోవడం అనే మానసిక విరామస్థితిలో ఉన్న రజినీకాంత్ నిజంగా ఈ క్షుద్ర రాజకీయాల్లోకి అడుగుపెడతాడా అనేది సందేహమే… తుగ్లక్ పత్రిక ఎడిటర్, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్తల్లో ఒకడైన గురుమూర్తి (ఆ పత్రిక చో రామస్వామిది… జాతీయవాదం, యాంటీ ద్రవిడ పార్టీలు అనేది ఈ పత్రిక రాజకీయ ధోరణి…. ఒక చిన్న ప్రాంతీయ భాష పత్రిక వార్షికోత్సవానికి ప్రధాని మోడీ కావడం ఒక విశేషం…) ఏమంటాడంటే… ‘‘రజినీ రాజకీయాల్లోకి రావటానికి ఇది సరైన సమయం… ఆయన అవసరం కూడా రాష్ట్ర రాజకీయాలకు ఉంది…’’
కరుణానిధి ముసలివాడైపోయి, ఇటీవల తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు… పార్టీ బాధ్యతల్ని కూడా స్టాలిన్‌కు అప్పగించాడు… తను ఏమేరకు పార్టీని కరుణానిధి తరహాలో నడిపిస్తాడనేది చూడాల్సిందే… తనకూ కుటుంబపరమైన చిక్కులున్నాయి… ఎలాగూ కాంగ్రెస్ జాతీయ స్థాయిలోనే ఏమాత్రం పుంజుకునే సూచనలు కనిపించడం లేదు… ఇలాంటప్పుడు ఒక జాతీయ పార్టీగా బీజేపీకి చాన్సెస్ ఉన్నాయనీ, రజినీకాంత్ గనుక సహకరిస్తే తమిళనాడును దున్నేయవచ్చు అనేది బీజేపీ భావన… ఈ రాష్ట్ర పార్టీ బాధ్యతల్ని తెలంగాణకు చెందిన మురళీధర్‌రావు చూస్తున్నా, తనను ఎలాగూ వెంకయ్య సరిగ్గా పనిచేయనివ్వడం లేదు, అన్నింట్లోనూ తనే వేలుపెడుతున్నాడూ అనేది పార్టీలో బహిరంగరహస్యం… బీజేపీకి వేరే బలమైన నాయకులు కూడా లేరు… బేసిక్‌గా పక్కా ఉత్తరాది పార్టీగా బీజేపీని చూసే తమిళనాడులో ఆ పార్టీ ఆశలు నెరవేరతాయా..? తమిళ ప్రజల ఆకాంక్షలకు భిన్నమైన ధోరణితో ఉండే బీజేపీకి సహకరిస్తాడా..?