తమిళ హీరో శరత్ కుమార్ బిడ్డ వరలక్ష్మి తెలుగు తెరకు కూడా కొత్తేమీ కాదు… కానీ ఏ తెలుగు సినిమాలోనూ కూడా తనదైన ముద్ర వేసే అవకాశం రాలేదు… సరైన పాత్ర, అంటే తన లుక్కుకు సరిపడా పాత్ర దొరికితే ఎంత అలవోకగా దున్నేయగలదో చెప్పడానికి కొత్తగా ఇప్పుడు రిలీజైన నాంది సినిమా చాలు… సినిమాలో నరేష్ వంటి సీనియర్ హీరో ఉన్నాడు, పరుగులు తీయించే ఓ భిన్నమైన కథ ఉంది… దర్శకుడి ప్రతిభ ఉంది… కానీ పదే పదే గుర్తొచ్చేది వరలక్ష్మి పాత్ర, దానికి ఆమె కరెక్టుగా సూటైన తీరు… సరైన పాత్రలకు సరైన నటుల ఎంపిక అనేది కూడా సినిమా సక్సెస్ కారణాల్లో ఒకటీ అనుకుంటే… నాంది సినిమాలో ఓ లాయర్ పాత్రకు వరలక్ష్మిని ఎంపిక చేసుకోవడం ద్వారా దర్శకుడు సినిమా సక్సెస్‌కు బాటలు వేశాడు… రొటీన్ ఫార్ములా హీరోయిన్ కాదామె… అదేసమయంలో పూర్తిగా హీరోయిన్ సెంట్రిక్ సినిమాలూ చేయదు… తనకిచ్చిన పాత్రకు ఆ సినిమాలో సరైన ప్రాధాన్యం ఉందా లేదా చూసుకుంటుంది… నెగెటివ్ షేడ్స్ ఉన్నా సరే, హీరోయిన్ పాత్ర కాకపోయినా సరే… కేర్ చేయదు… తన కథానాయిక కాదు, తను నటి… అంతే…
సినిమా సంగతికొస్తే అల్లరి నరేష్‌ను మెచ్చుకోవాలి… కొంతకాలంగా తను మథనంలో ఉన్నాడు, తను ఇన్నాళ్లూ జనాన్ని అలరించిన కామెడీ జానర్ రొటీన్, మొనాటనీ అయిపోయింది… జనం తిరస్కరించడం మొదలుపెట్టేశారు… తన మార్క్ సినిమాలు బాక్సాఫీసు దగ్గర అడ్డగోలుగా తన్నేయడం స్టార్టయింది… చివరకు తను వెళ్లాల్సిన బాట ఏమిటో తనకే అంతుపట్టని సిట్యుయేషన్లో పడిపోయాడు… 19 ఏళ్లుగా ఫీల్డులో ఉన్నాడు… ఫ్లాపులు, హిట్లు సరేసరి… కానీ ఒకటే మూస పాత్రలు… అప్పుడెప్పుడో గమ్యం, శంభోశివశంభో సినిమాల్లో నరేష్ కూడా నటుడే అనిపించుకున్నాడు… కానీ తరువాత ఏమీ లేవు… తన కెరీర్ ఏమిటో తనకే అర్థం కాలేదు… హీరోగానే చేయాలనే ఈగోను పక్కనపెట్టేసి ఆమధ్య మహర్షిలో ఓ ఆఫ్-బీట్ రోల్ ప్లే చేశాడు, జనానికి నచ్చింది… నరేష్‌కు తనకు కావల్సిన కొత్త బాటేమిటో అర్థమైంది… అదే నాంది మూవీ… అవును, అదే తన సెకండ్ ఇన్నింగ్స్‌కు నాంది…
Ads
తప్పుడు కేసులు, సుదీర్ఘ నిర్బంధాలు ఇండియాలో కొత్తేమీ కాదు… కాన్ని అలాంటి సెన్సిటివ్ అంశాన్ని, సెక్షన్ 211 వంటి ప్రాధాన్య, చట్టపరమైన సంక్లిష్టతలను డిస్కస్ చేయడం ఒకరకంగా దర్శకుడి సాహసమే… కత్తిమీద సాము… దాన్ని తెలివిగా డీల్ చేశాడు, రక్తికట్టించాడు దర్శకుడు కనకమేడల విజయ్… అంటే రొటీన్ తెలుగు సినిమాల ఫార్ములా నుంచి దూరంగా, ఓ భిన్నమైన, సామాజిక ప్రయోజనమున్న అంశాన్ని ఓ కథలాగా చెప్పడం మామూలు విషయమేమీ కాదు… నాలుగు ఫైట్లు, నాలుగు సాంగ్స్, నాలుగు పిచ్చి కామెడీ సీన్లతో ఎవడైనా సినిమా తీయగలడు… లాజిక్కులు చెడిపోకుండా ఓ ఉపయుక్త అంశాన్ని సినిమా ద్వారా ప్రేక్షకులకు నచ్చేలా చెప్పడం మెచ్చదగిందే… ఆ పాత్రలో నరేష్ గొప్పగా చేశాడని చప్పట్లు కొట్టలేం కానీ దెబ్బతీయలేదు, చెడగొట్టలేదు… గుడ్… నరేష్‌కు ఓ బాట దొరికింది… అలాగే తెలుగు సినిమా దర్శకులకూ ఓ భరోసా… సిన్సియర్‌గా, సరైన గ్రిప్‌తో ఏ కొత్త కథాంశాన్ని చెప్పినా ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకమూ మరోసారి కుదిరింది… ఇదే నాంది…
Share this Article