_____________________________
మీకు రెండు సినిమాల గురించి చెప్పాలి !

1

అంతర్జాలం రూపంలో ప్రపంచం మొత్తం మన రీడింగ్ టేబుల్ మీది పెట్టె లోకీ, అరచేయిలోని స్మార్ట్ ఫోన్ లోకీ ఇమిడి పోయాక, ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా, కనీస చదువు వున్న వాళ్ళందరూ ఈ మిథ్యా ప్రపంచం (virtual world) లోనే ఎక్కువగా గడుపుతున్న కాలంలో, ఈ మిథ్యా ప్రపంచంలోని చీకటి కోణాలను స్పృశిస్తూ రెండు సినిమాలు వొచ్చాయి.

ఖంగారు పడకండి … ఒకటి మలయాళంలో (సినిమా పేరు – వికృతి), రెండవది, తమిళంలో (సినిమా పేరు – లెన్స్).
2
ముందుగా మలయాళ సినిమా ‘వికృతి’ గురించి –

ఫేస్బుక్ తెరువగానే అది మనకు ఒక ప్రశ్న వేస్తుంది – what is on your mind ?
చాలా మందిమి ‘ఇక్కడ ఏ చెత్త అయినా వెయ్యొచ్చు’ అన్న ‘వికృతి’ అర్థమే తీసుకుంటాము.

మనం వేసే చెత్త మన ఇంట్లోనే వుండేదయితే ఇబ్బంది లేదు గానీ, అది పక్కవాళ్ళ ఇంట్లో పడి వాళ్ళను ఇబ్బందుల పాలు చేసేదయితే మాత్రం, శిక్షలను ఎదుర్కోవడానికి కూడా సిద్ధపడి వుండాలి.

ఆ సంగతిని చర్చించిన సినిమా ఈ ‘వికృతి’
నేను తరువాత చెప్పబోయే రెండవ సినిమాతో పోలిస్తే, ఈ వికృతి, ‘సింపుల్ & బ్యూటిఫుల్ సినిమా’

సౌదీలో ఉద్యోగం చేస్తూ సెలవు మీద కేరళలో తన ఊరికి వొచ్చిన సమీర్ కు ఫేస్ బుక్ పిచ్చి. ఎంత పిచ్చి అంటే, కేరళలో విమానం దిగగానే తన సహ ప్రయాణీకులతో కలిసి ఒక సేల్ఫీ దిగి గ్రూప్ లో పోస్టు చేసి, లైకులు ఎన్ని వొస్తున్నాయో చెక్ చేసుకుంటాడు. ఎయిర్ పోర్ట్ లో తనను రిసీవ్ చేసుకోవడానికి వొచ్చిన తన మిత్రుడితో ‘ఒరేయ్, నాతో నీకేమన్నా గొడవలున్నాయా? నా ఫేస్ బుక్ పోస్టులకు లైకులెందుకు కొట్టడం లేదు’ అని అడుగుతాడు.

కథకు ఇంకో వైపు ఎల్డో వుంటాడు.

ఈ ఎల్డో, అతడి భార్య … ఇద్దరికీ వినికిడి సమస్య, మాట్లాడలేరు. స్కూలులో చదివే ఇద్దరు పిల్లలు. దంపతులిద్దరూ స్కూలులో ఏవో చిన్న ఉద్యోగాలు చేసుకుని సంసారం నడిపిస్తుంటారు. వాళ్ళు బతికే జీవితం పట్ల ఎటువంటి ఫిర్యాదులు లేకుండా హాయిగా వుంటారు.

ఎల్డో తత్వం ఏమిటంటే, బస్సులో వెళుతున్నపుడు, పక్కవాడు ఏదైనా అడిగితే, ‘నేను మూగ-చెవుడు’ అని చెప్పి తప్పుకోకుండా, కాగితం మీద రాసి మరీ వివరిస్తాడు.

అనుకోకుండా ఒకరోజు ఎల్డో కూతురికి జ్వరం ఎక్కువ కావడంతో పెద్దాసుపత్రిలో పెట్టవలసి వొచ్చి, అక్కడే మూడు నిద్ర లేని రాత్రులు గడుపుతాడు. మెట్రో రైలులో ఇంటికి తిరిగి వొచ్చే క్రమంలో, నిద్రకు తాళలేక సీటు మీద పడుకుండి పోతాడు.

అప్పుడే మెట్రో రైలులో అటుగా వొచ్చిన మన సౌదీ సమీర్ పడుకుని వున్న ఎల్డో ఫోటో తీసి, దానికి ‘మెట్రో రైలులో సోయి లేకుండా పడి వున్న తాగుబోతు’ అని కాప్షన్ పెట్టి ఎప్పట్లాగే తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తాడు.

ఆ పోస్ట్ ఎంతగా వైరల్ అయిపోతుందంటే, ఎల్డో ఉద్యోగం ఊడిపోతుంది, కుటుంబం లోని సంతోషం, ప్రశాంతత ఆవిరై పోతాయి.

ఇక్కడ ఎల్డో జీవితం తాను పెట్టిన పోస్టుతో ఎంత అతలాకుతలమయిందో తెలియని సమీర్ తన పోస్టు వందల్లో, వేలల్లో షేర్ కావడం చూసి మురిసిపోతుంటాడు.

ఆ తరువాత జరిగిన పరిణామాలు ఏమిటన్నది, నేను కథగా చెబితే పెద్ద ఆసక్తిగా అనిపించకపోవొచ్చు గానీ, ప్రధాన పాత్రధారుల నటన, తాను చేసింది చాలా పెద్ద నేరమన్న సంగతి అర్థమయ్యాక సమీర్ గిల్టీ ఫీలింగ్ తో జీవచ్చవంలా ప్రవర్తించడం వంటివి సినిమాను ఆసాంతం చూసేలా చేసాయి. థ్రిల్లింగ్ సన్నివేశాల జోలికి పోకుండా, అపరాధ భావం, ప్రేమ, క్షమ, కరుణ వంటి మానవీయ విలువలతో, అలతి అలతి పదాలతో రాసిన అందమైన కవితలా ఈ సినిమా సాగిపోవడం బాగుంది.
సినిమాలో ఒక సన్నివేశం వుంటుంది-

‘తెలియక చేసినా సరే, ఇటువంటి నేరాలకు శిక్షలేమిటో తెలుసా? రెండేళ్ళ జైలు శిక్ష, ఐదు లక్షల పరిహారం’ అని తన స్నేహితుడి నోటి వెంట విన్న వెంటనే సమీర్ స్పృహ తప్పి పడి పోతాడు.
3
ఇక రెండో సినిమా, ‘లెన్స్’ చర్చించిన అంశం, అరకొర జ్ఞానాల ముఖ పుస్తక పోస్టులను మించిన మనిషి లోపలి వికారాలకు సంబంధించింది.

ఒక అపార్ట్ మెంట్ కాంప్లెక్స్…. అనేక కుటుంబాలు.
అందులో ఒక ఉద్యోగి కుటుంబం (అతడు సాఫ్ట్ వేర్ ఉద్యోగి కావొచ్చు, మరొక ఉద్యోగి కావొచ్చు … నేను కావొచ్చు, మీరు కావొచ్చు … పేరు ‘అరవింద్’ అన్నాడు దర్శకుడు)

అతడు పొద్దున్నే ఆఫీసుకు వెళతాడు. చుట్టూ పక్కల వాళ్లకు ‘హాయ్’ చెబుతూ సరదాగా వుంటాడు. భార్యా పిల్లలకు అవసరమైన అన్నీ సమకూర్చి పెడతాడు. ‘అతనికేంటి … జెంటిల్మన్’

కాకపొతే, రాత్రి పూట సరదాగా కాసేపు పోర్న్ సైట్లు చూస్తాడు. అప్పుడప్పుడూ రాత్రి పూట తన గది తలుపులు మూసుకుని, భార్యతో ‘అమెరికా క్లయింటు కాల్స్’ అని చిన్న అబద్ధమాడి, ఆన్ లైన్ చాటింగ్ లోకొచ్చిన అమ్మాయితో కొద్దిగా చిలిపి ఆటలోకి దిగుతాడు.

సరిగ్గా అప్పుడు అతగాడి కంప్యూటర్ తెర మీదకు ఒక ఆగంతకుడు ప్రత్యక్షమై ‘నువ్వు ఇప్పటిదాకా చేసిన అసహ్యకరమైన పనుల రహస్యమంతా నా దగ్గర వుంది. నేను నీ నుండి ఆశించేది ఒక్కటే. నేను లైవ్ లో ఆత్మహత్య చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నా. నువ్వు చూస్తూ వుండాలి’ అని ఒక చిత్రమైన డిమాండ్ పెడతాడు.

ఈ ఆగంతకుడు ఎర వేయడానికి వొచ్చిన వేటగాడా?

‘అంత అసహ్యకరమైన పని నేనేం చేసాను? అదేమన్నా పెద్ద నేరమా ? ఇవ్వల్రేపు చాలామంది చేస్తున్నది ఇదేగా? ఇదేం డైరెక్ట్ కాదుగదా? జస్ట్ వర్చువల్ ప్రపంచంలో ఏదో కాసేపు ఈ సరదా. ఆ మాటకొస్తే, రాత్రి చీకటి పడ్డాక, కంప్యూటర్ ల పైన, స్మార్ట్ ఫోన్ల పైన ఎవరెవరు ఏ మానసిక వికార కార్యకలాపాలలో మునిగిపోయి ఉంటారో చూసేవాళ్ళు ఎవరు?’ అని ఎదురు దాడికి దిగుతాడు అరవింద్.
అరవింద్ సమర్థన కన్విన్సింగ్ గా అనిపిస్తుంది కదా !

ప్రపంచీకరణ, అంతర్జాలం మన జీవితాలను పూర్తిగా ఆక్రమించాక, ఈ మిథ్యా ప్రపంచంలో ఏది నైతికత, ఏది నైతికత కాదు అన్న సున్నితమైన అంశాలను, మనం ఇక ఎంతమాత్రమూ నిర్లక్ష్యం వహించలేని అంశాలను చాలా ధైర్యంగా చర్చించిన సినిమా ‘లెన్స్’. ఇప్పటి కాలానికి అవసరమైన సినిమా.

నిజానికి ఇటువంటి సున్నితమైన అంశాలను స్పృశించడం ఒకనాటి తమిళ సినిమాకు కొత్త కాదు. ఒక్కసారి, కమలహాసన్ – శ్రీదేవి నటించిన భారతీరాజా సినిమా ‘ఎర్ర గులాబీలు’ గుర్తు తెచ్చుకోండి.

పైన ప్రస్తావించిన ‘వికృతి’ సినిమా వలె కథను సింపుల్ గా చెప్పిన సినిమా కాదు ఇది. షాకింగ్ సన్నివేశాలతో చెబితే తప్ప ఈ కొత్త ప్రపంచపు సమస్యల, నేరాల తీవ్రత ఏమిటో జనాలకు అర్థం కాదు అని నమ్మి తీసిన సినిమా ‘లెన్స్’.

ఎనభై శాతం సినిమా రెండు వైపులా వున్న రెండు ల్యాపుటాపుల లోని స్కైప్ వీడియోలలో, అద్భుతమైన స్క్రీన్ ప్లే తో నడుస్తుంది. ‘ఎవరు అసలు నేరస్తుడు? ఏది సరయిన శిక్ష?’ అన్న ప్రశ్నలకు సమాధానాలను పొరలు పొరలుగా చూపిస్తుంది.
ముఖ్యంగా, ఆగంతకుడు అరవింద్ కంప్యూటర్ తెర మీద ప్రత్యక్షమైన తరువాత ఇద్దరి నడుమా జరిగే సంభాషణ, ఒక గొప్ప తాత్విక సంభాషణలా ఆసక్తికరంగా సాగుతుంది. కొద్దిసేపు ఒక క్రైం థ్రిల్లర్ మధ్యలో చేసిన స్పిరిచ్యువల్ జర్నీలా వుంటుంది. సినిమాలో అదే పెద్ద ఆకర్షణ.

ఉదాహరణకు –
అరవింద్ కు బెడ్ మీద గాడనిద్రలో వున్న స్త్రీని చూపిస్తూ ఆగంతకుడు అంటాడు – ‘రాత్రి పూట అందరూ ఇంత నిశబ్దంగా నిద్రపోతే, లోకమెంత ప్రశాంతంగా వుంటుందో కదా!’

ఇంకో సన్నివేశంలో అంటాడు -‘ప్రశ్నించు, ప్రశ్నిస్తేనే హృదయం కాస్త కుదుటపడుతుంది. వెళ్ళు, తలుపు తీయి, ఎవరి ప్రశ్నలకు వాళ్ళే తలుపులు తీయాలి, తలుపులు తీస్తే నీ స్నేహితుడు ఉండొచ్చు, నీ శత్రువు ఉండొచ్చు, లేక నీ భార్య ఉండొచ్చు’

మరొక సన్నివేశంలో ఆ ఆగంతకుడు అన్నట్టు –
‘చుట్టూ ఎవరూ లేనప్పుడు నీవు నీవులా వుండవు’