ఈ బస్సు టొరంటోలోని అనేక ప్రాంతాల్లో ప్రయాణం చేస్తుంటుంది… అక్కడక్కడా ఆగుతుంటుంది… కూరగాయలు అమ్ముతుంటుంది… మళ్లీ ప్రయాణం… మరో మజిలీ… ఇదో మొబైల్ అంగడి… అక్షరాలా ఇది నడిచే కూరగాయల మండీ…
ఫుడ్ షేర్ టోరంటో, టోరంటో సిటీ, యునైటెడ్ వే టోరంటో కలిసి ఈ స్కీం నిర్వహిస్తున్నాయి… జస్ట్ ఒక బస్సునే కూరగాయాల మార్కెట్ గా మార్చేశాయి… సరసమైన ధరలకు తాజా కూరగాయలను అవసరమున్న ప్రజలకు అందించడమే దీని ధ్యేయం… తాజా కూరగాయలకు పెద్దగా యాక్సెస్ ఉండని లొకాలిటీలను టార్గెట్ చేసుకుని వెళ్తాయి ఈ బస్సులు…
ఒక్క అమెరికాలోనే దాదాపు 2.35 కోట్ల మంది సరైన ఆహారం సరిగ్గా అందని ప్రాంతాల్లో ఉంటారట… కెనడాలోనూ సేమ్… అలాంటివాళ్ల కోసం ఉద్దేశించిందే ఇది… ఆరోగ్యకరమైన ఆహారాన్ని అలాంటిచోట్లకు చేరవేయడమే దీని ఉద్దేశం…
 

Sponsored Links
బ్రాకోలీ నుంచి యాపిల్స్, ఆనియన్స్ వరకూ అన్నీ అందుబాటులో ఉంచుతారు… ఒక్కో ఏరియాలోకి వారానికి రెండుసార్లు వెళ్తుందీ బస్సు…
ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే… మన దేశంలోనూ కూరగాయలు పండించే రైతుకేమో సరైన ధర రాదు… కొనేవారికేమో విపరీతమైన ధరలు… ఇలాంటి బస్సుల్ని ప్రభుత్వాలు గనుక ఏర్పాటు చేయగలిగితే, కనీసం రుణసాయం చేయగలిగితే… రైతులే తమ కూరగాయల్ని ఇలా సరసమైన ధరలకు, తాజా తాజా స్థితిలో నేరుగా వినియోగదారుల దగ్గరికే తీసుకెళ్లి అమ్ముకోగలవు కదా… ఒక కిలోకు రైతుకు దక్కేదానికీ, వినియోగదారుడు చెల్లించే దానికి దాదాపు రెట్టింపు, మూడు రెట్లు తేడా ఉంటున్నది… దళారులు, వ్యాపారుల దోపిడీని అరికట్టాలంటే, వినియోగదారుడికి పౌష్టికాహారం అందుబాటులోకి తీసుకురావడమంటే ఇలాంటి కొత్త ఆలోచనల ద్వారానే సాధ్యం…. రైతుబజార్లకన్నా ఇది ఎక్కువ ప్రయోజనకరం…