ప్రయాణకాలే మనసా చలేనా…
గీతలో అక్షర పరబ్రహ్మయోగంలో ఈ శ్లోకముంది… ప్రయాణకాలం అంటే మృత్యువు… ప్రాణం పోయే సమయంలో మనసులో భక్తి, యోగబలం వుండి, కనుబొమల మధ్య ప్రాణాన్ని నిలిపినవాడు భగవంతుణ్ని చేరుకుంటాడు…
ఒక గారడీవాడు తాడుపై నడుస్తూ వుంటే జనమంతా చప్పట్లు కొడుతూ వుంటారు.. కాలుజారి కింద పడతాడు.. చావుబతుకుల మధ్య అతన్ని వదిలేసి జనం వెళ్లిపోతారు..
అతన్ని భుజాన వేసుకున్న జరాతూష్ట్ర ‘మరణం దుక్కించదగినదికాదు’ అంటాడు… (నీషే రచన)
ఇదంతా ఎందుకంటే..? నిన్న శ్రీదేవి పుట్టినరోజు… సూపర్ స్టార్‌గా వున్నప్పుడు పత్రికలన్నీ ప్రత్యేకంగా పేజీలు వేసేవి… నిర్మాతలు, దర్శకులు ఇంటిముందు క్యూ కట్టేవాళ్లు. కనీసం బతికుంటే ఎక్కడో ఒకచోట చిన్నవార్తయినా వచ్చేదేమో.. చనిపోతే ఏమీ వుండదు… (ఆమె కూతురు తిరుమలకు వచ్చిన ఫోటో మినహాయింపు… శ్రీదేవి పేరు ప్రస్తావనకు వస్తుంది, ఆమె తల్లిగా…) నా అభిమానం కూడా ఓరోజు ఆలస్యమైంది.. ఆగస్టు 13 ఎవరికీ గుర్తులేదు.. నా అభిమానంలాగే…
మాతరం అందాలనటి శ్రీదేవి… తొలి సినిమా అనురాగాలు, మా బంగారక్క ఆడలేదు… (ఫ్రిజిడిటీ మీద తెలుగులో వచ్చిన మొదటి సినిమా బంగారక్క).. పదహారేళ్ల వయస్సు తరువాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు… స్టూడియోలు, లోకేషన్స్ తప్ప బయటి ప్రపంచం తెలియని శ్రీదేవిలో అన్ని ఎమోషన్స్ ఎలా పలికేవి..? నటన అమెకి బాల్యం లేకుండా చేసింది.. అయినా వసంతకోకిలలో చిన్నపిల్లలా మారిపోయింది.. శ్రీదేవి కెరీర్‌లో ది బెస్ట్ సినిమా అది… జగదేకవీరుడులో చిరంజీవిని కూడా దాటేసింది… ఫ్రేములో శ్రీదేవి ఉంటే పెద్ద పెద్ద హీరోలు కూడా ఆనరు…
ఒకరి జీవితాన్ని చూసి ఇంకొకరు ఏమీ నేర్చుకోరు.. ఎప్పటికీ నేర్చుకోరు.. జీవితం పాఠాలకీ, పుస్తకాలనీ ఒదగదు.. సావిత్రిని చూసినవాళ్లెవరూ, పెళ్లయిన మగవాళ్లను చేసుకోరు, కానీ శ్రీదేవి చేసుకుంది..
స్కూల్ పుస్తకాలు మనకేమీ నేర్పించవు.. మహా అయితే భూమి గుండ్రంగా వుందని చెబుతాయి… కానీ ఈ భూమ్మీద ఎలా బతకాలో అవి చెప్పవు..
శ్రీదేవి నటించకపోయినా, ఇంకా చాలాకాలం బతకాల్సిన మనిషి.. ప్రేక్షకుల్ని ఆనందంలో ముంచెత్తిన శ్రీదేవి బాత్ టబ్బులో మునిగి చనిపోయింది.. అదే విషాదం..
రోజులు గడిచేకొద్దీ ఇక ఆగస్టు 13 ఆమె పిల్లలకు తప్ప ఇంకెవరికీ గుర్తుండదు.. వాళ్లకైనా ఎందుకు గుర్తుంటుందీ అంటే అమ్మకు ప్రత్యామ్నాయం ఇంకా దేవుడు సృష్టించలదు కాబట్టి…
నెమలి ఎంత అందంగా నాట్యం చేసినా, వేటగాడు బాణం వేయకుండా ఉండడు…
దేవుడు అతిగొప్ప వేటగాడు…
—— జీఆర్ మహర్షి