శాస్త్రం కూడా ఏ ఇద్దరికీ ఒకేలా ఉండదు… ఏ ఇద్దరు జ్యోతిష్కులూ ఒకేలా జోస్యం చెప్పడు… ఏ ఇద్దరు డాక్టర్లూ ఒకేలాగా మందులు రాయరు… గ్రహచారాలు, సనాతన సంప్రదాయాలకు సంబంధించి ఏ ఇద్దరు స్వాములూ ఒకేలా స్పందించరు… అచ్చు అలాగే… ఈ ఇద్దరు స్వాములు కృష్ణా పుష్కర పవిత్రతపై చెరో మాట మాట్లాడుతున్నారు… వీళ్లను నమ్మే భక్తజనానికి మాత్రం పిచ్చెక్కిపోతున్నది… అన్నట్టు గుర్తుంచుకొండి వీరిలో ఒకరు చంద్రబాబు వీరాభిమాని, మరొకరు చంద్రబాబుపై పిచ్చకోపం…
అంత్యపుష్కర ప్రభావంతో ఉన్న గోదావరి జలాలను… ఆదిపుష్కరకాలంలోని కృష్ణా జలాలతో కలిపేయడం వల్ల కృష్ణా పుష్కర స్థానాల పవిత్రత దెబ్బతింటుందనీ… దాని విశిష్టతే పోతుందనీ ఓ చర్చ కొద్దిరోజులుగా జరుగుతున్న సంగతి తెలిసిందే… ఈనెలాఖరున గోదావరి అంత్యపుష్కరాలు ఆరంభమవుతాయి. 12 రోజులపాటు ఉంటాయి… తరువాత నెలలోనే కృష్ణా ఆది పుష్కరాలు ఆరంభమవుతున్నాయి… ఒక్కో నదికి ఒక్కో కాలంలో పుష్కర పవిత్రత ఉంటుందనీ, రెండూ కలగలపడంతో పవిత్రత, విశిష్టత దెబ్బతింటున్నదనేది ఆ చర్చ సారాంశం…
దీనిపై విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి పుష్కరాల వేళ నదీసంగమం సరైన పని కాదని అంటున్నారు… కానీ గోదావరి వరద వచ్చినప్పుడే పట్టిసీమ నుంచి నీటిని ఎత్తిపోయాలి… తీరా కృష్ణా పుష్కరకాలం ఏడాదిపాటు ఉంటుంది కాబట్టి అన్నిరోజులూ గోదావరి నీటిని కృష్ణా నదిలోకి వదిలేయకపోతే ఇక పట్టిసీమ నిర్మించి ఏం ప్రయోజనం అనేది ఓ ప్రశ్న… ఆది పుష్కరాలు 12 రోజులే కాబట్టి, ఆ రోజులైపోయాక గోదావరి నీటిని తెచ్చుకుంటే సరిపోతుందనేది మరో వాదన… కానీ ప్రస్తుతం విజయవాడలోనే ఉన్న కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి మాత్రం ఒక నదీజలాలను మరో నదీజలాలతో కలిపితే సమస్య ఏమీ లేదని అంటున్నారు… ఆయన పైపైన ఈ వ్యాఖ్య చేశారే తప్ప పెద్దగా లోతుల్లోకి వెళ్లి దాన్ని వివాదాస్పదం చేసే ఉద్దేశం ఆయనకు లేనట్టు కనిపించింది… పైగా గత గోదావరి పుష్కరాల వేళ చంద్రబాబు తమతో కలిసి స్నానం చేశాడని సంబరపడిపోయాడు…
స్థూలంగా ఆలోచిస్తే… పుష్కరాల వేళ కాదు, ఎప్పుడైనా సరే నదీస్నానం మంచిదే… ఎన్ని నదుల సంగమమైనా సరే… ప్రవాహంలో స్నానం మంచిదే… అయితే శాస్త్రప్రకారం లోతుగా ఆలోచిస్తే అన్నీ తప్పులే కనిపిస్తాయి… ఎన్నో దోషాలూ కనిపిస్తాయి… ఇదీ అంతే…