అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా బ్రిటన్ కు చెందిన ఓ ప్రముఖ కంపెనీ కోఎక్సిస్ట్ ఓ ఆసక్తికరమైన చర్చకు తెరతీసింది… అదేమిటంటే, ఆ కంపెనీ నెలసరి రుతుస్రావం రోజుల్లో మహిళ ఉద్యోగులకు సెలవులు తీసుకునే అవకాశం కల్పించింది. దీంతో ఇలాంటి బహుళ జాతి కంపెనీలు, ఐటీ కంపెనీలు, సర్వీస్ సెక్టార్లలో పనిచేసే ఉద్యోగుల్లో ఇది బాగా చర్చనీయాంశమైంది. మన దేశంలోనూ కొన్ని పత్రికలు దీనిపై ఆర్టికిల్స్ ప్రచురించాయి. నిజానికి ఆ రోజుల్లో కొందరు మహిళలు విపరీతంగా ఇబ్బందిపడుతుంటారు. పనిపై శ్రద్ధ తగ్గుతుంది. చికాకు, కడుపునొప్పి, వికారం, అలసట వారిని పీడిస్తుంటాయి. అందుకే అలాంటివారికి సెలవులు ఇవ్వడమే కరెక్టనీ, అప్పుడే వారి బాధను అర్ధం చేసుకున్నట్టవుతుందని కోఎక్సిస్ట్ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. వాస్తవానికి ఇది కొత్తేమీ కాదు. రెండు దశాబ్దాలుగా మన దేశంలోని బీహార్ రాష్ట్రంలో ఈ సౌకర్యం ఉంది. కొన్ని ప్రభుత్వ శాఖల్లో నెలసరి రోజుల్లో తప్పనిసరైతే రెండు రోజులు ప్రత్యేక సెలవులు తీసుకోవచ్చు. కానీ మరే ఇతర రాష్ట్రమూ దీన్ని అమల్లోకి తీసుకురాలేదు. ఐతే దీనిపై మహిళ ఉద్యోగుల్లోనూ భిన్నాభిప్రాయాలు వినవస్తున్నాయి. ‘నిజమే, ఆ రోజుల్లో కొంత ఇబ్బంది ఉంటుంది. కానీ అందరికీ కాదు, అందుకే నిజంగా అవసరమున్న మహిళలకైతే దీన్ని సిక్ లీవ్ గా వర్తింపజేస్తే పర్లేదేమో… ఐనా ఈ నిర్ణయం అమలు చేస్తే, గతంలో నెలసరి రోజుల్లో వంటింట్లోకి, పూజాగదిలోకి రానివ్వని పాతకాలం రోజుల్లోకి వెళ్లినట్టు అనిపిస్తుంది’ అని టైమ్స్ ఆఫ్ ఇండియా కాలమిస్ట్ వనిత దావ్రా అభిప్రాయపడ్డారు. ‘8, 9 నెలల గర్భంతోనూ ఆఫీసులకు వచ్చి పనిచేసేంత మానసిక, శారీరక స్టేమినా ఉంది మహిళలకు… మళ్లీ ఈ పీరియడ్స్ లీవ్స్ అనేది పాత రోజుల్లోకి తీసుకెళ్లడం తప్ప మరొకటి కాదు’ అంటున్నది మరో మహిళ నేహా. ‘ఏం, ఆ రోజుల్లో ఖాళీగా పడకేయడం లేదుగా, కొంత ఇబ్బందిగా ఉన్నా సరే ఆ లీవ్స్ తీసుకోవడం పురుషులకన్నా మేమేమో తక్కువ అనే అభిప్రాయానికి తావిచ్చినట్టే’ అనేది సునయన గుప్త అభిప్రాయం. ‘అసలు ఈ కారణం చెప్పి సెలవు అడగడమే ఎంబరాసింగ్ గా ఉంటుంది’ అనేది మరొకరి భావన. ‘ఎవరూ ప్రత్యేకంగా సెలవు ఇవ్వనక్కర్లేదు, మరీ ఇబ్బందిగా ఉన్నప్పుడు రెండు రోజులు పెయిన్ కిల్లర్స్ కూడా పనిచేయనప్పుడు, కాదనకుండా సెలవులు ఇస్తే చాలు’ అంటున్నది మరొకావిడ!