ప్రపంచంలో ఎవడైనా సరే… భారతదేశం మ్యాపును తప్పుగా ప్రచురిస్తే కఠినంగా చట్టప్రకారం చర్యలు తప్పవంటూ మనం మొన్నమొన్ననే ఓ చట్టాన్ని తెచ్చుకున్నాం… బహుపరాక్ అంటూ అందరికీ హెచ్చరించేశాం… ఈ చట్టం రాగానే అందరికన్నా ముందే గూగుల్ వాడు వెంటనే తన అప్పటిదాకా తప్పుగా చూపిస్తున్న మ్యాపుల్ని సరిదిద్దుకున్నాడనీ కొత్త మ్యాపులతో మన జబ్బల్ని మనమే చరుచుకున్నాం… అదీ మన తడాఖా అని మన వీపు మీద మనమే శెభాష్ అని కొట్టేసుకున్నాం… అసలు గూగుల్ కు సీఈవోగా మన పిచ్చయ్ వచ్చాక కూడా గూగుల్ తప్పు మ్యాపుల్ని చూపిస్తుందా అనీ అభిమానాన్ని ఒలకబోసుకున్నాం
తీరా చూస్తే… అంతా ఉత్తదే… ఏదో భారతదేశంలో నెట్ సర్ఫ్ చేసేవారికి కనిపించే మ్యాపుల్లో తప్ప గూగుల్ మరేమీ మార్పులు చేయలేదు… దీన్ని అప్పట్లోనే విదేశాల్లో ఉన్న మనోళ్లు చూసి పెదవివిరిచారు… ఇదంతా తొండి అని మొత్తుకున్నారు… సహజంగానే మన దేశం చట్టాలు చేస్తుంది తప్ప సీరియస్ గా తీసుకోదు కదా… దీన్ని కూడా లైట్ తీసుకుంది… నిజానికి గూగుల్ తనకు సంబంధించిన ప్రతీ యాప్ లోనూ, ప్రతీ ప్రోగ్రామ్ లోనూ తప్పు మ్యాపుల్నే ఉపయోగిస్తున్నది… పైన చూపించిన మ్యాప్ చూడండి… ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెబ్ సైట్లకు సంబంధించిన రకరకాల ప్రాతిపదికలను ఎప్పటికప్పుడు పరిశీలించే గూగుల్ అనలిటిక్స్… అందులో ఇదీ ఇండియా మ్యాపు…
ఇందులో అరుణాచల్ ప్రదేశ్ కు గీతలు కొట్టేశారు… అంటే గూగుల్ వాడే చెబుతున్నాడు అది వివాదాస్పద ప్రదేశమని… సరే, చైనావోడు తలతిక్క కొర్రీలు పెడుతున్నాడు కాబట్టి… ఫర్ డిబేట్… అది వివాదాస్పదమే అనుకుందాం… వోకేనా… ఇదుగో ఈ జమ్ము కాశ్మీర్ చూడండి… అది మరీ ఘోరం… పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్, చైనా ఆక్రమిత కాశ్మీర్ చుట్టూ తనే బోర్డర్ కొట్టేయడంతోపాటు… మొత్తం జమ్ము కాశ్మీర్ రాష్ట్రాన్నే వివాదాస్పదంగా పరిగణిస్తూ అడ్డంగా గీతలు కొట్టేశాడు… అంటే అరుణాచల్ ప్రదేశ్, జమ్ము కాశ్మీర్ రాష్ట్రాలు రెండూ ఇండియాలో అంతర్భాగాలు అని గూగుల్ అంగీకరించడం లేదన్నమాట… మరి మొన్న మనం ఘనంగా తెచ్చుకున్న చట్టం ఏం చేస్తున్నది, ఎందుకు తెచ్చుకున్నట్టు మిష్టర్ మోడీ, మిష్టర్ పరీకర్, శ్రీమతి సుష్మా స్వరాజ్…? అన్నట్టు మిష్టర్ గూగుల్ పిచ్చయ్… నువ్వు భారతీయుడివేగా… కనీసం నీకైనా ఆ సోయి లేకపోతే ఎలా బాసూ…? దిసీజ్ టూ మచ్…