Muchata.com Telugu Latest News

Muchata.com Provided Telugu Latest News, Political News , Political News, Breaking News in Telugu LIVE ముచ్చట

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆ అమ్మాయి బీఎస్సీ (చేతబడి)… అల్లుడు గారేమో ఎంఎస్సీ (కాష్మోరా)….

January 7, 2021 by M S R

అబ్బాయి భూతాల డాక్టర్!
అమ్మాయి పిశాచాల సర్జన్!
————————

ఇది పూర్తిగా దయ్యాలకు సంబంధించిన అకెడెమిక్ సబ్జెక్ట్. ఇష్టం లేనివారు, భయపడేవారు ఇక్కడితో చదవడం ఆపేయగలరు.

భూత, ప్రేత, పిశాచ, శాకినీ, ఢాకిని…ఇలా దయ్యాల్లో ఎన్నో రకాలు. అన్ని దయ్యాలూ చెడ్డవి కావు. కొన్ని దయ్యాలే మంచివి కావు. విఠలాచార్య సినిమాలతో తెలుగులో దయ్యాలకు సెలెబ్రిటీ హోదా వచ్చింది. వంశపారంపార్యంగా మనకందిన విజ్ఞానం ప్రకారం- దయ్యం తెల్ల రంగు, లేదా బూడిద రంగుతో ఉంటుంది. కళ్లల్లో గుంతలు ఉంటాయి కానీ- కనుగుడ్లు ఉండవు. కాళ్లు వెనకకు తిరిగి ఉంటాయి. నేల మీద నిలబడకుండా గాలిలో తేలుతూ ఉంటుంది. రాత్రిళ్లు బిజీగా ఉండి పగలు రెస్ట్ తీసుకుంటుంది. ఇంతకంటే లోతుగా వెళితే దయ్యం ఒప్పుకోదు. ఊరుకోదు!

black magic

దయ్యం అంటే మనం భయం నటిస్తాం కానీ- దయ్యాలతో మన సహవాసం ఈనాటిది కాదు.

దయ్యాలు వేదాలు చదవడం నిషిద్ధం . అంటే దయ్యాలు వేదాలు తప్ప మిగతావన్నీ చదవచ్చు అని అనుకోవచ్చు. అయినా వేదమంతా దేవుళ్ల గురించే చెబుతుంది . దేవుళ్ళకు దయ్యాలకు అసలు పడదుకాబట్టి ఆ మాట పుట్టి ఉండవచ్చు.
ఉత్తిష్టంతు భూత పిశాచ . . . మంత్రంలో ,
ఆగమానార్థంతు దేవానాం , గమనార్థంతు రాక్షసాం . . కుర్వన్తు ఘంటారావం . . . మంత్రంలో భూత ప్రేత పిశాచాలు, రాక్షసులు లేచిపోవడానికి ;
దేవుళ్లు సాదరంగా లోపలికి రావడానికి అని స్పష్టంగా రోజూ చెబుతూనే ఉన్నాం . అర్థం తెలియదు కాబట్టి ధైర్యంగా ఉంటాం . అర్థం తెలిస్తే పిరికివాళ్ళై వణికిపోతూ ఉంటారు .

దేవుళ్ల గురించి మాట్లాడ్డానికి సకల వేదాలు , ఉపనిషత్తులు , పురాణాలు , మంత్రశాస్త్రాలు చదవాలి కానీ – దయ్యాల గురించి తెలియనిదెవరికి ? పబ్లిక్ డొమైన్ లో ఉన్నదంతా దయ్యాల కథలే .
తెలుగుభాషలో దయ్యం ఎన్ని హొయలు పోయిందో?
భాషలో దయ్యం ఎంత ముద్దుగా ఒదిగిపోయిందో ?
ఎన్ని దయ్యం నుడికారాలో?
ఎన్ని దయ్యం సామెతలో? ఎన్ని తిట్లో?
ఎన్ని దయ్యం పోలికలో?
దయ్యాన్ని అనవసరంగా ఆడిపోసుకుంటున్నాం కానీ , మనం దయ్యాలకు భిన్నంగా ఎలా ఉన్నామో చెప్పాలని వాటి డిమాండు.

black-magic (1)

జుట్టు చింపిరి చింపిరిగా ఉన్నా , విరబోసుకున్నా దయ్యంలా ఏమిటి ఆ జుట్టు అంటాం. చింపిరి, విరబోత ఇప్పుడు ఫ్యాషన్. జుట్టు విరబోసుకున్నవారంతా దయ్యాలని అనగలమా? అంటే అప్పుడు మనుషులే మిగలరు కదా?
ఏక వస్త్రం భుజాల నుండి కాలిగోళ్ళ వరకు వేలాడే డ్రస్సు దయ్యానికి యూనిఫామ్. మరిప్పుడు అది లేటెస్టు ఫ్యాషన్ కాబట్టి అలా వేసుకున్నవారందరిలో దయ్యాలను వెతకలేం కదా?
కాళ్ళు వెనక్కు ఉండడం దయ్యం అనాటమీ . సమాజం మనోవేగ తిరోగమనంలో వెనక్కే నడుస్తోంది కాబట్టి మనవి దయ్యం కాళ్ళు అంటే ఒప్పుకుంటామా? పీక్కు తినడం దయ్యం పధ్ధతి. మనమిప్పుడు అంతకంటే భిన్నంగా తింటున్నామా? పిచ్చిగా ఊగడం , వణకడం దయ్యం స్వభావం. మనం తూగి ఊగి వణకడానికి ఎన్నెన్నో పదార్థాలను కోరి కోరి తీసుకుంటున్నాం. రాత్రిళ్లు తిరగడం దయ్యం స్టయిల్. మనకిప్పుడు రాచకార్యాలన్నీ రాత్రిళ్లే. దయ్యం కాళ్లు భూమిని తాకవు. మనకాళ్లు భూమిని తాకడం మానేసి యుగాలు అవుతోంది.

మంచి దయ్యాలు, చెడ్డ దయ్యాలు ఒక విభజన. పిల్ల దయ్యాలు, కొరివి దయ్యాలు మరొక విభజన. వింత దయ్యాలు, మొండి దయ్యాలు ఇలా స్వభావాన్నిబట్టి ఇంకా చాలా దయ్యాలుంటాయి. అయితే యు ఐ డి ఆధార్ ఎన్రోల్ మెంట్ సరిగ్గా జరక్కపోవడంవల్ల దేశవ్యాప్తంగా దయ్యాల సంఖ్య మీద స్పష్టత లేదు. దయ్యానికి పనిచెప్పడం చాలా కష్టమని ప్రసిద్ధకథ. అంటే దయ్యాలతో పనిచేయించుకోవడానికి ఎవరో ప్రయత్నం చేశారన్నమాట.

witchcraft
ఒకప్పుడు ఊరికి ఉత్తరాన స్మశానంలో సమాధులను అరుగులుగా చేసుకుని చీకటి పడ్డాక దయ్యాలు నిద్రలేచేవి. ఇప్పుడు స్మశానాలన్నీ ఊళ్లో కలిశాక దయ్యాలకు రాత్రి పగలు తేడా తెలియక చస్తున్నాయి.
చీకటి, ఒంటరిగా ఉంటే మనపక్కన దయ్యాలే తోడు ఉన్న అనుభూతి కలుగుతుంది.
తెలుగు సినిమాల్లో దయ్యాలను హీరో – హీరో ఇన్ లను చేసిన విఠలాచార్యకు ఏమిచ్చి ఋణం తీర్చుకోవాలో తెలియక ఇప్పటికీ దయ్యాలు జుట్లు పీక్కుంటున్నాయి . మన జానపద కథలనిండా దయ్యాలే దయ్యాలు . దయ్యానికి శరీరం లేక మనశరీరాలను అద్దెకు తీసుకుంటాయి. మన భాషే మాట్లాడతాయి. కానీ దెబ్బకు దయ్యం దిగిపోవాల! అని భూత వైద్యుడు కొడితే దెబ్బలుమాత్రం మనకే తగులుతాయి. దయ్యాలతో మాట్లాడే నిపుణులు ఉంటారు. ఆ భాష, దాని వ్యాకరణం, నిఘంటువులు ఏ స్మశానంలో దొరుకుతోయో రహస్యం . అందుకే శ్రీ శ్రీ ప్రతీకాత్మకంగా శ్మశానాల నిఘంటువుల సంకెళ్లు తెంచుకుని అన్నాడేమో?
టీ వీ యాంకర్ల భాష మీద కూడా ఇలాంటి ముద్రలేవో ఉన్నాయికానీ ఆ వివరాల్లోకి వెళ్లడం సభా మర్యాదకాదు .
దయ్యం తిండి అని ఏనాడూ తిండి తినని దయ్యాన్ని తిట్టుకు వాడుకుంటున్నాం .
మనలోపలే కనపడని దయ్యాలుంటాయి . మనకు కనపడవు కానీ, ఎదుటివారికి మనలో దయ్యం కొట్టొచ్చినట్లు, మింగడానికి వచ్చినట్లు, మీదపడుతున్నట్లు స్పష్టంగా కనపడుతుంది.
చచ్చి దయ్యాలయిన వాటికి యూనిఫామ్ పధ్ధతి పాడు ఉంటుంది. జీవించి ఉన్న దయ్యాలను గుర్తించినవాడే నిజమయిన భూత వైద్యుడు.

graduation in black magic

ఇన్నాళ్ళకు భూత వైద్యాన్ని ఒక వైద్య శాస్త్రంగా బెనారస్ హిందూ విశ్వ విద్యాలయం గుర్తించింది. దయ్యాల ప్రత్యేక కోర్సుకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ కోర్సు మొదటి బ్యాచ్ బయటికి రాగానే ఎలా తమ ఉనికిని జాగ్రత్తగా కాపాడుకోవాలని అఖిల భారత భూత ప్రేత పిశాచ నిశాచర సంఘం అమావాస్య అర్ధరాత్రి నక్కలు ఊళలు వేస్తుండగా, తోడేళ్లు పళ్ళికిలిస్తుండగా, గుడ్ల గూబలు గోళీ కన్నులతో మిటకరిస్తుండగా, కాష్మోరా లేచి ఒళ్ళు విరుచుకుంటుండగా…

“ఢాకిని ఢక్క ముక్కల చక్క డంబో తినిపిస్తాన్
తాటకివనిపిస్తే తాటను వొలిచేస్తాన్
గుంటరి నక్క డొక్కల చొక్కా అంబో అనిపిస్తాన్
నక్కను తొక్కిస్తాన్ చుక్కలు కక్కిస్తాన్
రక్కిసమట్ట తొక్కిస బుట్ట పంబే దులిపేస్తాన్
తీతువు పిట్ట ఆయువు చిట్టా నేనే తిరగేస్తాన్
అస్త్రాయా ఫట్ ఫట్ ఫట్ ఫట్ వస్త్రాయ జట్ జట్ జట్ ఫట్…”

అని బ్యాక్ గ్రౌండ్లో ఆడియో భీకరంగా వినపడుతుండగా సమైక్య పిశాచ శంఖారావానికి పిలుపునిచ్చాయి!…………. By….. పమిడికాల్వ మధుసూదన్

Follow Us


Share this Article


Search On Site

Advertisement

Latest Articles

  • కరోనా రావచ్చు పోవచ్చు… కానీ కరోనా ట్యూన్ మాత్రం చస్తే వదలదు…
  • ఓహ్ బేబీ రజినీ చాంది..! నెట్ ట్రోలర్స్‌కు దొరికింది తాజా ‘ఏజ్ బార్ బకరీ’..!
  • ఫేస్‌బుక్ వేదికగా ఈ కలెక్టర్‌కు వేలాది మంది విభిన్న వీడ్కోలు..!
  • 2021లో మహావిపత్తులు..? డోన్ట్ వర్రీ..! ఆ రాతలన్నీ చదివి నవ్వుకొండి..!
  • చదివితే సింగిల్ కాలమ్ వార్త… వార్తాంశంలోని స్పూర్తి అంతులేనంత…!
  • సుమ..! కేవలం సోలో షో..! కాదంటే ఫ్లాపే… ఇదీ తాజా ఉదాహరణ…!!
  • KCR వేస్ట్, వేస్టున్నర… సరే… కానీ అది తేల్చాల్సింది ఈ దరిద్రపు సర్వేనా..?!
  • కంగనా భలే ఎంపిక..! ఆమె ఆ క్వీన్ కేరక్టరే ఎందుకు తీస్తున్నదంటే..?
  • కరోనా అనువాద వాణిజ్య ప్రకటనల్లో హాస్యం బాగా పండును…!
  • ‘చిన్నమ్మ పథకం’… సమయానికి జగన్‌ను గోమాతలా ఆదుకుంది…!

Archives

Copyright © 2021 · Muchata.com · Technology Support by Rishi Bharadwaj

Add Muchata to your Homescreen!

Add Now