Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

header-new-unit-muchata.com
  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కొత్త బీజేపీ కనిపిస్తోంది… టీఆర్ఎస్‌పై ‘స్వస్తిక్ ముద్ర’ వేసింది…

December 4, 2020 by M S R

ఇప్పుడున్నది ఒకప్పటి బీజేపీ కాదు… అది క్లియర్…! విషయం ఏదైనా సరే, టీఆర్ఎస్‌కు ముకుతాడు వేస్తాం అన్నట్టుగా దూకుడు ప్రదర్శిస్తోంది… తెలంగాణ ఎన్నికల సంఘం హడావుడిగా అర్ధరాత్రి ఓ విచిత్ర, వివాదాస్పద ఉత్తర్వు జారీ చేస్తే… తెల్లవారే హైకోర్టు తలుపుతట్టి, హౌస్ మోషన్ పిటిషన్ వేసింది… పది గంటలకల్లా హైకోర్టు ఆ పిటిషన్ విచారించి… ఎన్నికల సంఘం ఉత్తర్వులను తోసిపుచ్చింది… తొలి రౌండ్ ఫలితం కూడా రాకముందే ఈ తీర్పు వచ్చేయడం ఓ విశేషమే… మొదటి నుంచీ ఈ రాష్ట్ర ఎన్నికల సంఘం టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పినట్టల్లా ఆడుతున్నదని విమర్శిస్తున్న బీజేపీ మరోసారి తన వాదనను పరోక్షంగా నెగ్గించుకున్నట్టయింది…

ఏదైనా బ్యాలెట్ చెల్లుబాటు సందేహాస్పదంగా అనిపిస్తే, కౌంటింగ్ సిబ్బంది అక్కడున్న పార్టీల కౌంటింగ్ ఏజెంట్లకు చూపిస్తారు… రెండు గుర్తుల నడుమ స్వస్తిక్ గుర్తు పడినా సరే చెల్లని వోటుగా పరిగణనలోకి తీసుకుని పక్కన పడేస్తారు… ఒక్కో వోటు విలువ అలా ఉంటుంది… కనీకనిపించనట్టుగా ముద్ర పడినా సరే పక్కన పెట్టేస్తుంటారు… అలాంటిది రాష్ట్ర ఎన్నికల సంఘం అర్ధరాత్రి హడావుడిగా ఆదేశాలు జారీచేస్తూ… స్వస్తిక్ ముద్ర గాకుండా మరే ముద్ర ఉన్నా సరే పరిగణనలోకి తీసుకోవాలని చెప్పడం విస్మయకరమే…

ఏ ముద్ర కనిపించినా సరే, చెల్లుబాటు అనే పక్షంలో మరి స్వస్తిక్ ముద్రలు ప్రత్యేకంగా ఎందుకు పంపిణీ చేయడం..? స్వస్తిక్ గుర్తు ఎంచుకోవడం, అది కచ్చితంగా, స్పష్టంగా ఏ గుర్తు మీద పడుతుందో దాన్నే చెల్లుబాటులోకి తీసుకోవాలని ఆదేశించడం… ఓ పద్ధతి కోసం…! అలా గాకుండా పెన్నుమార్క్ ఉన్నా సరే చెల్లుతాయని ఆదేశిస్తే… ఏ ముద్ర ఉన్నా సరే, చెలామణీ అవుతాయని చెబితే… ఇక ఈ ప్రత్యేక సిరా దేనికి..? ఈ స్వస్తిక్ మార్క్ దేనికి..? ఈ విస్మయాలు సగటు వోటరులోనూ కలగడం సహజం…

అసలే పోలింగ్ చివరి గంటలో టీఆర్ఎస్, మజ్లిస్ రిగ్గింగుకు పాల్పడ్డాయని… ఆఖరి గంటలో 10 శాతానికిపైగా పోలింగ్ శాతం నమోదు కావడం దానికి సంకేతమని బీజేపీ విమర్శిస్తోంది… ఇక ఈ స్వస్తిక్ ఉత్తర్వులతో బీజేపీకి చిర్రెత్తింది… కోర్టుకు వెళ్తామని రాత్రే బండి సంజయ్ స్పందించాడు… అన్నట్టుగానే కోర్టుకెక్కింది పార్టీ… తన వాదనను నెగ్గించుకుంది… అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో ఉన్న తమ కౌంటింగ్ ఏజెంట్లకు వెంటనే హైకోర్టు ఆదేశాలు చేరేలా చూసుకుంటే… ఇలాంటి వివాదాస్పద వోట్లపై అభ్యంతరాలు లేవనెత్తే చాన్స్ బీజేపీకి ఏర్పడుతుంది…

హైకోర్టు కూడా స్థూలంగా ఈ ఆదేశాలను తిరస్కరించలేదు… ఒకవేళ ఏదైనా డివిజన్‌లో కొన్ని ఓట్ల తేడా ఉండి, అక్కడ పెన్ మార్కు లేదా స్వస్తికేతర ముద్రలు ఉన్న బ్యాలెట్స్ ఉంటే… అవి గెలుపోటముల డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉంటే, అప్పుడు ఎన్నికల రూల్ బుక్ ప్రకారం ఆ ఓట్ల గురించి ఆలోచిద్దాం, అప్పటివరకు ఆ డివిజన్ల ఫలితం వాయిదా వేయాలని చెప్పింది… ఇదీ మరో ప్రాథమిక సమాచారం… ఈమేరకైనా బీజేపీకి రిలీఫే…

నిజానికి ఎన్నికల సంఘం ఎందుకీ ఆదేశాలు ఇచ్చినట్టు..? దీని ఆంతర్యం ఏమిటో ఎవరికీ అంతుపట్టడం లేదు… ఏదో తిరకాసు ఉందని బీజేపీ సందేహిస్తోంది తప్ప, ఇదుగో దీనికోసం ఈ ఉత్తర్వులు జారీచేశారని అది కూడా చెప్పలేకపోతోంది… ఎన్నికల సంఘం చట్టబద్ధంగానే, గతంలో ఉన్న ఉత్తర్వుల ప్రకారమే ఈ అర్ధరాత్రి ఉత్తర్వులు జారీచేయవచ్చుగాక… కానీ స్వస్తిక్ మినహా ఇక ఏ ముద్రకూ చెల్లుబాటు లేదని హైకోర్టు తేల్చేసింది… కౌంటింగ్ ఏర్పాట్ల సమీక్ష సందర్భంగా కొందరు ఆఫీసర్లు ‘ఒకవేళ స్వస్తిక్ ముద్ర గాకుండా వేరే ముద్ర కనిపిస్తే ఏం చేయాలి..?’ అని అడిగారు కాబట్టి ఇలా క్లారిటీ ఇచ్చాం అని ఎన్నికల సంఘం చెప్పుకుంది… కానీ స్వస్తిక్ ముద్ర గాకుండా వేరే ముద్ర ఎందుకు కనిపిస్తుంది..? అనే అంశంపై లోతుగా వెళ్లాలి కదా…

ప్రతి పోలింగ్ కేంద్రానికి సరిపడా స్వస్తిక్ ముద్రలు, ఇంక్ ప్యాడ్లు ఇచ్చినప్పుడు… వేరే ముద్రలు ఎందుకొస్తాయి..? అసలు ఆ ప్రశ్నే ఎందుకు ఉత్పన్నమవుతోంది..? ఇది కదా అసలు ప్రశ్న… అది వదిలేసి, ఏ ముద్ర పడినా సరే అనే హడావుడి ఆదేశాలు ఎందుకు ఇచ్చినట్టు..? మొత్తానికి హైకోర్టు ద్వారా ‘స్వస్తిక్ ముద్ర’ వేయించుకున్నట్టయింది… అది పరోక్షంగా టీఆర్ఎస్‌ను బదనాం చేయడానికి బీజేపికి మరో అస్త్రం అందించినట్టయింది… (అధికారికంగా, సాంకేతికంగా ఎన్నికల సంఘానికీ, ప్రభుత్వానికీ ప్రత్యక్ష సంబంధం లేకపోయినా సరే… ఎన్నికల సంఘంపై బీజేపీ వరుస విమర్శలు చేస్తున్నందున ఈ పిటిషన్‌కూ, ఈ అర్ధరాత్రి ఆదేశాలకు, హై కోర్ట్ స్పందనకి ఇంత ప్రాధాన్యం ఏర్పడింది…)

అన్నట్టూ… ఎన్నికల సంఘం అర్ధరాత్రి ఆదేశాల వార్తను కూడా రాసుకోలేకపోయిన పత్రికలు కనీసం సిగ్గుపడతాయా..?

అవునూ… తదుపరి న్యాయపోరాటం ఎక్స్ అఫిషియో వోట్ల భారీ సంఖ్యపైనేనా..? కాంగ్రెస్ పార్టీకి ఏమైనా అర్థం అవుతోందా…?

Follow Us


Share this Article


Search On Site

Advertisement

Latest Articles

  • ఇక అందరినీ బాలయ్య ఆవహించేస్తున్నాడు… చూశావా సంచయితా..?
  • మరో కార్తీకదీపం..! కథ కాదు, చేదు నిజం… టీవీ కథను మించిన ట్విస్టులు…
  • వుమెన్స్ డే..? ఓ నిజ స్ఫూర్తి కథనం ఇదుగో… ‘‘అంతిమ మిత్రురాలు..!!
  • జెమినిలో జూనియర్..! ‘మీలో ఎవరు కోటీశ్వరులు’ హోస్టింగు తప్పా..? ఒప్పా..?!
  • వేల కోట్ల బాస్ జారిపడ్డాడా, పడేయబడ్డాడా..? గతంలో కొడుకు హత్య… ఇప్పుడు..?!
  • దంచు దంచు… నీ దంచుడు దక్కిన నాదెంత భాగ్యమో… (పార్ట్-2)…
  • ఘన సాహితీమూర్తులు… ఈర్ష్య, అసూయ తిట్లకు కాదెవరూ అతీతులు…
  • అప్పుడు హీరో క్రీజులోకి దిగి… హాకీ స్టిక్‌తో విలన్లను కబడ్డీ ఆడేసుకుంటాడు…
  • సువిశాల హృదయుడు మోడీ చక్రవర్తి..! ప్రత్యర్థులనూ ప్రేమించు దయా సముద్రుడు..!!
  • చాగంటి రాధాకృష్ణ స్వామి భలే చెప్పాడు… ఈ రాతలూ కలియుగధర్మమే…

Archives

Copyright © 2021 · Muchata.com · Technology Support by Rishi Bharadwaj

Add Muchata to your Homescreen!

Add Now