Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

స్టార్ హోటల్ అంటే ఇదీ..! స్టార్లలోకి తీసుకెళ్లి ఆతిథ్యం ఇస్తారు..!!

March 5, 2021 by M S R

అనంతమయిన హోటల్ ఆకాశం!
అంతరిక్షం టోటల్ మీకోసం!!
——————-

ఆకాశం, గగనం, శూన్యం- అని సంస్కృత ప్రామాణిక నిఘంటువు అమరకోశం ఆకాశాన్ని ఆకాశానికెత్తుతూ ఎన్నెన్నో పదాలతో హారతి పట్టింది. నిజమే. రామ- రావణ యుద్ధాన్ని దేనితో పోల్చాలో తెలియక- అంతటి ఆదికవి వాల్మీకి- ఆకాశానికి ఆకాశమే పోలిక. సముద్రానికి సముద్రమే పోలిక. రామ- రావణ యుద్ధానికి రామ-రావణ యుద్ధమే పోలిక అన్నాడు. అందరికీ, అన్నిటికీ అవకాశం కల్పించేదే ఆకాశం. గ్రహాలు కూడా ఆకాశంలో స్థిర కక్ష్యల్లో కక్షలు కార్పణ్యాలు లేకుండా బుద్ధిగా తిరగడానికి అవకాశం కల్పించినది ఆకాశం. విశ్వ విఖ్యాత శాస్త్రవేత్త ఐన్ స్టీన్ చెప్పిన
E=mc^2 మాస్ ఎనర్జీ ఈక్వలైన్స్ ఫార్ములాకు అవకాశం కల్పించినది కూడా ఆకాశమే. ఆకాశమంతా శూన్యంగా కనిపిస్తున్నా- ఆ శూన్యంలో శక్తి ఉంది. ఇంతకంటే లోతుగా వెళ్లడానికి ఇది భౌతికశాస్త్ర పాఠం కాదు.

Ads

మనం నిలబడిన భూగోళం, మన కంటికి కనిపించే సూర్య చంద్రులు ఇతర గ్రహాల గురించే ఖగోళ శాస్త్రం మాట్లాడుతుంది. ఇలాంటి బ్రహ్మాండాలు అనేకం ఉన్నాయంటుంది వేద విజ్ఞానం. ఒక సూర్యుడు కాదు- అనేక సూర్య మండలాలు అంటుంది. విరాట్ పురుషుడు ఎక్కడిదాకా విస్తరించాడు అంటే ఆకాశంలో ఎంతెత్తుకు వెళ్లినా, ఇంకా ఇంకా విస్తరించి ఉంటాడట.

“రవిబింబం బుపమింపఁ బాత్ర మగు ఛత్రం బై శిరోరత్న మై
శ్రవ ణాలంకృతి యై గళాభరణ మై సౌవర్ణ కేయూర మై
ఛవిమ త్కంకణ మై కటిస్థలి నుదంచ ద్ఘంట యై నూపుర
ప్రవరం బై పదపీఠ మై వటుఁడు దా బ్రహ్మాండమున్ నిండుచోన్”

వామనుడు త్రివిక్రముడై బ్రహ్మాండాలన్నీ నిండిపోయినపుడు భాగవతంలో పోతన చెప్పిన పద్యమిది. త్రివిక్రముడికి సూర్యుడు మొదట గొడుగుగా కనిపించినవాడు- ఆయన పైపైకి ఎదిగేకొద్దీ నుదుటి బొట్టుగా, చెవిపోగుగా, మెడ హారంలో కొలికిపూసగా, భుజకీర్తిగా, నడుముకు ఆభరణంగా, కాలి మంజీరంగా, చివరికి ఆయన పాదానికి పీఠంగా మారిపోయాడట. అంతటి సూర్యుడిని కాలికింద పీటగా చేసుకుని విశ్వమంతా ఎదిగి నిలిచిన పద్యమిది. కారణజన్ముడు మన పోతన మాత్రమే రాయగల పద్యమిది. బ్రహ్మాండాలు దాటి తెలుగు పద్యం విస్తృతి, అనంత తత్వాన్ని నాలుగు పాదాల్లో నాలుగు యుగాలకు నిలిపిన పద్యమిది. మన ఆచారం ప్రకారం భూమ్యాకాశాలు పూజింపదగినవి.

space hotel

మనుచరిత్రలో ప్రవరాఖ్యుడికి సిద్ధుడు పసరు ఇవ్వగానే కాలికి పూసుకుని రివ్వున ఎగిరిపోయాడు. యక్ష కిన్నెర కింపురుష గంధర్వులు ఆకాశమార్గంలో నిరంతరం తిరగగలరు. నారదుడు రోజూ ముల్లోకాలను చుట్టి రాగలడు. ఆయన్ను పాస్ పోర్ట్, వీసా, స్టాంపింగ్ అడిగే దేవదానవులు ఇప్పటిదాకా పుట్టలేదు. ఇక పుట్టరు.

Ads

ఆకాశంలో తేలుతూ, ఊగుతూ, సాగిపోవాలన్న కోరిక ఈనాటిది కాదు. ఆకాశంలో ఒక హోటల్ కట్టి, ఆ హోటల్ ను అంతరిక్షంలో తిప్పుతూ ఉంటామని అమెరికాకు చెందిన ఒక కంపెనీ ప్రకటించింది. 2027 నాటికి అందుబాటులోకి వచ్చే ఈ అంతరిక్ష హోటల్ జెయింట్ వీల్ ను పోలి ఉంటుంది. ఒకసారి నాలుగు వందల మంది బస చేయడానికి గాజు గదులు ఉంటాయి. రూమ్ లో కిటికీ కర్టెన్ తీయగానే చంద్రుడితో బాతాఖానీ పెట్టుకోవచ్చు. నక్షత్రాలకు నీళ్లు పోయవచ్చు. సూర్యుడి నోట్లో థర్మా మీటర్ పెట్టి వేడి ఎంత ఉందో చూడవచ్చు. సూర్యుడిని మింగడానికి రాహువు వస్తే మనం కిటికిలోనుండి చెయ్ అడ్డు పెట్టవచ్చు. చచ్చి స్వర్గానికో, నరకానికో వెళ్లే వారితో కులాసాగా మాట్లాడుకోవచ్చు. పిజ్జాలో, బ్లడీ బర్గర్లో పిండాలుగా వారి చేత పితృ దేవతలకు డైరెక్ట్ గా పంపవచ్చు. ఇంకా పైపైనే ఎన్నెన్నో అడ్వాంటేజ్ లు పిండుకోవచ్చు. భూమి మీదికి దిగడం ఇష్టం లేకపోతే- పై నుండి పైకే పోవచ్చు!………. By…. పమిడికాల్వ మధుసూదన్

Share this Article






Advertisement

Search On Site

Latest Articles

  • లక్ష కోట్ల అవినీతి… ప్రతి రాజకీయ ప్రచారానికీ ఓ లెక్క ఉంటుంది…
  • ఆ ఫ్లాట్లలోనే మగ్గిపోకుండా… స్విగ్గీలు అయిపోకుండా… కాస్త కిందకు దిగండి…
  • పవన్ కల్యాణ్ బెటరా..? జూనియర్ బెటరా… తేల్చుకోవాల్సింది చంద్రబాబే…
  • గ్రూప్ వన్ నియామకాల వైఫల్యం… కేసీయార్ పాలనకు చేదు మరక…
  • పండితపుత్రుడు ట్రూడా… ఇండియాతో గోక్కుని ‘దెబ్బ తినేస్తున్నాడు…’’
  • సినిమాగా ‘పర్వ’… ఆదిపురుష్‌లాగే తీస్తే అడ్డంగా తిరస్కరించడం ఖాయం…
  • Petal Gahlot… పాకిస్థాన్ అధ్యక్షుడిని కబడ్డీ ఆడేసుకుంది… అసలు ఎవరీమె..?!
  • మందు ఎక్కితే… ఆంగ్లం దానంతటదే తన్నుకుని వస్తుంది అదేమిటో గానీ…
  • బాబు గారూ… మీకు చౌతాలా వయస్సు, జైలుశిక్ష గురించి ఏమైనా తెలుసా..?!
  • సొసైటీ మీద పడి కోట్లు దండుకుని బతికే వాళ్లతో… సొసైటీకి జీరో ఫాయిదా…

Archives

Copyright © 2023 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions