అంతే…. నల్లధనంలోనూ మనమే నంబర్ వన్……… ఏమిటీ పిచ్చి స్టేట్ మెంట్ అని అప్పుడే తిట్టేసుకోకండి…. కేంద్ర ప్రభుత్వం ఓ స్కీమ్ పెట్టింది తెలుసు కదా… ఐడీఎస్… అంటే, స్వచ్ఛందంగా నల్లధనాన్ని వెల్లడించే పథకం అన్నమాట…. వాళ్లేమీ పట్టుకోరు… ఎవ్వరినీ ఏమీ అనరు… వాళ్లకన్నీ తెలుసు… ఎవరెవరి దగ్గర ఎన్ని లక్షల కోట్లున్నాయో తెలుసు? కానీ ఈగ వాలనివ్వరు కదా… మన ఆదాయపు పన్ను శాఖ అంటేనే అంత…. వాళ్ల కసి, కక్ష, కోపం, అసహనం అంతా పాపం, నెలజీతగాళ్ల పైనే….
ఈ పథకం పెట్టాక మొత్తం దేశంలో 65,250 కోట్ల నల్లధనం బయటకి వచ్చినట్టు కేంద్రం గొప్పగా…. సారీ, ఘొప్ఫగా ప్రకటించింది… అక్కడికి అదేదో సాధించేసినట్టుగా!! మొత్తం నల్లధనంలో అది వీసమెత్తు కాదు, ఈక మందమూ కాదు…. అదేదో పాకిస్థాన్ సర్జికల్ దాడులు చేసినట్టు ఈజీ పని అనుకున్నట్టుంది…….. సరే, అది వదిలేయండి…. ఇలా నల్లధనం వెల్లడించిన నగరాల్లో హైదరాబాద్ నంబర్ వన్ అట…
64,275 మంది ఇలా నల్లధనం వెల్లడించారూ అంటే…. తలా ఓ కోటి రూపాయలు వెల్లడించారన్నమాట…. పెద్ద ప్రహసనం అనిపించడం లేదూ… సరే, ఇదైనా నయమే కదా అంటారా? వోకే…. అందులో 13,000 కోట్ల నల్లధనాన్ని వెల్లడించి హైదరాబాద్ అగ్రస్థానంలో ఉండగా, 8500 కోట్లతో ముంబై, 6000 కోట్లతో ఢిల్లీ తరువాత స్థానాాల్లో ఉన్నాయట…. గ్రేటే… అన్నట్లు, ఆ మొత్తంలో 45 శాతం కేంద్ర ప్రభుత్వానికి ఆదాయంగా వచ్చేసినట్టే….
అయితే ఇక్కడ ఓ ట్విస్టు ఉంది… స్వచ్ఛందంగా నల్లధనాన్ని ఎంతో కొంత, అన్ని నగరాలకన్నా మిన్నగా బయటపెట్టినందుకు మనకు మనం మెచ్చుకోవాలా? లేక అన్ని నగరాల్లోకన్నా ఇక్కడే నల్లధనం బాగా పోగైనట్లు భావించాలా? ఇదో ధర్మసందేహం….
ఎందుకంటే… ఓ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ సంవత్సరం విపరీతంగా క్రైమ్ నమోదైందట… డీజీపీ పిలిచి బండబూతులు తిట్టాడట… ఏం చేస్తున్నారు మీరంతా? గాడిదలు కాస్తున్నారా? అని ఎక్కేశాడుట…. ‘‘అయ్యా, గతంలో కనీసం ఆ నేరాలు నమోదు కూడా కాకపోయేవి… మేం నమోదు చేస్తున్నాం… అంతే తేడా…’’ అని చెప్పారట ఆ స్టేషన్ బాధ్యులు….
విషయం అర్థమైందీ అనుకుంటాను!!