ఆర్టీసీ కార్మికుల సమ్మె చట్టవిరుద్ధమా, కాదా..? చట్టవిరుద్ధం అయితే ప్రభుత్వానికి ఉండే హక్కులేమిటి…? అసలు ఆర్టీసీ అనేది కేవలం ఒక పబ్లిక్ యుటిలిటీ సర్వీసు (ప్రజలకు సంబంధించిన ఓ సేవ) మాత్రమేనా..? దీన్ని అత్యవసర సేవల (ఎసెన్షియల్ సర్వీస్) కింద పరిగణించవచ్చా..? ఎస్మాను ప్రయోగించే అధికారం ప్రభుత్వానికి ఉందా..? అసలు చట్టవిరుద్ధమో కాదో ప్రకటించే అర్హత, అధికార పరిధి హైకోర్టుకు ఉందా..? అసలు ఎస్మా పరిధిలోకి ఆర్టీసీ వస్తుందా..? అసలు టీఎస్ ఆర్టీసీ ఏర్పాటుకే చట్టబద్ధత లేనప్పుడు మిగతావన్నీ చట్టవిరుద్ధాలే అవుతాయి కదా..? ఇదుగో ఇన్నిరకాల ప్రశ్నలతో హైకోర్టులో ఆర్టీసీ విచారణ కొత్తకొత్తగా ఇంట్రస్టింగుగా సాగుతున్నది… నిన్న హైకోర్టు విచారణ సందర్భంగా,.. ‘‘సమ్మె విరమించండి లేదా చర్చలు జరపండి అని ఎవరికీ చెప్పే పరిస్థితి లేదిప్పుడు..’’ అని వ్యాఖ్యానిస్తూనే… అసలు ఆర్టీసీ ఎస్మా పరిధిలోకి వస్తుందా..? సమ్మె చట్టవిరుద్ధమని హైకోర్టు ప్రకటించవచ్చునా అని సీనియర్ న్యాయవాది విద్యాసాగర్‌ను అడిగింది… ప్రకటించవచ్చుననీ, ఆర్టీసీ ఎస్మా పరిధిలోకి వస్తుందని తను చెప్పాడు… కానీ ఆర్టీసీ ఎస్మా పరిధిలోకి వస్తుందనే జీవో ఏమైనా ఉందా అనడిగితే పిటిషన్‌దారు తరఫు న్యాయవాది చూపించలేదు… సమయానికి తన దగ్గర అది ఉండకపోవచ్చు… సో, ఈరోజుకు విచారణ వాయిదా వేసింది కోర్టు… ఈరోజు కూడా అదే చర్చ ఇంకాస్త ఇంట్రస్టింగుగా సాగింది…
మళ్లీ సీనియర్ లాయర్‌ను అడిగింది కోర్టు… సమ్మె చట్టవిరుద్ధమని ప్రకటించే అధికారం, అర్హత, పరిధి హైకోర్టుకు ఉన్నాయనీ, ఆర్టీసీని కూడా 1998 సంవత్సరంలో ఎస్మా పరిధిలోకి చేర్చారని ఆయన గుర్తుచేశాడు… కానీ 1998లో ఉత్తర్వులు ఏపీఎస్ఆర్టీసీకి మాత్రమే వర్తిస్తాయి కదా అని హైకోర్టు సందేహం… 2015లో కూడా అలాంటి జీవో ఇచ్చారని చెబుతూ, తన దగ్గర ఉన్న జీవో కాపీని కూడా ఇచ్చాడు… అవును, నిజమే… కానీ 2015లో ఎస్మా పరిధిలోకి చేర్చిన మాట నిజమే, కానీ అది ఆరు నెలలకు మాత్రమే వర్తిస్తుంది కదా, ఇప్పుడు ఆ జీవో చెల్లుబాటులో లేనట్టే కదా అన్నది… అదీ పాయింటే… ఎస్మా పరిధిలో ఒక సంస్థ గానీ, ఒక సర్వీసు గానీ లేనప్పుడు, దానిపై ఎస్మాను ఎలా ప్రయోగిస్తారు అనేది ప్రశ్న… హైకోర్టు కూడా చట్టం పరిధుల్ని దాటి పోలేదని గుర్తుచేస్తూ… అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారంటూ సమ్మెను చట్టవిరుద్ధంగా ప్రకటించలేమని తేల్చింది…
ఈ సమస్యను ప్రభుత్వం, ఆర్టీసీ పీటముడిలా మార్చేసిన సంగతి తెలుసు కదా… కేసీయార్ బెదిరింపులతో సంస్థ మనుగడపై సందేహాలతో ఆర్టీసీ కార్మికుల తాడోపేడో అన్నట్టుగా సమ్మె కొనసాగిస్తుండగా… ఇక ఆర్టీసీ ఖతం, గతం అన్నట్టుగా కేసీయార్ పట్టుదలగా ఉన్నాడు… మరి సమస్యకు పరిష్కారం ఏమిటి..? ఇదే డౌటు హైకోర్టుకూ వచ్చినట్టుంది… ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో ఓ కమిటీ వేస్తామని, దీనిపై ప్రభుత్వం స్పందన ఏమిటో చెప్పాలని అడ్వొకేటు జనరల్‌కు సూచించింది… సో, మళ్లీ వాయిదా… సో, ఇంకా జాప్యం అనివార్యం… తాత్కాలికంగా తమ ఆందోళనల్ని నిలిపేసిన ఆర్టీసీ కార్మికుల స్పందన ఏమిటో చూడాలి…