ఓ పెళ్లి మంటపం… టేబుళ్లపై భోజనాలు… మొదటి బంతి పూర్తి కాగానే ఈ భోజనవ్యవహారాలు చూసే పెళ్లిపెద్ద మొత్తం అరిటాకుల్నీ వరుసగా పరిశీలిస్తూ వెళ్లాడు…పెళ్లికి వచ్చినవాళ్లు ఏయే ఫుడ్ ఐటమ్స్ ఎక్కువగా వదిలేశారో గుర్తించాడు… వాటిని టేస్ట్ చేసి, లోపాలేమిటో తెలుసుకున్నాడు… రెండో బంతి భోజనాలకు కూర్చునేలోపు అక్కడ వంటలు చేసేవాళ్లకు కొన్ని మార్పులు చెప్పాడు… సో, రెండో బంతి తరువాత చూస్తే వదిలేసిన ఫుడ్ ఐటమ్స్ చాలా తగ్గిపోయాయి… ఇక్కడ ఉద్దేశం ఏమిటీ..? ఫుడ్ వేస్టేజీ తగ్గించడంతోపాటు… వచ్చిన అతిథి భోజనంలోని ప్రతి ఫుడ్ ఐటమ్ తృప్తిగా ఎంజాయ్ చేశాడా లేదా అనేది ప్రధానం… ఇక ఇంకో కథలోకి వెళ్దాం పదండి… గౌరవ్ దేవన్… ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఫుడ్, బేవరేజెస్ లాంజ్ ఆపరేట్ చేసే Travel Food Services కంపెనీకి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్లస్ బిజినెస్ హెడ్ ఆయన… ఏదో ఫ్లయిట్ ఆలస్యం అయితే అక్కడక్కడే తిరుగుతూ, పరిసరాలు గమనిస్తున్నాడు… తినగా మిగిలిన ఫుడ్ పారేసే డస్ట్ బిన్లు నిండిపోయి, ఓవర్ ఫ్లో అవుతున్నట్టు గమనించాడు… సాధారణంగా ఎప్పటికప్పుడు వాటిని పోర్టు సిబ్బంది క్లియర్ చేస్తుంటారు కాబట్టి ఎవరూ సరిగ్గా గమనించలేదు… మరీ అంతగా డస్ట్ బిన్లు నిండటం ఏమిటీ అనే సందేహం వచ్చింది ఆయనకు… ఎలాగూ ఫ్లయిటుకు ఇంకా టైముండటంతో, రెండు గ్లవుజు తెప్పించుకుని, తొడుక్కుని ఒక డస్ట్ బిన్ ఓపెన్ చేసి, ఆ చెత్తను చిందరవందర చేసి, పరిశీలించాడు… ఎక్కువగా ఏమేం ఫుడ్ ఐటమ్స్ డస్ట్ బిన్‌లో పడుతున్నాయో తెలుసుకోవాలని ఆ ప్రయత్నం…
ఆయనకేదో డౌటొచ్చింది, వరుసగా 3 రోజులపాటు ఓ ఇద్దరిని అక్కడే నియమించి, ఏమేం పారేస్తున్నారో తనకు రిపోర్టు ఇవ్వమన్నాడు… చివరకు తేలింది ఏమిటీ అంటే..? టేస్ట్ లేక కాదు, సప్లయ్ చేసే ఫుడ్డు ఐటమ్స్ ఎక్కువై, మొత్తం తినలేక ప్రయాణికులు వాటిని పారేస్తున్నారు… లేట్ నైట్ విమాన ప్రయాణికులకు పెట్టే ఫ్రీ ఫుడ్డు ఇలా ఎక్కువగా వేస్ట్ అవుతుంది… ఆ టైముకు ఎవరూ ఎక్కువగా తినరు, పైగా డెజర్ట్స్ (భోజనం తరువాత తీసుకునే తీపి పదార్థాలు) ఎక్కువగా పారేస్తున్నారు… అందరికీ ఒకేతరహా ఫుడ్ ఇస్తున్నారే తప్ప ఇన్నిరోజులూ ప్రయాణికులు ఏం తింటున్నారో, ఏం వదిలేస్తున్నారో ఎవరూ పట్టించుకోలేదు… తమకు ఎక్కువైన ఆహారాన్ని ప్రయాణికులు డస్ట్ బిన్లలో పడేస్తారే తప్ప ఫలానా ఫుడ్ ఐటమ్ ఎక్కువగా పెడుతున్నారు అని కంప్లయింటు చేయరు కదా…
తరువాత డెజర్ట్స్‌కు సంబంధించి కొన్ని మార్పులు చేశారు… ‘నేను డస్ట్ బిన్ పరిశీలించినప్పుడు ఎక్కువగా డెజర్ట్సే కనిపించాయి… డిన్నర్‌లో 15 రకాలు అందుబాటులో పెట్టేవాళ్లం… ప్రయాణికుడు రెండో మూడో, లేదా నాలుగో తీసుకుంటున్నాడు… ఒక చెంచా, రెండు చెంచాలు తినేసి, మిగతాది పారేస్తున్నాడు… వెరయిటీలు టేస్ట్ చేస్తున్నారు తప్ప, తీసుకున్నది పూర్తిగా ఎంజాయ్ చేయడం లేదు…’ అంటున్నాడు దేవన్… ఈ డస్ట్ బిన్ పరిశోధన తరువాత 15 వెరయిటీలకు బదులు ఏకంగా 18 వెరయిటీలను స్టార్ట్ చేశారు… కానీ తక్కువ మొత్తాల్లో… జనం ఎక్కువగా పారేస్తున్న రకాలను వదిలేశారు… వాటి బదులు చిన్న సైజున్న మాకరాన్లు, కప్ కేకులు పెట్టసాగారు… రైస్, చపాతీ, కరీ, సలాడ్… ఇలా ప్రతి అంశంలోనూ ఆ డస్ట్ బిన్ అనాలిసిస్ ద్వారా మార్పులు చేశారు…
ఒక ఏడాదిలో ఒక్క ముంబై ఎయిర్ పోర్టులోనే కోటీ 20 లక్షల రూపాయల సేవింగ్ వచ్చింది… అదీ ఒక్క డెజర్ట్స్ ఖర్చులో… ఈ దేవన్ వాళ్ల కంపెనీకి దేశంలోని 19 సిటీల్లో 280 ఫుడ్ ఔట్ లెట్స్ ఉన్నయ్… ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నయి పోర్టుల్లోనూ ఫుడ్ లాంజులు వాళ్లవే… ఈ ముంబై డస్ట్ బిన్ అనాలిసిస్ తరువాత ప్రతిచోటా ఇదే అనాలిసిస్ స్టార్ట్ చేశారు… ఏరియాల వారీగా కూడా ప్రయాణికుల ఫుడ్ అలవాట్లు వేర్వేరుగా ఉంటాయి కదా… ఈ సంవత్సరం చిన్న చిన్న మార్పులతో నాలుగైదు కోట్ల సేవింగ్ అంచనా వేస్తున్నారు… దేవన్ దీంతో ఊరుకోలేదు… కిచెన్లలోని డస్ట్ బిన్ల అనాలిసిస్ చేయించాడు… అవసరం లేకపోయినా ఏమేం ఎక్కువగా వండుతున్నారో, ఏం పారేస్తున్నారో దీంతో అర్థమైంది… అక్కడా మార్పులు స్టార్ట్… మొత్తమ్మీద అన్ని ఔట్ లెట్లు, కిచెన్లు కలిపి ఏడెనిమిది కోట్ల మేరకు సేవింగ్ అంచనా వేస్తున్నారు ఇప్పుడు… వారెవ్వా… తన సూక్ష్మ పరిశీలన ద్వారా ఒకేసారి కస్టమర్ సంతృప్తినీ, ఫుడ్ వేస్టేజీని, ఖర్చులో ఆదాను, కంపెనీకి మరింత మార్జిన్‌ను సాధించేశాడన్నమాట… నీలాంటోళ్లు ఉండాల్సిందే బాసూ ప్రతి కంపెనీలోనూ…!