‘‘…. మొత్తంమీద నాడు దొరలను ఎదిరిస్తే బతకలేని పరిస్థితి ఎలా ఉండేదో, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ధిక్కరిస్తే కూడా బతకలేని పరిస్థితి ఉంది. తెలంగాణలో ఇప్పుడు మనుగడ సాగించాలంటే కేసీఆర్‌కు జీ హుజూర్ అనాల్సిందే! లాల్ సలామ్, ఇంక్విలాబ్ జిందాబాద్ వంటి నినాదాలకు ఇప్పుడు కాలం చెల్లింది. అధికారానికి దాసోహం అనకపోతే మింగ మెతుకు కూడా పుట్టదు. గిట్టనివారు కేసీఆర్‌ను నియంత అనవచ్చు! ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలోనే కాదు.. మరెన్నో విషయాల్లో ఆయనే రైట్ అని అనిపించుకుంటున్నారు. సంఘటిత శక్తి అనే మాటకు ఇప్పుడు తావులేదు. ‘జై కేసీఆర్’ అని నినదిస్తే హాయిగా బతకవచ్చు. సో.. కేసీఆర్ గ్రేట్ అని అందరం ఒప్పుకొందాం ప్రస్తుతానికి!….’’——- ఇది ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ కొత్త పలుకులోని ఓ పార్ట్… నిజం…
ఇంకొకటి చెప్పుకుందాం… నవ తెలంగాణలో కనిపించిన ఒక వార్త…. ‘‘”ఒకడు చికెన్ బిర్యానీ తెచ్చుకున్నాడనుకో…చికెన్ ముక్క లాగేసుకుంటే, అన్నంలో పప్పు వేసుకొని తింటాడు. పప్పు లాక్కుంటే…చారు పోసుకొని తింటాడు. అదే అన్నం లాక్కుంటే కోపం వస్తుంది. అప్పుడు మనం ‘రైస్ ఫ్రీ’ అన్నామనుకో…ముందు లాక్కున్నవన్నీ మర్చిపోతాడు. అదే రాజకీయం అంటే” ఓ తెలుగు సినిమాలో గొల్లపూడి మారుతీరావు చెప్పే డైలాగ్ ఇది. ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల పరిస్థితి ఇలాగే ఉంది. 52 రోజుల పాటు సమ్మె చేసిన ఆర్టీసీ కార్మికులకు ఒక్క డిమాండ్‌ను కూడా పరిష్కరించకుండా, వారి కొలువులు వారికే ఇచ్చేసి…అదేదో ‘ఘనకార్యం’ చేసినట్టు ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నది…..
వర్తమాన రాజకీయాల్లో జనం పల్స్ తెలిసినవాడు కేసీయార్… అందులో ఏ డౌటూ లేదు… మొన్నమొన్నటిదాకా అరిగోస పెట్టిన కేసీయారే… ఇప్పుడు వాళ్లకు దేవుడిలా కనిపిస్తున్నాడు… కనిపించేలా చేసుకున్నాడు తను… యూనియన్ల కట్టు దాటకుండా, విధుల్లో చేరకుండా, నానా తిట్లూ తిట్టిన నోళ్లు ఇప్పుడు కేసీయార్‌కూ జైజై అంటున్నాయి… చప్పట్లు కొడుతున్నయ్… ఇక్కడే కేసీయార్ విజయం సాధించింది… నిజానికి వాళ్ల ప్రధాన డిమాండ్లయిన సర్కారులో విలీనం, జీతాల పెంపు వంటి ప్రధాన డిమాండ్లు ఎటో కొట్టుకుపోతున్నయ్… యూనియన్ల రెక్కలు కత్తిరించేశాడు… ఆ నేతలు డ్యూటీల్లో కనిపిస్తున్నారు… ఫో, రెండేళ్ల దాకా యూనియన్లు లేవు, గుర్తింపు ఎన్నికల్లేవు అంటున్నాడు తను… ఇంకేమన్నాడో తెలుసా..?
డిపోకు అయిదుగురిని పిలిచాడు… నన్ను మాత్రమే నమ్మండి అన్నాడు… ఈ యూనియన్లు, ఈ ప్రతిపక్షాలు మీకు నయాపైసా లాభం చేయలేవు అన్నాడు… మొన్నమొన్నటిదాకా ఏమేం చెప్పాడో అన్నీ రివర్స్… అందరూ చప్పట్లు కొట్టారు… కేసీయార్‌కూ జై అన్నారు… తను ప్రకటించిన నిర్ణయాలు ఏమిటో తెలుసా..?
1. ఆర్టీసీలో కండక్టర్లు, డ్రైవర్లను కార్మికులు అని పిలిచే పద్ధతికి స్వస్తి. అందరినీ ఉద్యోగులు అనే పిలవాలి. యాజమాన్యం, ఉద్యోగులు వేర్వేరు కారు. అందరూ ఒకటే, ఒకటే కుటుంబం లాగా వ్యవహరించాలి.
2. ఆర్టీసీ కార్మికులకు చెల్లించాల్సిన సెప్టెంబర్ నెల జీతాన్ని మంగళవారం (డిసెంబర్ 2న) చెల్లిస్తాం.
3. ఉద్యోగులు సమ్మె చేసిన 55 రోజులకు కూడా వేతనం చెల్లిస్తాం.
4. ఉద్యోగులు ఇంక్రిమెంట్ యధావిధిగా ఇస్తాం.
5. సమ్మె కాలంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబంలో ఒకరికి ఎనిమిది రోజుల్లో ఉద్యోగం ఇవ్వాలి. ప్రతీ కుటుంబానికి ప్రభుత్వం తరుఫున రెండు లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లిస్తాం.
6. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి బడ్జెట్లో ఆర్టీసీకి వెయ్యి కోట్లు కేటాయిస్తాం.
7. ఆర్టీసీ ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయస్సును 58 నుంచి 60 సంవత్సరాలకు పెంచుతాం.
8. ఆర్టీసీ ఉద్యోగులకు సంపూర్ణ ఉద్యోగ భద్రత ఉంటుంది.
9. సంపూర్ణ టికెట్ బాధ్యత ప్రయాణీకుడిపైనే ఉంటుంది. ఆ కారణంతో కండక్టర్లపై చర్యలు తీసుకోము.
10. కలర్ బ్లైండ్ నెస్ ఉన్న వారిని వేరే విధుల్లో చేర్చుకోవాలి తప్ప, ఉద్యోగం నుంచి తొలగించవద్దు.
11. మహిళా ఉద్యోగులకు నైట్ డ్యూటీలు వేయవద్దు. రాత్రి 8 గంటలకు వారు డ్యూటీ దిగేలా ఏర్పాట్లు చేయాలి
12. ప్రతీ డిపోలో కేవలం 20 రోజుల్లో మహిళల కోసం ప్రత్యేక టాయిలెట్లు, డ్రెస్ చేంజ్ రూమ్స్, లంచ్ రూమ్స్ ఏర్పాటు చేయాలి
13. మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులతో పాటు, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా మూడు నెలల పాటు చైల్డ్ కేర్ లీవ్స్ మంజూరు చేస్తాం.
14. మహిళా ఉద్యోగుల ఖాకీ డ్రెస్ తొలగిస్తాం. వారికి ఇష్టమైన రంగులో యూనిఫామ్ వేసుకునే వెసులుబాటు కల్పిస్తాం. పురుష ఉద్యోగులు కూడా ఖాకీ డ్రస్సు వద్దంటే వారికీ వేరే రంగు యూనిఫామ్ వేసుకునే అవకాశం కల్పిస్తాం.
15. మహిళా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి తగు సూచనలు చేయడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం.
16. రెండేళ్ల పాటు ఆర్టీసీలో గుర్తింపు యూనియన్ ఎన్నికలు నిర్వహించేది లేదు
17. ప్రతీ డిపోలో ఇద్దరు చొప్పున కార్మికులు సభ్యులుగా కార్మిక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తాం
18. ఉద్యోగుల తల్లిదండ్రులకు కూడా వర్తించేలా ఆర్టీసీలో హెల్త్ సర్వీసులు అందించాలి. కేవలం హైదరాబాద్ లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా అవసరమైతే ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందుకునేలా చర్యలు తీసుకోవాలి
19. ప్రతీ డిస్పెన్సరీలో ఉద్యోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేయాలి. మందుల కోసం బయటకు తిప్పవద్దు.
20. ఆర్టీసీ ఉద్యోగుల తల్లిదండ్రులకు ఉచిత బస్సు పాసులు అందించాలి.
21. ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు ఫీజు రీ ఎంబర్స్ మెంటు సౌకర్యం వర్తించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది.
22. ఉద్యోగుల పిఎఫ్ బకాయిలను, సిసిఎస్ కు చెల్లించాల్సిన డబ్బులను చెల్లిస్తాం.
23. డిపోల్లో కావాల్సిన స్పేర్ పార్ట్స్ ను సంపూర్ణంగా అందుబాటులో ఉంచుతాం.
24. ఆర్టీసీలో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులను వెంటనే పర్మినెంట్ చేస్తాం.
25. ఆర్టీసీ కార్మికుల గృహ నిర్మాణ పథకానికి ప్రభుత్వం రూపకల్పన చేస్తుంది.
26. ఆర్టీసీలో పార్సిల్ సర్వీసులను ప్రారంభించాలి….
ఓ పిట్ట కథ కూడా చెప్పాడు… ఆశ్చర్యం, సందేహం ఏముంది..? యూనియన్ల నేతలపైనే…! ‘‘ప్రతి పని చేసేటప్పుడు చెడగొట్టేవాళ్ళు ఉంటారు… రామాయణ యుద్ధం… యుద్ధంలో రామబాణం వల్ల అర్ధాయుష్షుతో మరణించిన రాక్షసులు కొందరు తమ పరిస్థితి ఏమిటని రాముణ్ణి అడిగినప్పుడు కలియుగంలో మీరు అక్కడక్కడా పుట్టండి అంటాడు రాముడు… అలా పుట్టిన వారే మనుషులను పీక్కుతింటున్నారని, వారే ఆర్టీసీలో అందరినీ ఇబ్బంది పెడుతున్నారు…’’ దెబ్బకు ప్రతిపక్షాలు, యూనియన్లు ఫసాక్…
ఆర్టీసీ ఉద్యోగులకు యాభై వేల జీతాలన్నాడు… ఇప్పుడు 20, 25 వేలు మాత్రమే అన్నాడిప్పుడు… జీతాలు డబ్బుల్లేవుపో అన్నాడు… సమ్మెకాలానికీ జీతం ఇస్తానుపో అన్నాడిప్పుడు… ఇక ఆర్టీసీని మోసే సీన్ లేదన్నాడు… ఏటా 1000 కోట్లు ఇస్తాం అంటున్నాడు ఇప్పుడు… బజారునపడితే పడండి, నాదేం పోయింది అన్నాడు… మీకు ఉద్యోగభద్రత గ్యారంటీ అంటున్నాడు ఇప్పుడు… అంతేనా..? జీతాల పెంపూ గీతాలూ జాన్తానై… మీ పదవీకాలమే రెండేళ్లు పెంచుతున్నానుపో అన్నాడు… అందరూ చప్పట్లు… ఈ దేవుడిని అనవసరంగా దూషించామే, ఎంత తప్పు చేశాం అన్నట్టుగా కన్నీళ్లు, చప్పట్లు… మరి నిజంగానే కేసీయార్ ఆర్టీసీ ప్రైవేటీకరణ నుంచి వెనక్కి తగ్గినట్టేనా..? తను చెప్పిన 50 శాతం ఆర్టీసీ, 30 శాతం ప్రైవేటు, 20 శాతం అద్దె బస్సులు ఫార్ములా లేనట్టేనా..? కేసీయార్‌లో ఈ మార్పుకి కారణం ఏమిటి..? అనుకున్నట్టుగా ఆలోచనలు అమలు చేయలేని స్థితి ఏమైనా ఏర్పడిందా..? సరే, ఏదైనా కానివ్వండి… ఆర్టీసీ నిలబడాలి… ప్రజారవాణా బాగుండాలి… అది కిలోమీటరుకు 20 పైసల చొప్పున ప్రజల జేబులకు చిల్లు కొట్టినా సరే…!!