‘కీర్తి చక్ర ‘ కు అపకీర్తి
*****************

జనవరి 15, 2000

వరంగల్ మూడవ అదనపు సెషన్ కోర్టు

జనశక్తి నక్సలైట్లలో చీలిక వర్గం (వీరన్న వర్గం) దళ కమాండర్ మందాటి వెంకన్న అలియాస్ గీరన్నకు ఎట్టకేలకు బెయిల్ మంజూరీ చేసింది. ఈయన అంతకు ముందటి ఏడాది 1999, ఆగస్టులో హనుమకొండలో చైత్యన్య డిగ్రీ కాలేజి యజమాని పురుషోత్తంరెడ్డిని డబ్బుల కోసం కిడ్నాప్ చేయగా, పోలీసులు పట్టుకొని కోర్టులో హాజరు పరిచారు. అరు నెలలుగా వరంగల్ జైల్లో ఉన్న అతనికి ఆత ర్వాత ఎట్టకేలకు బెయిల్ మంజూరు చేసింది…

*****
1998′ జూన్ 16
ములుగు, వరంగల్ జిల్లా, మున్సిఫ్ కోర్టు…
జనశక్తి వీరన్న వర్గం యాక్షన్ టీమ్ సభ్యులు శంకర్, గిరి ఇద్దరినీ మంగపేట పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. వీరు జనశక్తి దర్మన్న దళ కమాండర్ గుర్రాల హంసారెడ్డి నేతృత్వంలో వెంకటాపురం మండలం లక్ష్మీదేవీపేటలో ములుగు మాజీ ఎమ్మెల్యే సూర్యనేని రాజేశ్వరరావుకు చెందిన వరి కల్లంపై కరువు దాడి చేశారు. ఈ కేసులో కోర్టులో హాజరు పరచగా అసలు నిందితుడిని ఎందుకు పట్టుకోలేదని జడ్జి ప్రశ్నించగా, అతను ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో తలదాచుకున్నారు అని తెలియజేశారు. దీంతో వారికి బెయిల్ మంజూరీ చేసి అసలు నిందితుడిని పట్టుకోమని ఆదేశించారు…

అంతకు ముందటి ఏడాది ఏమి జరిగిందంటే…

********
15, మార్చి, 1997
రాష్ట్రపతి భవన్, న్యూ ఢిల్లీ
దేశ భద్రత కాపాడటంలో ప్రాణాలు కోల్పోయిన అమర జవానుల కుటుంబాలకు రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ కీర్తి చక్ర అవార్డ్  బహూకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అవార్డును అందుకున్న వారిలో అందరూ వీర జవాన్ల కుటుంబాల సభ్యులే అయినప్పటికీ ఒకే ఒక సాధారణ పౌరుని భార్యకు కూడా బహూకరించారు. ఆమె పేరు పూజారి మన్నెమ్మ, ఈమె పూజారి మాణిక్యం అనే వ్యక్తి భార్య. ఈమె భర్త నక్సల్స్ తో వీరోచితంగా పోరాడి వారిలో ఇద్దరినీ హతమార్చిన ఘటనలో అమరుడు అయ్యారు. అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, వరంగల్ జిల్లా, మంగపేట మండలం ,తిమ్మంపేట గ్రామానికి చెందినవాడు. ఏప్రిల్ 20, 1995 లో వారి గ్రామంపై జనశక్తి నక్సల్స్ దాడి చేయగా వారితో వీరోచితంగా పోరాడారు. ఇందులో పాల్గొన్న నక్సల్స్ నేతలు వెంకన్న, నాగన్నలపై ఊహించనివిధంగా ఎదురుతిరిగి గొడ్డలితో నరికి ఆ ఇద్దరినీ అంతమొందించారు. అయితే చివరకు ఈ దాడిలో పూజారి మాణిక్యం తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు.

ఒక సాధారణ పౌరుడు నక్సల్స్ పై జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోవడంతో అప్పటి చంద్రబాబునాయుడి ప్రభుత్వం అమర జవాన్లకు ఇచ్చే కీర్తిచక్ర అవార్డు కోసం కేంద్రానికి సిఫారసు చేసింది. చనిపోయిన వారిలో మాణిక్యం బీజేపీ కార్యకర్త కావడంతో అప్పటి వాజ్‌పేయ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, ఆ కీర్తి చక్ర పతకాన్ని అందజేసింది.

ఇక్కడ కట్ చేస్తే…అసలు ఏమి జరిగిందంటే… సంఘటన స్థలానికి వెళ్ళకుండానే స్థానిక పోలీసులు కట్టుకథ అల్లి పై అధికారులకు సమాచారం ఇచ్చారు. వాస్తవానికి నక్సల్స్ ఎవ్వరూ చనిపోలేదు. చనిపోయింది మాణిక్యం, వారి అన్న, మాజీ జెడ్పీ ఛైర్మెన్ పూజారి అది నారాయణ. కానీ వీరు ఇచ్చిన సమాచారాన్ని నిర్ధారించుకోకుండా కేంద్రానికి కీర్తి చక్రకు సిఫారసు చేశారు. అయితే… అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది.
*******


ఏ ఇద్దరు నక్సల్స్‌ను పూజారి మాణిక్యం మట్టుబెట్టాడని పోలీసులు నివేదికలు ఇచ్చారో… ఎవరిని చంపారని మాణిక్యానికి కీర్తిచక్ర ఇచ్చారో… ఆ నక్సల్స్ బతికే ఉన్నారు… కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు… అంటే పోలీసులు అత్యున్నత స్థాయిలోని దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతినే తప్పుదోవ పట్టించినట్టే కదా… ఈ పోలీసుల నిర్వాకం నాకు చెవిలో పడింది. వాళ్ళు బతికే ఉన్నారని వార్త రాస్తే ఎవ్వరూ నమ్మరు. ఎందుకంటే అమరులైన నక్సల్స్ పేర్లతో వేరే వాళ్లు కొనసాగుతూ ఉండటం మామూలే. అందుకే వారిని స్వయంగా కలిసి ఇంటర్వ్యూ ఇస్తేనే మరో మాటకు తావు ఉండదని రంగంలోకి దిగాను… వీరు ఎక్కడెక్కడ ఉన్నారో వెతికి పట్టుకున్నాను… వారిని స్వయంగా నేను కలిసిన సాక్ష్యం కోసం వారిని ఇంటర్వ్యూ చేసే ఫోటోతో సహా స్టోరీ ఫైల్ చేశాను. సరిగ్గా ఆంధ్రభూమి కరీంనగర్ ఎడిషన్ లాంచింగ్ రోజున నా స్టోరీ పబ్లిష్ చేశారు…

.

.

.

…….. Velijala Chandrasekhar……….  9849998092