ధోనీ రిటైర్ అయినట్టేనా..? కొనసాగుతాడా…? ఓ చర్చ..! ఆరు నెలలు ఆగండి, నేనే చెబుతా అంటూ ధోనీ దోబూచులాట… అంతేకదా, చివరి బాల్ దాకా సస్పెన్స్‌తో చంపేసే టైపు..! కొన్ని కోట్ల మందికి ఆరాధ్యుడు..! తనను ఏమైనా అంటే ఫ్యాన్స్ విరుచుకుపడతారు… తిట్టిపోస్తారు… అంత వీరాభిమానం… కానీ క్రికెట్ ఆటలో నైపుణ్యం వేరు… వ్యక్తిగా తను ఏమిటీ అనేది కూడా ముఖ్యమే… తన ఆటతీరు గొప్పది అయినంతమాత్రాన తన వికృత, ప్రజావ్యతిరేక కోణాన్ని ప్రేమించాల్సిన పనిలేదు… తనలోని ఆటగాడు వేరు… తనలోని వ్యాపారి వేరు… అది గుర్తించాలి… ఇదే సంవత్సరం జూలైలో ‘ముచ్చట’ ఓ స్టోరీ రాసింది… ముందుగా అది చదవండి… కేసు అర్థమవుతుంది…
ధోని… మహేంద్రసింగ్ ధోని… కోట్ల మంది క్రికెట్ ప్రేమికులకు ఆరాధ్యుడు… సైన్యంలోనూ హోదా… కానీ… ఓ ఆర్థిక అక్రమార్కుడు..! పత్రికలో, ప్రత్యర్థులో, గిట్టనివారో చేసే ప్రచారం కాదు ఇది… సాక్షాత్తూ సుప్రీం వేదికగా బట్టబయలవుతున్న ఆర్థిక అవలక్షణాలు… తెలుగు మీడియాకు పెద్దగా పట్టడం లేదు గానీ ఇంగ్లిషు మీడియా అన్నీ పూసగుచ్చినట్టుగా ప్రజలకు చెబుతున్నది… ధోని చీకటికోణాల్ని స్పష్టంగా ఆవిష్కరిస్తున్నది… కాసేపు తనపై క్రికెట్ కోణంలో ఉన్న విమర్శల్ని వదిలేయండి… ఒకప్పుడు జట్టును పట్టుకుని వేలాడుతున్నారంటూ కొందరు సీనియర్ల ఉద్వాసనకు కారకుడైన ధోని ఇప్పుడు టీంకు తనే పెద్ద భారంగా మారిపోయాడనే వెక్కిరింపులనూ వదిలేయండి… తను మునుపటి ధోనీ కాదనేది నిజం… కానీ ఇక్కడ చెప్పుకునేది ధోని మరో వికృతరూపం… ఇక్కడ చిన్న డిస్‌క్లెయిమర్… వ్యాపారం వేరు, వ్యాపారం పేరిట అక్రమాలు వేరు, వ్యాపారంలో అక్రమాలు వేరు… ధోనిది అన్నీ కలగలిసిన వ్యవహారం… మరీ బిజినెస్ పరిభాషలో చెప్పుకుంటే అర్థం చేసుకోవటానికి సంక్లిష్టంగా ఉంటుంది… సో, సింపుల్‌గా చెప్పుకుందాం…
ఆమ్రపాలి స్కామ్… ఇళ్లు కట్టిస్తామని వేల కోట్లు ప్రజల నుంచి వసూలు చేసి, వేల కోట్ల డబ్బును ఫేక్ కంపెనీలకు డైవర్ట్ చేసిన స్కాం ఇది… సుప్రీంలో విచారణ జరుగుతున్నది… రెరా, ఫెమా, మనీలాండరింగు, తప్పుడు లావాదేవీలు వంటి బోలెడు కేసులున్నయ్ ఇప్పుడు దానిమీద… సుప్రీం ఈ గ్రూపు ఆర్థిక లావాదేవీల మీద సూక్ష్మమైన ఆడిటింగు చేయించింది… అందులోని ముఖ్యాంశాలు ఏమిటంటే…
- ఈ గ్రూపు అనేక ఫేక్ కంపెనీలను క్రియేట్ చేసి, వేల కోట్లను మళ్లించింది…
- అందులో ఒకటి ఆమ్రపాలి మహి డెవలపర్స్… అందులో ధోని భార్య పేరిట 25 శాతం వాటా ఉంది… అంటే నేరుగా ఆమ్రపాలి వ్యవహారాలతో ధోనికి సంబంధాలున్నయ్… మిగతా 75 శాతం వాటా ఆ ఆమ్రపాలి గ్రూపు సీఎండీ అనిల్ కుమార్ శర్మ పేరిట ఉంది…
- ఈ అమ్రపాలి డెవలపర్స్ కంపెనీలోకి ఆమ్రపాలి గ్రూపు నుంచే నగదు మళ్లించారు…
- ఆమ్రపాలి గ్రూపుకి చాలాకాలం పాటు ధోని బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు… ఈ స్కాం బయటకొస్తున్నప్పుడు, అంటే మూడేళ్ల క్రితం తను బ్రాండ్ అంబాసిడర్ హోదా నుంచి వైదొలిగాడు… పైగా ఆరేళ్లు తన సర్వీసెస్ వాడుకున్నందుకు తనకే ఆ గ్రూపు 40 కోట్లు బాకీ ఉందనీ, తనకే డబ్బు రావాలంటూ కోర్టుకెక్కాడు…
- ఆమ్రపాలి గ్రూపుకీ రితి స్పోర్ట్స్ మేనేజ్‌మెంటు అనే కంపెనీకి నడుమ కూడా లావాదేవీలున్నయ్… అదెవరిది..? అందులో ధోనీదే ప్రధాన వాటా… ఇది ధోనీదే గాకుండా ఇంకొందరు క్రికెటర్ల యాడ్స్, రెవిన్యూ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తుంటుంది… (ఆ క్రికెటర్లకే ధోనీ ఫేవర్‌గా ఉండేవాడని ఆరోపణలున్నయ్)…
- ఇంతేకాదు… ధోని చెన్నై బేస్డ్ ఐపీఎల్ కంపెనీ సీఎస్‌కేకి కెప్టెన్… ఆమ్రపాలికీ ఈ సీఎస్‌కే నడుమ… ఈ సీఎస్‌కే రితి నడుమ కూడా బోలెడన్ని లావాదేవీలు… వేటికీ సరైన ఒప్పందాలు లేవు… సాదా కాగితాలపై ఏదేదో రాసేసుకుని కోట్లకుకోట్ల లావాదేవీలను నిర్వహించారు…
- ప్రజల నుంచి ఇళ్ల నిర్మాణం పేరిట వసూలు చేసిన డబ్బులో నుంచే ఈ రితి కంపెనీకి చెల్లింపులు జరిపారు…
ఇంకా తవ్వితే ఎన్నో, ఎన్నెన్నో… ఇదండీ మన క్రికెట్‌లో మనం లెజెండరీ పర్సనాలిటీగా ప్రేమిస్తున్న ఓ వ్యక్తి చీకటి బాగోతం… ఇవేమీ ఆధారరహిత ఆరోపణలేమీ కావు… అనేకానేక రికార్డులు పరిశీలించి ప్రొఫెషనల్ ఆడిటర్లే తేల్చి, సుప్రీంకు ఇచ్చిన నివేదికలోని అంశాలు… సో, బయటకు అనేక వెలుగులు విరజిమ్మే మొహాల అసలు వికృతరూపాలు ఎన్నో… విధి ఎదురుతన్నినప్పుడు అవి ప్రజల ఎదుట ప్రత్యక్షమవుతాయి… ఇదే ప్రబల నిదర్శనం… ఏమో… ధోనీ మార్కు ధని లోన్ వ్యవహారంలో ఏమేం బయటపడతాయో రాను రాను..!!
ఇక తాజా వార్తలోకి వద్దాం… ఆమ్రపాలి స్కాంకు సంబంధించి తాజాగా ధోనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు… https://www.outlookindia.com/website/story/india-news-ms-dhoni-part-of-criminal-conspiracy-in-amrapali-scam-allege-multiple-firs-with-delhi-police/343381
ఇప్పటివరకూ ఈ స్కాంకు సంబంధించి ఢిల్లీ పోలీసు ఆర్థిక అక్రమాల విభాగంలో ఏడు ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి… ఈ మొత్తం కుట్రలో అతడికి కూడా భాగస్వామ్యం ఉందని ఆరోపించిన ఆమ్రపాలి గ్రూప్ బాధితులు ఎఫ్‌ఐఆర్‌లో ధోని పేరును కూడా చేర్పించారు… క్రికెటర్‌గా ధోనికి, బిల్డర్‌గా అనిల్ శర్మకు ఎంతో పేరుందని, వీరిపై నమ్మకంతోనే ఫ్లాట్లు కొనుగోలు చేసేందుకు సొమ్ములు చెల్లించామని బాధితులు పేర్కొన్నారు… సో, క్రమేపీ ఈ కేసు ధోని మెడకు చుట్టుకుంటున్నట్టే… తను న్యాయపరమైన విచారణకు సిద్ధపడాల్సిందే… క్రికెట్ నుంచి రిటైర్ అవుతాడా లేదా అనేది వేరే సంగతి… కానీ తన పాపులారిటీని చివరకు ఈ స్థాయిలో దుర్వినియోగం చేసిన మొట్టమొదటి క్రికెటర్ ధోనీయే..!