తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో భారీ చీలిక తప్పదా..? రేవంత్‌రెడ్డిని వ్యతిరేకించేవర్గం గత్యంతరం లేక సొంత కుంపటి పెట్టేసుకుంటుందా..? తెరవెనుక బీజేపీ సహకరిస్తుందా..? ఢిల్లీకి ఇప్పటికే రేవంత్ మీద ఫిర్యాదులు, నివేదికలు జోరుగా పంపబడుతున్నాయా..? ఆగండాగండి… ఇది సాక్షి సంకోచం లేకుండా తెలంగాణ రాజకీయాల్లోకి వదిలిన ఓ సందేహం, ఓ సంకేతం… సాక్షాత్తూ పత్రిక ఎడిటర్ రాసిన వార్తావ్యాసంలోనే ఈ డౌటనుమానాలు, పరోక్షంగా ఏదో జరగబోతోందనే సూచనలు వదలబడినవి…
ఏమాటకామాట… ఇది ఓ విశేషమే… ఎంతసేపూ ఏపీ పాలిటిక్స్, బాబు మీద భీకర దూషణలు, జగనన్న భజనలతో ఉప్మా, ఉప్పుడుపిండి అనిపించే ఆ కాలమ్ ఒక్కసారిగా దమ్ బిర్యానీలా స్పైసీగా కనిపించింది… తెలంగాణలోనూ సాక్షి పత్రిక ఉందనీ, పాఠకులు ఉన్నారనీ, రెండు రాష్ట్రాల్లో పత్రిక ఉనికి ఉన్నదనీ, ఫాఫం, తెలంగాణలో కూడా రాజకీయాలు ఉన్నాయనీ, ప్రజలు ఉన్నారనే సోయి కనిపించడం ముదావహం… (అఫ్కోర్స్, ఈరోజు వ్యాసంలోనూ అదే బాబును తిట్టిపోయడం, టీకాంగ్రెస్‌లో బాబు సైనికుడిగా చెప్పబడే రేవంత్ మీద ప్రతికూల ధోరణి ఉండనే ఉన్నయ్… ఆ మూపనార్ కథ చదివి ఇక కాంగ్రెస్ నేతలంతా ధిక్కారజెండాలు పూని కదలండోయ్ అనే కర్తవ్యబోధ కూడా ఉంది..)
విషయం ఏమిటంటే..? గతంలో ఓసారి, 1996లో కాంగ్రెస్ అధిష్ఠానం అన్నాడీఎంకేతో పొత్తుకూడినది… ప్రజల్లో జయలలిత మీద బాగా కోపం ఉంది మహాప్రభో అని మొత్తుకున్నా హైకమాండ్ వినలేదు, అలా వింటే దాన్ని హైకమాండ్ అనరు… సో, వినలేదు… దాంతో కాంగ్రెస్ నాయకులందరూ ఏకమై మూపనార్ నేతృత్వంలో బయటికొచ్చేసి, తమిళ మానిల కాంగ్రెస్ అని వేరు కుంపటి పెట్టిరి… డీఎంకే ఈ చాన్స్ వాడుకుని, ఈ టీఎంసీతో పొత్తుకూడినది… జనం జేజేలు పలికారు… అఫ్కోర్స్, చాలా పిల్లకాలువలు కాంగ్రెస్‌ను వీడిపోతుంటయ్, నాలుగురోజులకే విలీనం అయిపోతుంటయ్… ఇదీ అంతే జరిగింది… ఇప్పుడు పంజాబ్‌లో మాజీ సీఎం అమరీందర్ సింగ్ కూడా లోక్ చీలిక కాంగ్రెస్ కుంపటి పెట్టెను… బీజేపీ వెనుక నుంచి మద్దతు డప్పు కొట్టసాగెను… సో, రేవంతుడి సకల వ్యతిరేక గొంతులూ, ఏకం కండి, పోరాడితే పోయేదేమీ లేదు, చంద్రబాబు విషకౌగిలి తప్ప అని పరోక్షంగా పిలుపునిస్తోంది సాక్షి…
Ads
సరే, బాగుంది, టీకాంగ్రెస్ పరిస్థితి బాగాలేదనేది నిజం… ఇప్పటికే కేసీయార్ నానా దెబ్బలూ కొట్టి కొట్టి తొక్కేశాడు… ఐనా పార్టీ ఎంచక్కా ఊపిరి నిలుపుకుంది… కేడర్ ఉంది, దాని జనం దానికి ఉన్నారు… కాస్త పరిస్థితులు ఏమాత్రం సహకరించినా లేవడం ఖాయం… కానీ కాంగ్రెస్ లేవడాన్ని అడ్డుకునే శక్తులు కాంగ్రెస్ బయటకన్నా కాంగ్రెస్‌లోనే ఎక్కువగా ఉంటయ్… ఉంటేనే దాన్ని కాంగ్రెస్ రక్తం అంటారు… రేవంత్ మీద ఫిర్యాదుల పరంపర అనేదీ నిజమే… వీళ్లంతా బయటికొచ్చి సొంత కుంపటి పెట్టేంత సీన్ ఉందానేదే చాలా పెద్ద ప్రశ్న… లీడ్ చేసే మూపనార్ ఎవరనేదీ పెద్ద ప్రశ్నే… ఎవరి మాట ఎవరు వింటారు..? పోనీ, అలా అందరూ కలిసి ధైర్యం చేశారూ అనుకుందాం… ఆ చీలికపాయకు బీజేపీ మద్దతు దాకా ఎందుకు..? బీజేపీకి అలాంటి చాన్స్ కేసీయార్ ఎందుకిస్తాడు..? నెవ్వర్… పొద్దున్నే ఆ చీలికనాయకుల్ని ప్రగతిభవన్ పిలిపించి, మంచి దావత్ ఇచ్చేసి, వరుసగా అందర్నీ అలుముకుని, బంగారుతెలంగాణ వైపు కలిసి కదులుదాం అని ఆ ప్రతిజ్ఞాభవన్లో నినదింపజేస్తాడుగా… ఏమో, ఇప్పటికే తనవాడైన ‘మూపనార్’ను తయారు చేసి, పదును పెడుతున్నాడేమో కూడా…!! ప్రత్యర్థి శిబిరాలకు మంటలు పెట్టడంలో ‘మాంచి’ అనుభవం ఉన్నవాడే కదా… మంట పెట్టించుకోవడానికి కాంగ్రెస్ శిబిరం ఎప్పుడూ రెడీగానూ ఉంటుంది కదా…!!! జగ్గన్నా, అసలు నువ్వు ఎటు వైపు..?
Share this Article