అల్లరిచిల్లర గ్యాంగు, ఈవ్ టీజింగు, నాలుగు ఫైట్లు, ఓ ఐటమ్ సాంగ్, పది పంచ్ డైలాగులు, అయిదు పాటలు, ఇద్దరో ముగ్గురో హీరోయిన్లు… తెలుగు సినిమా అంటే అంతే అన్నట్టు మార్చేయడంలో నిర్మాతలు, దర్శకులకన్నా హీరోల పాపమే ఎక్కువ. వంశచరిత్రలు, తాతలు-తండ్రుల కీర్తనలతో ముక్కిన కథలతో… ఫాల్స్ ఇమేజీ చట్రంలో తెలుగు సినిమాను బంధించేశారు… కానీ దీనికి నాగార్జున అతీతం… రిస్క్ ను ఇష్టపడతాడు… దాని విజయాన్ని అంతే ఆస్వాదిస్తాడు… శివ సినిమా దగ్గర్నుంచీ ఎక్కువ శాతం ఇదే టైపు… తను కంపు సినిమాల్లో నటించలేదని కాదు, కానీ ఆ ఫాల్స్ ఇమేజీ చట్రంలో నుంచి ఎప్పటికప్పుడు బయటపడతాడు…
అకస్మాత్తుగా ఒక అన్నమయ్యగా దర్శనమిస్తాడు…. మరోసారి శ్రీరామదాసుగా అలరిస్తాడు… రాజన్నగా తెలంగాణ దరువేస్తాడు… మీలో ఎవరు కోటీశ్వరుడు అంటూ ఇంటింటికీ చేరి పలకరిస్తాడు… ఇప్పుడు చక్రాలబండికి పరిమితమయ్యే ఓ పాత్రను అంగీకరించి తన ప్రయోగనైజాన్ని మరోసారి బలంగా చాటుకున్నాడు నాగార్జున… అసలు సిసలు తెలుగు సినిమా హీరో ఈ పాత్రకు అంగీకరించడమే గ్రేట్… (ఇప్పుడు తెలుగు సినిమా ఉన్న స్థితిలో…) దానికి ఊపిరి సినిమాలో పర్ ఫెక్ట్ గా న్యాయం చేశాడు నాగార్జున… దీనికి తనకు అభినందనలు…
ఇక సినిమా విషయానికొస్తే… ఏ సమీక్షకుడూ మొత్తం కథ చెప్పడు కాబట్టి దాన్ని వదిలేద్దాం… అన్ టచబుల్ సినిమాకు తెలుగీకరణ ఇది… భావోద్వేగాలతో, కొత్త తరహా కథనంతో ఆసక్తికరంగా సాగుతుంది. రొటీన్ తెలుగు సినిమా పోకడలు కనిపించవు. మొత్తం సీరియస్ గా ఉండకుండా చాలాచోట్ల ఎక్కడికక్కడ కామెడీ సంభాషణలతో కొంత బరువు తగ్గించారు. తమన్నా అందంగా ఉంది. అంతే… కార్తీ బాగా చేశాడు… జయసుధ, ప్రకాశ్ రాజ్ లకు వంకలు పెట్టేదెవరు…? అనుష్క, శ్రియ అకస్మాత్తుగా మెరుస్తారు… ఆలీ కూడా ఉన్నాడు… సెకండాఫ్ కొంత బోరింగ్ అనిపించినా, ఫస్టాఫ్ మాత్రం సినిమా బాగుంటుంది… మొత్తానికి సూపర్ హిట్, బంపర్ హిట్ ట్యాగులేమీ అవసరం లేదు గానీ, ఇది చూడదగిన సినిమా!!