Muchata

దటీజ్ సాయిపల్లవి..! ఆ కోటి ఆఫర్‌ సింపుల్‌గా వద్దంది… మళ్లీ చప్పట్లు..!!

November 19, 2019

సాయిపల్లవి… చాలా డిఫరెంటు… పెద్ద గాసిప్స్ ఉండవు… లేనిపోని హెచ్చులుండవు… ఓ సినిమా తారలా గాకుండా తెలిసిన వాళ్లమ్మాయి అన్నట్టుగా కనెక్ట్ అయిపోయింది… ప్రత్యేకించి ఫిదా సినిమాతో..! తరువాత కొన్ని సినిమాలు చేసింది గానీ ఫిదాతోనే తెలుగునాట ఇంటింటికీ చేరింది… ఇక రౌడీ బేబీ డాన్సుతో ఇరగదీసింది… అంతటి ప్రభుదేవుడే ఆ డాన్స్ స్టెప్స్ డైరెక్ట్ చేస్తూ ఆశ్చర్యపోయాడట ఆమె మూమెంట్స్ చూసి..! బట్, ఇదంతా ఒక కోణమే… తనను అప్రిసియేట్ చేసే కోణం వేరే… తను సింపుల్… డాక్టరీ చదివింది… పెద్ద పెద్ద షాపింగు మాళ్లు, బట్టల షాపుల ఓపెనింగ్స్ గట్రా వెళ్లదు… తను, తన సినిమాలు అంతే… సినిమాల్లో మాత్రమే కనిపించాలి తను… అదీ ఏదో ఓ పాత్రలో… అంతేతప్ప డబ్బు వస్తుందని ఎడాపెడా ‘ప్రతి ఆఫర్‌’ను ఒప్పేసుకుని, డబ్బు కోసం ఏమైనా చేసే కేరక్టర్ కాదు… ఇప్పుడు అలాంటి రీజన్‌తోనే మళ్లీ వార్తల్లోకి వచ్చేసింది…

అప్పట్లో ఓ ఫెయిర్‌నెస్ క్రీం యాడ్స్ కోసం రెండు కోట్ల ఆఫర్ వస్తే జస్ట్, తిరస్కరించేసింది… ఓ సౌతిండియా చిన్న హీరోయిన్ రెండు కోట్ల డబ్బు వద్దన్నదీ అంటే అందరూ విస్తుపోయి చూశారు… పెద్ద పెద్ద స్టార్ హీరోలే డబ్బు కోసం కక్కుర్తితో అనారోగ్య పానీయాలకు కూడా యాడ్స్ చేస్తున్న రోజులివి… ‘‘ఆ పాపపు డబ్బులు నాకెందుకు..? ఏం బతకలేనా..? ఇంటికి వెళ్తే నాకు కావల్సింది మూడు చపాతీలు లేదంటే కాసింత అన్నం… అంతకుమించి నాకు పెద్ద విలాసాల్లేవు, హైఫై కోరికలూ లేవు… బతకలేకపోతే వైద్యం చేసుకుంటాను… చక్కగా డాక్టరీ చదువుకున్నాను కదా… ఐనా కేన్సర్ కారకాలు ఉండే క్రీంలను అంటగట్టడానికి నేను ఉపయోగపడితే అది నాకు పాపం కాదా..? మన చర్మం కలర్ మన నేటివిటీ… యాక్సెప్ట్ చేయాలి, కృత్రిమంగా తెల్లబరచడం ఉండదు… కుదరదు… ఐనా ఇలాంటి బ్రాండ్ల ప్రమోషన్స్, ఇలాంటి కమర్షియల్ యాక్టివిటీ నాకు సూటవదు…’’ ఇదే ఆమె చెప్పిన సమాధానం… ఏమిటి ఈమె..? ఈలోకంలో, ఈకాలంలో ఉండాల్సిందేనా..? అయితే ఆ మాటల్లోని ఆ నిజాయితీ ఎన్నిరోజులులే, ఎంతమందిని చూశాం ఇలా నీతులు చెప్పినోళ్లను అని నెగెటివ్‌గా స్పందించినవాళ్లూ బోలెడు మంది… కానీ తను అంతేనని రుజువు చేసుకున్నది మరోసారి…

ఈసారి కోటి రూపాయల ఆఫర్… ఓ బట్టల కంపెనీ… రిటెయిల్ సేల్స్ పెంచుకోవడం కోసం ఆమె యాడ్స్ చేయాలి… ఆ బట్టల్ని ధరించి వీడియో, ఫోటో షూట్ చేయాలి… వాళ్లు ప్రచారం చేసుకుంటారు… సాయిపల్లవి మళయాళం, తమిళం, తెలుగు భాషల్లో ఫేమస్ కదా… కాస్త ఫ్యామిలీ టైపు లుక్స్ కదా… ఆమె వాళ్లకు చాయిస్… కానీ ఆమె వద్దనేసింది… సింపుల్… ‘నాకు ఇలాంటి కమర్షియల్ యాక్టివిటీ చేతకాదు, నా మనస్సుకు విరుద్ధం’ అనేసింది… వావ్… మళ్లీ ఓసారి ఇండస్ట్రీ విస్తుపోయింది… పాత్రల ఎంపికల్లోనూ వైవిధ్యం ఉండేలా చూసుకునే సాయిపల్లవి ప్రస్తుతం తెలుగులో విరాటపర్వంలో నక్సలైటుగా చేస్తున్నది… నాగచైతన్యతో కలిసి కమ్ముల శేఖర్ లవ్ స్టోరీలో నటిస్తున్నది… తాజాగా నెట్ ఫ్లిక్స్ వారి ఓ అంథాలజీ వెబ్ సీరీస్‌లోని ఒక పార్టులో ప్రకాష్ రాజ్‌తో నటిస్తున్నది… ఇవన్నీ వోకే… వినియోగదారుల్ని మోసగించే ఏ కమర్షియల్ యాక్టివిటీలోనూ నటించబోననీ, వాటికి ఉపయోగపడబోననీ నియమం పెట్టుకున్న సాయిపల్లవి ఎప్పుడూ ఇలాగే ఆ మాటమీదే ఉంటుందా..? ఇప్పటికైతే ఉన్నది… ఉండాలనే ఆశిద్దాం… విధిలేక డబ్బు కోసం వాటికి లొంగే స్థితికి ఆమె రావొద్దనే అనుకుందాం… గంజాయి వనాల్లో కొన్ని తులసి మొక్కలైనా బతక్కపోతే ఎలా..?

Filed Under: main news

Recent Posts

  • మామాంగం..! తెలుగు ప్రేక్షకుడు కనెక్ట్ కాలేని ఓ కేరళ వేడుక..!!
  • అనవసర వివాదాలతో బోలెడంత హైప్, ప్రచారం… కానీ ఏముందని ఇందులో..!
  • సాయిరెడ్డి కేంద్ర షిప్పింగ్ శాఖ, నందిగం సురేష్‌కూ చాన్స్… ఇంకా..?!
  • KCR ప్రభుత్వాన్ని ఇరికిస్తారా..? బహుశా ఎదురుతన్నే ప్రమాదం..!
  • అబ్బో, భారీ యవ్వారమే..! టీడీపీ పెద్దలపై జగన్ మరో పెద్ద దెబ్బ..!!
  • హాటు సీన్లు, ఘాటుతనం… ఈసారి బూతు సినిమా పూర్తిగా రిజెక్టెడ్…
  • ఛపాక్ దీపిక పడుకోన్‌కన్నా ముందే ఓ పార్వతి సాహసం..!
  • గన్స్‌తో చుట్టుముట్టారు… గజ్జున వణికిపోయిన శ్రియ..!
  • పాపం శివసేన..! కాంగ్రెస్ స్వారీ తెలిసొచ్చింది…! పౌరసత్వ బిల్లే ఉదాహరణ..!!
  • రుణానందలహరి
  • ప్రి-వెడ్డింగు షూట్లు- రికార్డింగ్ డాన్సులపై నిషేధం… ఎందుకు..?!
  • తెగించినోడికి తెడ్డే లింగం..! ‘‘ఇంకా తీవ్రమైన శిక్ష ఏం వేయగలరు నాకు..?!’’
  • ఫాఫం సాక్షి..! తన బాస్ ధోరణే పెద్ద ఇష్యూ అయిపోయింది మళ్లీ..!!
  • ఈ అమ్మపాల వైరల్ ఫోటో వెనుక..! తెలుసుకోవాల్సినవి ఇంకా బోలెడు..!!
  • ఈనాడుకు సర్టిఫికెట్టు దేనికి జగన్..? సాక్షే కాదు, అదీ తప్పే రాసింది కదా…!!

Follow

Subscribe to notifications

Handcrafted with by All Tech Media. All Rights Reserved Muchata.