Muchata.com Telugu Latest News

Muchata.com Provided Telugu Latest News, Political News , Political News, Breaking News in Telugu LIVE ముచ్చట

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అబ్బ.., ఎంత మంచి కలెక్టరో అనుకున్నారు పిచ్చిజనం… ఆహాఓహో అన్నారు…

January 1, 2021 by M S R

ముందుగా ఓ కథ చదువుదాం… మనం ‘ముచ్చట’లో రాసుకున్నదే… 2018 నాటి మాట… కొన్ని హఠాత్తుగా తమిళనాడులో, సోషల్ మీడియాలో మస్తు ప్రశంసలతో ప్రచారానికి వస్తయ్… అందులో ఒకటి మనం అలా పికప్ చేసి రాసుకున్నది… ఆహా, ఇంత మంచి కలెక్టర్ అసలు ఉంటాడా…? ప్రభుత్వ ఉద్యోగులకే తలమానికం కదా ఈ ధర్మప్రభువు అనిపించేలా ఉంటుంది కథ… నిజానికి 99.99 శాతం బ్యూరోక్రాట్లు ఇలా ఉండరు… ఉంటే ఈ భారతదేశ అధికార వ్యవస్థలకే అవమానం కదా… సరే, కథలోకి వెళ్తే…

collector

తమిళనాడులోని చిన్నమనై కెన్‌పట్టి అనే ఓ చిన్న ఊరు… పేదరికం తాండవించే ఊరు… ఆ ఊరవతల ఓ చిన్న గుడిసె… మరీ చిన్న గుడిసె… దాని ముందు ఓ కారు వచ్చి ఆగింది… ఒకాయన నీలి గళ్ల చొక్క టక్ చేసుకుని, కళ్లద్దాలు పెట్టుకుని ఉన్నాడు… బెల్టు, బూట్లు… కారు దిగి ఆ ఇంటి తలుపు అనబడే ఓ తడిక తీసుకుని లోపలకు తలవంచి వెళ్లాడు… మసిబారిన గోడల పక్కన ఓ మూలన గాజుకళ్లతో, ఎండిపోయిన చెట్టులా ఓ ముసలామె కనిపించింది… ఎవరెవరు ఉంటారు ఇంట్లో అన్నాడు ఆ దొరబాబు…

ఆమెకు అధికార్లను చూస్తేనే వణుకు… అధికార్లంటే ప్రజలకు సహజంగానే వణుకే కదా… భయంభయంగానే చెప్పింది… ‘అయ్యా, నా పేరు రంగమ్మాళ్… ఆయన పేరు రామన్… మా ఆయన… ఇప్పుడే ఎటో పోయాడు…’ అన్నది బెరుకుబెరుకుగా… ఆమె వయస్సు 80 ఏళ్లు… ఆయన వయస్సు 82… ఏందయ్యా మేమేమైనా తప్పుచేశామా..? అనడిగింది ఆమె ఆ దొరబాబును… భయం సహజం… తరతరాలుగా అధికార యంత్రాంగం ఇలాగే ఉంటుంది…

ఆ పక్కనే ఉన్న ఓ చాపను తీసుకుని, కింద పరుచుకుని కూర్చున్నాడు… పరిచయం చేసుకున్నాడు… ‘అమ్మా, నా పేరు అంబళగన్… నేను ఈ జిల్లాకు కలెక్టర్‌ను…’ అన్నాడు… ఆమె మొహంలో అంతులేని ఆశ్చర్యం… ఊళ్లో పట్వారీతో మాట్లాడటానికే ఆమెకు భయం… అలాంటిది కలెక్టరే ఈ గుడిసెకు వచ్చాడు… ఏం తప్పు జరిగింది..? అవును ఏం తప్పు జరిగింది..? ఒక కలెక్టర్ అలాంటి గుడిసెల్లోకి అడుగుపెట్టడమే ఆయన చుట్టూ తిరిగే ప్రభుత్వ ఉద్యోగులు, అధికార్ల దృష్టిలో పెద్ద తప్పు… ఎంతసేపూ ఏ ఫైల్ మీద సంతకం చేస్తే ఎన్ని కోట్లు వస్తాయో ఆలోచించని ఆ కలెక్టర్ ధోరణే వాళ్లకు అంతుపట్టని తప్పు…

అక్కడికి దగ్గరలోనే ఉండే మాకన్ కురిచి అనే ఊరికి మాస్ కంటాక్ట్ ప్రోగ్రామ్ కింద వెళ్లాడు ఆ కలెక్టర్… మధ్యాహ్నం అయిపోయింది… అధికార్లు బ్రహ్మాండమైన భోజన ఏర్పాట్లు చేసిపెట్టారు… కానీ అవన్నీ రిఫ్యూజ్ చేసి, ఇదుగో, ఇలా ఓ గుడిసెకు వచ్చాడు తను… చాప మీద బైఠాయించాడు… డ్రైవర్, తనతో వచ్చిన దఫేదార్. ఆ ఊరి పట్వారీ, ఏరియా గిర్దావర్, తాలుకూ తహసిల్దార్ అందరూ గుడిసె బయటే నిలబడ్డారు… ఆమె గురించి అడిగాడు… ఇద్దరు కూతుళ్లు… ఎక్కడో ఉంటున్నారు… ఆ గుడిసెలో ఆ ఇద్దరే… జీవనసంధ్యలో ఒకరికొకరు… పనిచేసే బలం లేదు… కేవలం ప్రభుత్వం ఇచ్చే ఉచిత బియ్యం పథకం ఆసరాగా బతుకుతున్నారు… వాళ్లో వీళ్లో సాయం చేస్తే మిగతా సరుకులు… అంతే… అవును, మన దేశంలో ఇలాంటి వాళ్ల సంఖ్య కోట్లల్లో ఉంటుంది… చేదునిజం…

‘ఏం వండుకున్నావమ్మా… నాకూ కాస్త పెడతావా..?’ అనడిగాడు ఆ కలెక్టర్…

ఆమె మొహంలో మరింత ఆశ్చర్యం… ‘ఇంకా వండుకోలేదయ్యా..?’ అన్నది… ఏం..? అనడిగాడు కలెక్టర్… ఇంట్లో సరుకులు లేవని చెప్పలేక అలా నిర్వేదంగా కలెక్టర్ మొహం వంక చూస్తుండిపోయింది… కలెక్టర్ ఎక్కడికి వెళ్లినా తన ఇంటి నుంచే మధ్యాహ్న భోజనం తీసుకువెళ్తాడు క్యారియర్‌లో… డ్రైవర్‌ను కేకేసి అది లోపలకు తెప్పించుకున్నాడు… ఆమెను ఓ విరిగిన చెక్కపీట మీద కూర్చోమన్నాడు… అరిటాకులు పరిచాడు… ఈరోజు నాతో భోజనం చేయి అన్నాడు… ఇదంతా కలా అనుకుంటున్నది ఆమె… అవును మరి, ఆమె ఊహించని, ఊహించలేనిదే కదా అది…

ఆమెతోపాటు భోజనం చేస్తూ అడిగాడు… మీకు వృద్యాప్య పెన్షన్లు వస్తున్నాయా..?

‘లేదయ్యా… ఆఫీసుల చుట్టూ తిరిగి చేసిపెట్టేవాడు లేడు, మాకు ఓపిక లేదు, పైరవీలకు డబ్బు కూడా లేదు’ అన్నది ఉన్నదున్నట్టుగా… బయట నిలబడిన తహసిల్దార్‌ను లోపలకు పిలిచాడు… అప్పటికప్పుడు ఓ దరఖాస్తు తనతోనే నింపించాడు… ఆమె వేలిముద్ర తీసుకున్నాడు… కింద కలెక్టర్ సంతకం… వచ్చే నెల నుంచి ఆమె ఇంటికి పెన్షన్ అందాలి అని చెప్పాడు… ఒక ఇంట్లో ఒకరికే పెన్షన్… మరి ఆ ముసలాయనకు ఎలా..? ఏ పథకం కింద ఏం ఇవ్వవచ్చో చూసి, తనకు ప్రపోజల్ పంపించాలని చెప్పాడు… అంతేకాదు… ఆ తాలూకాలో పెండింగ్‌లో ఉన్న పెన్షన్ల దరఖాస్తులను వెంటనే క్లియర్ చేసి, ఫైనల్ సంతకం కోసం కలెక్టరేట్‌కు పంపించాలని ఆదేశించాడు… ఆమెతో మాట్లాడుతూనే భోజనం చేశాడు… సరేనమ్మా… మా అమ్మతో కూర్చుని భోజనం చేసినట్టుగా ఉంది అంటూ నమస్కరించి, వెళ్లిపోయాడు… ఆమె ఇప్పటికీ నమ్మలేకపోతున్నది… ఈరోజు ఏం జరిగింది…?!



ఇదీ కథ… కళ్లు చెమర్చాయి కదా… కోటికొక్కరు ఇలాంటి కలెక్టర్లు అనుకుంటున్నారు కదా… సరే, సీన్ కట్ చేయండి… తరువాత ఎప్పుడో ఈ కలెక్టర్ ఇంకేమైనా ఘనకార్యం చేశాడా అని సెర్చిస్తూ ఉంటే… ఓ కథ దొరికింది... అదీ చదవండి…

తిరుచ్చిలో నిరుపయోగం ఉన్న ఓ బోర్‌వెల్‌లో పడి సుజిత్ విల్సన్ అనే పిల్లాడు మరణించాడు… డీఫంక్ట్ బోర్లన్నీ మూసేయాలని ప్రభుత్వం మళ్లీ ఆదేశాలిచ్చింది… సహజంగానే ఎవడూ పట్టించుకోడు కదా… తూతూమంత్రంగా కొన్ని సీల్ చేసి, చేతులు దులిపేసుకున్నారు ప్రభుత్వ సిబ్బంది… ఒకటీరెండు చోట్ల మంచి జాగ్రత్త ఏర్పాట్లతో భూగర్భజలం రీచార్జి పాయింట్లుగా మార్చారు…

కరూర్ కలెక్టర్ అంబళగన్ అంటే అప్పటికే సూపర్ డూపర్ బంపర్ కలెక్టర్ అనే ప్రచారం జరిగింది కదా… పాపం, సెంబియానత్తం అనే ఊరికి చెందిన ఓ గ్రామస్థుడు అమాయకంగా ఓ సాయంత్రం పూట కలెక్టర్ నంబర్‌కు ఫోన్ చేశాడు…

‘‘అయ్యా, మా ఊళ్లో ఓ బోర్ మరీ ప్రమాదకరంగా ఉంది, ఎవరికి చెప్పినా వినడం లేదు, మీరైనా కల్పించుకుని దాన్ని సీల్ చేయించండి సార్…’’ ఇదీ రిక్వెస్టు… ఈ కలెక్టర్ మన బాలయ్యలాగే రియాక్టయ్యాడు…

‘‘అక్కడ మీ తాలూకాకు బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ ఒకడు ఉంటాడు… ఆయనతో మాట్లాడాలి నవ్వు… పోయినవా, వెళ్లి తనను కలిసినవా, అంత శ్రద్ధ ఉన్నవాడివి ఎందుకు చేయలేదు ఆ పని..? నేనేమైనా శరవణభవన్‌లో సర్వర్‌లా కనిపిస్తున్నానురా..? రాస్కెల్, ఫోన్ పెట్టెయ్…’’

ఈ కాల్ ఫోన్‌లో రికార్డయింది… అప్పటికే ఈ దొరవారు ఎంపీ జ్యోతిమణితో కూడా ఎంపీ ఎన్నికలప్పుడు ఇలాగే మాట్లాడాడు… ఈసారి పర్‌ఫెక్టుగా కాల్ రికార్డ్ చేసి, విలేకరులకు ఇచ్చారు… సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అయిపోయింది… ఈ సారుగారిని ఆమధ్య మధురై కలెక్టర్‌గా బదిలీ చేశారట… ఏముంది..? కరూర్ ప్రజల అదృష్టం మధురై ప్రజలకు శనిలాగా పట్టుకుంటుంది అన్నమాట… అంతే తేడా… ఈ దొరతనాలు మాత్రం మారవు… అందుకే అన్నీ నిజాలని నమ్మకండి… ఉన్నతాధికారులు మనుషుల్లా వ్యవహరిస్తారనే కథల్ని అస్సలు నమ్మొద్దు… వాళ్లూ మన క్షుద్ర నాయకుల్లాంటోళ్లే…!!

Follow Us


Share this Article


Search On Site

Advertisement

Latest Articles

  • కరోనా రావచ్చు పోవచ్చు… కానీ కరోనా ట్యూన్ మాత్రం చస్తే వదలదు…
  • ఓహ్ బేబీ రజినీ చాంది..! నెట్ ట్రోలర్స్‌కు దొరికింది తాజా ‘ఏజ్ బార్ బకరీ’..!
  • ఫేస్‌బుక్ వేదికగా ఈ కలెక్టర్‌కు వేలాది మంది విభిన్న వీడ్కోలు..!
  • 2021లో మహావిపత్తులు..? డోన్ట్ వర్రీ..! ఆ రాతలన్నీ చదివి నవ్వుకొండి..!
  • చదివితే సింగిల్ కాలమ్ వార్త… వార్తాంశంలోని స్పూర్తి అంతులేనంత…!
  • సుమ..! కేవలం సోలో షో..! కాదంటే ఫ్లాపే… ఇదీ తాజా ఉదాహరణ…!!
  • KCR వేస్ట్, వేస్టున్నర… సరే… కానీ అది తేల్చాల్సింది ఈ దరిద్రపు సర్వేనా..?!
  • కంగనా భలే ఎంపిక..! ఆమె ఆ క్వీన్ కేరక్టరే ఎందుకు తీస్తున్నదంటే..?
  • కరోనా అనువాద వాణిజ్య ప్రకటనల్లో హాస్యం బాగా పండును…!
  • ‘చిన్నమ్మ పథకం’… సమయానికి జగన్‌ను గోమాతలా ఆదుకుంది…!

Archives

Copyright © 2021 · Muchata.com · Technology Support by Rishi Bharadwaj

Add Muchata to your Homescreen!

Add Now