మే 28… తెలుగు ప్రజలు మరవలేని ఓ మహానటుడు, నాయకుడి పుట్టినరోజు… తనది గాకుండా పోయిన తన పార్టీ తెలుగుదేశం తనను స్మరిస్తూ ఈ ఒక్కరోజు ఓ షో చేస్తుంది… వెన్నులో దిగిన కత్తులు చేతులు కట్టుకుని కీర్తనలు పాడుతూ ఉంటయ్… అవునూ… ఆయన కేవలం అల్లుడిని నమ్మీ నమ్మీ చివరకు తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడా..? వెన్నుపోటు చరిత్ర పుస్తకానికి ముఖచిత్రం చంద్రబాబే కావచ్చు… కానీ తనొక్కడే కారకుడా..? ఇంకెవరూ లేరా..? తన భుజాల మీద తుపాకీ పెట్టి కాల్చినవారెందరు..? అందరూ ఎన్టీయార్ నమ్మకస్తులే… అందరూ ముంచేసినవాళ్లే… ఒక్క ముక్కలో చెప్పాలంటే… మహాభారతంలో అరయగ కర్ణుడీల్గె అన్నట్టుగా… ఎన్టీయార్ పతనానికి కారకులు ఎందరో, ఎందరో… “నేను నిన్ను నమ్మాను… నన్నే మోసం చేస్తావా…?’’

“నమ్మబట్టే కదా, మోసం చేయగలిగాను…“

ఇది ఓ సినిమాలోని డైలాగ్… ఎన్టీఆర్ విషయంలో కూడా అచ్చం ఇలాగే జరిగింది. ఎన్టీఆర్ చంద్రబాబును నమ్మాడు. అందుకే ఆయన తేలిగ్గా మోసం చేయగలిగారు. కుట్ర బయటినుంచి కాక చాపకింద నీరులా ఎన్టీ ఆర్ సొంత ఇంటి నుంచే జరగడంతో ప్రశాంతంగా పనైపోయింది.

నమ్మకం ఎంత చిత్రమైంది. నమ్మకం వమ్ము కావడమంటే ఏమిటో ఎన్టీఆర్ తెలుసుకునేలోపే జరగాల్సిందంతా జరిగిపోయింది. సిఎం కుర్చీమీద కూర్చోవాల్సిన వాడు రోడ్డుమీదకు వచ్చేశాడు. పూలు చల్లాల్సిన వాళ్ళే…. చెప్పులు విసిరారు. ఒంగి ఒంగి నమస్కారాలు పెట్టేవాళ్ళే.. కాళ్ళుపట్టి కిందకు లాగేశారు. భుజం పట్టుకుని నడీ రోడ్డు మీదకు విసిరేశారు…

తెలుగు దేశం పార్టీ ప్రారంభించక మునుపే చంద్రబాబును నమ్మి పిల్లనిచ్చాడు. అప్పుడు ఎన్టీఆర్ కేవలం సినీ నటుడే. నటనలో బతుకుతున్నవాడు నిజం ఏమిటో పసిగట్టలేక పోయాడు. చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలో వున్నాడు. పైగా రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా వున్నారు. అదృష్టం కలిసొస్తే నడిచే కొడుకు పుట్టినట్లు, ఏకంగా రాష్ట్ర మంత్రే అల్లుడిగా రావడంతో ఎన్టీఆర్ ఎంతో సంతోషించారు.

“నమ్మకం… 1

కాలం చిత్రమైంది. పరిస్థితులు విచిత్రమైనవి. చూస్తూ చూస్తూ వుండగానే కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైంది. ఎన్టీ ఆర్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎన్నికల ముందు మంత్రిగా వున్న చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగానే పోటీచేసి ఘోరంగా ఓడిపోయారు. అంతకు ముందు పార్టీ (కాంగ్రెస్ ) అధిష్టానం ఆదేశిస్తే సాక్షాత్తు మామ (ఎన్టీఆర్ ) పైనే పోటీ చేస్తానంటూ బీరాలు కూడా పలికాడు. మొత్తానికి అనూహ్యంగా 35 యేళ్ళు అప్రతిహతంగా అధికారంలో వున్న కాంగ్రెస్ తెలుగు వాడి ఆత్మగౌరవం ముందు తలొంచింది. ఎన్టీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. చంద్రబాబు అధికారానికి
దూరమయ్యారు. కొంతకాలం గడించిందో … లేదో.. ”నేను కూడా తెలుగుదేశం పార్టీ లోకి వచ్చేస్తానంటూ” మామకు (ఎన్టీఆర్) కు కబురందింది. కన్నపేగునే ఇచ్చుకున్నాడు కాబట్టి అల్లుడి మాటను కాదనలేకపోయాడు. అయితే ఈ విషయాన్ని పార్టీలో చర్చకు పెట్టాడు.

నిజానికి నచ్చినా నచ్చకపోయినా స్వయానా అధినాయకుడి అల్లుడు కావడంతో చాలామంది కిమ్మనకుండా గమ్మున వుండిపోయారు. ఒక్క నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి (నెల్లూరు ) మాత్రం నోరువిప్పి “బాగోదేమో అన్నగారూ, మీరొకసారి ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మనం
అధికారంలోకి వచ్చాము. పైగా చంద్రబాబు గారు మీపైనే పోటీ చేస్తానంటూ ఎన్నికల ముందు సవాలు చేశారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెసోడిని పార్టీలోకి చేర్చుకోవడం చూసేవాళ్ళకు బాగోదు. పైగా అల్లుడు కావడంవల్ల ఎన్టీఆర్ సిధ్ధాంతాలకు తిలోదకాలిచ్చాడన్న విమర్శ వస్తుంది. మరోలా అనుకోకుండా, మీరు మరో సారి ఆలోచించండి. నా మటుకు నాకు బాబుగారిని పార్టీలో చేర్చుకోవడం ఇష్టం లేదు“ అని తెగేసి చెప్పారు. దీంతో ఎన్టీఆర్ ఖంగు తిన్నారు. పునరాలోచనలో పడ్డారు. ఎంతైనా అల్లుడు కదా ! మమకారం ఎక్కడికి పోతుంది.? ఇంటి నుంచి ఒత్తిడి కూడా తోడవడంతో నల్లపురెడ్డిని పిలిచి , ఒప్పించుకున్నారు. ఇకనేం వున్న ఆ ఒక్క అడ్డూ తొలిగింది. చంద్రబాబుకు లైన్ క్లియర్ అయింది. ”అల్లుడని నమ్మి“ చంద్రబాబును తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నారు ఎన్టీఆర్…

“నమ్మకం….. 2

తెలుగు దేశం పార్టీ లో చేరాక కొంత కాలం చంద్రబాబు గుంభనంగా వున్నారు. పార్టీలో వున్న పరిస్థితులేమిటి? అధికార పీఠానికి దగ్గరగా వున్నవారెవరు? ఎన్టీఆర్ ఎవరి మాట వింటున్నారు? వంటి వాటిని నిశితంగా గమనించి ఓ అవగాహనకు వచ్చారు. తానుఅధికారం కోసం రాలేదని, పార్టీని పటిష్టం చేయడమే తన లక్ష్యమని ఎన్టీఆర్ కు నమ్మబలికాడు. ఎన్టీ ఆర్ కూడా సరేనన్నారు. చంద్రబాబు మెల్లగా పార్టీలో కుదురుకున్నాక, పట్టుసాధించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. చంద్రబాబు రాజకీయ శిక్షణల పేరుతో పార్టీలో అందరికీ దగ్గరయ్యారు. తనకంటూ ఓ ప్రత్యేకవర్గాన్ని తయారు చేసేపనిలో పడ్డారు. తొందరగానే ఆ పనీ పూర్తయింది. పార్టీలో చంద్రబాబు పేరు మార్మోగింది. పాపం ఎన్టీ ఆర్ మాత్రం దీన్ని గమనించినా.. అల్లుడి మీది నమ్మకంతో
“అంతా మన మంచికేలే “ అనుకున్నారే తప్ప, అల్లుడి విధేయతపై ఎప్పుడూ ఈషణ్మాత్రంగానైనా…. బాబుని అనుమానించలేదు.

“నమ్మకం…. 3

నాదెండ్ల భాస్కర రావు వెన్నుపోటు ఉదంతంలో చంద్రబాబు బాగా కష్టపడ్డారు. క్యాంపుల నిర్వహణలో క్రియాశీలకంగా వ్యవహరించారు ఎన్టీఆర్ కు అండగా
నిలిచారు. వెంకయ్య నాయుడు, రామోజీరావు, కమ్యూనిస్టు పార్టీ నాయకుల్ని, ఇతర ప్రజాస్వామ్య శక్తుల్ని కూడగట్టడంలో ముఖ్య పాత్ర వహించారు. చివరకు నాదెండ్ల పదవీచ్యుతి, అసెంబ్లీ రద్దు, ఆతర్వాతి ఎన్నికల్లో తెలుగుదేశం ఘనవిజయం సాధించడం జరిగిపోయాయి. ఇప్పుడు ఎన్టీఆర్ కు చంద్రబాబుపై గురి, నమ్మకం పెరిగాయి. పార్టీ వ్యవహారాల్ని గుత్తగా బాబు చేతిలో పెట్టారు. పార్టీ కి ప్రధానకార్యదర్శిని చేశారు.

“నమ్మకం… 4

పార్టీలో అయిన వారు, కానివారు అధికారం అనుభవిస్తున్నారు. బాబు మాత్రం అధికారానికి దూరంగా పార్టీ సేవ చేస్తున్నారని ఎన్టీ ఆర్ భావించేవారు. చంద్రబాబుకు కూడా ఏదైనా… అధికార పగ్గాలు అప్పజెప్పాలన్న నిర్ణయానికొచ్చారు. అప్పుడే రైతుల సంక్షేమం కోసం ఓ రాష్ట్ర స్థాయి సంస్థను ఏర్పాటు చేయాలన్న ఆలోచన వుండింది. ఇకనేం? రాష్ట్ర కర్షకపరిషత్ కు రూపురేఖలు వచ్చేశాక చంద్రబాబు మీది నమ్మకంతో ఆయనను ఛైర్మన్ గా నియమించారు. కర్షక పరిషత్ ఓరకంగా ఎన్టీఆర్ మానసపుత్రి. అందులో అల్లుడే ఛైర్మన్. ఇంకేముంది పరిషత్ ప్రారంభం అట్టహాసంగా, ఆరంభంగా ఏర్పాటు చేశారు. ఎల్బీ
స్టేడియంలో సభ. అప్పటి లోక్ సభ స్పీకర్ బలరామ్ జక్కర్ ప్రాంభకులు. వేలాది మంది జనం హాజరయ్యారు. ఎడ్లు, ఫలప్రదర్శనలు, ముగ్గులు అంతా గ్రామీణ వాతావరణం. ఎన్టీఆర్ కూడా అందర్నీ ఆశ్చర్య పరుస్తూ ఓ పెయ్య బండిలో కూర్చొని సభాస్థలి వద్దకు వచ్చారు. సభ దిగ్విజయంగా జరుగుతోంది. సభలో దాదాపు అంతా మాట్లాడారు. చివరకు ఎన్టీ ఆర్ వంతు వచ్చింది. సభ దిగ్విజయమైందన్న ఆనందంలో వున్నారు ఎన్టీఆర్. రైతుల సమస్యల్ని
గురించి చాలా ఆవేశంగా మాట్లాడారు. చివరలో “ఇంత ముఖ్యమైన సంస్థ కాబట్టే నా అల్లుడికి కట్నంగా ఇస్తున్నా”నంటూ సభాముఖంగా ప్రకటించారు. అల్లుడి మీది ప్రేమ చేటు తెచ్చి చివరకు చంద్రబాబు పదవీచ్యుతుడు కావలసివచ్చింది. అది వేరేసంగతి…

“నమ్మకం… 5

తెలుగుదేశం పార్టీ విజయాల పరంపరకు బ్రేక్ పడింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎన్టీఆర్ ప్రతిపక్ష నాయకుడి పాత్రపోషించాల్సి వచ్చింది. అప్పుడు కూడా చంద్రబాబే అన్ని వ్యవహారాల్ని చక్కబెట్టేవారు. చంద్రబాబుపై ఎన్టీ ఆర్ కు నమ్మకం ఇంకా పెరిగింది. ఆ తర్వాతి ఎన్నికల్లో ఎన్టీ ఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. ఈసారి చంద్రబాబును రెవెన్యూ మంత్రిగా నియమించారు. మంత్రి అయ్యాక అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో కూడా చంద్రబాబు చక్రం తిప్పటం మొదలు పెట్టారు.

లక్ష్మీపార్వతి ప్రవేశం….

ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీ పార్వతి ప్రవేశంతో తెలుగు దేశం పార్టీ సీన్ మారింది. అప్పటిదాకా అంతా చంద్రబాబు హవానే వుండింది. కానీ లక్ష్మీపార్వతిని ఎన్టీఆర్ వివాహం చేసుకున్నాక కొత్త అధికార కేంద్రం వెలిసింది. చంద్రబాబుకు ఇది గిట్టలేదు సరికదా… లక్ష్మీపార్వతిని ఎలా తప్పించాలన్న ఆలోచనలో పడిపోయారు. లక్ష్మీ పార్వతి కూడా మెల్లగా రాజకీయాల వైపు మళ్ళే ఆలోచనలో వున్నప్పుడు, చంద్రబాబు తన వ్యూహాలకు పదునుపెట్టారు. ముందుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి వారితో మాట్లాడుకున్నారు. లక్ష్మీ పార్వతిని అన్ పాపులర్ చేసే బాధ్యతను ఆంధ్రజ్యోతి వెంకటరావు, రాధాకృష్ణ తీసుకున్నారు. లక్ష్మీ పార్వతిపై రోజుకో నెగిటివ్ వార్త. రోజుకో కొత్త కథనం. అంతఃపురంలో జరిగే విషయాలను ఎన్టీఆర్ కు దగ్గరగా వుండే ఓ ఆంతరంగిక ఉద్యోగి ఎప్పటికప్పుడు బాబుకు చేరవేస్తుండేవారు. అలా వచ్చిన వార్తలే స్టిరాయిడ్ ఇంజక్షన్లు వగైరా.. వగైరా.. (అనుమానంతో ఆ తర్వాత ఎన్టీఆర్ ఆంతరంగిక ఉద్యోగిని
బయటకు పంపేశారు ) మొత్తానికి లక్ష్మీపార్వతిని సాకుగా చూపి ఎన్టీఆర్ ను అధికార పీఠం నుంచి తప్పించాలన్న కుట్రకు పథకం సిధ్ధమైంది. ఉత్తరాంధ్రలో పార్టీ కార్యక్రమాల్లో ఎన్టీఆర్ తలమునకలై వున్నప్పుడు , వ్యూహాన్ని అమలులో పెట్టారు.

నమ్మకం వమ్మైందిలా…! (వెన్నుపోటు ఎపిసోడ్ )

హైదరాబాదు వైస్రాయ్ హోటల్ అధిపతి ప్రభాకర రెడ్డి కూడా తెలుగు దేశం పార్టీ లో వున్నారు. చంద్రబాబు వైస్రాయ్ నే వేదికగా చేసుకొని ఎమ్మెల్యేల క్యాంప్ పెట్టారు. మొదట ఈ క్యాంప్ కు ఆదరణ లభించలేదు. డాక్టర్ వెంకటేశ్వరరావు తొలుత ఎన్టీఆర్ పక్షమే వున్నారు. ఈనాడు లో స్పెషల్ క్యాంపెయిన్ మొదలైంది.. ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా రోజురోజుకూ ఎమ్మెల్యేల మద్దతు పెరిగిపోతున్నట్లు అంకెల గారడీతో వార్తలు ప్రచురిస్తున్నారు. ఓ దశలో దగ్గుబాటి రామోజీ రావు గారిని కలిసి మాట్లాడారు. మీరు చెబుతున్న ఎమ్మెల్యే ల ఫిగర్ సరికాదని చెప్పారు. కానీ రామోజీ వినలేదు.. నా దగ్గర విశ్వసనీయ సమాచారం వుందని పత్రికలో భాషలో చెప్పారు. నిజానికి మొదట మద్దతు లేని మాట వాస్తవం. అప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి స్పెషల్ క్యాంపెయిన్ మత్తు మందులా పనిచేసింది. ‘‘మీకెందుకు… మీరు ముందుకెళ్ళండి. మీరు 30శాతం చేస్తే నేను 70 శాతం నడిపిస్తానని” ఓ పత్రికాధిపతి హామీ ఇవ్వడంతో చంద్లబాబు స్పీడ్ పెంచారు. చివరి అస్త్రంగా ఎన్టీఆర్ కుటుంబ మద్దతుపై వల విసిరారు.

ఎట్టకేలకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు బాలకృష్ణా, హరికృష్ణా, దగ్గుబాటి వెంకటేశ్వర రావును కూడా లోబరుచుకొన్నారు. వారికి రకరకాల ప్రలోభాలు పెట్టారు. దగ్గుబాటికి ఉపముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేసినట్లు వార్తలు వచ్చాయి. దగ్గుబాటితో సహా దాదాపు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంతా బాబు తిరుగుబాటు శిబిరంలోకి చేరిపోయారు! దీంతో తెల్లారే సరికల్లా పచ్చపత్రికలు సీన్ ను మార్చేశాయి. మెజారిటీ ఎమ్మెల్యేలంతా చంద్రబాబు పక్కనే వున్నారన్న బిల్డప్ ఇచ్చాయి. దాంతో అరకొర మిగిలిన ఒకరిద్దరు కూడా వైస్ రాయ్ కు చేరిపోయారు!

పాపం ఎన్టీఆర్ హైద్రాబాద్ కు వచ్చాక కుట్ర జరిగిన విషయాన్ని తెలుసుకున్నారు. అప్పటి ఇంటిలిజెన్స్ వర్గాలు కూడా ఓరకంగా ఈ విషయాన్ని ముసుగులో పెట్టడంలో కూడా బాబు హస్తముందంటారు. విషయం తెలుసుకున్నాక లక్ష్మీ పార్వతి సమేతంగా ఎన్టీఆర్ చైతన్య రథం ఎక్కారు. ఇంద్రారెడ్డి , ముద్దుకృష్ణమనాయుడు లాంటి మిగిలిన ఎమ్మెల్యేలు తోడురాగా వైస్రాయ్ వద్దకు చేరింది. చైతన్య రథం.హోటల్ బయట రోడ్డుపై నిలిపి, మైకు ద్వారా ఎమ్మెల్యేల్ని బయటకు రావాలని పిలిచారు. ఈలోగా ఎన్టీఆర్ పై చెప్పుల వర్షం కురిసింది. ఎవరు చేయించి వుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎమ్మెల్యేలు, కుటుంబ సభ్యులు అప్పటికే ఆనందంలో మునిగి వున్నారు.హోటల్ లో పార్టీ కూడా చేసుకున్నారు. చివరకు ఎన్టీఆర్ పదవీచ్యుతి, సిఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం వెంట వెంటనే జరిగి పోయాయి…

ఇదంతా నిశ్శబ్దంగా జరిగిన ఓ ”ప్రజాస్వామిక విప్లవంగా” తెల్లారే పచ్చ పత్రికల్లో పతాకసారి శీర్షికతో వార్తలొచ్చాయి. నమ్మిన అల్లుళ్ళు, కొడుకులు, కుటుంబసభ్యులే మోసంతో దెబ్బ తీయడాన్నిఎన్టీఆర్ చాలారోజులు జీర్ణించుకోలేక పోయారు. ఆయన చంద్రబాబునాయుడ్ని తిట్టిన తిట్లు బహుశా ఏ మామా ఏ అల్లుడ్ని కూడా తిట్టి వుండక పోవచ్చు. చాలా బాధపడ్డారు. మానసికక్షోభ అనుభవించారు. ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో మంచికో చెడ్డకో ఎన్టీ ఆర్ తుది శ్వాస
దాకా తోడున్నది, చివరి దాకా ఎన్టీఆర్ కు మిగిలింది లక్ష్మీపార్వతే. అయితే.. ఈ కథలో లక్ష్మీపార్వతిని ప్రధానవిలన్ గా చూపించడంలో ఇప్పటి ఆంధ్రజ్యోతి ఎమ్.డి రాధాకృష్ణ పాత్ర ప్రధానమైతే…. ఎన్టీఆర్ను పదవీచ్యుతుడిని చేయడంలో ఈనాడు రామోజీరావు గారి అక్షరలాఘవం ముఖ్యమైంది. చంద్రబాబు భుజాలపై తుపాకీ పెట్టి అందరూ ఎన్టీఆర్ ను దెబ్బతీశారు. ఎన్టీ ఆర్ ను ఎవరైతే అధికారంలోకి తేవడానికి తమ పత్రికలను పణంగా పెట్టారో.. చివరకు వారే
ఎన్టీఆర్ పతనాన్ని శాసించడంలో సహకరించడం విశేషం.

ఏదైతేనేం? ఓ మహానటుడు ,గొప్ప రాజకీయ వేత్త ఓ దుర్మార్గమైన వెన్నుపోటు రూపంలో అల్లుడి కుట్రకు బలయ్యారు. అటు సినిమాల్లో, ఇటు రాజకీయాల్లో ఓ ఉత్తుంగ తరంగంలా ఎగిసిన ఎన్టీఆర్ సొంత కుటుంబ సభ్యుల చేతిలోనే పతనమవడం మరపురాని, మరవలేనివిషాదం..!!

……. Abdul Rajahussain……