‘దురాశ విషం లాంటిది’

‘దురాశ మనిషిని చంపదుకదా’
ఇది అమెజాన్ లో నిన్ననే స్ట్రీమ్ అయిన గులాబో సితాబోలో ఒకానొక సంభాషణ.

‘నీకంటే పదిహేనేళ్ల పెద్దావిడ కదా ఆమెలో ఏం చూసావ్’

‘ఆమెకున్న బంగ్లాని’

‘నీలో ఆమె ఏం చూసింది’

‘నా యవ్వనాన్ని’
ఇది మరో సంభాషణ

బిగ్ బి అమితాబ్, ఏడు వరుస హిట్లిచ్చిన ఆయుష్మాన్ ఖురానా కలిసి నటించిన ఈ సినిమా ఓటిటిలో విడుదల కావడం బహుశా రేపటి డిజిటల్ సినిమా పరిణామాలకు పునాది కావచ్చు కానీ పెద్ద స్క్రీన్ మీద ఆడవేమోనన్న భయం ఉన్న సినిమాలు మాత్రమే ఇక్కడ చోటు చేసుకుంటున్నాయేమోనన్న అనుమానం కూడా కలుగుతోంది ఇతర ఓటిటి సినిమాలను కూడా చూస్తుంటే …

ఇది చెడ్డ సినిమా కాదు కానీ చెడగొట్టిన సినిమా. ఈ సంభాషణల సారాంశమే సినిమా ఇతివ్రుత్తం. కానీ ఆ కథా చక్రం సూటిగా కాక మధ్య మధ్యలో దారి తప్పి ఎటెటో దొర్లుకుంటూ ఎక్కడో ముగిసిపోవడమే ఆ చెడగొట్టుతనం…

కెమెరా పనితనం బావుంది. బిజిఎం చాలా బాగుంది. సంభాషణలూ బాగున్నాయి. ఇక నటీనటుల గురించైతే చెప్పక్కర్లేదు. అమితాబ్ తనను తాను చెరిపేసుకుని పాత్రను మాత్రమే గీసుకున్నాడు. ఖురానాకు అచ్చుగుద్దినట్టు సూటయ్యే పాత్ర. విజయ్ రాజ్, టీనాబాటియా, బ్రిజేంద్ర… అందరూ ఇరగదీసారు.

ఓ హవేలీని తమదిగా చేసుకునేందుకు కొంతమంది చేసే ప్రయత్నం, తద్వారా పుట్టుకొచ్చే నాటకీయత ఇక్కడ ప్రధానం. ఒక సందర్బంలో భాగస్వాములైనవారంతా ఉమ్మడి ప్రయోజనాన్ని పక్కకు పెట్టి పేదరికం పురిగొలిపే స్వార్దానికి ఎలా ఒడిగడతారో చెప్పడం దర్శకుడి ఉద్దేశ్యమే కానీ కథాసంవిధానం ఈ ప్రధాన ఉద్దేశ్యాలను దెబ్బతీసింది.

అయితే లక్నువీ హిందీ మీదా అక్కడి సంస్క్రుతిని పరోక్షంగా ప్రస్తావించడం వీదా పెట్టిన ద్రుష్టి దర్శకుడు స్క్రీన్ ప్లేమీద పెట్టలేదు. అసలా గులాబో సితాబో అనే టైటిల్ కూడా ఉత్తరప్రదేశ్లో ఆడించే ఓ తోలుబొమ్మలాటకు సంబంధించిందే. అయితే ఆ తోలుబొమ్మలాటలో ఒక భార్య ఒక ప్రియురాలి చిర్రుబుర్రులే కీలకం. కానీ సినిమాలో ఎక్కడా ఈ తరహా రెండు పాత్రలు ఎదురుబొదురైనట్టు లేదు…

సినిమాలో అనవసర సన్నివేశాలు చాలా ఉన్నాయి. వాటిని తొలగించినా వాటి బదులు బలమైన సంఘటనలను అల్లుకున్నా సినిమా మరింత బాగుండేది.

నిజానికి ఈ కథను ఒకానొక నిజ సందర్బంనుంచి ఎంచుకున్నారు. గూగుల్ లో జంగిల్ ప్రిన్స్ ఆఫ్ ఢిల్లీ అని సెర్చితే దొరికే ఆ వార్తాకథనం లో ఉన్న డ్రామా కూడా గులాబో సితాబోలో మిస్సింగ్.

గొప్ప నటులూ గొప్ప నటనా మాత్రమే సినిమాను రక్షించలేవు. ఈ వేదికను పరిగణనలోకి తీసుకుంటారో లేదో కానీ అమితాబ్ చాలా అవార్డుల కోసం కర్చీఫ్ వేసినట్టే…

.

………..  Prasen Bellamkonda………..