దేశమంతా వరదలు ముంచెత్తుతున్నయ్… అనేకచోట్ల బాధితుల ఫోటోలు, వార్తలు, కష్టాలు, కన్నీళ్లు కూడా పత్రికల పేజీలను తడిపేస్తున్నయ్… మన తెలుగు రాష్ట్రాల సంగతే తీసుకుంటే… అబ్బో… శ్రీశైలానికి రోజుకు 9 లక్షల క్యూసెక్కులు… సాగర్‌కు తరులుతున్న కృష్ణా… రేపో ఎల్లుండో ఫుల్లు… పులిచింతల ఫుల్లు… (మరి ప్రపంచమంతా కరువొచ్చినా సరే, ఆ కృష్ణా డెల్టాకు రావద్దు కదా)… గోదావరిలోనూ రోజుకు 8 లక్షల క్యూసెక్కులు వృథాగా సముద్రంలోకి… మన పత్రికల దృష్టిలో దేశం, రాష్ట్రం జలకళను సంతరించుకుని, సుభిక్షంగా ఉంది కదా… కానీ ఏదీ ఏమైందీ..? ఇంతటి అతివృష్టిలోనూ అనావృష్టితో ఏడుస్తున్న కొన్ని ప్రాజెక్టుల కథే చెప్పరేం ఎవరూ..? వాటి ఆయకట్టు దుస్థితి వార్తలేమీ రావు దేనికి..?
చూశారు కదా… గోదావరి ఎగువన… సింగూరు నిల్… నిజాంసాగర్ నిల్… శ్రీరాంసాగర్ నిల్… మధ్యమానేరు నిల్… దిగువమానేరు నిల్… అసలవి ప్రాజెక్టులే కానట్టుగా మీడియా వదిలేసింది… సరే, మేఘా వాళ్ల కంట్రాక్టుల కోసమో, తెలంగాణ జనం కోసమే చేపట్టిన శ్రీరాంసాగర్ పునరుజ్జీవన పథకం లిఫ్టుల పుణ్యమాని ఆ ప్రాజెక్టులోకి కొన్ని టీఎంసీలను త్వరలో నింపబోతున్నారట… ఈ వరదజలాలు ప్రవహిస్తున్న ఈ స్వల్ప కాలంలోనైనా అది జరుగుతుందో లేదో చూడాలి… నిజానికి అది ఉపయుక్త ప్రాజెక్టే… అది సరే, అవే కాళేశ్వరం జలాలతో మధ్యమానేరు నింపే పనులన్నీ పూర్తయ్యాయా..? అదీ నింపబోతున్నారా..? ఎప్పుడు…? దాన్నీ వదిలేద్దాం… మధ్యమానేరు నిండి పొర్లితే దిగువ మానేరు కూడా నిండుతుంది… అదీ సరే… మరి సింగూరు కథేమిటి..? మరి నిజాంసాగర్ దురవస్థ సంగతేమిటి..? డెడ్ స్టోరేజీని కూడా ఖాళీ చేశారు దేనికి..? వాటిల్లో ఉండే ఫౌనా అండ్ ఫ్లోరా గురించి కూడా ఆలోచించకుండా ఎవరు ఖాళీ చేశారు..? తెలంగాణ ప్రభుత్వమే… ఇంకెవరు..?!
అంతా బాగుంది, పాలకుడి చల్లని పాలనలో అంతా చల్లగా ఉంది… సుభిక్షంగా ఉంది, సస్యశ్యామలంగా ఉంది అనే స్తుతికథనాల నుంచి కాస్త బయటపడండి సార్లూ… ఉన్నదున్నట్టు రాయండి… అబద్ధాలు అవసరం లేదు, బ్యాడ్ ప్రాపగండా కూడా అక్కర్లేదు… నిజాలే రాయండి… ఈ తెలంగాణలో ఇక మీ చంద్రబాబుకు ఏ స్పేసూ లేదు, మీరెన్ని వేషాలు వేసినా చంద్రబాబుకు వచ్చేదేమీ లేదు… కానీ…. కేసీయార్‌కు కోపమొస్తది, అబ్బో, మేం రాయం అనుకునే పక్షంలో ఇక మీడియా ఉనికికే అర్థం లేదు కదా… అతిశయోక్తులు, అనవసర టార్గెట్లు, అబద్దాలు అక్కర్లేదు… లక్షల సర్క్యులేషన్‌తో కొన్ని వందల కోట్ల టర్నోవర్‌తో నడిచే పత్రికలకు ఏ జలబాధ్యతా లేదా..? సారీ, జనబాధ్యత లేదా..? తెలుగు న్యూస్ చానెళ్లను వదిలేయండి… వాటికెలాగూ ఓ దిశ, ఓ దశ ఎలాగూ లేదు… టీఎంసీలకు, క్యూసెక్కులకూ తేడా తెలియని జర్నలిజం అది… కనీసం పత్రికలకైనా ఏ సోయీ అక్కర్లేదా..? నమస్తే సాక్షికి ఎలాగూ చేతకాదు, అది దాసోహపత్రిక, అదేమీ రాయదు… ఈనాడు కూడా సేమ్, అదే దురవస్థ… నాకెందుకొచ్చిన తిప్పలు, కేసీయార్‌తో ఎందుకు గోక్కోవడం అనే భయం… వణుకు… కనీసం కాస్తోకూస్తో ప్రొఫెషనల్ టెంపర్ అప్పుడప్పుడైనా చూపించే ఆంధ్రజ్యోతికి ఏమైంది..? అప్ కంట్రీ పత్రికలకు ఏమైంది..?