(మొదటి పార్టుకు తరువాయి భాగం ఇది…)
నవంబర్ 1, 1988

ఉదయం విలేఖరి కిడ్నాప్, సారా కాంట్రాక్టర్ దురాగతంపై అన్ని పత్రికల్లో ప్రముఖంగా వార్తా కథనాలు… విలేఖరి రాధాకృష్ణను కిడ్నాపర్ చెర నుంచి రక్షించి తమకు అప్పగించాలని జిల్లా కేంద్రంలో జర్నలిస్ట్స్ యూనియన్ ఆధ్వర్యంలో దీక్షా శిబిరం… అయితే అదే రోజు గద్వాల డేట్ లైన్ పై వచ్చిన ఒక చిన్న సింగిల్ కాలం వార్త మమ్మల్ని తీవ్ర ఆందోళనకు గురిచేసింది… రాధాకృష్ణ తనను ఎవరు కిడ్నాప్ చేయలేదని, సొంత పని మీద గద్వాలకు వచ్చినట్టు, అతనే వచ్చి తనను కలిసి చెప్పినట్టు గద్వాల డిఎస్పీ చెప్పినట్టుగా ఈ వార్త సారాంశం… అయితే రాధాకృష్ణ స్వయంగా మీడియాకు చెప్పినట్టు లేదు. సారా కాంట్రాక్టర్ కు కొమ్ముకాస్తున్న పోలీసులు ఆడుతున్న నాటకమని ఇదని అర్థం అయింది. గద్వాల డిఎస్ పీని కలిసి రాధాకృష్ణ ఎక్కడున్నారో వెంటనే తమ వద్దకు తీసుకురావాలని గద్వాల విలేకరులను కోరాం.

వాళ్ళు తెలుసుకొని వచ్చి, పోలీసులు అతన్ని పొద్దున్నే మహబూబ్ నగర్ ఎస్పీ వద్దకే తీసుకువచ్చినట్టు సమాచారం ఇచ్చారు. ఇలా ఉండగా తెల్లారే సరికి జిల్లా నలుమూలల 64 మండలాల నుంచి విలేఖరులు మహబూబ్ నగర్ లోని దీక్షా శిబిరానికి చేరుకున్నారు. అలాగే ఉదయం పత్రిక కో ఆర్డినేటర్ జొన్నలగడ్డ రాధాకృష్ణ బస్ లో పొద్దున 7-30 గంటలకల్లా మహబూబ్ నగర్ కు చేరుకున్నారు. పది గంటలకు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏ పీ యూ డబ్ల్యూ జే) రాష్ట్ర అధ్యక్షుడు కంచర్ల పూర్ణచందర్ రావు, ఉదయం అదిలాబాద్ స్టాఫ్ రిపోర్టర్ కృష్ణయ్య కారు లో మహబూబ్ నగర్ కు చేరుకున్నారు. రాధాకృష్ణను మహబూబ్ నగర్ తీసుకువచ్చిన గద్వాల పోలీసులు నేరుగాఎస్పీ వద్దకు తీసుకెళ్లారు. ఆయన అదే పోలీసులను ఇచ్చి జీప్ లో ఉదయం 11 -15 గంటలకు రాధాకృష్ణను కలెక్టరేట్ ముందున్న దీక్షా శిబిరం దగ్గర వదిలి పెట్టి వెళ్లారు. గద్వాల డి ఎస్ పీ కి తాను అలా చెప్పలేదని, కేసు పెడతావా అంటే మా నాయకులతో మాట్లాడి చెబుతానని మాత్రమే చెప్పినట్టు స్పష్టం చేశారు. కేసులు, గీసులు పెట్టీ అంత పెద్ద వారితో ఒంటరిగా ఫైట్ చేయగలవా? ఆలోచించుకోమని నచ్చజెప్పే ప్రయత్నం చేశారని వివరించారు. ఏ నిర్ణయమైనా మా నాయకులతో మాట్లాడిన తర్వాతేనని చెప్పినట్టు రాధాకృష్ణ చెప్పారు. ఈ లొల్లులు (ఆందోళనలు) ఎందుకు నేనే పని మీద వెళ్లినట్టు చెప్పు ఈ ఇష్యూ ఇంతటితో క్లోజ్ అవుతుందని చెప్పినా తాను వినలేదని రాధాకృష్ణ వివరించారు. అలాగే తనను వాళ్ళు ఎలా కిడ్నాప్ చేశారో రాధాకృష్ణ పూసగుచ్చినట్లు చెప్పారు.
********

రాధాకృష్ణ ఏం రాశారు?

తెలంగాణ యావత్తు -కర్నాటక బార్డర్ జిల్లాలకు విస్తరించి అప్పట్లో భరత్ సింహా రెడ్డి సారా సామ్రాజ్యం కొనసాగేది. సారా, కల్లు రెండు వ్యాపారాలు ఆయనవే. అధికారంలో ఎవ్వరున్నా ఆ నేతలను తన వ్యాపారంలో భాగస్వామ్యం చేసుకొని మూడు పువ్వులు, ఆరు కాయలుగా దందా నడిచేది. ఎక్సయిజ్ శాఖ కు అరకొర సిబ్బంది మాత్రమే ఉండేది. నాటు సారా (గుడుంబా), ఇప్ప సారా కాసి అమ్ముకోవడం లంబాడీలు, యితర బీదా బిక్కి జనానికి జీవనాధారంగా ఉండేది. తమ వ్యాపారానికి సమాంతరంగా సారా తయారు చేయడం సారా రాజులకు నచ్చేది కాదు. దీనిని అరికట్టేందుకు సారా కాంట్రాక్టర్ ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని అర్థరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా లంబాడీ తండాలపై మెరుపు దాడులు చేసేవారు. ఇది రాధాకృష్ణ రాసిన వార్తకు నేపథ్యం.

ఆత్మకూరు మండలంలో బాలకిస్టాపూర్ తండాపై సారా సైన్యం చేసిన దాడిపై, అక్కడి గిరిజనులు వచ్చి రాధాకృష్ణకు చెప్పగానే స్వయంగా అయనే ఫోటోగ్రాఫర్ కావడంతో ఫోటోలతో సహా అక్టోబర్ 26 న ఉదయం పేపర్ లో ‘‘అది సారా ప్రభువుల రాజ్యం‘‘ శీర్షికన స్టోరీ రాశారు. అది ప్రచురితం అయిన రోజు సాయంత్రం సారా సైన్యం రాధాకృష్ణ ఫోటో స్టూడియోకు వచ్చి (రూప స్టూడియో ఇప్పటికీ అదే పేరుతో ఉంది) ‘‘మా గురించి రాస్తే చంపేస్తామని‘‘ బెదిరించారు. ఆ సమయంలో స్టూడియో వద్ద జనం ఉండటంతో మళ్లీ ఎప్పుడైనా వద్దామని వెళ్లి పోయారు. తన స్టూడియో కు వచ్చి బెదిరించి వెళ్లారని అక్కడే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి, అదే రాత్రి మహబూబ్ నగర్ కు చేరుకున్నారు.

తనను బెదిరించిన విషయం ఉదయం స్టాఫ్ రిపోర్టర్ రఘురామయ్య కు చెప్పారు. ఆయన మరుసటి రోజు 27 న ముఖ్యమైన వారితో సమావేశం ఏర్పాటు చేసి జరిగిన విషయం చెప్పారు. ఆ తర్వాత 28 న రాధాకృష్ణ ను వెంటబెట్టుకొని మేము (రఘు రామయ్య, హన్మంతురెడ్డి , పరుశురామ్ శర్మ, వెల్జాల చంద్రశేఖర్, బరార్ విజయకుమార్) హైదరాబాద్ వెళ్ళాం. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో యూనియన్ నేతలు పూర్ణచంద్రరావు, కే శ్రీనివాస్ రెడ్డి, పిఎ రామారావు ను కలిసి వివరించాం. వారు మమ్మల్ని అప్పటి హైదరాబాద్ డిఐజీ పేర్వారం రాములు వద్దకు తీసుకెళ్లగా జరిగిందంతా చెప్పాం. భయపడనవసరం లేదు, నేను జిల్లా పోలీసులకు చెబుతానని హామీ ఇచ్చి పంపించారు. ఆ తర్వాత డిఐజీని కలిసి వచ్చాం, ఇక ఏమి భయం లేదని రాధాకృష్ణ 30 న ఆత్మకూరు చేరుకోవడం… అదే రోజు రాత్రి కిడ్నాప్ చేయడం జరిగింది…
********

కిడ్నాపర్లు ఎలా వదిలేశారు?

కిడ్నాప్ జరిగిన తెల్లారే (31 న) జిల్లా కేంద్రంలో జర్నలిస్టులు ఆందోళనకు దిగడం, కిడ్నాప్ చేసింది సారా కాంట్రాక్టర్ మనుషులేనని స్పష్టంగా బయట పడటంతో రాధాకృష్ణ కు ఏమి జరిగినా తమ పైకి వస్తుందని భావించారు. ఇక అతన్ని తమ వద్ద పెట్టుకోవడం మంచిది కాదని, అదే రోజూ సాయంత్రం మూడు గంటలకు బయలుదేరి మహబూబ్ నగర్ మీదుగా కాకుండా జడ్చర్ల నుంచి సాయంత్రానికి ఆత్మకూరు సమీపంలోని చింతకుంట తీసుకెళ్లారు. అక్కడ అప్పట్లో తెలంగాణలో మోస్ట్ డిమాండ్ బ్రాండ్ ‘‘రెడ్డి బీడీ‘‘ ఫ్యాక్టరీ యజమాని చింతకుంట సుధాకరరెడ్డి కి (ప్రస్తుత మహబూబ్ నగర్ జెడ్పీ చైర్ పర్సన్, నవలా రచయిత్రి స్వర్ణ సుధాకర్ భర్త) రాధాకృష్ణను అప్పగించారు. ఆ సమయంలో భరత్ సింహారెడ్డి ఫోన్ చేసి సుధాకరరెడ్డితో మాట్లాడాక రాధాకృష్ణ తో మాట్లాడించారు. దాసరినారాయణరావు పేపర్ పెట్టి దీవాలా తీశారు. రేపో మాపో పేపర్ మూసేస్తాడు. ఎప్పుడైనా బజారులో పడాల్సిందే. ఎంత అవసరము అయితే అన్ని డబ్బులు ఇస్తా పెద్ద స్టూడియో పెట్టుకోమని చెప్పారు. నేను పోలీసులతో మాట్లాడుతా, గద్వాలకు వెళ్లి సొంత పని మీద ఊరు వెళ్లినట్టు చెబితే సరిపోతుందన్నారు. ఆ తర్వాత అతన్ని పోలీసులకు అప్పగించారు. వారు అతన్ని గద్వాలకు, అక్కడి నుంచి మహబూబ్ నగర్ కు తీసుకువచ్చి అప్పగించిన విషయం తెలిసిందే…
_________

****
ఇంత జరిగాక భరత్ సింహా రెడ్డిని అరెస్ట్ చేయడానికీ పోలీసులు నవంబర్ 10 వ తేది వరకు ఎందుకు ఆగారు? నవంబర్ 11 న హైదరాబాద్ లో జర్నలిస్టులు పెద్ద ఎత్తున ‘‘ చలో సెక్రేటరేయట్‘‘ కార్యక్రమం ఎందుకు నిర్వహించారు? అప్పటి డిఐజీ పేర్వారం రాములు స్వయంగా ఆత్మకూరుకు వచ్చి వెళ్లి సీఎం ఎన్ టిఆర్ కు ఏమి నివేదిక ఇచ్చారు? రాధాకృష్ణ కు ఏమైనా జరిగితే చంపేస్తామని పీపుల్స్ వార్ నక్సల్స్ భరత్ సింహా రెడ్డి కి ఎందుకు వార్నింగ్ ఇచ్చారు..? నెల రోజుల పాటు రాధాకృష్ణ ఎక్కడ తలదాచుకున్నారు?. అప్పటి పీపుల్స్ వార్ జిల్లా కార్యదర్శి కిరణ్ అలియాస్ పోతుల సుదర్శన్ రెడ్డి రాధాకృష్ణ తో ఏమి మాట్లాడారు?. ఉదయం యాజమాన్యం ఆయన్ను తిరుపతికి ఎందుకు పంపించింది?…

(మరో కథనంలో….)

…… Velijala Chandrasekhar…..   9849998092 (జర్నలిస్టు డైరీ)….