Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

దీన్నే ‘డర్టీ జర్నలిజం’ అంటారా..? ఆంధ్రజ్యోతి ‘పె-ద్ద-లు’ చెప్పాలి…!!

May 23, 2022 by M S R

తెలుగు పాత్రికేయం… కాదు, అర్జెంటుగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ సహా ఆ పత్రిక బాధ్యులు ఒకింత సిగ్గుతో తలదించుకోవాలి… వాడెవడో దిక్కుమాలిన, జర్నలిజం ఓనమాలు తెలియని న్యూస్18 అనే అంబానీ న్యూస్ సైటు రాశాడంటే అర్థం చేసుకోవచ్చు… అది పాతాళస్థాయి కాబట్టి… కానీ మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్టులు, శిక్షణ పొందినవాళ్లు, సీనియర్లు, తెల్లారిలేస్తే సమాజానికి లక్షన్నర నీతులు చెప్పేవాళ్లు కూడా ఇలాగే ఏదిపడితే అది రాసేయవచ్చా..? విషయం ఏమిటంటే..?

అదే న్యూస్18వాడు ఏమంటాడంటే… ఓ వార్తకు ప్రారంభం ఇది… ‘‘రామాయణంలో వాలి- సుగ్రీవుల కథ తెలుసు కదా.. ఒకేలా కనిపించే ఆ కవల సోదరులు ఒకరినొకరు మోసం చేసుకొని, ఒకరి భార్యను మరొకడు అనుభవించి, తప్పు నీదంటే నీదంటూ కొట్లాడుకోవడం, గొడవలు జరగడానికి ముందు నుంచే తమ్ముడి భార్యపై కన్నేసిన వాలి దుర్మార్గం హెచ్చు మీరి చివరికి శ్రీరాముడి చేతిలో చావడం తెలిసిందే… వాలి కథాంశంతో అదే పేరుతో అజిత్ హీరోగా ఓ సినిమా కూడా వచ్చింది. అచ్చంగా అలాంటి ఘటనే మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఒకేలా కనిపించే కవల సోదరుల్లో ఒకడు తమ్ముడి భార్యను ఏమార్చి ఏకంగా ఆరునెలలపాటు వీలైనన్ని సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. వాడి దుర్మార్గం బయటపడిన తర్వాత ఆ కుటుంబం ఇచ్చిన ట్విస్టుకు షాకైపోవడం బాధితురాలివంతైంది. అయితే ఇది త్రేతాయుగం కాదు కాబట్టి ఆమె తెగించి, ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలివే…

సరే, ముందుగా ఆ మిగతా వార్త కూడా చదవండి… ‘‘మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా కేంద్రం శివాజీనగర్ పరిథిలో ఓ కుటుంబం నివసిస్తోంది. ఆ ఫ్యామిలీలో కవలసోదరులు ఆ ఏరియాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. చిన్నప్పటి నుంచి చూస్తున్నా వాళ్లలో ఎవరు పెద్దోడు, ఎవరు చిన్నోడు అని ఇంట్లోవాళ్లే కన్ఫ్యూజ్ అవుతుంటారు. వాళ్లకు పెళ్లీడు రావడంతో కుటుంబీకులు కవలలైన అమ్మాయిల కోసం తెగ వెదికారు. కానీ దొరకలేదు. తనకు ఇప్పుడే పెళ్లి వద్దని పెద్దోడు చెప్పడంతో ఆరు నెలల కిందట చిన్నోడికి ఓ అమ్మాయిని కట్టబెట్టారు.

అత్తారింట్లో కాపురానికి వచ్చిన ఆ అమ్మాయి కూడా కవల సోదరుల్లో తన భర్తను కచ్చితంగా గుర్తుపట్టలేకపోయింది. ఈ క్రమంలో తమ్ముడి భార్యపై కన్నేసిన అన్న.. ఒకేలా కనిపించే రూపంతో ఆమెను ఏమార్చాడు. తమ్ముడు లేని సమయం చూసుకొని అతనిలా గదిలోకి దూరి మరదలితో శృంగారకలాపాలు సాగించేవాడు. భర్తే కదానే నమ్మకంతో ఆమె కూడా అడ్డుచెప్పేదికాదు. ఇలా ఆరు నెలలుగా వికృత ఉదంతం కొనసాగుతుండగా…

ఇటీవల ఓ సందర్భంలో భర్త తీరుపై ఆమెకు అనుమానం పెరిగింది. విషయం నిర్ధారించుకున్న వెంటనే.. బావ సాగిస్తోన్న వికృతాన్ని బాధితురాలు తన భర్త, అత్తమామలకు చెప్పేసింది. అయితే, కుటుంబీకులు అందరూ వాలికే వత్తాసు పలకడం ఆమెను మరింత షాక్ కు గురిచేసింది. విషయం బయటికి తెలిస్తే కుటుంబం పరువు పోతుందని, కాబట్టి నోరు మూసుకుని మునుపటిలా సాగిపోమని భర్తతోపాటు మిగతా అందరూ ఆమెను బెదిరించారు. ఇక భరించలేని స్థితిలో ఆమె తన పుట్టింటివాళ్లను పిలిపించి, వారి సాయంతో భర్త, బావ, అత్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఒకేలా కనిపించడాన్ని అడ్వాంటేజీగా తీసుకొని భర్తనని నమ్మించి బావగాడు తనపై ఆరు నెలలుగా అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ప్రాథమిక విచారణ అనంతరం పోలీసులు.. అత్యాచారానికి పాల్పడిన బాధితురాలి బావతోపాటు అతనికి వత్తాసుపలికిన భర్త, అత్తమామలు, ఇతర కుటుంబీకులను సైతం అరెస్టు చేశారు. కవల సోదరుడిపై ఐపీసీ 378, 323, 506, 24 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, ఫ్యామిలీ మొత్తాన్ని అరెస్టు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నామని శివాజీనగర్ పోలీస్ స్టేషన్ ఇంచార్జి దిలీప్ దొలారే మీడియాకు చెప్పారు.

ఇదే వార్త, అచ్చు ఇలాగే ఆంధ్రజ్యోతి వాడు కూడా రాసుకున్నాడు… ఇలా…

aj

ఇక్కడ వార్తలోని నిజానిజాల జోలికి పోవడం లేదు… పోలీసులు చెప్పేవన్నీ నిజాలు కాకపోవచ్చు… కావచ్చు కూడా..! సరే, ఫిర్యాదు ఆధారంగా రాసిన వార్త కాబట్టి ఇక ఆ లోతుల్లోకి ఇక్కడ వెళ్లడం లేదు… ఆరు నెలలపాటు ‘‘తేడా’’ను గుర్తించకపోవడం అనేది మరో అంశం… అయితే ఎటొచ్చీ ‘‘మహారాష్ట్రంలో ‘వాలి’ అనే శీర్షిక దగ్గర వస్తోంది అభ్యంతరం… ఆ వార్త ఆరంభవాక్యాలు ఎనలేని ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి…

ఎట్టెట్టా… వాలి, సుగ్రీవుల గొడవకు మూలం… వాలి తన తమ్ముడి భార్యను వాడేసుకోవడమా..? ఏమార్చి అత్యాచారానికి పాల్పడటమా..? ‘‘ఒకేలా కనిపించే ఆ కవల సోదరులు ఒకరినొకరు మోసం చేసుకొని, ఒకరి భార్యను మరొకడు అనుభవించి, తప్పు నీదంటే నీదంటూ కొట్లాడుకోవడం, గొడవలకు కారణం’’ అని తన పురాణ పరిజ్ఞానాన్ని పరిచేశాడు వార్తారచయిత… కేవలం తార కోసమే వాలి సుగ్రీవుణ్ని తన్నితరిమేశాడా..?

వాలికి సుగ్రీవుడు తమ్ముడు. విధేయుడు. ఒకసారి మాయావి అనే రాక్షసునితో యుద్ధం చేస్తూ వాలి ఒక బిలం లోపలికి వెళ్ళాడు. బిలం వెలుపలే ఉండమని వాలి తన తమ్ముడు సుగ్రీవునికి చెప్పాడు. ఒక మాసం గడచినా వారు వెలుపలికి రాలేదు. రాక్షసుని చేతిలో వాలి మరణించి ఉంటాడని భయపడ్డ సుగ్రీవుడు బిలం ద్వారాన్ని ఒక బండరాతితో మూసి నగరానికి తిరిగివచ్చాడు. మంత్రులు సుగ్రీవుడిని రాజుగా అభిషేకం చేశారు. వాలి తిరిగివచ్చి సుగ్రీవుడిని నిందించి దండించాడు. తన్ని తరిమేశాడు… సుగ్రీవుడి భార్య రుమను తనే ఏలుకుంటాడు… అంతకుముందు సుగ్రీవుడు కూడా అన్న ఎలాగూ లేడని వాలి భార్య తారను ఏలుకుంటాడు…

అది వానర రాజనీతి… అన్నాదమ్ముల్లో ఎవరైనా మరణిస్తే, భార్య సతీసహగమనం చేయడం ఉండదు… జీవించి ఉన్నవారితో  సహజీవనం చేస్తుంది… అంతేతప్ప, భార్యల విషయంలో కామంతో ఒళ్లు కొవ్వొక్కి, ఒకరి భార్యపై ఒకరు కన్నేసుకుని, మోసం చేసుకోవడం కాదు… దానికోసమే తన్నుకోవడం కాదు… ‘‘ముందు నుంచే తమ్ముడి భార్యపై వాలి కన్నేయడమే గొడవలకు, అన్నాదమ్ముల తన్నులాటకు కారణం’’ అని తేల్చేయడం వెనుక ఉన్న పాత్రికేయ జ్ఞానం స్థాయి ఏమిటి..? వీళ్ల దుంపతెగ… కవలలు అనగానే వాలి-సుగ్రీవులు గుర్తుకొచ్చి, ప్రతి వార్తకూ ఏదో ఒక పురాణ అధ్యాయంతో లింక్ పెట్టడం ఏమిటి అసలు..?! అసలు…… వద్దులెండి…!!

Share this Article






Advertisement

Search On Site

Latest Articles

  • ఉక్రెయిన్ సంక్షోభం..! రష్యాలో మన రిటెయిలర్లకు భలే చాన్సు..!!
  • గుప్తగామిని..! 18 ఏళ్ల క్రితమే పవిత్ర హైదరాబాద్‌కు చక్కర్లు కొట్టేది… ఎందుకు..?!
  • ఒకప్పుడు పొట్టతిప్పల చిరుద్యోగం… ఈ ‘‘యాక్టింగ్ సీఎం’’ ప్రస్థానం ఇంట్రస్టింగ్…
  • హబ్బ… మక్కీకిమక్కీ ఆ కథ మొత్తం ఏం కొట్టేశావు బాసూ…
  • నక్సలైట్ల గురించి తెలియకుండా ఈ సినిమాలు ఏమిట్రా నాయనా..?!
  • మోడీ మళ్లీ ప్రధాని కాగానే 50 రాష్ట్రాలు… 50 united states of India..!
  • ఈ ఆనందం పేరేమిటంటారు ఆంధ్రజ్యోతి మహాశయా..?
  • నిరోధ్ వాడితే కేసు..! పిల్స్ దొరికితే జైలు..! కాపర్ టీ వేసుకుంటే అరెస్టు..!!
  • ఆనంద్ దిఘే..! ఏకనాథ్ షిండేకు పదునుపెట్టిన ‘పెదరాయుడు’…!
  • అరివీర కంపర పాత్రికేయం..! లోలోతుల్లోకి ఇంకా వేగంగా తెలుగు జర్నలిజం…!!

Archives

Copyright © 2022 · Muchata.com · Technology Support by CultNerds IT Solutions