రాహుల్ గాంధీ పదే పదే పార్టీలోని సీనియర్లే పార్టీకి శాపం, గ్రహణం అని ఎందుకు బాధపడుతూ ఉంటాడో చాలామంది అర్థం కావడం లేదు… మా బాసుకు ఏమిటీ పిచ్చి అని విసుక్కునే పార్టీ కేడర్ కూడా ఉన్నారు… కానీ వాళ్లకు కూడా ఈరోజు వీహెచ్ మాట్లాడిన మాటలు చూస్తే అర్థమైంది… ఇక మా పార్టీ బాగుపడటం కల్ల అనే నిరాశ కూడా కమ్మేసి ఉంటుంది… ఉన్న బలాన్ని కత్తిరించుకోవడంలో కాంగ్రెస్ తరువాతే ఏ పార్టీ అయినా..!
నిజం… పార్టీలో డెమొక్రటిక్ వాతావరణం అవసరమే… కానీ అది అరాచకం స్థాయిలో ఉండొద్దు.,. క్రమశిక్షణ కనుమరుగై, జనం ఏవగించుకునే స్టేజ్ వస్తే పార్టీ మూలాలకే ఎసరు… రేవంత్‌రెడ్డి శుద్ధపూస ఏమీ కాదు… అలాగని పాపం, తనూ చెప్పుకోవడం లేదు… ఈరోజు కేసీయార్‌ను ఢీకొట్టాలంటే జనారెడ్డిలు కాదు… రేవంత్‌రెడ్డిలే కావాలని కొందరి భావన… పార్టీ అలాగే అనుకుంటోంది…
కాకపోతే కాంగ్రెస్ కదా… భయపడుతోంది… సీనియర్లు అందరూ ఏం పెంట పెడతారో అని.., అందుకే ఆగీ ఆగీ, నాన్చీ, నాన్చీ… చివరకు మధ్యేమార్గంగా ఓ వర్కబుల్ సొల్యూషన్ కు వస్తోంది… రేవంతుడు పీసీసీ, శ్రీధర్‌బాబు సీఎల్పీ, కోమటిరెడ్డి సీడబ్ల్యూసీ, ప్రచార కమిటీకి భట్టి, వర్కింగ్ ప్రెసిడెంట్లు సంపత్, యాష్కి, షబ్బీర్… మరీ అవసరమైతే మరో ముగ్గురు నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఇంకా అవసరమైతే అయిదారుగురు వర్కింగ్ సెక్రెటరీలు, పదీపన్నెండు మంది ప్రచార కమిటీ చైర్మన్లు, సెక్రెటరీలను కూడా వేసుకోవచ్చు.., మన పార్టీ మన ఇష్టం…
Ads
ఉన్నంతలో బెటరే… మైనారిటీ, ఎస్సీ, బీసీ, రెడ్డి తదితరాలన్నీ కవరయ్యాయి… కానీ వీహెచ్‌కు నచ్చలేదు… హైకమాండ్ మీద ఎగిరాడు… ‘‘ఎప్పుడు నేను నోరు జారీ మాట్లాడలేదు, అవినీతి చేయలేదు, భూ కబ్జాలు చేయలేదు… నాకు ఎందుకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదో అర్థం కావడం లేదు… వాస్తవాలు చెబుతాననే కొందరు నన్ను కలువనివ్వడం లేదు… ఏ ఎన్నికలో ఓడిపోయినా ఎందుకు రివ్యూ జరుగదు… గ్రేటర్ లో రేవంత్ రెడ్డి 48 డివిజన్లు బాధ్యతలు తీసుకున్నాడు, కేవలం ఇద్దరిని గెలిపించిండు, కోమటిరెడ్డి రెండు మున్సిపాలిటీలు గెలిపించిండు, రేవంత్ రెడ్డి ఎన్ని గెలిపించిండు..? టీడీపీని ముంచిండు, ఇప్పుడు కాంగ్రెస్ ను ముంచాలని చూస్తున్నాడు… రేవంత్ గతంలో సోనియాకు సమాధి కట్టాలన్నాడు… రాహుల్ పై తీవ్ర విమర్శలు చేసిండు… రేవంత్ రెడ్డి మీద ఓటుకు నోటు, భూ కబ్జా కేసులు ఉన్నాయి… ఆయనకు పీసీసీ ఇస్తే జైల్ చుట్టూ తిరగాలా..?
మానిక్ ఠాగూర్ నా ఫోన్ ఎందుకు ఎత్తడం లేదు..? ఢిల్లీ వాళ్లు ఏది చెబితే అది వినాలా..? కాంగ్రెస్ లో కొందరు డబ్బులకు అలవాటు పడ్డారు… షబ్బీర్ అలీ అప్పుడు ఎంఐఎంకు మద్దతు ఇచ్చిండు, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కు మద్దతు ఇస్తున్నడు… ఇలాంటి వారి వల్లే నష్టం జరుగుతోంది… విజిటింగ్ కార్డులు ప్రింట్ చేస్తానని నేతల చుట్టూ తిరిగిన రేవంత్ కి ఇన్ని కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి…? ఆయన చరిత్ర మాకు తెలుసు.. బీసీలకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలి, లేదంటే ఒరిజినల్ రెడ్డికి ఇవ్వాలి… అందరూ నేతలు అసంతృప్తిగా ఉన్నారు, మల్లు రవి ఎందుకు రేవంత్ కు చెంచాగిరి చేస్తున్నాడో అర్థం కావడం లేదు..? మానిక్ ఠాగూర్ ప్యాకేజీలకు అమ్ముడుపోయిండు… సోనియాకు తప్పుడు రిపోర్టులు ఇచ్చిండు… అధిష్టానానికి అన్ని వివరాలు చెప్పినా ఆయనకే పీసీసీ ఇస్తే మా నిర్ణయం మేము తీసుకుంటాం…’’
ఇన్ని మాటలు మాట్లాడినట్టు మీడియాలో వినిపిస్తోంది, కనిపిస్తోంది… బీసీలకు పీసీసీ అడగడం న్యాయమే… డౌట్ లేదు… మరి అన్యాపదేశంగా జగ్గారెడ్డికి, కోమటిరెడ్డికి డప్పు ఎందుకు..? గెలిపించడమే అర్హత అయితే వీహెచ్ ఏం గెలిపించాడు..? నగర ప్రధాన నేత కదా, మొన్న గ్రేటర్లో ఏం చేశాడు..? షబ్బీర్ ఆర్ఎస్ఎస్ ఏమిటి..? అసలు రేవంత్ ఒరిజినల్ రెడ్డి కాకపోవడం ఏమిటి..? పార్టీ పరువును బజారుకీడ్చి బద్దీబదనాం చేసే వాళ్లను ఎందుకు హైకమాండ్ ఉపేక్షించాలి..? పార్టీ ప్రకటనే రాలేదు… అప్పుడే స్టార్ట్…
వీళ్లు మారరు… రేవంతుడో, ఇంకెవరో… బండిని అసలు కదలినిచ్చేట్టు లేరు… జనం స్వచ్చందంగా ముందుకొచ్చి, మాకు కేసీయార్ నచ్చడం లేదు, బీజేపీని నమ్మలేం, మీకే వోట్లేస్తాం అని ఉద్యమించినా సరే… మీరెవడ్రా వోట్లేయడానికి అని తరిమేట్టున్నారు ఈ నాయకులు..? నిజమే… కాంగ్రెస్ ముందు పూర్తిగా ప్రక్షాళన చేసుకుని మరీ తదుపరి కార్యాచరణకు దిగితే బెటర్… మరి వీహెచ్ ఏం చేయాలీ అంటారా..? తక్షణం ఓ ప్రాంతీయ పార్టీ పెట్టేసి, పాదయాత్ర స్టార్ట్ చేసేసి… ఇటు కేసీయార్, అటు మోడీ, మధ్యలో తన పాత కాంగ్రెస్ నేతలకు కూడా ముచ్చెమటలు పట్టించాలి… అంతే… జై వీహెచ్… జైజై వీహెచ్…
Share this Article