మొన్న ఒకాయన ఓ ఫంక్షన్ చేశాడు… ఈమధ్య కామనే కదా, మందు కూడా పెట్టాడు… మంచి స్కాచ్ సీసాలు టేబుళ్లపై పెట్టాడు… కొందరు ఫుల్ బాటిళ్లు ఖాళీ చేసి కూడా అసంతృప్తిగా మొహాలు పెట్టారు… వాళ్లకు ఆనలేదు… మళ్లీ వాళ్లకు చీప్ లిక్కర్‌కు ఎక్కువ, ప్రీమియంకు తక్కువ బాపతు సీసాలు తెప్పిస్తే తప్ప వాళ్ల మొహాలు తేటపడలేదు… ఎస్, నాటు అలవాటైనవాడికి నీటు ఎక్కదు… కాదు, కడుపులోకే దిగదు… మన కేసీయార్ సర్కారు ప్రజల మీద అత్యంత దయతో అనుమతించిన కల్లు అంగళ్ల మాటేమిటి..? అసలు కల్లు తప్ప అనేక రకాల ఆర్టిఫిషియల్ కల్లు లభ్యం… అది తాగేవాడికి ఇంకేదీ అవసరం లేదు…

మేం బొచ్చెడు జిల్లాల్ని నాటుసారా నుంచి విముక్తి చేశామహో అని ఆబ్కారీ వాళ్లు చెప్పారు, మనం నమ్మాలి… కానీ ఊళ్లల్లో ఇప్పటికీ గుడుంబాదే రాజ్యం… దుకాణంలో బెల్లం ముక్క దొరికితే చాలు వ్యాపారులను కేసులపాలు చేసి, వేధించి, డబ్బులు వసూలు చేసి… ఎహె, అదంతా నాటుసారా తయారీని మించిన దందా… ఇప్పసారా అంటారా..? అది ప్యూర్ అండ్ ట్రెడిషనల్… మరి మరీ నాటు అండ్ ఘాటు…ఆ టేస్టుకు, ఆ రేంజుకు అలవాటు పడిన వాళ్లకు ఈ తొక్కలో స్కాచులు, ఫారిన్ బ్రాండ్లు జుజూబీ… కూల్ డ్రింక్ తాగినట్టు కూడా ఉండదు… చచ్చిపోయి ఏలోకాన ఉన్నాడో గానీ ఎన్టీవోడు ఆదాయం కోసం చేసినా చాలామంది నోళ్లలో ప్యూర్ మత్తు నింపాడు… వారుణివాహిని పేరిట కల్తీలేని సారాను పోశాడు,.. బుజ్జిముండలు, చిన్న చిన్న పాకెట్లలో చేరి, జేబుల్లోకి దూరి… నాలుకకు తీటపుట్టగానే నోళ్లలోకి పారి… చెలరేగిపోయింది..! ఇప్పుడు దాని ప్లేసును చీప్ లిక్కర్ ఆక్రమించింది, అనగా రంగుసారా… పెద్ద తేడా ఏమీ ఉండదు, బెల్లంసారాకు, ఈ రంగుసారాకు… కాకపోతే ఈ రంగుసారా జేబులు ఖాళీ చేస్తుంది, సర్కారు ఖజానా నింపుతుంది… అంతే తేడా…

mandakini

ఈ సీసా చూడండి… పేరు మందాకిని… పేరులోనే మందు ఎంత మత్తుగా ధ్వనిస్తున్నదో… బ్రాండ్ పేరు అంటే ఇలా ఉండాలి… కాస్త జాగ్రత్తగా పరిశీలించండి… తెలుగులో కూడా నాటుసారా అని కనిపిస్తుంది… తమిళం, మలయాళం, సింహళం భాషల్లోనే కాదు, హిందీలో కూడా ముద్దుగా దేశీదారు అని రాసి ఉంటుంది… అంటే నాటుసారా అనే అర్థం… సంప్రదాయిక, కాలాతీత విలువ కలిగిన సారాను అమ్ముతాం అంటోంది ఈ కంపెనీ… దీనికీ ఓ కథ ఉందండోయ్… కేరళలో పత్తా చరయం లేదా వాత్తు చరయం అంటారు, నాటుసారాను… స్థానిక తయారీ… దాన్ని 23 ఏళ్ల క్రితం నిషేధించారు… మన ప్రభుత్వాలకు రంగుసారా ఆదాయం కావాలి తప్ప ఈ సారా వద్దు కదా… నిషేధం తరువాత కూడా దాని తయారీ ఆగలేదు… ఆబ్కారీ వాళ్లు ఆ సారాను, తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకోవడం, కేసులు పెట్టడం పరిపాటి అయిపోయింది… మన దగ్గర వంద లీటర్ల బెల్లం పానకం ధ్వంసం అని పిచ్చి వార్తలు కొన్ని పత్రికల్లో కనిపిస్తాయి కదా… అలాంటివి… అయితే కొందరు ఇళ్లల్లోనే తయారు చేసుకుంటారు, రహస్యంగా పెళ్లిళ్లలో సర్వ్ చేస్తారు…

బెల్లం, చెరుకు రసమే కాదు, కొన్నిరకాల స్పైసెస్ కూడా కలిపి తయారు చేసే ఆ సారాకు అభిమానులు ఎక్కువ… ఈ మందానికి విషయానికి వద్దాం… దీన్ని ఎర్నాకుళానికి చెందిన అబిష్ చెరియన్, ఎలియాన్ చెరియన్, సరీష్ కుంజప్పన్ అనే ముగ్గురు సోదరులు తయారు చేశారు… మలబారి వాత్తే అని పేరు పెట్టారు… కానీ ఇక్కడ కాదు, కెనడాలో..! ఇటలీ రూట్స్ ఉన్న డాన్ డిమాంటే అనే ఓ వ్యాపారి లాస్ట్ స్ట్రా అనే తన డిస్టిలరీల నుంచి దీన్ని మార్కెట్ చేస్తున్నాడు… సేమ్, అచ్చు కేరళ సంప్రదాయ నాటుసారాయే… ‘‘రెండుమూడేళ్లుగా దీనికోసం కష్టపడుతున్నాం… మా బ్రదర్ 2005లో కెనడా వచ్చాడు, ఏవేవో జాబ్స్ చేశాడు, వాడికి కేరళలోని ఈ సారా మాత్రమే కాదు, చాలారకాల లిక్కర్ టేస్టులు తెలుసు… అందుకే ఈ ఆలోచన వచ్చింది, కానీ కెనడాలో డిస్టిలరీ పర్మిషన్ అంత వీజీ కాదు… ఈ సారాకు ప్రేమికులు ఉన్నారు, ఉంటారని తెలుసు కానీ సరైన తయారీ, సరైన మార్కెటింగ్ ఎలా..? అందుకే డిమాంటే సపోర్ట్ తీసుకున్నాం… ఇంకా ఔట్‌లెట్లలో అమ్మకాలకు పర్మిషన్ రాలేదు, కానీ జనం ఎగబడి డిస్టిలరీ దాకా వచ్చి కొంటున్నారు…’’ అంటున్నాడు అబిష్ చెరియన్…

‘‘నిజం చెప్పాలంటే మాకు వ్యాపారం తెలియదు, బేసిక్స్ కూడా తెలియవు, ఈ సారా తయారీ ఓ ప్యాషన్‌లా చేపట్టాం… ఆ మసాలాలన్నీ కెనడాలో దొరుకుతాయి, ఎందుకు తయారీ చేపట్టకూడదు అనే ఆలోచన వచ్చాక డిమాంటేను కలిశాం, ఆయనే చాలా విషయాలు నేర్పించాడు మాకు… కేరళలో బెల్లమే కాదు, కాజు, పైనాపిల్, ద్రాక్ష కూడా వాడుతుంటారు ఈ సారా తయారీకి… దీన్ని ఇష్టపడేవాళ్లు తమిళులు, శ్రీలంకలోని తమిళులు, మలయాళీలు… కన్నడ, తెలుగు కొంతమేరకు… అందుకే అయిదు భారతీయ భాషల్లో దీని పేరును రాశాం… కెనడాలో సౌతిండియన్లు భలే ఇష్టపడుతున్నారు… పంజాబీలు, కొందరు మహారాష్ట్రీయులు కూడా దీన్ని ఇష్టపడతారు…’’ అంటున్నారు ఈ మందాకిని బ్రదర్స్… వాట్సప్ గ్రూపుల్లో ఈ సీసా ఫోటో పెట్టగానే జనం ఎగబడ్డారు, ఈ రష్ చూసి డిమాంటే కూడా షాక్ తిన్నాడుట… డిస్టిలరీ దగ్గర సీసాను చేత్తో పట్టుకుని సెల్ఫీలు దిగుతూ, షేర్లు చేస్తూ తెగసంతోష పడుతున్నారట కొందరు నాటుసారా ప్రేమికులు… డిస్టర్బ్ చేయకండి, వాళ్ల అమ‌ృతం వాళ్లకు దొరికింది… మీరిక కుమ్మేయండి బ్రదర్స్…!!