హహహ… అదే అరాచకమైన సెటైర్… పేరడీ… స్పూఫ్… ఏదైనా అనండి… సినిమాలోనే కాదు, చివరకు తమ ప్రచారంలోనూ అదే స్టయిల్… మొన్నీమధ్య ఓ ముచ్చట పోస్టు మీద ఫేస్‌బుక్‌లో చర్చ జరిగింది… ఇంతకు ముందు సినిమాలు ఎన్ని వారాలు నడిచాయి అనే ప్రచారప్రకటనలు కనిపించేవి, అవి మెల్లిమెల్లిగా రోజుల్లోకి వచ్చాయి… విజయవంతమైన 50 వ రోజు, 100వ రోజు… ఇలా… అదీ తగ్గిపోయి విజయవంతమైన 7 రోజులు, 8 రోజులు అన్నట్టుగా పడిపోయాయి… నిజమే… పడిపోయాయి… చాలామంది నెటిజన్లు రాబోయే రోజుల్లో విజయవంతమైన రెండు షోలు, మూడు షోలు అన్నట్టుగా మారబోతున్నది, లేదంటే కలెక్షన్ల లెక్కలు మాత్రమే విజయానికి ప్రాతిపదికలు కాబోతున్నాయి అని వ్యాఖ్యలు చేశారు… సేమ్… కొబ్బరిమట్ట… విజయవంతమైన 50 గంటలు అని ప్రకటనలకు దిగేశారు నిర్మాతలు… దీన్ని కూడా ఓ సెటైర్‌లాగా భావించాలి… అచ్చం ఆ సినిమాలో కథ, ట్రీట్‌మెంటులాగే… అవునేమో… నిజంగానే రాబోయే రోజుల్లో గంటల్లో విజయాల్ని లెక్కించుకునే రోజులు రాబోతున్నాయేమో… మహేష్ కత్తి అయితే ఏకంగా ఈ సినిమా ప్రదర్శించడం లేదని ఏదో ఊళ్లో ఎవరో టవర్ ఎక్కాడట, అదీ షేర్ చేసుకున్నాడు… ఇవన్నీ సరే, సరే…
చాలామంది అడిగే ఓ ప్రశ్న… సినిమాపై వినిపించే విమర్శలకు జవాబులు ఇస్తున్నారు అందరూ తప్ప సినిమా ఎలా ఉందో చెప్పడం లేదు అని..! చాలా క్లిష్టమైన, కష్టమైన ప్రశ్న… గొట్టు ప్రశ్న… ఎందుకంటే..? కొబ్బరిమట్ట ఏ ఈక్వేషన్‌లోనూ ఇమడదు… సంప్రదాయిక సూత్రాల్లో విశ్లేషణలు కూడా కుదరవు… ఆ కథ, ఆ సినిమా ఓ పేరడీ… కాదు, ఓ సెటైర్… అది చూడాలనుకునే ప్రేక్షకులు ముందుగానే ఓ మైండ్ సెట్‌తో వెళ్లాలి… వర్తమాన దక్షిణాది సినిమాల ట్రెండ్స్ మీద, కథల మీద, కథనాల మీద, కంటెంటు మీద, హీరోల ధోరణుల మీద సంధించిన ఓ పాశుపతం అది…
పాశుపతం అని ఎందుకని అనుకోవాలీ అంటే..? మన దైవాంశసంభూతులైన, నయా దేవుళ్ల మీద, వాళ్లకుండబడే భక్తగణం మీద, వాళ్ల ‘అభి’మతాల మీద కొబ్బరిమట్ట ఓ భారీ సెటైర్… ఇదొక సాహసం… ఎందుకంటే..? పత్రికల్లో, టీవీల్లో, సోషల్ మీడియాలో వీసమెత్తు విమర్శ వచ్చినా తట్టుకోలేని రోజులు… అలాంటిది తన చుట్టూ ఉన్న సినిమా ప్రపంచం మీద ఇంతటి సెటైర్లు వేసే ఓ సినిమా తీయడమే ఓ పెద్ద సాహసం… అది కొబ్బరిమట్ట సినిమా ఉద్దేశం… రెగ్యులర్ సినిమా కథ, కథనం, నటీనటుల పర్‌ఫామెన్స్ ఎట్సెట్రా లెక్కల్లో చూడొద్దు దాన్ని… ముందే మైండ్ మేకప్ చేసుకునే సినిమాకు వెళ్లాలి… పాత సినిమాలను, మన సినిమాల ట్రెండ్స్‌ను దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఆ సినిమా చూడాలి… అప్పుడు దాన్ని ఎంజాయ్ చేయగలం, అది రెగ్యులర్ సినిమా కాదు… రొటీన్ భజనకథనాల నడుమ విమర్శనాత్మక వ్యంగ్య కథనాలు కనిపిస్తే ఎలా చదువుతామో ఆ కోణంలోనే దాన్ని చూడాలి…
ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే..? మన్మథుడు-2 అనే ఓ ఈటీవీ జబర్దస్త్‌కు తాత లాంటి ఓ వల్గర్ సినిమాను తెలుగు ప్రేక్షకుడు అడ్డంగా తిరస్కరించాడు… ఫోఫోవయ్యా, నువ్వేంటీ నీ స్టేచర్ ఏమిటి..? ఈ అశ్లీల, ఈ అసభ్య సినిమా ఏంటీ అని సగటు తెలుగు ప్రేక్షకుడు ఛీకొట్టేశాడు… ఈ స్థితిలో దాని పరాజయం రాక్షసుడు అనే ఓ రీమేక్ థ్రిల్లర్‌కు కలిసొచ్చింది… అసలే బెల్లంకొండ… ఇంకా నటనలో ఓనమాలు దిద్దడానికే కిందామీద పడుతున్నాడు, కానీ సినిమాలోని కంటెంటు పుణ్యమాని మొదటిసారి ఓ హిట్ ఎంజాయ్ చేస్తున్నాడు… నాగార్జున మరీ వర్మగారి ఆఫీసర్ స్థాయిలో అడ్డంగా చతికిలపడటం, మార్కెట్‌లో ప్రస్తుతానికి వేరే మంచి సినిమాలు ఏమీ లేకపోవడంతో బెల్లంకొండ రాక్షసుడికి కలిసొస్తున్నది… లక్కు… ఈ నేపథ్యంలో ‘‘విజయవంతమైన 50 గంటలు’’ అనే కొబ్బరిమట్ట సినిమా ప్రచారం రియల్లీ… అది కూడా ఓ సెటైర్… కీపిటప్ సంపూ… నువ్వు ఉండాల్సినోడివే బాసూ… గో ఎహెడ్ ఆండ్రాయుడూ…