……….. కలెక్టర్ల సదస్సులో సీఎం కేసీయార్ వెలిబుచ్చిన అభిప్రాయం ఇది… అవును, కేసీయార్ ను మెచ్చుకోవాలి… దాచిపెట్టుకునే ప్రయత్నమేమీ లేకుండా కుండబద్ధలు కొట్టినట్టు తన పాలనపై ఏదో అసంతృప్తి ఉందని తనే చెప్పడానికి చాలా సాహసం కావాలి… ఇక్కడ డంబాచారాలు ఏమీ లేకుండానే తను నిజం చెప్పాడు… ప్రజల్లో పాలనపై ఏ అభిప్రాయం ఉందనే విషయం రకరకాలుగా సర్వేల్లో, తనదైన మార్గాల్లో ఎప్పటికప్పుడు తెలుసుకునే కేసీయార్ ఉన్నమాటే చెప్పాడు… కానీ నిజమే… ఎందుకీ అసంతృప్తి..? తెలంగాణ సమాజంలో అసంతృప్తి పెరుగుతున్నందుకు కారణమేందీ..? వాళ్లేం కోరుకున్నారు…? ఏం జరుగుతున్నదనే అంశంపై నిజాయితీగా ఎవరైనా విశ్లేషించే వాతావరణం ఉందా..? దీనిపై నిర్మాణాత్మక చర్చ గానీ, సూచనలు గానీ ఇవ్వగల స్వేచ్ఛ ఉందా..? కేసీయార్ పాలన తీరుపైనో, ప్రభుత్వ విధానాలపైనో స్థూలంగా ప్రజల్లో ఏ భావన ఉందనేది కాస్త పక్కనపెడితే… తన ఎమ్మెల్యేలు, తన మంత్రుల వ్యవహారాలు కేసీయార్ కు, పార్టీకి తీవ్ర వ్యతిరేకతను పెంచుతున్నాయనే విషయం కేసీయార్ కూ తెలుసు… ఈ స్థితిలో రాజకీయ అవినీతి, ప్రజాప్రతినిధుల విచక్షణాధికారాల సమీక్ష, సవరణ లేకుండా… పార్టీ ఇమేజీ కాపాడుకోవడం, తన ప్రతిష్ట కాపాడుకోవడం సాధ్యమేనా..? ఓ కలెక్టరో, ఓ జాయింట్ కలెక్టరో ఇవన్నీ తెలిసీ చేయగలిగేది ఏముంటుంది…?
సుదీర్ఘ కాలశోధన అక్కర్లేదు… జస్ట్, చిన్న చిన్న ఉదాహరణలకు…. ఈరోజు ఇదే ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఒకటీరెండు వార్తల్నే తీసుకుందాం… రంగన్న గుడిని, గుడి స్థలాన్ని చెరబట్టిన మంత్రికి సంబంధించిన ఫాలోఅప్… ఇలాంటి నాయకుడిని తెలంగాణ సమాజం అసలు కోరుకుందా..? తీసుకొచ్చి నెత్తిన పెట్టుకున్నది కేసీయారే కదా… ఆ మంత్రిని కేసీయార్ ఏం చేయగలడు..? అదే మంత్రి నగరంలో చేసే పనులు కేసీయార్ కు తెలియవా..? ఇవి అంతిమంగా కేసీయార్, టీఆర్ఎస్ పై వ్యతిరేకతను పెంచడం లేదా..? నగరంలో ప్రతి కార్పొరేటరూ ఓ ఎమ్మెల్యే, ఓ మంత్రిగా, రాజ్యాంగేతర శక్తులుగా మారి, కేవలం సెటిల్మెంట్లు, వసూళ్లే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనేదీ కేసీయార్ కు తెలుసు… నగరాన్ని దత్తత తీసుకున్న కాబోయే ముఖ్యమంత్రి కేటీయార్ కూ తెలుసు… పోనీ, జిల్లాల్లో ఏం జరుగుతున్నది…? కొమురవెల్లి మల్లన్న ప్రాంగణంలో నానా భ్రష్టాచారాలకు తెరతీస్తున్న ఎమ్మెల్యే బాగోతాలపై, అక్రమాల అధికారులపై వార్తలు రాసినందుకు గాను ఇదే ఆంధ్రజ్యోతి సిద్దిపేట రిపోర్టర్ పై ఎమ్మెల్యే చెప్పగానే, పోలీసులు కేసు పెట్టేశారు… ఇది ఏమని సంకేతాలిస్తున్నది..? ఈ ఒక్క ఎమ్మెల్యేనే కాదు, 60, 70 శాతం ఎమ్మెల్యేలు వాళ్ల నియోజకవర్గాలకు ముఖ్యమంత్రులుగా వ్యవహరించడం లేదా…? వీళ్లను పాత ఎమ్మెల్యేలతో పోల్చుకోదా తెలంగాణ సమాజం..? ఏం మార్పు వచ్చిందనే అసంతృప్తి కలగదా..? ఆశలు అధికంగా ఉన్నప్పుడు, అవి భంగపడినప్పుడు కలిగే అసంతృప్తి మరింత అధికంగా ఉంటుంది… గతంలో తెలంగాణ సమాజానికి ఏ నష్టం జరిగినా మాట్లాడిన, రాసిన, వాదించిన, పోరాడిన గొంతులన్నీ ఇప్పుడు అధికార పదవుల్లో పదిలంగా కూర్చుని, కిమ్మనని వైనం అందరూ గుర్తించడం లేదా..? ఇలా విశ్లేషిస్తూ పోతే ఎన్నో, ఎన్నెన్నో…
తప్పు ఎక్కడ జరుగుతుందో కేసీయార్ కు బాగా తెలుసు… కొరఢా పట్టుకోవాల్సింది తనే… అది చేయగలడా..? అదే అసలు ప్రశ్న…!!