Muchata.com Telugu Latest News

Muchata.com Provided Telugu Latest News, Political News , Political News, Breaking News in Telugu LIVE ముచ్చట

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తడి ఎండిన తెలుగు కలాలు..! కన్నీటి సిరాకు దూరదూరంగా…!!

January 2, 2021 by M S R

నిజమే, ఓ మిత్రుడు బాధపడినట్టు…. కరోనా ఎన్ని పాఠాలు నేర్పింది మనిషికి..? నేర్పిస్తూనే ఉంది..? మళ్లీ మనం చూస్తామో చూడమో ఇలాంటి విపత్తును… ప్రపంచం మొత్తం వణికిపోయింది… పోతున్నది… ఈ భూగోళానికి కుదిపేసే ఇలాంటి విపత్తు వస్తే… మతం ఏమిటి..? కులం ఏమిటి..? ప్రాంతం ఏమిటి..? అసలు దేశం ఏమిటి..? మనిషన్నవాడే మిగుల్తాడా మిగలడా అన్నంత కలవరం… కానీ ఒక్క కలమూ కదల్లేదేం..? ఒక దర్శకుడికీ, ఒక్క నిర్మాతకూ మనసు కదల్లేదేం..? ఇన్ని సీరియళ్లు, ఇన్ని పత్రికలు, ఇన్ని టీవీలు, ఇన్ని సినిమాలు… అసలు వైరాగ్య భావనను వదిలేసిన కళకు అర్థమేముంది..?

deaths

నిజానికి నిర్వేదాన్ని, వైరాగ్యాన్ని బోధించనిదే ఏ కళకైనా పరమార్థం ఏముంది…? అదే కదా మనిషికి తన పరిమితులేమిటో, తనెంతటి అల్పజీవో చెప్పేది… తన ఊపిరి ఎంత బుద్భుదప్రాయమో తెలిపేది..? రొమాన్స్, వినోదం మాత్రమే కాసులు కురిపిస్తాయనే పిచ్చి భ్రమ మనల్ని ముంచెత్తి… చివరకు కరోనా కూడా కళ్లు తెరిపించలేదా..?

లక్షల మంది వలస కార్మికులు బతుకు జీవుడా అంటూ పిల్లాపాపలతో వందల కిలోమీటర్లు నడుస్తూ సాగించిన ప్రస్థానం మీద మాత్రం ఒకరిద్దరు గుండెలు కదిలిపోయేలా పాటలు రాశారు, పాడారు… లక్షల మందితో కన్నీళ్లు పెట్టించారు…

పిల్ల జెల్లా ఇంటికాడా ఎట్ల ఉండ్రో అంటూ ఆదేశ్ రవి సరళమైన పదాల్లో రాసిన వ్యథాగీతం అల్టిమేట్… కానీ సోకాల్డ్ కమర్షియల్ కలాలు కదల్లేదు… మనిషి కన్నీరు కూడా కళావస్తువే అనే సోయి లేకపోవడం, టేస్ట్ లేకపోవడం, బాధ్యత లేకపోవడం… నిష్ఠురంగా ఉన్న నిజం అదే…

ఎన్ని చూశాం ఉదాహరణలు ఈమధ్యే… వందల కోట్ల ఆస్తులుండీ… చివరి క్షణాల్లో ఎవరూ లేక… అనాథల్లాగా సర్కారు స్మశానవాటికల్లో కాలిపోయిన శవాల్ని.! చితి దగ్గర ఒక్క కన్నీటిబొట్టుకూ నోచుకోని చావుకు మించిన దరిద్రం జీవితంలో ఏముంటుంది..? ఒక్క పదం, ఒక్క గేయం, ఒక్క పాట ఈ దురవస్థను, ఈ దుఖాన్ని పట్టుకోగలిగిందా..? కళకు ఇంతకుమించిన దరిద్రం ఇంకేముంటుంది..?

deaths1

రాయగల సత్తా ఉన్న రచయితల కలాలు కథానాయికల కాళ్ల చుట్టూ, తొడల చుట్టూ పరిభ్రమిస్తూ… వాళ్ల పాదాల మీద పారాడుతున్నయ్… కాసుల కోసం తప్పదేమో… కానీ తన గుండెలో ఎక్కడో ఇంకా మిగిలి ఉన్న తడి కూడా ముఖ్యమే కదా… యూట్యూబ్ వ్యూస్ లెక్కేసుకుంటూ మురిసిపోదాం సరే, కానీ నెలల తరబడీ కనిపించని భయంలో బందీలై బతుకుతున్నాం కదా, మనిషిని వైరాగ్యపు భావనల్లోకి తీసుకెళ్లగలిగే ఒక్క పాటేది..?

పాత రోజుల్లోనూ సినిమాలు తీశారు, వాళ్లూ కాసుల కోసమే తీశారు… కానీ జీవితం తాలూకు ప్రతి ఎమోషన్‌ను పట్టుకున్నారు… ఇప్పటికీ చాలా భాషల్లో సినిమాలు మనిషి ఉద్వేగాల్ని ఆవిష్కరించే దిశలో చాలా ఎఫర్ట్ పెడుతున్నారు… ఎటొచ్చీ నాయికల కాళ్లను వదిలేసి రాలేని దరిద్రం మాత్రం మన తెలుగుదే… పదవులు, రాజకీయాల యావలో పడిపోయిన ప్రజాకలాలూ మినహాయింపు కాదు… అవీ ప్రజలను ఏనాడో వదిలేశాయి… అప్పుడెప్పుడో తిక్కరేగి, తిమ్మిరెక్కి బలిసిపోయిన సినిమాపాట ఆనాటి నుంచీ మారనేలేదు… తీయని దెబ్బ అని మూర్ఛనలు పోతూ, అమ్మడూ కుమ్ముడూ దాకా ఎన్ని వయ్యారాలు ప్రదర్శించిందో గానీ వేరే ఉద్వేగం జోలికి వెళ్తే ఒట్టు…

కానీ…. అప్పట్లో వచ్చిన ఓ పాట… ఈ జీవనతరంగాలలో… అల్టిమేట్… ఆత్రేయ రాసిన గీతం, ఘంటసాల గొంతులో పలికిన విషాదం ఈరోజుకూ అలాంటి వైరాగ్యగీతం మళ్లీ రాలేదు…

deaths2

వాస్తవానికి ఈరోజు కరోనా దుఖానికీ ఈపాటే ఆప్ట్… నేటి అనాథ మరణాలను కూడా తడుముతున్నట్టు ఉంటాయి చరణాలు…

‘‘పదిమాసాలు మోసావు పిల్లలను… బ్రతుకంతా మోసావు బాధలను… ఇన్ని మోసిన నిన్ను మోసేవాళ్ళు లేక వెళుతున్నావు’’

‘‘ఈ జీవన తరంగాలలో, ఆ దేవుని చదరంగంలో, ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకీ బంధము…’’

అవును… ఇప్పుడంటే శవాల్ని బంధువులకు ఇస్తున్నారు గానీ, కరోనా ఉధృతి ఉన్నవేళ సేమ్…

‘‘కడుపు చించుకు పుట్టిందొకరు, కాటికి నిన్ను మోసేదొకరు, తలకు కొరివి పెట్టేదొకరు, ఆపై నీతో వచ్చేదెవరు’’

అసలు ఆ వైరస్ ఓ అర్ధజీవకణం… అది జీవమో కాదో కూడా చెప్పలేం… అలాంటిది భూగోళాన్ని పట్టేసి పకపకా నవ్వుతోంది… ఎన్నో పీనుగలు…

‘‘తాళి కట్టిన మగడు లేడని తరలించుకు పోయే మృత్యువాగదు, ఈ కట్టెను కట్టెలు కాల్చక మానవు, ఆ కన్నీళ్ళకు చితిమంటారవు…’’

కథాసందర్భం వేరు కావచ్చు… కానీ ఈరోజుకూ నిజం అదే కదా… “మమతే మనిషికి బంధిఖానా, భయపడి తెంచుకు పారిపోయినా, తెలియని పాశం వెంటపడి, ఋణం తీర్చుకోమంటుంది, నీ భుజం మార్చుకోమంటుంది” అన్నీ నిజాలే… కానీ నేటి అనాథ మరణాలకు ఆ అవకాశమూ లేదు… గుండెల్లో తడి ఆరిపోయి, మరమనుషుల్లాగా మారిన ప్రతి ప్రసిద్ధ కలానికీ నివాళి అర్పిస్తూ…

Follow Us


Share this Article


Search On Site

Advertisement

Latest Articles

  • సరికొత్త డ్రామా కంపెనీ… ఈటీవీ షో అంటేనే కామెడీ అయిపోయింది…
  • విజ్జెక్క ఆ సీటుకు ఎలా ఆప్ట్..? ఈ ప్రచారం తెరమీదికి తెస్తున్నదెవరు..?
  • ఓహ్… షర్మిల తిరుగుబాటు వెనుక ఇంత భారీ వ్యూహం దాగుందా..?!
  • తెలంగాణ సీఎం కుర్చీ అంత ఈజీయా..? జగన్-షర్మిల వార్… పార్ట్-2…
  • జగన్- షర్మిల డిష్యూం డిష్యూం..! వైఎస్ కుటుంబంలో చీలిక..! పార్ట్-1…
  • రోజాతో ఢీకి ఓంకార్ సై..! వర్షిణికి భలే చాన్స్..! అసలేం జరుగుతున్నదంటే..?!
  • కాకి బంగారం..! అల్లరిపాలైన నరేష్..! బావురుమన్న బాలయ్య టైటిల్..!!
  • లక్-కీ..! దగ్గుబాటి సురేషుడు లక్కీయేనా..? తొక్క మీద కాలేశాడా కొంపదీసి..!
  • పర్ సపోజ్, ఆమె వేరే పెళ్లిచేసుకుంటే… మాజీ భర్త వీర్యంపై హక్కులేమవుతయ్..?
  • తటస్థ నాగేశ్వరా… బీజేపీని తిట్టాలంటే భద్రాచలం రాముడు కావాలా ఏం..?

Archives

Copyright © 2021 · Muchata.com · Technology Support by Rishi Bharadwaj

Add Muchata to your Homescreen!

Add Now