అక్టోబర్ 30, 1988
ఆత్మకూరు (మహబూబ్ నగర్ జిల్లా)
వేంకటేశ్వర స్వామి గుడి బజార్
ఆ వీధిలో చిన్న కాంపౌండ్ లో ఓ చిన్న గది.
రాత్రి 12 గంటల సమయం
ఆ కాంపౌండ్ ఎదుటకు ఒక కమాండర్ జీప్ వచ్చి ఆగింది.
ఆరుగురు వ్యక్తులు జీప్ దిగారు. నలుగురు వ్యక్తులు పిట్ట గోడ ఎక్కి కాంపౌండ్ లోపలికి దూకారు. మిగతా ఇద్దరు జీప్ పక్కన నిలబడ్డారు. గోడ దూకి వెళ్ళిన నలుగురు అందులోని ఒక గది తలుపులు దబ దబా బాదగా, ఓ వ్యక్తి డోర్ తీసుకొని బయటికి వచ్చారు. వచ్చిన వ్యక్తులు తోసుకొని లోపలికి వచ్చి, ఆ తలుపు తీసిన వ్యక్తి రెండు చేతులు వెనక్కి విరిచి పట్టుకొని ‘‘ఏం రా, నువ్వు విలేఖరివి అయితే, ఏమైనా తీసుమార్ కాన్ అనుకున్నావా… రెడ్డి సాబ్ పిలుస్తుoడు పద‘‘ అని గదమాయించారు. ‘‘ఏ రెడ్డి సాబ్‘‘ అని అతను ప్రశ్నించగా, ఏ రెడ్డి సాబో తెలుస్తది పద … అంటూ బయటికి బలవంతంగా లాగారు. పాంట్ వేసుకుని వస్తా అనగానే చేతులు వెనక్కి విరిచి పట్టుకున్న వ్యక్తి వదిలారు. తలుపు వెనుక తగిలించిన షర్ట్ వేసుకునే లోపే మరొకతను ఇలాగే రా అంటూ… బయటికి లాక్కెళ్లాడు. గేట్ తెరచి జీప్ వద్దకు తీసుకెళ్లగా, అక్కడ సిద్దంగా ఉన్న వ్యక్తులు, అలా లాక్కొచ్చిన అతన్ని లేపి జీప్ లో పడేశారు. జీప్ స్పీడ్ గా వెళ్లి ఓ పెద్ద బంగ్లా ముందు కాంపౌండ్ లోకి వెళ్ళింది. వచ్చిన వారంతా గబగబా జీప్ దిగి, తీసుకొచ్చిన వ్యక్తిని నెట్టుకుంటూ లోపలికి తీసుకెళ్లారు.

అక్కడ విశాలమైన గదిలో ఓ భారీకాయుడు, అతని ముందర మందు బాటిళ్లు, చేతిలో సిగరెట్, ఇరు వైపులా రౌడీల్లా ఉన్న ఓ ఏడెనిమిది మంది… ‘‘ నువ్వేనారా ఆ విలేకరివి‘ అంటూ ఆ భారీకాయుడు ఒక్క ఉదుటున లేచి చెంప చెళ్లుమనిపించారు. బలంగా కొట్టిన దెబ్బకు అతనికి దిమ్మతిరిగి పోయింది. తెలియకుండానే కళ్ళలోకి నీళ్ళు వచ్చేశాయి. ‘‘నేను ఎవరినో తెలియదా, నా సంగతి తెలిసే పెద్ద పీకుడుగానిలా వార్త రాసినవా, ఆఫ్ట్రాల్ ఫోటోగ్రాఫర్ గాడివి‘‘ అంటూ అగ్రహంగా బండ బూతులు తిడుతూ, ఓ చేతిలో మందు గ్లాస్, మరో చేతిలో నీ సిగరెట్ దమ్ము గట్టిగా పీల్చి ముఖం పైకి ఊదుతున్నాడు. ‘‘ నేను ఇక్కడికి వచ్చింది వ్యాపారము చేసుకోవడానికి, రాజకీయాలు చేయడానికి కాదు. నువ్వు నాతోనే రాజకీయం చేస్తావురా!‘‘ అంటూ మరింత రెచ్చి పోయారు. ‘‘ నేను తలుచుకుంటే నువ్వు బతుకుతావారా, మీ పేపర్ ఓనర్ దాసరి తెలుసు, మీ ఎడిటర్ పతంజలి తెలుసు. నా సంగతి నీకేం తెలుసు రా‘‘ అని గట్టిగా అరుస్తూనే ఉన్నారు. మాట్లాడటం కొద్దిసేపు ఆపేసి, తన ముందున్న టీ పాయ్ కింది నుంచి రివాల్వర్ తీసి ఒక వ్యక్తిని కళ్ళతో సైగ చేసి పిలిచి అందించాడు.

అతన్ని ఇంటి నుంచి లాక్కొచ్చినవారు మళ్లీ బయటికి లాక్కెళ్లి, జీప్ మధ్య సీట్లోకి తోసి, ఇరువైపులా ఇద్దరేసి వ్యక్తులు కూర్చున్నారు. జీప్ ముందుకు కదిలి స్పీడ్ గా దూసుకెళ్తోంది. ఏమి అర్ధం కావడం లేదు. అంతా ఒక సినిమాలా, కలలాగుంది. రివాల్వర్ ఇచ్చారంటే చంపడానికి కాకుంటే మరెందుకు ఇస్తారు. రక రకాల ఆలోచనలు, భయము, ఆందోళన. ఇంతలో కురుమూర్తి గుడి గుట్టల మధ్యన జీప్ అగింది. అక్కడ మరో జీప్ సిద్దంగా ఉంది. ఈ జీప్ నుంచి అమాంతం లేపి ఆ జీప్ వెనక సీట్లో ఎత్తి పడేశారు. అక్కడో ఇద్దరు వ్యక్తులు మారిపోయారు. జీప్ మళ్లీ దూసుకుపోయింది. కాస్త దూరం వెళ్ళాక పేరూరు రైల్వే గేట్ పడి ఉండటంతో జీప్ ఆపేశారు. ముందు సీట్లో కూర్చున్న ఇద్దరు వ్యక్తులు జీప్ దిగి వెనుకకు వచ్చారు. ఒకరి చేతిలో అంతకు ముందు ఆ బంగ్లా లో ఇచ్చిన రివాల్వర్ ఉంది.

అదే సమయంలో రైలు కూత వేస్తుంది. ఆ సమయంలో వచ్చేది బెంగుళూర్ ఎక్స్ ప్రెస్. ఒకతను ‘‘దిగు …దిగు ట్రైన్ వచ్చేస్తుంది. పట్టాల మీద పడేస్తే దిక్కూ దివాణం ఉండదు, చూసినవా ఇది సింగపూర్ నుంచి తెప్పించినం‘‘ అని రివాల్వర్ తిప్పుతుండగా, మరొకతను పాంట్ జేబులో నుంచి ప్లాస్టిక్ వైర్ తీసి రెండు కాళ్ళూ కట్టేస్తున్నాడు. రివాల్వర్ తిప్పే వ్యక్తి ‘‘మాపై మళ్లీ ఇలాంటి వార్తలు రాస్తావా, చెప్పు. లేకుంటే ఇక్కడే పట్టాలపై పడేస్తం‘‘ అంటూ రివాల్వర్ గురి పెట్టారు. అతనికి ఏం మాట్లాడాలో తెలియక వణుకుతూ రెండూ చేతులు జోడించారు.

జీప్ ముందు సీట్లో కూర్చున్న మరొక వ్యక్తి దిగి వెనక్కి వచ్చారు. ‘‘ఇంత ఈజీగా చంపుతమా, ఇక్కడ వద్దులే‘‘ అని వారించారు. అతను వీరందరికీ బాస్ లా ఉన్నాడు. చెప్పగానే వాళ్ళు వెళ్లి జీప్ లో కూర్చున్నారు. ట్రైన్ వెళ్లిపోయింది. జీప్ మళ్లీ స్పీడ్ అందుకుంది. మహబూబ్ నగర్ టౌన్ లో నుంచి వెళ్తుంది. ఎక్కడికి తీసుకెళ్ళు తున్నారో అర్థం కావడం లేదు. టౌన్ దాటింది, నవాబ్ పేట వైపు వెళ్ళుతుంది. 15-20 కి. మీ వెళ్ళాక ఓ లంబాడీ తండా వద్ద మలుపు తిరిగి ఓ ఫామ్ హాజ్ లోకి వెళ్లి ఆగింది. అప్పటికే అక్కడ కొందరు ఉన్నారు. జీప్ నుంచి దింపి , యూరిన్ చేస్తే ఇక్కడే చేయి అన్నారు. ఆ తర్వాత అక్కడున్న రెండు అంతస్తుల మేడ పైకి తీసుకెళ్లారు. చేతులు, కాళ్ళూ కట్టేసి అక్కడ ఓ చాపపై పడేశారు. (కిడ్నాప్ కు గురైంది ఎవ్వరో కాదు, ఆత్మకూరు ఉదయం విలేఖరి రాధాకృష్ణ).
*********
మరుసటి రోజు . అక్టోబర్ 31
ఉదయం 9 గంటలకు మహబూబ్ నగర్ ఉదయం స్టాఫ్ రిపోర్టర్ రఘురామయ్యకు ఆత్మకూరు ఈనాడు విలేఖరి అక్తర్ ఫోన్ చేశారు. మీ విలేఖరి రాధాకృష్ణను సారా కాంట్రాక్టర్ భరత్ సింహారెడ్డి (బంగ్లా లో చేయి చేసుకున్న వ్యక్తి ) మనుషులు రాత్రి కిడ్నాప్ చేశారంటా… నాకు తెలిస్తే వెంటనే రాధాకృష్ణ రూము కెళ్ళి చూస్తే లేడు. ఆ పక్క ఇంట్లో ఉండే లాయర్ గోపాలరావును అడిగితే రాత్రి ఎవ్వరో వచ్చి జీప్ లో ఎక్కించుకెళ్ళారని చెప్పాడని వివరించారు. ఎలా జరిగిందో పూర్తిగా తెలుసుకొని ఆత్మకూరు విలేకరులంతా మహబూబ్ నగర్ కు వచ్చేయండి, ఇక్కడ స్టాఫ్ రిపోర్టర్లను, యూనియన్ నాయకులను జమ చేస్తా, ఎస్పీ దగ్గరికి వెళ్దామని రఘు రామయ్య చెప్పారు. ఈ విషయాన్ని క్షణాల్లో రఘు రామయ్య అందరికీ చెప్పి, ఉదయం ఆఫీసు వద్దకు వస్తే మాట్లాడుకొని ఏం చేద్దాం అనేది నిర్ణయం తీసుకుందామని చెప్పారు.

ఉదయం ఆఫీస్ వద్దకు యూనియన్ జిల్లా అధ్యక్షుడు హనుమంత్ రెడ్డి, స్టాఫ్ రిపోర్టర్లు పరుశురాం శర్మ (జ్యోతి), వెల్జాల చంద్రశేఖర్ ( భూమి), విజయకుమార్ ( ప్రభ), హిందూ వేణుగోపాల్ (హిందూ), ఉర్దూ విలేఖరులు ముజీబ్, జక్కి తదితరులు అంతా చేరుకున్నారు. కిడ్నాప్ చేసిన వ్యక్తి బిగ్ షాట్ కావడంతో ఏవిధంగా ఎదుర్కోవాలని చర్చించాం. ఇది చిన్న విషయం కాదు జాగ్రతగా డీల్ చేయాలి., లేకపోతే రాధాకృష్ణ ప్రాణాలకే ప్రమాదం. సెన్సిటివ్ విషయం. రాష్ట్ర నాయకుల దృష్టికి తీసుకెళ్లి వారి డైరెక్షన్ లో వెళ్ళాలని నిర్ణయించాం. అప్పటి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు కంచర్ల పూర్ణచంద్రరావు, యూనియన్ నాయకులు కే శ్రీనివాసరెడ్డి, పీఎస్ రామారావుకు జరిగిన విషయమంతా చెప్పాం. ఇంతలో ఆత్మకూరు విలేఖరులంతా వచ్చేశారు.
**********
అదేరోజు సాయంత్రం నాలుగు గంటల కల్లా కలెక్టరేట్ ఎదుట దీక్షా శిబిరం. రాధాకృష్ణను వెంటనే విడుదల చేయాలి, కిడ్నాప్ కు వడిగట్టిన గద్వాల ఎమ్మెల్యే డికే సమరసింహారెడ్డి సోదరుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ డికే. భరత్ సింహా రెడ్డిపై కేసు పెట్టి అరెస్ట్ చేయాలని డిమాండ్. (భరత్ సింహా రెడ్డి ప్రస్తుత బిజెపి నాయకురాలు, కాంగ్రెస్ మాజీ మంత్రి డీకే అరుణ భర్త. ఆమె అప్పటికి ఇంకా రాజకీయాల్లోకి రాలేదు…) ఇలా ఉండగా తెల్లారేసరికి అన్ని పత్రికల విలేకరులు మహబూబ్ నగర్ కు తరలి రావాలని అందరికీ ఫోన్లు. ఆ రాత్రి కలెక్టరేట్ ఎదుట శిబిరంలోనే అంతా పడుకున్నాం. మరో వైపు ఉదయం పేపర్ జనరల్ మేనేజర్ బీహెచ్ దేవేశ్వర్ రావు, ముఖ్యమంత్రి ఎన్టీఆర్, హోం మంత్రి కోడెల శివప్రసాదరావు, డిజిపి సిఎస్ రామ్ మోహన్ రావుకు తమ విలేకరి రాధాకృష్ణ కిడ్నాప్ పై టెలిగ్రామ్ ద్వారా ఫిర్యాదు చేశారు.

*****
ఆ మరుసటి ఏమి జరిగింది?
విలేకరి రాధాకృష్ణ ను వదిలేశారా?
భరత్ సింహా రెడ్డిని అరెస్ట్ చేశారా?
తనను ఎవరు కిడ్నాప్ చేయలేదని రాధాకృష్ణ ఎందుకన్నారు?

(మరో కథనంలో….)

….. Velijala Chandrasekhar…  (జర్నలిస్టు డైరీ) …  9849998092