ఈ ఫోటో చూశారుగా… ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ, బాల్ ఠాక్రేల భేటీ సీన్… శివసేన నిర్మించిన ఠాక్రే బయోపిక్ సినిమాలోనూ ఈ సీన్ ఉంటుంది… మొన్న శివసేన ప్రమాణస్వీకారం సందర్భంగా వెలిసిన బ్యానర్లలోనూ ఈ ఫోటో ఉంటుంది… ఎమర్జెన్సీని సమర్థిస్తాడు ఠాక్రే… అందుకని ఆ పార్టీని నిషేధించకుండా వదిలేస్తుంది ఇందిరాగాంధీ… ఠాక్రే ఎమర్జెన్సీని ఎందుకు సమర్థించాడు..? ఏ విపక్షం మీద చూపని ప్రేమను ఇందిరగాంధీ శివసేన మీద ఎందుకు చూపించింది..? అసలు ఈ భేటీ ఏమిటి..? ఈ ఫోటో ఏమిటి..? ఆ గుట్టు ఏమిటో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ విప్పేశాడు… అసలు శివసేనను సృష్టించిందే మేం… మేమూ మేమూ పొత్తు పెట్టుకుంటే తప్పేమిటోయ్, అధికారాన్ని పంచుకుంటే నేరమేమిటోయ్ అన్నట్టుగా వ్యాఖ్యలు చేశాడు కొన్ని… ఇలా….
1960 ప్రాంతంలో… ముంబైలో ఎఐటీయూసీ, సీఐటీయూ ఆధిపత్యాన్ని అడ్డుకోవటానికి ఓ ప్రత్యామ్నాయ శక్తిగా శివసేనను సృష్టించారన్నమాట… మొదట్లో కేవలం మరాఠాల ఆత్మగౌరవం, మద్రాసీలపై వ్యతిరేకత పేరిట గ్యాంగులను కూడగట్టిన శివసేన కొందరు లెఫ్ట్ నేతల్ని కూడా హతమార్చింది… అంటే శివసేనను సృష్టించింది కాంగ్రెసే అనే ఇన్నేళ్ల ప్రచారం నిజమే అని కాంగ్రెస్ సీనియర్ నేత ఇప్పుడు ధ్రువీకరించినట్టు అయ్యింది…
అక్కడ అమెరికా చేసేది అదే… ఇక్కడ కాంగ్రెస్ చేసేదీ అదే… ఐఎస్ఐ కావచ్చు, భింద్రన్ వాలే కావచ్చు, ఠాక్రే కావచ్చు… అవి కొన్ని శక్తుల్ని సృష్టిస్తాయి… పోషిస్తాయి… చివరకు ఆ భస్మాసుర హస్తాలు తమనే బలిగొనే ప్రయత్నం చేస్తాయి… ఠాక్రే కూడా అలాగే ఏకు పోయి మేకుగా తయారై ఉండవచ్చు… అయితే ఇక్కడ జైరాంరమేష్ శివసేన సృష్టికర్తలం మేమే అనే ప్రకటనకు తోడు… తరువాత్తరువాత శివసేన చేసిన అన్నిపనులకూ మాదే నైతిక బాధ్యత అంటే ఇంకా భేషుగ్గా ఉండేదేమో…
శివసేన సృష్టికర్త కాంగ్రెసే… 1960 నాటికి ఇందిరాగాంధీ రాజ్యం ఏమీ రాలేదు… కానీ పార్టీలో ఆమె కూడా సీనియర్ నేత… ఎస్‌కేపాటిల్, వీపీ నాయక్ వంటి నేతలు ముంబైలో లెప్ట్ ప్రాబల్యాన్ని తగ్గించటానికి ఠాక్రేను ముందుపెట్టి శివసేనను పుట్టించారు అనేది ఏనాటి నుంచో ఉన్న ప్రచారమే… సరిగ్గా జైరాం రమేష్ అదే చెబుతున్నాడు ఇప్పుడు… సో, ఇప్పుడు అర్థమైంది కదా ఎమర్జెన్సీని ఠాక్రే ఎందుకు సమర్థించాడో, ఠాక్రే పార్టీని ఇందిరాగాంధీ ఎందుకు క్షమించి వదిలేసిందో… ఇదేకాదు… 1980లో సీఎం ఏఆర్ అంతూలేకు ఠాక్రే బాగా మద్దతు ఇచ్చాడు… అదీ జైరాం రమేషే చెబుతున్నాడు…
మరి తను జీవం పోసిన అదే పార్టీ కరడుగట్టిన హిందూ అతివాద పార్టీగా ఎందుకు మారిపోయింది..? బాబ్రీ కూల్చివేతను ఘనతగా చెప్పుకున్నదేం..? ఇన్నేళ్లూ బీజేపీతో అంటకాగిందేం… ఈ ప్రశ్నలు మనం అడగొద్దు… తమ కొన్ని తలనొప్పుల్ని తగ్గించుకోవడానికి విరుగుడుగా కాంగ్రెస్ సృష్టించిన ఇలాంటి చాలా ప్రత్యామ్నాయ శక్తులు తమకు ఇష్టం వచ్చిన దారిలోకి మళ్లి ఆ కాంగ్రెస్‌కే తల్నొప్పుల్ని సృష్టించడం శివసేనతో మొదలు కాదు, చివరిదీ కాదు… భింద్రన్‌వాలే కథ తెలిసిందేగా… తను పుట్టించి, తను పోషించిన ఆ కేరక్టర్ చివరకు ప్రత్యేక దేశం పేరిట మారణహోమాన్ని నడిపించింది… ఆ భావజాలం చివరకు ఆ ఇందిరమ్మనే బలితీసుకుంది… శివసేనను పుట్టించింది మేమే అని గొప్పగా చెప్పుకునే ముందు… ఆ తప్పులకు మేమే కారణమహో అని అన్యాపదేశంగా అంగీకరిస్తున్నట్టు అవుతుంది అనే సోయి జైరాం రమేష్‌కు లోపించింది..!! ‘ముల్లును ముల్లుతోనే తీయాలి’ అనేది రాజకీయాల్లో ప్రతిసారీ పనికిరాదు మాస్టారూ… కొన్నిసార్లు అసలు ముల్లుకన్నా దాన్ని తీయాల్సిన ముల్లు మన కాలిలోనే విరిగిపోయి, రాచపుండుగా మారుతుంది…