ఎవరబ్బా ఈ ఆంధ్రా ప్రముఖుడు…! ఇదొక విశేష చర్చ ఇప్పుడు… విషయం ఏమిటంటే..? సీబీడీటీ అనగా ప్రత్యక్ష పన్నుల బోర్డు ఓ ప్రకటన చేసింది… ఏమిటంటే, ఐటీ శాఖ ఈనెల తొలివారంలో దాడులు నిర్వహించింది దేశవ్యాప్తంగా… దాదాపు 3300 కోట్ల హవాలా రాకెట్‌ను, అందులో ప్రముఖ కార్పొరేట్ సంస్థల పాత్ర అందులో ఉందని కనిపెట్టినట్టుగా చెప్పింది… దాదాపు 42 చోట్ల నిర్వహించిన ఈ సోదాల్లో తేలిన ప్రధాన విషయాల్లో ఒకటి… మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు అనగా నీటిప్రాజెక్టులు, రోడ్లకు వెచ్చించిన నిధులను తప్పుడు మార్గాల్లో దారి మళ్లించారట… ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ ప్రముఖుడికి 150 కోట్లు చెల్లించినట్టు ఆధారాలు కూడా బయటపడ్డాయట… అవును, ఆంధ్రజ్యోతి కూడా అదే రాసింది…
ఆంధ్రజ్యోతి, ఈనాడు రాసిందంటే బహుశా చంద్రబాబు అయి ఉండకపోవచ్చా…? చంద్రబాబు అని ఏమాత్రం సందేహం వచ్చినా సరే, ఆ వార్త రాకుండా పోయేదేమో… మరి ఎవరబ్బా ఆ ముఖ్యుడు..? కేంద్ర ప్రభుత్వం చంద్రబాబును కార్నర్ చేయటానికి తగిన ఆధారాల కోసం వెతుకుతున్నదనే సంగతి కరెక్టే… కేసీయార్ దొరుకుతాడా అని చూస్తున్నదనీ పొలిటికల్ సర్కిళ్లల్లో ఉన్న ప్రచారం… మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిధులు అంటే..? కొంపదీసి మేఘా కంపెనీ లేదా సీఎం రమేష్ కంపెనీ గానీ ఏమైనా అలా దారి మళ్లించాయా..? రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎడాపెడా ప్రాజెక్టులు పొందుతున్న కంపెనీ మేఘా ఒక్కటే కొంతకాలంగా.. చంద్రబాబు పీరియడ్‌లో ప్రాజెక్టులు పొందిన వాటిల్లో సీఎం రమేష్ కూడా ఉన్నాడు కానీ ఈమధ్య తమ ఆఫీసులపై ఏ దాడులూ జరగలేదు… పైగా అవన్నీ రివర్స్ టెండరింగులో చిక్కుకున్నట్టున్నాయి…! పోలవరం కంట్రాక్టులు పొందిన నవయుగ కాదు కదా…? ఆ కంపెనీ ఆఫీసులపై ఏమీ దాడులు జరగలేదు ఈమధ్యకాలంలో..! ఆమధ్య వారం రోజులపాటు ఐటీ దాడులు జరిగాయి మేఘా కంపెనీపైనే… కానీ సీబీడీటీ మాత్రం ఈనెల మొదటివారంలో జరిగిన దాడులు అని చెబుతున్నది, అంటే మేఘా కూడా కాకపోవచ్చు… మరి ఎవరబ్బా..? ఇచ్చింది ఎవరు..? తీసుకున్నది ఎవరు..?
మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిధులు దారి మళ్లడం అంటే తప్పకుండా కంట్రాక్టు కంపెనీలు చెల్లించే డబ్బులే… ఎవరికి ఇస్తారు..? అధికారంలో ఉన్న ప్రముఖులకే ఇస్తారు… అవీ ఎన్నికల ముందు రాజకీయ అవసరాల కోసం ఖర్చు చేస్తారు… ఈమధ్య రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జరిగిన ఎన్నికలు ఏమీ లేవు… పర్టిక్యులర్‌గా ఆంధ్రప్రదేశ్ పేరు ప్రస్తావించినందున కేసీయార్ కాదని ఇట్టే అర్థం చేసుకోవచ్చు… అధికారంలోకి వచ్చాక మొత్తం రివర్స్ టెండరింగులో మునిగిన జగన్‌కు ఇప్పుడప్పుడే ఎవరూ డబ్బులు ఇచ్చి ఉండకపోవచ్చు… ఇదంతా రకరకాల ఊహాగానమే సుమా… అయితే సీబీడీటీ బోర్డు చెబుతున్న లావాదేవీలు అసలు ఏ కాలంలో జరిగినవి అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్కు… కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు కేటాయించిన నిధుల్ని రాజకీయ అవసరాల కోసం దారి మళ్లించిన ఆధారాల కోసం కేంద్రం కొద్దిరోజులుగా ప్రయత్నిస్తున్నదనే ప్రచారం ఉన్నదే… మరి కేంద్రం గుప్పిట చిక్కబోతున్న ఆ ఆంధ్రా ముఖ్యుడెవరబ్బా..? కొంపదీసి టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ ఆరోపిస్తున్నట్టు రెండు కార్పొరేటు కంపెనీల నడుమ జరిగిన హవాలా చెల్లింపులు కాదు కదా… ఏమో… ఏపీ నుంచి ఓ ఆంధ్రా ముఖ్యుడు కాంగ్రెస్ పార్టీకి మొన్నటి ఎన్నికల ముందు డబ్బులు అడ్జెస్ట్ చేశాడనే ప్రచారం ఉన్నదే కదా… అవి ఈ డబ్బులేనా..? ఏమోలెండి… వచ్చే ఆదివారం ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ కొత్తపలుకులో ఏమైనా రాస్తాడేమో చూద్దాం… అక్కసుతోనో, ప్రేమతోనో అప్పుడప్పుడూ కాసిన్ని నిజాల్ని కక్కుతున్న కలం ఈమధ్య అదొక్కటే తెలుగునాట… మనం ఇన్నిరకాలుగా ఆలోచించి బుర్ర బద్దలు కొట్టుకున్నా ఒక్క హింటూ దొరకలేదు, ప్చ్, ఏం వార్తలు రాస్తారయ్యా..?