Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇప్పుడంటే ఎర్రతనం క్షీణదశ కానీ… అప్పట్లో ఎర్రెర్ర సినిమాలు ఎక్కువే…

February 16, 2026 by M S R

.

Subramanyam Dogiparthi …. కె బి తిలక్ , జగ్గయ్య వంటి వామపక్ష భావజాలం ఉన్నవారు 1950s , 1960s లో సామ్యవాద , సమవాద సినిమాలను ప్రారంభిస్తే తర్వాత కాలంలో మాదాల రంగారావు , టి కృష్ణ , పోకూరి బాబూరావు , ధవళ సత్యం , వేజెళ్ళ సత్యనారాయణ , బి నరసింగరావు , దాసరి నారాయణరావు వంటి వారు ఎర్ర సినిమాలను తీయడం ప్రారంభించారు . బాగా ఎర్రగా తీసిన ఘనత మాత్రం ఆర్ నారాయణమూర్తిదే . అత్యంత సాధారణ స్థాయి నుండి సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఎర్ర నారాయణమూర్తి  ధైర్యంగా ఎర్ర సినిమాలను వదిలాడు .

1990s దాకా వచ్చిన ఈ ఎర్ర సినిమాలు ఈ శతాబ్దంలో ఆల్మోస్ట్ కనుమరుగయిపోయాయనే చెప్పాలి . చిత్రం ఏమిటంటే యువతలో కూడా ఈ ఎర్రతనం బాగా పోయింది . యాభై ఏళ్ళ నా సుదీర్ఘ ఉపాధ్యాయ ప్రస్థానంలో అన్ని రంగుల విద్యార్థి సంఘాలను చూసాను . ఒక విద్యార్థి నాయకుడిగా 1968-74 ప్రాంతంలో ప్రత్యక్షంగా విద్యార్థి ఉద్యమాలలో , గొడవల్లో పాల్గొన్నాను . ఎంతో మార్పు వచ్చింది యువతలో . నా ఇల్లే వైకుంఠం నా బొందే కైలాసం తరం ఇప్పటి యువతరం .

Ads

1990 లో వచ్చిన ఈ అడవి దివిటీలు సినిమాకు కధా రచయిత , స్క్రీన్ ప్లే రచయిత , నిర్మాత , దర్శకుడు ఎర్ర నారాయణమూర్తే . పదునైన మాటల్ని వ్రాసింది కె బి ఆనంద్ . వంగపండు ప్రసాదరావు , సిరివెన్నెల సీతారామ శాస్త్రి పాటల్ని వ్రాయగా విద్యాసాగర్ సంగీత దర్శకత్వాన్ని వహించారు . వందేమాతరం శ్రీనివాస్ , వంగపండు ప్రసాదరావు , లలితాసాగరి ఉత్తేజకరంగా పాడారు .

పరుచూరి బ్రదర్స్ కధలు ఎలా అయితే అటు తిప్పి ఇటు తిప్పి దుష్టశిక్షణ శిష్టరక్షణ మీద నడుస్తాయో అలాగే ఎర్ర సినిమాలు సామాజిక ఆర్థిక రాజకీయ దోపిడీ చేసే పెత్తందార్లు , వారి బారి నుండి నోరు లేని జనాన్ని రక్షించే విప్లవకారుల మీద నడుస్తాయి .

ఈ సినిమా గిరిజనుల హక్కులు , వాటిని కబ్జా చేసే ఓ MLA , అతని హోం మినిస్టర్ బావ , మినిస్టర్ కొడుకు అఘాయిత్యాలు , వాటిని ఎదుర్కొనే క్రమంలో నక్సలైటుగా మారే ఫారెస్ట్ ఆఫీసర్ చుట్టూ నడుస్తుంది . ఫారెస్ట్ ఆఫీసరుగా పురాణం సూర్య , MLA గా రాళ్ళపల్లి , మినిస్టరుగా రావుజీ , అతని కొడుకుగా సాయికుమార్ తమ్ముడు రవిశంకర్ నటించారు .

నక్సలైటు దళం నాయకుడిగా ఎర్ర నారాయణమూర్తి తన టిపికల్ నటనలో మునిగిపోయాడు . సినిమాలో చాలా ప్రధానమైన పాత్ర స్పెషల్ యస్పీగా దేవదాస్ కనకాలది . నక్సలైటుగా మారిన ఫారెస్ట్ ఆఫీసర్ తండ్రి పాత్ర ఆయనది . విధిబధ్ధుడిగా , తండ్రిగా సంఘర్షణకు గురయ్యే ఎమోషనల్ సీన్లలో చాలా బాగా నటించాడు . క్లైమాక్సులో తానే అడవి దివిటీగా మారిన సీనులో ఇంకా బాగా నటించాడు . ఆయన భార్యగా అత్తిలి లక్ష్మి బాగా నటించింది .

కాసేపే కనిపించినా ముఖ్యమంత్రి పాత్రలో హరిబాబు (subject to correction) బాగా నటించాడు . నక్సలైట్లు , పోలీస్ ఆఫీసర్లే కాదు ; సున్నితమైన శాంతిభద్రతల సంరక్షణలో ఓ ముఖ్యమంత్రి కూడా ఎలా సంఘర్షణకు గురవుతారో బాగా చూపించారు .

ఇతర పాత్రల్లో శాంతిలత , రాజు , పి యల్ నారాయణ  తదితరులు నటించారు . సహజంగానే అడవి నేపధ్యం ఎక్కువగా ఉంటుంది కదా ! ఎక్కడ షూట్ చేసారో కానీ బాగానే ఉంటుంది నేపధ్యం .

సినిమా యూట్యూబులో ఉంది . రాజకీయ , సామాజిక , ఆర్ధిక న్యాయం వంటి అంశాల మీద స్పృహ ఉన్నవారికి బాగానే ఉంటుంది . ఈ సినిమా పరిచయం ముగించే ముందు నా మాట ఒకటి మిత్రులు వినాలి . హింస , అప్రజాస్వామిక , రాజ్యాంగ విరుధ్ధ మార్గంలో ఏ ఉద్యమం తన ధ్యేయాలను సాధించలేదు అనేది నా నిశ్చిత అభిప్రాయం .

నేను పరిచయం చేస్తున్న 1239 వ సినిమా , #తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_స్కూల్ #సినిమా_కబుర్లు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • జ్యోతిష నామ ధూర్తత్వం సమాజానికి కీడు చేస్తోంది… జాగ్రత్త సుమీ…
  • నేపాలీ సెన్సేషన్… ఓ ఆయుర్వేద డాక్టర్ కొడుకు, ఓ ర్యాపర్… ఎవరితను..?!
  • తర్జుమాలే ఉద్యమంగా! … Tribute to Mukthavaram Pardhasaaradhi ….
  • అసలెవరు ఈ ఆండీ పైక్రాఫ్ట్..? పాకిస్థాన్ పుండు మీద కారం..!!
  • అమెరికా, ఇజ్రాయిల్‌లతో యుద్ధం చేస్తున్నది చైనా- రష్యాలే…!!
  • “పట్టు పురుగుకు పూరీ ప్రాణభిక్ష… పట్టు అవసరమే లేని తిరుమల!”
  • …. చివరకు తన రక్తపు వేలిముద్రతో సాక్షి సంతకం చేస్తుంది…
  • ‘‘చూడు కమల్.., నీ చేతినీ, నా చేతినీ పోల్చి చూడు… ఎంత తేడా ఉందో…’’
  • శివాజీ ఆ గరుడ పురాణ ప్రవచనాలు మళ్లీ మొదలెట్టాడురా బాబోయ్..!!
  • నక్సల్స్ ఘాతుకం..! నిజాన్ని, తప్పును ఆలస్యంగా అంగీకరించిన వైనం..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions