.
బాలీవుడ్ ప్రముఖ సింగర్ ఉదిత్ నారాయణ్..! అందరికీ తెలిసిన బాలీవుడ్ గాయకుడు… బాలీవుడ్డే కాదు, 36 బాషల్లో వేల పాటలు పాడాడు… ఇటీవల మనశంకర వరప్రసాద్ లో అందరినీ ఆకట్టుకున్న మీసాలపిల్లా సాంగ్ పాడింది ఆయనే..!
“అమ్మాయే సన్నగా”, “రామ్మా చిలకమ్మ”, “నా ప్రాణమా” వంటి ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడాడు తెలుగులో కూడా… ఆయన గొంతులో ఉండే ఒక ప్రత్యేకమైన మార్దవం (Sweetness) ఆయనను అందరికీ ఇష్టమైన గాయకుడిని చేసింది…
Ads
ఉదిత్ నారాయణ్ కొడుకు ఆదిత్య నారాయణ్ కూడా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు… ‘ఇండియన్ ఐడల్’ వంటి పెద్ద సింగింగ్ షోలకు హోస్ట్‌గా చాలా పాపులర్…
తన కెరీర్‌లో ఎన్నో విజయాలు అందుకున్న ఉదిత్ నారాయణ్… దేశంలోని అగ్రశ్రేణి సింగర్లలో ఒకరిగా దశాబ్దాలపాటు వెలుగు వెలిగాడు… అయితే ఈ మధ్య కాలంలో ఆయన వరుస వివాదాలలో చిక్కుకుంటున్నాడు… ఆ మధ్య ఒక ఈవెంట్‌లో యువతులతో అసభ్యంగా ప్రవర్తించిన ఉదిత్ నవ్వులపాలయ్యాడు…
ఎవరో ఫ్యాన్‌ను పబ్లిక్ ఈవెంటులో దగ్గరకు అభిమానంతో వచ్చిన ఓ ఫ్యాన్ పెదాలపై ముద్దు పెట్టడం ఈ గ్రంథ ‘సాంగు’డిపై అనేక విమర్శలకు తావిచ్చింది… ఐతేనేం, నో రిగ్రెట్స్, అస్సలు ఊరుకోరు కదా ఫ్యాన్స్ అంటూ సమర్థించుకున్నాడు…
అన్నట్టు మీకు గుర్తుందా, తెలుగు గాయని, టీవీ ఆర్టిస్టు సమీర భరధ్వాజ్ ఈ సంఘటనపై చేసిన ఓ సెటైరిక్ వీడియో బాగా పాపులరయింది… ఇదుగో…
గాయకుడిగా ఉదిత్‌ను ఎంతో ఇష్టపడే వాళ్ళు కూడా ఆయన వింత ప్రవర్తనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు… ప్రతిభ వేరు, వ్యక్తిత్వం వేరు… ఏదైనా రంగంలో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తే, అదే స్థాయి వ్యక్తిత్వంలో ఉండాలని ఏముంది..?
చివరకు తను ఎక్కడైనా కనిపిస్తే… దగ్గరికి వెళ్ళడానికి కూడా అమ్మాయిలు, మహిళలు భయపడుతున్నారు… ఇక సుదీర్ఘకాలం ఆయనతో ప్రయాణం చేస్తున సతీమణి రంజన కూడా ఆయన చేష్టలతో విసిగిపోయింది… తాజాగా బీహార్‌లోని ఓ పోలీస్ స్టేషన్‌లో భర్తపై ఫిర్యాదు చేసింది…
ఈ కేసు కాస్త ఇంట్రస్టింగ్… ఎందుకంటే..? ఉదిత్ నారాయణ్ మొదటి భార్య రంజనా ఝా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు సంచలనం సృష్టించింది… దీని ప్రధాన అంశాలు ఇవే…
-
ఘోరమైన ఆరోపణ…: 1996లో వైద్య పరీక్షల పేరుతో తనను ఢిల్లీలోని ఒక ఆసుపత్రికి తీసుకెళ్లి, తనకు తెలియకుండానే గర్భాశయాన్ని (Uterus) తొలగించారని ఆమె ఆరోపించింది…
-
కుట్ర…: ఈ పనిలో ఉదిత్ నారాయణ్‌తో పాటు ఆయన సోదరులు, రెండో భార్య దీపా నారాయణ్ కూడా భాగస్వాములని ఆమె పేర్కొంది…
-
30 ఏళ్ల తర్వాత ఎందుకు?…: ఈ విషయం తనకు అప్పట్లో తెలియదని, ఇటీవల వేరే ఆరోగ్య సమస్యతో డాక్టరును సంప్రదించినప్పుడు మాత్రమే ఈ మోసం బయటపడిందని ఆమె వాదిస్తోంది…

నిజానికి ఈమె ఈ ఫిర్యాదు చేయడం వెనుక కూడా ఓ పే-ద్ద కథ ఉంది… 2006 వరకు ఉదిత్ అసలు రంజనా తన భార్య అని అంగీకరించలేదు… కానీ ఆమె కోర్టులో ఆధారాలు చూపించాక, 1984లో తమకు పెళ్లయిందని ఒప్పుకున్నాడు… ఒప్పుకోవాల్సి వచ్చింది… బహుశా ఆమె భరణం కోసం కూడా కోర్టుకు ఎక్కినట్టు గుర్తు…
డబ్బు కోసం, ఆమె అప్పుడప్పుడూ తనను గెలుకుతూ ఉంటుందనేది ఉదిత్ ఆరోపణ… 30 ఏళ్ల క్రితం తన గర్భాశయాన్ని కుట్రతో తొలగింపచేశారని ఇప్పుడు కేసు పెట్టడం ఏమిటని కొట్టిపారేస్తున్నాడు… కానీ పోలీసులు మాత్రం విచారిస్తాం, నిజాలు తేలుస్తాం అంటున్నారు… మొత్తానికి ఉదిత్ మనస్తత్వానికి తగిన మొదటి భార్య..!!
Share this Article