.
ఆరోగ్యం అంటే మీకు ఏం గుర్తొస్తుంది? చెమటలు చిందే జిమ్ములు.. నోరు కట్టేసుకునే డైట్ చార్టులు.. చేదు మాత్రల గుళికలు.. ఇవే కదా? కానీ, మీరు గీసే ఒక చిన్న బొమ్మ, మీరు హుషారుగా పాడే ఒక పాట మీ ఆయుష్షును పెంచుతాయని ఎవరైనా చెబితే? నమ్మశక్యంగా లేదా? అయితే ఇది చదవండి.
రక్తం చెప్పే రహస్యం: ప్రోటియోమిక్స్ మనం బ్లడ్ టెస్ట్ చేయించుకుంటాం. షుగర్ ఎంతో, కొలెస్ట్రాల్ ఎంతో తెలుసుకుంటాం. కానీ ఇప్పుడు వైద్య రంగంలో ఒక నిశబ్ద విప్లవం మొదలైంది. దాని పేరు ‘ప్రోటియోమిక్స్’ (Proteomics).
Ads
మన రక్తంలో లక్షలాది ప్రోటీన్లు ఉంటాయి. ఇవి కేవలం కణాలను నిర్మించడమే కాదు.. మన శరీరానికి ఇన్ఫర్మేషన్ పాస్ చేసే మెసెంజర్లు కూడా. మీరు పదేళ్ల తర్వాత ఏ జబ్బు బారిన పడతారో మీ రక్తం ఇప్పుడే చెప్పేస్తుంది. మీ రక్తం మీ భవిష్యత్తును చూస్తోంది. జాగ్రత్త!
కళాపోషణ.. కేవలం కాలక్షేపం కాదు! మనం బొమ్మలు వేసినప్పుడు.. హుషారుగా డ్యాన్స్ చేసినప్పుడు.. మన మెదడులో ‘డోపమైన్’ అనే ఒక అద్భుతమైన హార్మోన్ విడుదలవుతుంది. దీన్నే ‘హ్యాపీ హార్మోన్’ అంటారు. ఈ హార్మోన్ ఏం చేస్తుందో తెలుసా? మీ రక్తంలోని ప్రోటీన్లకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. మీ రోగనిరోధక శక్తిని రెట్టింపు చేస్తుంది.
# సంగీతం: రక్తంలోని మంటను (Inflammation) తగ్గిస్తుంది.
# నృత్యం: మెదడును చురుగ్గా ఉంచుతుంది. ఒత్తిడిని మటుమాయం చేస్తుంది.
# గానం: ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచి, ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరుస్తుంది.
మీలోని ఆర్టిస్ట్‌ని నిద్రలేపండి ఆరోగ్యం అంటే కేవలం శరీరం బాగుండటం కాదు.. మనసు హాయిగా ఉండటం. లండన్ యూనివర్సిటీ పరిశోధకులు శాస్త్రీయంగా నిరూపించిన సత్యం ఇది.
రోజూ ఒక 15 నిమిషాలు కేటాయించండి. మీకు నచ్చిన పని చేయండి. పెయింటింగ్ వేస్తారా? మొక్కలకు నీళ్లు పోస్తారా? పాత పాటలు పాడుకుంటారా? ఏదైనా సరే.. అది మీ శరీరంలోని ప్రోటీన్లను ఆరోగ్యంగా ఉంచుతుంది.
గుర్తుంచుకోండి.. కళాపోషణ ఉన్న చోట అనారోగ్యం దరిచేరదు. మాత్రల కంటే మనసుకు నచ్చిన పనే గొప్ప మందు. మీలోని కళాకారుడికి ప్రాణం పోయండి.. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారండి!
-పమిడికాల్వ మధుసూదన్
9989090018

- ‘మడిసన్నాక కాసింత కళాపోషణుండాలయ్యా… ఉత్తినే తిని తొంగుంటే మడిసికి గొడ్డుకి తేడా ఏటుంటాది…’ ముత్యాల ముగ్గు సినిమాలో రావు గోపాలరావుకి స్టార్ డమ్ తెచ్చిన డైలాగ్ ఇది… విలన్ చెప్పినా వినదగిన మాట… ఆయనకు ఆనాడే తెలుసు ఈ ఆరోగ్య రహస్యం..!!!
Share this Article