Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘‘నేనెందుకు ఏడ్చానో నాకే అర్థం కాలేదు… ఈ ఎమోషన్ అర్థమేమిటి..?’’

February 28, 2026 by M S R

.

నేనొక ఉబెర్ డ్రైవర్‌ని… ఎక్కువగా రాత్రి షిఫ్ట్ చేస్తాను… గత వారం రాత్రి 11-00 గంటలకు ఒక వృద్ధుడిని ఎక్కించుకున్నాను… కారులో కూర్చోగానే ఆయన అన్నాడు…
“ఈ రాత్రి నన్ను ఐదు చోట్లకు తీసుకెళ్లాలి… నేను నీకు $ 500 (డాలర్లు) ఇస్తాను… నగదు… కానీ పనంతా పూర్తయ్యే వరకు ‘ఎందుకు’ అని అడగకూడదు…” అని ఐదు అడ్రస్సులు ఇచ్చాడు…

*మొదటి అడ్రెస్— పట్టణ శివారులోని ఒక ఇల్లు… ఆయన కారులోనే కూర్చొని ఆ ఇంటిని పది నిమిషాలు నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయాడు… కళ్లలో నీరు… మాట లేకుండా యేడుస్తున్నాడు… తరువాత “సరే పద ఇక…” అన్నాడు….

Ads

రెండో అడ్రెస్— అది ఒక ప్రాథమిక పాఠశాల… అది ఖాళీగా, చీకటిగా ఉంది… ఆయన కారు దిగి వెళ్లి, ఆ పాఠశాల గ్రౌండ్ లో ఆటబొమ్మల దగ్గర ఉన్న ఊయలపై కూర్చున్నాడు… ఇరవై నిమిషాలు అక్కడే గడిపాడు… తిరిగి వచ్చి అన్నాడు…
“ఇక్కడే నేను 43 సంవత్సరాలు బోధించాను… నా జీవితంలో నాకు దొరికిన అత్యుత్తమ ఉద్యోగం ఇది…

మూడో అడ్రెస్— ఒక చిన్న రెస్టారెంట్… లోపలికి వెళ్లి కాఫీ ఆర్డర్ చేశాడు… కానీ తాగలేదు… ఒక మూల టేబుల్ దగ్గర ఒంటరిగా కూర్చుని చుట్టూ చూస్తూ పదిహేను నిమిషాలు గడిపాడు… తిరిగి వచ్చి అన్నాడు…
“1967లో నా భార్యతో మొదటి డేట్ ఇక్కడే…”

నాలుగో అడ్రెస్– అది ఓ శ్మశానం… ఒక సమాధి దగ్గరకు వెళ్లి ముప్పై నిమిషాలు నిలబడి మాట్లాడాడు… ఏమన్నాడో వినిపించలేదు… తిరిగి వచ్చినప్పుడు కళ్లంతా ఎర్రగా ఉన్నాయి….
“నా భార్య చనిపోయి ఈరోజుకి మూడేళ్లు…” అన్నాడు…

*ఐదో అడ్రెస్– ఓ ఆసుపత్రి… కారును పార్క్ చేయమన్నాడు… “ఇదే చివరిది…” అని నా వైపు చూసి అన్నాడు…
“ఇప్పుడే నీకు కారణం చెబుతాను… నాకు నాలుగో దశ క్యాన్సర్ ఉంది… ఇంకో కొన్ని వారాలు… లేక కొన్ని రోజులు మాత్రమే ఉండొచ్చు… ఈ రోజురాత్రి నా మొత్తం జీవితాన్ని ఒకసారి… చివరిసారి వెనక్కి తిరిగి చూడాలని అనిపించింది…” ఆయన అది అనగానే నేను ఏడవడం మొదలుపెట్టాను…



“ఆ ఇల్లు— అక్కడే నా పిల్లలను పెంచాను…
ఆ పాఠశాల— అక్కడే నా జీవితానికి అర్థం దొరికింది…
ఆ రెస్టారెంట్— అక్కడే నేను ప్రేమలో పడ్డాను…
ఆ శ్మశానం— అక్కడే నేను వీడ్కోలు చెప్పాను…
మరి ఈ ఆసుపత్రి— ఇక్కడే ఈ రాత్రి చేరుతున్నాను… హాస్పీస్ వార్డులో… ఇక ఇంటికి వెళ్లను…” అని $500 నా చేతిలో పెట్టాడు…



ఈరోజంతా నన్ను నువ్వే నడిపించావు…  నాపట్ల దయ చూపిన చివరి అపరిచితుడివి నువ్వే కావచ్చు… ఈ ప్రయాణం ముగింపు దశ అర్థవంతంగా ఉండాలని అనుకున్నాను… నువ్వు నిజంగా దాన్ని పూర్తి చేశావు…

నేను ఆ డబ్బు తీసుకోలేనని అన్నాను… కానీ ఆయన ఒత్తిడి చేశాడు….
“దయచేసి తీసుకో… వదిలివేయడానికి కూడా నాకిక ఎవరూ లేరు… నా పిల్లలు నాతో మాట్లాడరు… స్నేహితులు ఎవరూ అందుబాటులో లేరు… డబ్బు కోసమే అయినా, నీ వృత్తిధర్మమే అయినా, నువ్వు నాకు మూడు గంటల టైమ్ ఇచ్చావు… అది $500 కంటే ఎక్కువ…” అంటూ చిన్న సూట్‌కేస్ తీసుకుని, దిగే ముందు నన్ను అడిగాడు…

“నీ పేరు?”
“మార్కస్”
“ధన్యవాదాలు, మార్కస్… నా జీవితంలో నువ్వు నాకు ఓ చివరి జ్ఞాపకం…”
ఆయన ఆసుపత్రిలోకి నడుచుకుంటూ వెళ్లిపోయాడు… నేను కారులో కూర్చొని ఒక గంట పాటు ఆగకుండా ఏడ్చాను… ఏదో తెలియని ఎమోషన్ అది… నాకు ఏడుపు ఎందుకొచ్చిందో నాకే అర్థం కాలేదు…

మరుసటి రోజు తిరిగి వెళ్లాను… ఆయన గది 412… పూలతో వెళ్లి తలుపు తట్టాను… ఆయన చిరునవ్వుతో…. “మార్కస్…! నువ్వు మళ్లీ వచ్చావా?”
“అలా వదిలేయలేకపోయాను… మీరు బాగున్నారా?” అన్నాను… “చనిపోబోతున్నాను… కానీ నిన్న రాత్రి నా జీవితం మొత్తాన్ని మరోసారి నెమరేసుకున్నాను… అందుకేనేమో కాస్త బాగున్నాను…”

అలా రెండు వారాలపాటు ప్రతి రోజూ వెళ్లాను… కాఫీ, న్యూస్ పేపరు తీసుకెళ్లాను… వార్తలు చదివాను… కొన్నిసార్లు నిశ్శబ్దంగా కూర్చున్నాం… ఆయన తన ఆనందాలు, బాధలు, పశ్చాత్తాపాలు అన్నీ చెప్పాడు…
“నేను ఒంటరిగా, ఓ అనాథగా చనిపోతాననుకున్నాను… కానీ నువ్వున్నావు… అపరిచితుడిగా వచ్చి నా చివరి రోజుల్లో నా కుటుంబమయ్యావు… అది ఒక అనుకోని వరం…”

ఆయన చేతిని పట్టుకుని అన్నాను…
“మీరు ఎంతమాత్రమూ ఒంటరి కాదు…”
ఒక మంగళవారం అర్థరాత్రి వెళ్ళి నేను ఆయన చెయ్యి పట్టుకున్నాను… ఆయన చివరి మాటలు…
“మార్కస్… ప్రజలకు చెప్పు… అపరిచితులను నిజంగా కాస్త దయచూడమని చెప్పు… మనమందరం ఎక్కడికో వెళ్తున్నాం… కొందరు వేగంగా, కొందరు నెమ్మదిగా…. మార్గమధ్యంలో నాలాంటోడు తారసపడితే కాస్త దయ చూపమని చెప్పు… అది నువ్వు చూపావు…’’ అని తెల్లవారుజామున 3:17కి ఆయన కళ్లుమూశాడు…

  • అంత్యక్రియలకు ఆరుగురే వచ్చారు — నేను, ముగ్గురు నర్సులు, ఒక న్యాయవాది, పత్రికలో చదివి వచ్చిన ఒక పూర్వ విద్యార్థి… 43 సంవత్సరాలు బోధించిన మనిషి… 52 సంవత్సరాలు ఒక స్త్రీని ప్రేమించిన మనిషి… 81 సంవత్సరాలు జీవించిన మనిషి… ఆయన అంత్యక్రియలకు ఆరుగురు మాత్రమే… అందుబాటులో ఉన్న వారు…

అప్పుడు నేను ఇలా చెప్పాను…  “ప్రతి అపరిచితుడు ఎవరికో ఒక ప్రపంచం… ప్రతి ఉబెర్ ప్రయాణికుడికి ఒక కథ ఉంది… మనం దాటిపోతున్న ప్రతి మనిషి జీవిస్తూ, చనిపోతూ, ఎవరో తనను గమనించాలని ఆశిస్తూ ఉంటాడు… ఆయన నాకు $500 ఇచ్చాడు… కానీ దాని కంటే విలువైనదాన్ని ఇచ్చాడు — అపరిచితుల పట్ల దయ అనేది అదనపు విషయం కాదు… అదే జీవితం… ఎందుకంటే మనమందరం అపరిచితులమే… ఎవరో ఒకరు ఆగి, మనల్ని చూసి, మన మాటలు విని, మనతో ఉండేంత వరకు…”

ఆ $ 500 ఇప్పటికీ నా గ్లోవ్‌ బాక్స్‌లోనే ఉంది… ఖర్చు చేయలేదు… అది ఒక జ్ఞాపకం…
ప్రతి ప్రయాణికుడు తన చివరి ప్రయాణంలో ఉండవచ్చు. ప్రతి అపరిచితుడు తన చివరి వీడ్కోలు చెబుతుండవచ్చు…
అందుకే ఇప్పటి నుండి నేను వేరేలా డ్రైవ్ చేస్తాను…
కొంచెం నెమ్మదిగా…
కొంచెం దయగా….
ఇంకొంచెం ఎక్కువగా.. మనిషిగా….!!!
—————————
{ఒక వాట్సప్ గ్రూపులో వచ్చింది ఈ కథ... బాగుంది... వెలిశెట్టి నారాయణరావు, విశ్రాంత సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడి పేరుతో... ధన్యవాదాలు మాస్టారూ...)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • జంధ్యాల హీరోయిన్… సినిమాల్ని పక్కకు తోసేసి, అమెరికా వెళ్లి…
  • ఈ స్వరాల రాణి… రుచుల మహారాణి కూడా…!
  • ప్రభాస్ ఫుడ్ కల్చర్..! పిల్లికి బిచ్చం పెట్టని ఇండస్ట్రీలో రియల్ హీరో..!!
  • బుమ్రాలు కూడా ‘లైన్’ తప్పిన వేళ… కుర్ర బౌలర్లు కుమ్మేస్తున్నారు…
  • రేవంత్ హైబ్రీడ్ మోడల్ కేంద్రం పాటించదగిందే… అదెలాగంటే..?
  • ఆర్ఎస్ఎస్ లింకులు… జడ్జిపై కేజ్రీవాల్ డిఫరెంట్ అటాక్…
  • అహం బ్రహ్మస్మి..! ట్రంప్ కదా, పోప్‌నూ ధిక్కరిస్తాడు, వెక్కిరిస్తాడు..!!
  • సాక్షాత్తూ ఆ దేవదేవుడే ఊరేగింపుగా వచ్చి, మన దగ్గరే ఆగిపోతే…!!
  • డబ్బు కోసం… సొంత ఆర్మీని ‘ఇరాన్ పోరు’లోకి పంపిన పాకిస్థాన్…
  • శబ్దం..! ఈ ఇద్దరు తారలు.. భిన్నమైన కథ.. బీజీఎం థమన్.. ప్లస్ ఫ్యాక్టర్స్…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions