Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కుడి ఎడమైతే…! అదొక తాత్విక, వైరాగ్య వ్యక్తీకరణ..! అపహాస్యం చేయకండి..!!

May 31, 2026 by M S R

.

( అప్పరుసు శ్రీనివాసరావు )  ….. గత రెండుమూడు రోజులుగా సోషల్ మీడియాలో ఒక వీడియో క్లిప్ విపరీతంగా వైరల్ అవుతోంది. ఒక డిజిటల్ ఛానల్‌కు చెందిన ఇంటర్వ్యూలో ఓ సినీ విశ్లేషకుడు (ఆయనెవరో నాకు తెలియదు) తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన “దేవదాసు” (1953) చిత్రంలోని ప్రసిద్ధ గీతం గురించి ఒక వినూత్న వ్యాఖ్యానం చేశారు. అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలోని పాట —
“కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్… ఓడిపోలేదోయ్…”
అనే గీతం. దీనిని మహాకవి సముద్రాల సీనియర్ రచించారు.

అయితే ఆ విశ్లేషకుడు ఈ పాటకు పూర్తిగా భిన్నమైన అర్థం చెప్పారు. ఆయన చెప్పిన ప్రకారం, సముద్రాల అసలు రాసింది “కూడి ఎడమైతే పొరబాటు లేదోయ్…” అని. అంటే, కలిసిన జంట విడిపోతే అందులో తప్పేమీ లేదనే భావమట. కానీ అసిస్టెంట్ డైరెక్టర్ పాటను కాపీ చేస్తూ “కూడి”ని “కుడి”గా పొరబడటంతో, ఘంటసాల కూడా అదే విధంగా పాడేశారట. రికార్డింగ్ సమయంలో సముద్రాల ఆ పొరపాటును గమనించినప్పటికీ, దేవదాసు మద్యం మత్తులో పాడుతున్న పాట కావడంతో, అది అలాగే ఉంటే కూడా సరిపోతుందని భావించి సరిదిద్దలేదట.

Ads

అంతేకాదు, ఆ విశ్లేషకుడు మరో కల్పిత కథనాన్ని కూడా జోడించారు. ప్రముఖ కవి ఆత్రేయకు కూడా “కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్…” అనే లైన్ సరిగా అనిపించలేదట. ఒకసారి రిక్షాలో ప్రయాణిస్తున్నప్పుడు రిక్షావాడు ఈ పాటను హమ్ చేస్తూ ఉండగా, ఆ లైన్ గురించి అతనితో ఆత్రేయ వాదించారట.

కానీ ఈ మొత్తం కథనం నాకు ఏమాత్రం నమ్మశక్యంగా అనిపించలేదు. చిన్నప్పటి నుంచి ఎన్నోసార్లు “దేవదాసు” సినిమా చూసిన నేను, ఆ పాటను అనేకసార్లు విన్న నేను, దాని వెనుక ఉన్న తాత్వికతను అర్థం చేసుకునే ప్రయత్నం చేసిన నేను — సముద్రాల గారు అసలు “కూడి ఎడమైతే…” అని రాసి ఉండరని గట్టిగా నమ్ముతున్నాను. ఆయన ఉద్దేశపూర్వకంగానే “కుడి ఎడమైతే…” అని రాశారని భావిస్తున్నాను.

ఈ పాటలోని భావం ఏమిటంటే — దేవదాసు ఒక జమీందారీ కుటుంబానికి చెందిన యువకుడు. అతని జీవితం అంతా సవ్యంగానే సాగుతోంది. కానీ తండ్రి ఒత్తిడితో పార్వతితో అతని ప్రేమ విఫలమవుతుంది. చివరకు పార్వతి మరో వృద్ధుడిని వివాహం చేసుకోవడంతో దేవదాసు తీవ్ర నిరాశలోకి జారిపోతాడు. మద్యం వ్యసనానికి బానిసవుతాడు.

అక్కడి నుంచి అతని జీవితం పూర్తిగా విరుద్ధ దిశలోకి మళ్లిపోతుంది. తనను తాను నాశనం చేసుకునే మార్గాన్ని ఎంచుకుంటాడు. అయినప్పటికీ, ఆ మద్యం మత్తులోనే ఒక కొత్త ఆనందాన్ని వెతుక్కోవాలని ప్రయత్నిస్తాడు. జీవితంలో సరిదారి దొరకనప్పుడు, తప్పు దారిలోనైనా ఓ ఉపశమనం పొందడంలో తప్పేమీ లేదనే తాత్విక, వైరాగ్య భావన అతనిలో ఏర్పడుతుంది.

అదే భావాన్ని సముద్రాల ఈ లైన్లో అద్భుతంగా చెప్పారు —
“కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్…”
జీవితం కుడి వైపు — అంటే సరైన దిశలో సాగకపోతే, ఎడమ వైపు — అంటే విరుద్ధ దిశలోనైనా మనిషి తనకు నచ్చిన ఆనందాన్ని వెతుక్కోవడంలో తప్పు లేదని దేవదాసు భావిస్తున్నాడు. అది ఓటమి కాదని అంటున్నాడు.

దీనికి వెంటనే వచ్చే లైన్‌ను గమనిస్తే ఆ భావం మరింత స్పష్టమవుతుంది —
“సుడిలో దూకి ఎదురీదకా… మునకే సుఖమనుకోవోయ్…”
అంటే, ఒకసారి సుడిగుండంలోకి దూకిన తర్వాత బయటపడేందుకు పోరాడటం కన్నా, ఆ మునకలోనే ఒక రకమైన సుఖాన్ని వెతుక్కోమని భావం.

దేవదాసు ఇప్పటికే మద్యం అనే సుడిగుండంలోకి దిగిపోయాడు. పార్వతిని మరిచిపోవడానికి ఆ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఇప్పుడు అతనికి ఆ సుడిలో ఇంకా లోతుగా మునిగిపోవడమే ఒక ఉపశమనంలా కనిపిస్తోంది.

పాట చివర్లో వచ్చే లైన్లు కూడా అదే తాత్వికతను ప్రతిబింబిస్తాయి —
“లాహిరి నడి సంద్రములోన… లంగరుతో పని లేదోయ్…”
అంటే, సముద్రం మధ్యలో ఉన్న ఓడకు లంగరు వేసి దిగిపోవడం సాధ్యం కాదు. గమ్యం చేరేవరకు ప్రయాణం కొనసాగించాల్సిందే. ఆ ప్రయాణాన్నే ఆస్వాదించాలి.

దేవదాసు తనను తాను అలాంటి సముద్ర మధ్యలో చిక్కుకున్న ఓడగా భావిస్తున్నాడు. ఇప్పుడు తిరిగి వెనక్కి రావడం సాధ్యం కాదని అతనికి తెలుసు. కాబట్టి గమ్యం లేని ఈ ప్రయాణాన్ని కొనసాగించడమే అతని విధి. చివరకు ఆ ప్రయాణం పార్వతి ఊరిలో ముగుస్తుంది. అక్కడే అతని జీవితం కూడా ముగుస్తుంది.

ఇంత గొప్ప తాత్విక భావంతో రాసిన గీతాన్ని “అసలు అది కూడి ఎడమైతే…” అంటూ ఒక చిన్నపాటి తప్పిద కథగా మార్చేయడం చాలా హాస్యాస్పదంగా అనిపిస్తోంది.

ఇలాంటి కల్పిత కథనాలు గతంలో కూడా వినిపించాయి. 1968లో వచ్చిన “సుఖదుఃఖాలు” చిత్రంలో మహాకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసిన
“ఇది మల్లెల వేళయనీ… ఇది వెన్నెల మాసమనీ…”
అనే ప్రసిద్ధ గీతం గురించీ ఒక కథ ప్రచారంలో ఉంది.

ఒక సందర్భంలో ఓ ఔత్సాహిక కవి దేవులపల్లిని అడిగాడట — “ఇది వెన్నెల వేళయనీ… ఇది మల్లెల మాసమనీ…” అని ఉండాలి గానీ, “మల్లెల వేళ”, “వెన్నెల మాసం” అన్నవి ఎలా సరైన పదబంధాలు అవుతాయి?” అని.

అప్పుడు దేవులపల్లి వద్ద సమాధానం లేక, “అందుకే తర్వాతి లైన్‌లో ‘తొందరపడి ఒక కోయిల ముందే కూసింది’ అన్నాను” అంటూ మాట దాటవేశారట.

ఇలాంటి కథలు వినడానికి ఆసక్తికరంగా ఉన్నప్పటికీ, మహాకవుల రచనల వెనుక ఉన్న లోతైన భావజాలాన్ని పక్కనపెట్టి, వాటిని కేవలం పదప్రయోగాల పొరపాట్లుగా చూపించడం మాత్రం సాహిత్యానికీ, ఆ గేయరచయితల ప్రతిభకీ అన్యాయం చేసినట్టే అనిపిస్తుంది…..

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కుడి ఎడమైతే…! అదొక తాత్విక, వైరాగ్య వ్యక్తీకరణ..! అపహాస్యం చేయకండి..!!
  • అనంత శ్రీరామ్ ఓ క్షుద్ర రచయిత… ఈ శాస్త్రీయ విశ్లేషణ సాక్షిగా…
  • ‘‘భలేవారే మాస్టారూ… తాగినోడి మాటలకు అర్థాలేమిటి? మర్మాలేమిటి…’’
  • పిక్కపై చుక్క మిగలకుండా మామిడి పండు జుర్రుకోవడం… ఓ పెద్ద కళ…
  • ‘నా చేతికి ఏమీ అంటకుండా… జగన్‌ను జైలుపాలు చేయడం ఎలా..?’’
  • ‘రైతు డిస్కం’పై అడ్డూఅదుపు లేని అబద్ధాలు- బీఆర్ఎస్ తప్పుడు బాష్యాలు…
  • ‘నేను ఓడిపోతే నా బిడ్డనిచ్చి పెళ్లి చేస్తా’… తండ్రులెప్పుడూ మారలేదు..!!
  • సీఎం విజయ్… కోర్టు చెప్పింది, వీఐపీ- టారిఫ్ కల్చర్ మార్చగలవా..?
  • ‘వార్’పై ట్రంప్ మార్క్ మరో ప్రకటన..! చరిత్రాత్మక ఒప్పందమా? ఇదీ ఫేకేనా..?!
  • వైభవ్ సూర్యవంశీలో పరివర్తన..! ఈలోపే పాపం *నిష్క్రమణ…!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions