.
పాలకుడు మరీ సున్నితంగా కనిపించకూడదు, వ్యవహరించకూడదు… థిక్ స్కిన్ అవసరం చాలా విషయాల్లో… తమిళనాడు కొత్త సీఎం జోసెఫ్ విజయ్ కాస్త అలవాటు చేసుకోవాలి… ఎందుకంటే..? తనను ఓ కొత్త తరహా సీఎంగా ప్రొజెక్ట్ చేయడానికి తన పీఆర్ టీమ్ బాగానే పనిచేస్తోంది… ఇంటి నుంచి లంచ్ తెచ్చుకున్నట్టు ఫోటోలు, ఠంచన్‌గా టైమ్‌కు రావడం వార్తలు ఎట్సెట్రా…
సీఎంగా ఓ కొత్త లుక్ కూడా ప్రొజెక్ట్ అవుతోంది… సాధారణంగా ఓ తెల్ల షర్ట్, ఏదో ఓ కలర్ ప్యాంటుతో సింపుల్‌గా కనిపించే విజయ్ సీఎంగా ఎప్పుడూ తెల్ల చొక్కాపై నల్ల కోటు (బ్లేజర్), బ్లాక్ పాంటు వేసుకుంటున్నాడు… ఇదీ తన డ్రెస్ కోడ్ ఇప్పుడు… పద్దతిగా, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తిగా, సీరియస్ పాలకుడిగా ప్రొజెక్ట్ కావడం, వెండితెర బ్రాండెడ్ ఆహార్యానికి దూరమైనట్టు చూపించుకోవడం… సరే, బాగానే ఉంది… పదవి కొత్తలో ఇవన్నీ కామన్…
Ads
మరోవిషయం టర్కీ టవల్… సాధారణంగా ఆఫీసుల్లో కుర్చీలపై సాధారణంగా టర్కీ టవల్ వేసుకుంటుంటారు… ఆఫీసర్లే కాదు, ఓ మోస్తరు ఉద్యోగులు, ప్రత్యేకించి ఏసీల్లేని ఆఫీసులైతే కామన్… అదే కాదు, కార్ల డ్రైవింగ్ సీట్లపై… అంతెందుకు టర్కీ టవల్ మన నిత్యావసరం ఇప్పుడు… కుర్చీల్లో కూర్చున్నప్పుడు చెమటపడితే పీల్చకుని, మెత్తగా ఓ కంఫర్ట్ ఇస్తాయి… లెదర్, కుషన్ కుర్చీలైతే టర్కీ టవల్ ఓ సౌకర్యం…
కానీ కరుణానిధి గతంలో ఏం చేశాడంటే..? ఠాట్, ఇది బ్రిటిష్ రాచరికపు కల్చర్, మనమేంటి, మన కల్చరేంటి అనే ఓ సినిమా పోకడలో సీఎం కుర్చీ మీద టర్కీ టవల్‌ను లాగి బయటికి విసిరేశాడు… వామ్మో, టర్కీ టవల్‌కు ఇంత రాచరికపు మెత్తదనంతోపాటు, అహం, ఆధిపత్యం, పెత్తనం, వీవీఐపీతనం లక్షణాలు కూడా ఉన్నాయాని తమిళ ప్రజానీకం చెవుల్లో పూలు పెట్టుకుని విని, చూసి, తరించిపోయింది…
అంతేకాదు, తరువాత వచ్చిన జయలలిత, పళనిస్వామి, స్టాలిన్ కూడా అదే పాటించారు… జనం నుంచి మళ్లీ విమర్శలు రాకుండా… ఏసీ ఆఫీసులే కదా, టర్కీ టవల్ ఉంటేనేం, లేకపోతేనేం… ఇప్పుడు విజయ్ సీఎం కాగానే ఆ కుర్చీపై మళ్లీ టర్కీ టవల్ ప్రత్యక్షమైంది… నిజానికి అది ఏ కల్చర్‌కూ సంకేతం కాదు, ఓ కంఫర్ట్, అంతే…
ఇది ‘శోష’ల్ మీడియా యుగం కదా… ప్రతిదీ రాద్ధాంతం జరగాల్సిందే… సామాజిక, పర్యావరణ కార్యకర్తగా చెప్పబడే లీసీ ప్రియా కంగుజమ్ సోషల్ మీడియా వేదికగా విజయ్‌ని ట్యాగ్ చేస్తూ… “ఇది బ్రిటీష్ సంస్కృతి అని, దీనికి స్వస్తి పలకాలని” ఒక పోస్ట్ పెట్టింది… అంతే, టర్కీ టవల్ తీసేశాడు విజయ్… తన వ్యక్తిగత జ్యోతిష్కుడిని ఓఎస్డీగా చేసి, ఎవరో నో అనగానే పీకిపారేశాడు… అంతే సింపుల్‌గా టర్కీ టవల్‌ను తీసిపారేశాడు…
అందుకే చెప్పింది… లక్ష మంది లక్ష చెబుతారు… అన్నీ పాటించడం అంటే ఇక ఇలాంటి విషయాలకే టైమ్ ఖతం… అందుకే థిక్ స్కిన్ అవసరమనేది… నల్ల బ్లేజర్ జిప్ పెట్టుకోవద్దు, లోన తెల్ల షర్టు పైన గుండీ కూడా పెట్టుకో, లైట్‌గా గడ్డం పెంచు వంటి సలహాలూ వస్తాయి… చేసేవాడుంటే చెప్పేవాళ్లు లక్షమంది…
విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలను గమనిస్తే… తను “పర్సెప్షన్ మేనేజ్‌మెంట్” (ప్రజల్లో తన ఇమేజ్ ఎలా ఉందనేది) విషయంలో ఓవర్-రియాక్ట్ అవుతున్నట్టుంది… ప్రకాష్ రాజ్ ఐకానిక్ డైలాగులో చెప్పాలంటే… ‘ఇదే, తగ్గించుకుంటే మంచిది’….
Share this Article