.
హైదరాబాద్, జనవరి 29… నిన్న ఓ వార్త కనిపించింది… ఈనాడులో కూడా వచ్చింది… పైపైన వార్త చదివితే ఓ ఆసక్తికరమైన చిన్న వార్త… సో, పెద్దగా ప్రముఖంగా కనిపించేలా పబ్లిష్ చేయలేదు… సరే, ముందుగా ఆ వార్త చదువుదాం…
ఒక కుటుంబం (తల్లి, కొడుకు, రెండున్నరేళ్ల మనవడు) హైదరాబాద్ నుండి ప్రయాణించడానికి విమానాశ్రయానికి చేరుకున్నారు… నిబంధనల ప్రకారం రెండు ఏళ్లు దాటిన పిల్లలకు విడిగా టికెట్ తీసుకోవాలి… అయితే, ఆ పిల్లాడికి టికెట్ అవసరం లేదని భావించిన సదరు కుటుంబం, తమ వద్ద ఉన్న రెండు టికెట్లతోనే లోపలికి ప్రవేశించింది… బస్సుల్లో, రైళ్లలో పెద్దగా పట్టించుకోరు, ఏజ్ తనిఖీ చేయరు…
Ads
విచిత్రమేమిటంటే.., విమానం లోపలికి వెళ్లి, ఓ సీటులో కూర్చోబెట్టారు పిల్లాడిని, ఆ సీటులో జర్నీ చేయాల్సిన పెద్ద మనిషి ఎవరో వచ్చి, గొడవకు దిగడంతో విమాన సిబ్బంది వచ్చి, ఏజ్ కనుక్కుని, ఆ కుటుంబాన్ని విమానం నుంచి దింపారు… అప్పటివరకూ ఎయిర్ లైన్స్ సిబ్బందికి ఆ పిల్లాడికి టికెట్ లేదని తెలియదు…

పోలీసులు కేసు నమోదు చేయలేదు… తెలియక చేసిన తప్పు కాబట్టి ఇక ఎవరూ ఆ కుటుంబాన్ని వేధించలేదు, అక్కడికి సంతోషం… ఎయిర్ బస్సు కూడా ఎర్ర బస్సే అనుకున్నారేమో… అందులో నేరం లేదు, ద్రోహం లేదు… కానీ…
ఆ కుటుంబం ఆ పిల్లాడిని వేరే సీటులో కూర్చోబెట్టకుండా… తమ ఒడిలోనో కూర్చోబెట్టుకుని ఉంటే ఏ గొడవ జరిగేది కాదు… రెండేళ్లలోపు పిల్లాడే అనుకునేవారు ఎయిర్ లైన్స్ సిబ్బంది… రెండేళ్లలోపు పిల్లలకు టికెట్ అవసరం లేదు (ఇన్‌ఫాంట్స్)… కాకపోతే గంటల జర్నీ అయితే, పడుకోబెట్టడానికి వెసులుబాటు ఉంటుంది కాబట్టి సపరేట్ టికెట్ తీసుకుంటారు చాలామంది రెండేళ్లలోపు పిల్లలకు (ఇన్‌ఫాంట్స్) కూడా…
అయితే… ఆ పిల్లాడి ఏజ్ ఎంత..? టికెట్ ఉందా లేదా అని ఎయిర్ లైన్స్, ఎయిర్ పోర్టు సిబ్బంది ఏ దశలోనూ కనుక్కోలేదు… ఎయిర్ పోర్టు ఎంట్రీ దగ్గర సీఐఎస్ఎఫ్ వాళ్లు ప్రతి వ్యక్తి గుర్తింపు కార్డు (ఎక్కువగా ఆధార్) చెక్ చేస్తారు, టికెట్ ఉందా లేదా, అందులో ఏ వివరాలున్నాయో చూస్తారు.., గుర్తింపు కార్డులో మొహం, ఈ మొహం ఒకటేనా కూడా చూస్తారు…
సరే, అక్కడ చిన్న పిల్లాడే కదా అని వదిలేశారు అనుకుందాం… బోర్డింగ్ పాస్ తీసుకునే కౌంటర్ దగ్గర అన్నీ వెరిఫై చేస్తారు… సరే, అక్కడా గమనించలేదేమో లేదా వెబ్ చెక్‌ఇన్ చేశారేమో అనుకుందాం… (వెబ్ చెక్ ఇన్ చేసేవాళ్లలా లేరు)…
(సింబాలిక్… ఎఐ ఫోటో)…
మూడో దశ సెక్యూరిటీ… అక్కడా బోర్డింగ్ పాస్ చూస్తారు… అనుమానమొస్తే చెక్ చేస్తారు… ఈ దశ కూడా దాటేశారు అనుకుందాం… విమానం ఎక్కే గేటు దగ్గర బోర్డింగ్ పాస్ తప్పకుండా చెక్ చేస్తారు… అక్కడా ఎవరికీ ఏ సందేహమూ రాలేదు…
చివరగా విమానం లోపలకు వెళ్లేచోట కూడా హెడ్ కౌంట్ కోసం బోర్డింగ్ పాసులు చూస్తారు… ఇన్ని దశల్ని దాటి ఆ పిల్లాడిని ఆ కుటుంబం ఎంచక్కా తీసుకుపోవడమే ఓ విడ్డూరంలా అనిపిస్తోంది… దీన్ని పెద్ద విద్రోహమో, భద్రత వైఫల్యమో అనే ముద్ర వేయకపోయినా… నిర్లక్ష్యం అని మాత్రం చెప్పుకోవాల్సిందే…
విమానం దింపేశారు సరే… కానీ నిర్లక్ష్యం మీద అంతర్గత విచారణ, దిద్దుబాటు ఎలా..? అందుకే ఇది కేవలం మానవతప్పిదమా, సాంకేతిక లోపమా అనే కోణంలో మాత్రం ఓ అంతర్గత విచారణ చేపట్టారట…
విమాన ప్రయాణాలకు సంబంధించి తనిఖీలు తప్పనిసరి... కొంచెం అతిగా అనిపించినా తప్పులేదు... తప్పకూడదు... అదే ఇక్కడ లోపించింది... అదీ శంషాబాద్ ఎయిర్‌పోర్టు వంటి అంతర్జాతీయ విమానాశ్రయంలో..!!
Share this Article